[box type=’note’ fontsize=’16’] శ్రీమతి శివరాజు సుబ్బలక్ష్మి గారి జయంతి (సెప్టెంబరు 17) సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల. [/box]
[dropcap]శ్రీ[/dropcap] బుచ్చిబాబు గారు, శ్రీమతి శివరాజు సుబ్బలక్ష్మి గార్ల దాంపత్యం, కేవలం ఏడడుగుల అనుబంధం మాత్రమే కాదు. బుచ్చిబాబు గారి సాంగత్యం సుబ్బలక్ష్మి గారికి రచనా స్ఫూర్తి నిచ్చింది. స్త్రీగా ఆమె వ్యక్తిత్వ వికాసానికి నాందిని పలికింది. ఆమె క్రియా శీలతకు, సృజనాత్మక ప్రతిభకు దోహదం చేసింది.
ఆకాశం అందంగా ఉంటుంది, కాని అందుకోగలమా! అని విశ్వసించిన శివరాజు సుబ్బలక్ష్మిగారు బ్రతుకు పరిమళాలను జారి పోనీక ప్రతి స్పందనలో ఊపిరి పీల్చుకున్నారు. వృద్ధాప్యానికి విసుగు రానీయక, ఆత్మీయ భావనలతో ఉత్సాహం కలిగించుకున్నారు. స్నేహం ఆమె తేజస్సు. మంచితనం ఆమె మనస్సు. ఆమె జీవితం నిరామయ తపస్సు.
బుచ్చిబాబు గారు దూరమై అనేక సంవత్సరాలు గడచినా, బ్రతుకు గాజు బొమ్మలో ఆమె అనేక దశకాల జీవన సౌహార్ద్రాన్ని ప్రతిఫలించుకున్నారు. “అప్పుడు ఆ వూళ్లో వున్నాం. ఇప్పుడు ఈ వూళ్లో వున్నాం అని కాక జరిగిన విషయాలు రాస్తున్నాను” అంటూ ‘మా జ్ఞాపకాలు’ రాసారు. తళతళలాడే అద్దంలా శుభ్ర వదనంతో విపులమైన జీవన ప్రయాణాన్ని సార్థకం చేసుకున్నారు. ఒంటరితనానికి అనుభవాల తాదాత్మ్యతను జోడించుకున్నారు. ఆచరణాత్మకమైన తాత్వికతలో మనుగడ సత్యాలను గ్రహించారు. భర్త గారి జన్మ శతాబ్ది 2017 వరకూ జీవించాలని కోరుకున్నారు. ఆ కోరికను తీర్చుకుని, ఇచ్ఛా మరణం పొందినట్టుగా ఫిబ్రవరి 6, 2021నాడు 95వ ఏట తనువు చాలించారు.
ఆమెతో మాట్లాడితే గడచిన పుటల సాహిత్యానికి సాక్ష్య రూపం కదలాడుతుంది. నవ్వు తొణికిసలాడుతూ పలికే జ్ఞాపకాల దొంతరలో ఇసుమంత తొట్రుపాటు కనపడదు. ఆమె సందర్శనంలోని సౌందర్యం, దివ్యానుభూతిని కలిగించక మానదు.
ఆమె రచయిత్రి. ఆమె చిత్రకారిణి. ప్రకృతి పట్ల గల ఆరాధన ఆమె అభివ్యక్తికి సహజ గుణ సౌమ్యతను ప్రతిపాదించింది.
శివరాజు సుబ్బలక్ష్మి గారు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు కుంచె నద్దారు. దేవికా రాణి, ఇందిరా గాంధీ వంటి ప్రముఖుల చిత్రాలను సజీవంగా తీర్చారు. 2015లో ‘Nature in Thoughts’ పేరుతో బుచ్చిబాబుగారు వేసిన 177 రంగుల చిత్రాల్ని సుబ్బలక్ష్మి గారి 140 వర్ణ చిత్రాల్నీ కలిపి ఒక విలువైన చిత్ర సంపుటాన్ని వెలువరించారు. భర్త బుచ్చిబాబు గారు చిత్రకారులు. తాము గూడా స్వయంగా చిత్రలేఖనాన్ని అభ్యసించారు. ఆమెకు సంగీతంలోనూ ప్రవేశముంది. వయెలిన్ వాయించేవారు. శ్రీ బాపు గారు సుబ్బలక్ష్మి గారిని పిన్నీ అని పిలిచారు.
