[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]స[/dropcap]డెన్‌గా ఓ కేరెక్టర్ మోటర్ సైకిల్ మీద దిగింది. చాలా ఎత్తుగా, లావుగా, ఎర్రగా వున్న అతను లోపలి కొస్తునే దామోదర్ గారి భుజం మీద కొట్టి, ప్యూన్ గెడ్డం పీకి, విజయ్‌ని ‘మోటూ’ అని వెక్కిరించి, ఆఫీస్ అంతా చెల్లా చెదురు చేసి ఫ్యాక్టరీలోకి వెళ్ళాడు. అతని మోటర్ సైకిల్ ఒకడు తుడుస్తున్నాడు. ప్రవీణ్ అని బి.కామ్ నైట్ కాలేజీలో చేస్తూ, ఇక్కడ ఎకౌంట్స్ చూసే అబ్బాయి “రవి సార్ వచ్చాడు, ఇక్కడంతా హడావిడే ఇంక” అని నాతో హిందీలో చెప్పాడు. అతను ట్రూప్ బజార్ నుండి వచ్చేవాడు. అతని మేనమామ ఈ కంపెనీకి ఆడిటర్. ఆ విధంగా అతన్ని ఇక్కడ పని నేర్చుకోడానికి పెట్టారు. ఇంకో ట్రెయినీ కూడా, బోర్డు పెట్టుకుని, నా పక్క సీట్‌లోనే బోర్డు మీద బొమ్మలేస్తూ వుండేవాడు. అతను సివిల్ ఇంజనీరింగ్ ట్రెయినీట. రవి వెళ్ళినంత ఫాస్ట్‌గా ఫ్యాక్టరీ లోంచి ఇవతల కొస్తూ, “ఏం నిజామాబాద్ ఎప్పుడు పోతున్నావ్? కొత్త సినిమాలు ఏం చూసావ్?” అని సివిల్ ఇంజనీరింగ్ వినోద్‌ని అడిగాడు. “ఏం చూడలేదు” అని అతను అన్నాడు. “సినిమా చూడకుండా ఎలా బతికున్నావ్? నీ ప్రాణం పోతుంది కద!” అన్నాడు. తర్వాత నా వైపు చూసాడు.
చమెలీపూలు భుజం మీద పడి వున్నాయి. నేను అతన్ని విష్ చెయ్యలేదు. ఎవరూ నాకు పరిచయం చెయ్యలేదు మరి! నేను సీరియస్‍గా టైప్ చేస్తున్నాను. అతను నా మొహం ముందు చిటికెలు వేసాడు. ఆ అమర్యాదకరమైన ప్రవర్తన అప్పటిదాకా, ఎవరూ నాతో చూపెట్టలేదు. ఆశ్చర్యంగా, కొంచెం కోపంగా చూసాను. “మీ పేరేంటి?” ఇంగ్లీషులో అడిగాడు. చెప్పాను. “ఆఫీసుకి పూలు పెట్టుకు రాకూడదు… మీ ఇంట్లో పేరంటం కెళ్ళేటప్పుడు పెట్టుకోండి…” హిందీలో చెప్పాడు. ఎం.డి. గారి ఇంట్లో కన్నడా, బయట హిందీ మాట్లాడ్తారు అందరూనూ.
రవి రేష్‌గా నాకు చెప్పి, ఎం.డి. గారు పిలిస్తే ఆయన రూమ్ లోకి వెళ్ళాడు. అప్పుడు దామోదర్ గారు నవ్వి, నాతో చిన్న గొంతుతో, “ఎం.డి. గారి రెండో అబ్బాయి, కాబోయే మా ఎం.డి.గారు” అన్నారు.
దామోదర్ గారు ఎం.డి.గారి మేనకోడలి భర్త. ఆయన అభిమానం చూరగొని, కంపెనీ మొత్తం తన భుజస్కంధాలపై నడిపిస్తారని తెలిసింది. నాకు కొన్నిసార్లు పాత సినిమాల్లో సాక్షి రంగారావు, అల్లు రామలింగయ్య పాత్రలా అనిపించేది, ఆయన వినయం ఎం.డి. గారి ముందు. ఎందుకో నా పట్ల చాలా ఆప్యాయత కనబరిచేవారు పని కూడా నేర్పించేవారు.