ఆంగ్లంలో సంతోష్ కుమార్ పేరిట రచనలను చేసి ఆంగ్లంలో నిధి అనిపించుకున్న బుచ్చిబాబు గారి సాంగత్యంతో సుబ్బలక్ష్మి గారు ఆంగ్ల సాహిత్యంలో కూడా ప్రవేశం సంపాదించుకున్నారు. భర్త గారు, రాసి పడేసిన రచనలను చదివి పత్రికలకు పంపించారు. భార్య భర్తలను కథలలో విడదీయవద్దని భర్త గారికి చెప్పేవారట. వాద వివాదాలకు తావివ్వక భర్తగారి భావనలలోని అభ్యుదయాన్ని అర్థం చేసుకున్నారు. “మా సుబ్బు చెప్తే అది నిజమే” అని భర్త గారితో అనిపించుకున్నారు. మనం మాట్లాడుకునే రీతి లోనే కథలను రాయాలని బుచ్చిబాబు గారు అభిప్రాయ పడినట్టు తమ రచనాశైలిని అవలంబించారు.
ఆమె నిరంతర పఠనశీలి, బాల్యంలో అభ్యసించిన సంస్కృత పాఠాలను సార్థకం చేసుకుని సంస్కృత రామాయణం, కాళిదాసు రచనలను చదివారు. బుచ్చిబాబు గారు ఆకాశవాణిలో పనిచేస్తుండటంతో వాళ్ల ఇంటికి విశ్వనాథ సత్యనారాయణ గారు, జరుక్‌శాస్త్రి గారు, తదితర సాహితీ దిగ్దంతులు అనేకమంది; ప్రముఖ రచయితలూ, చిత్రకారులూ, కవులూ వస్తుండేవారు. వాళ్ల మధ్య జరిగే సాహితీ చర్చలలో సుబ్బలక్ష్మి గారు పాల్గొనే వారు. ఆనాటి నుండి వారికి మాట్లాడడంలో సంకోచమన్నది తెలియదు.
శ్రీమతి సుబ్బలక్ష్మి గారు స్త్రీవాది కాదు, భర్త గారి కీర్తికి తోరణం కడుతూనే స్వయం వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్నారు. మధ్య తరగతి స్త్రీల ఆత్మ వ్యథను, ఊహా కల్పితంగా కాక, నిశిత పరిశీలనతో కథలుగా రాసారు. నిజ జీవితాల్లో ట్రాజడీలను అనుభవించిన సామాన్య స్త్రీల సమస్యలకు తమ కథలలో ఓదార్పు నిచ్చారు. భర్త లేని స్త్రీలు అటు పుట్టింటి లోనూ, అత్తింటిలోనూ, పడిన వ్యథకు వెల కట్టారు. సంఘంలో స్త్రీ స్థానం పట్ల ఆమెకి నిర్దుష్టమయిన అభిప్రాయాలున్నాయి.
వారి కథల్లో, స్త్రీలు, నిర్లిప్తంగానూ, మరి కొన్నచోట్ల స్థిర చిత్తంతోనూ కనుపిస్తారు. మధ్య తరగతి యువతులుగా సన్నిహితులవుతారు. ఆవిడ కథల శీర్షికలు కూడా భావనాత్మకంగా వైవిధ్యంగా ఉంటాయి. ‘‘సుబ్బలక్ష్మి కథల్లో విశిష్టత, ఇవి ఒక స్త్రీ మాత్రమే రాయగలదు అని అనిపించడం’’ అని పింగళి లక్ష్మీకాంతం గారు కొనియాడారు.
వారి కథ “పోస్టు చేయని ఉత్తరం” జరిగిన సంఘటనను ఆధారం చేసుకుని రాసారు. తన కళ్ళ ముందే ఆడపడచు భర్తతో అన్యోన్యంగా ఉండడం చూస్తుంది ఇందిర. అత్తగారు ఇందిరనే మాటలంటుంది. వేరే ఊరిలో ఉంటున్న భర్త ఆమెను తీసుకుని వెళ్ళడు. మరొక అమ్మాయిని ఇష్టపడతాడు.
పుట్టింటి వారు కూడా ఆమె సరిగా ఉంటే మరొకరిని భర్త ఎందుకు ఇష్టపడతాడని తప్పు పట్టవచ్చు.
అలాంటి ఇందిర స్థితిని దయనీయంగా నిరూపించారు.
అద్దేపల్లి వివేకానందా దేవి గారు సుబ్బలక్ష్మి గారి ముంజేతి కంకణం కథ తమ వదినె గారి జీవితాన్ని పోలి ఉంది అని ఆ కథ లోని సహజత్వానికి అబ్బుర పడ్డారు.
మట్టిలో మాణిక్యంగా ప్రశంసలను అందుకున్న “కథ మట్టి గోడల మధ్య గడ్డి పోచ”. ఈ కథలో పార్వతి కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకుంటుంది. తుప్పలూ, పుంతలూ శిథిలాలూ, వాటిని చుట్టి మొండి గోడలు. అందులోనే తను జీవించాలి ‘గడ్డిపోచలా’ అని నిర్థారించుకుంది. ‘కాలం వేసిన ఎగుడు దిగుడు బండలపైన జీవితం సాగుతోంది’ పార్వతికి. మనుషుల స్వభావ పరిశీలనకు ఈ కథ ఉత్తమ ఉదాహరణ. కావ్య సుందరి కథ, మనో వ్యాథికి మందుంది, మగత జీవి చివరిచూపు కథలు భిన్న పార్శ్వాల స్త్రీ మనోగతులను వివరిస్తాయి.
‘ఒడ్డుకి చేరిన ఒంటరి కెరటం’ సుబ్బలక్ష్మి గారికి నచ్చిన కథ. ఆశమ్మ త్యాగం చేసి అన్నగారి పిల్లల్ని ఇద్దరినీ పెంచుతుంది. కానీ వాళ్లు కూడా ఆవిడని సరిగ్గా చూడరు. ఆవిడ ఏదో ఆశించి చేయలేదు. ‘తన అన్న తనకి అప్పచెప్పాడు. అది తనకర్తవ్యం. అంతే.’ అనుకుంటుంది.
సుబ్బలక్ష్మి గారు రాసిన నవల “నీలం గేటు అయ్యగారు” కథనంతా ఇంటి పని మనిషి పొన్ని ద్వారా చెప్పించారు. ఈ నవలను ఎమెస్కో వారు 1964 లో ముద్రించారు. “మనం పనివాళ్ళని అనుకుంటాం కాని వాళ్ళు చాలా విషయాలు గమనిస్తారు” అని అసలు విషయాన్ని గ్రహించారు.
నవల మొత్తం పనిమనిషి కోణంలోనే సాగుతుంది. పాశ్చాత్య పోకడలు అంతటా విస్తరిస్తున్న సమయంలో జనాల్లో నెలకొంటున్న మిడిమిడి జ్ఞానం, నాగరికత మోజులో కుహనా విలువలకు లోనయిన పాత్రలను ఆవిష్కరించారు.
స్వభావ సిద్ధమైన మైత్రీ గుణాన్ని, బెంగళూరు నివాస కాలంలో సాహిత్య మిత్రులకు అనన్యంగా అందించారు. ప్రతి సంవత్సర జయంతి కార్యక్రమాలతో బాటు, శ్రీ బుచ్చిబాబు గారి శత జయంతి ఉత్సవాన్ని ఘనంగా బెంగళూరులో జరిపించారు (2016). ఆ సభలో సుబ్బలక్ష్మి గారి చిత్ర లేఖన సంపుటం ఆవిష్కరణ జరిగింది.
బన్నేరు ఘట్ట, బెంగళూరులో వారి నివాసానికి రెండు సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు, ఆవిడ కొత్తగా వచ్చిన పుస్తకాల గురించి చెబుతూ, చక్కగా అమర్చుకున్న పుస్తకాల వరుసను చూపించారు. పక్క గదిలో ఆమె గీసిన చిత్రాలు నిరంతర భావుకతకు దృశ్య రూపంగా కనుపించాయి. పూజ చేసుకున్న దేవుని గదిని చూస్తుంటే పొద్దుట అర్పించిన పూలు ఆమె లాగే శుభ్ర వదనంతో విచ్చుకుని ఉన్నాయి. వేడి భోజనం వడ్డించారు. ఆమెకు సభలకు వెళ్ళాలనీ, సాహిత్య మిత్రులను కలుసుకోవాలన్న ఉత్సాహం తగ్గనిది.
వారు బెంగళూరులో పుత్రుని ఇంట నివసించడం, బెంగళూరు సాహితీ మిత్రులకు కలసి వచ్చిన అదృష్టం. ఆ భాగ్యాన్ని మరపు రాని స్మృతుల మనసు లంకె బిందెలలో గుప్తంగా దాచుకోవాలి. ….. అనన్యమైన మహిళ శ్రీమతి శివరాజు సుబ్బ లక్ష్మి గారి జయంతికి (సెప్టెంబరు 17) వసివాడని పొగడ పూల అక్షర మాలను సమర్పించాలి.
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పురస్కారం, ఆంధ్రప్రదేశ్‌సాహిత్య అకాడమీ పురస్కారం, గృహలక్ష్మీ స్వర్ణకంకణం వంటి సత్కారాలందుకున్న సుబ్బలక్ష్మి గారు, మాలతీ చందూర్‌సాహిత్య పురస్కారం కూడా అందుకున్నారు.
సుబ్బలక్ష్మి గారి తండ్రి శ్రీ ద్రోణంరాజు సూర్యప్రకాశరావు గారు గాంధేయవాది. ఆవిడ రచనలలో ఎక్కువ శాతం గాంధేయ సిద్ధాంతలు కనబడుతుంటాయి.
~
“దసరా, దీపావళి పండుగలు జరుపుకున్నట్లుగా స్వాతంత్య్ర దినోత్సవ పండుగ జరుపుకున్నాం. అప్పుడు నాకు 22 సంవత్సరాల వయసు. ఇంటిల్లిపాదీ ఉదయాన్నే తలంట్లు పోసుకుని, కొత్త బట్టలు కట్టుకున్నాం. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాం. గడపలకు పసుపు రాసి, కుంకుమ పెట్టాం. ఇల్లంతా కళకళలాడింది. రోజూ ఉండే ఇల్లే అయినా ఆ రోజు ఎంతో కొత్తగా అనిపించింది. రకరకాల మిఠాయిలు తయారు చేశాం. ఇంటికి వచ్చినవారందరికీ నిండుగా భోజనం పెట్టాం. అప్పుడు మేం హైదరాబాద్‌లో ఉంటున్నాం. జెండా ఎగురవేయటానికి హైదరాబాద్ ఆకాశవాణి కార్యాలయానికి వెళ్లాం. అప్పటికి ఇంకా డక్కన్ రేడియోగా వ్యవహరించేవారు.
ఆ రోజు నేను ఎరుపు అంచు ఉన్న నీలం రంగు పట్టు చీర కట్టుకున్నాను. ఆ చీరంటే నాకు చాలా ఇష్టం. బుచ్చిబాబుగారు ఖద్దరు పైజమా, లాల్చీ కట్టుకున్నారు. పైన వేసుకోవటానికి ముందుగానే జోద్‌పూర్ కోటు కుట్టించుకున్నారు. ఆ రోజు మద్రాసు నుంచి సినీ నటులు పుష్పవల్లి, భానుమతి గారలు వచ్చారు. జైలు నుంచి విడుదలైన వారిలో కొందరు ఆకాశవాణి ద్వారా ప్రత్యక్షంగా తమ అనుభవాలు పంచుకున్నారు. ఎస్.ఎన్‌మూర్తి గారు స్టేషన్ డైరెక్టర్. ఉమామహేశ్వరరావు అనే అనౌన్సర్ ‘భారతదేశం నేటి నుంచి స్వతంత్ర దేశం’ అని అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. వింజమూరి సీత అనసూయలు, టంగుటూరి సూర్యకుమారి దేశభక్తి గీతాలు ఆలపించారు. కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు……
ఒకసారి గాంధీగారు హైదరాబాద్ వచ్చినప్పుడు సత్యనారాయణ అనే ఆయన వేసిన పెయింటింగ్ గాంధీగారికి నా చేత ఇప్పించారు. గాంధీగారు స్టేజీ మీద నుంచి కిందకు దిగటానికి, నా భుజాల మీద చేయి వేసుకున్నారు. చాలాకాలం ఆ భుజాన్ని ఎంతో పవిత్రంగా తడుముకునేదాన్ని. స్వాతంత్ర్యం వచ్చిన రోజున నాకు ఆ సంఘటన ఒక్కసారి మనసులో స్ఫురించింది. అలాగే ప్రకాశం పంతులు గారు మా ఇంటికి వస్తుండేవారు. మా వారిని ‘ఏరా! బుచ్చీ!’ అంటూ ఆప్యాయంగా పలకరించేవారు. ఆ రోజులు ఎంతో గొప్పవి. స్ఫూర్తిదాయకమైనవి….. ఇత్యాదిగా వారి స్మృతులలోని ప్రతి పుట, స్వాతంత్ర్యోత్తర కాలం లోనూ, అంతకు పూర్వమూ గల సంప్రదాయ, సంస్కృతులను ప్రతిబింబిస్తాయి. ఆనాటి స్త్రీల చరిత్రను నిత్య నూతనంగా అభ్యుదయ పథానికి సమన్వయిస్తాయి.”