కాసేపట్లోనే ఎం.డి.గారి రూం లోనుండి ప్యూన్ వచ్చి నన్ను పిలుస్తున్నారని చెప్పారు. నేను వెళ్ళేసరికీ, ఎం.డి.గారి ముందు కూర్చుని, అక్కడున్న పేపర్ వెయిట్‌తో ఆడ్తున్న రవి, “ఇది నువ్వే టైప్ చేసావా?” అని ఒక కాయితం, నా మొహం దాకా తెచ్చి, ఆడించాడు. నేను అప్పటికే అతని ‘రౌడీ’ ప్రవర్తన అర్థం చేసుకుని, తల ఆడిస్తూ, కోపంగా చూసాను. అదే విజయ్ అయితే, ఎం.డి.గారి పెద్ద కొడుకైనా, దూరంగా నిలబడి “ఎస్ సర్” అని వినయంగా మాట్లాడ్తాడు. ఇతనికి ఆయన అంటే కూడా భయమూ, భక్తీ లేనట్టుంది. ఎం.డి.గారి ముందే గట్టి గట్టిగా నాతో మాట్లాడుతున్నాడు. ఆయన “రవీ” అన్నారు మందలింపుగా. నేను అతనితో కాకుండా ఎం.డి. గారి వైపు తిరిగి, “సార్… మిస్టేక్స్ వుంటే మళ్ళీ చేస్తాను” అన్నాను. ఎం.డి. గారు తల అడ్డంగా ఊపి, “యూ కెన్ గో” అన్నారు నాతో.
నేను బయట కొచ్చినా, నాకు కోపంగా, పిలిస్తే పలికే కన్నీళ్ళు, కళ్ళ నిండా వచ్చాయి. దామోదర్ గారు నా వైపు చూసి చిన్నగా నవ్వి, లోపలికి వెళ్ళారు.
పూలు పెట్టుకోకూడదట! రాత్రే రోజూ చమేలీ పూలు కొసి మాల కట్టుకుని, తడి రూమాలులో పెట్టుకుని, ఎంతో మురిపెంగా, గంజి పెట్టిన ఇస్త్రీ చీరలు కట్టుకుని వెళ్ళే నాకు, ఈ మాట చాలా కోపాన్ని తెప్పించింది. ఆ రోజు లంచ్ టైంలో రుసరుసలాడ్తూ ఇంటికొచ్చి అమ్మమ్మ అన్నం పెడ్తుంటే “ఆ ఎండి గారికి ఓ తిక్క కొడుకున్నాడు. ఎంత పొగరో… నన్ను పూలు పెట్టుకోవద్దు అన్నాడు” అన్నాను.
అమ్మ కూడా వచ్చింది. విషయం విని “నిజమే అతను చెప్పినది. ఆఫీసులకి పూలు పెట్టుకుని, ఒంటి నిండా నగలు పెట్టుకునీ వెళ్ళకూడదు. మా రాజమణి ఆఫీసుకి మొదటిరోజు లంగా ఓణీలో కుచ్చుల జడా, చెంప స్వరాలతో వస్తే అంతా నవ్వారు. అలాగే మన ఇంటి పక్కన కేర్ సెంటర్‍లో పిల్లల్ని వదిలి వెళ్ళే బాలా త్రిపుర సుందరి, మొహం నిండా, కాళ్ళ నిండా పసుపు, తల నిండా చేమంతిపూలూ, మొహం మీద మూడు బొట్లూతో పేరంటానికొచ్చినట్లు ఆఫీసు కొస్తే కూడా, కొందరు మగాళ్ళు ‘మంగళగౌరి’ అని నిక్‍నేమ్ పెట్టి పిలవడం, ఇంకా కొంతమంది ‘కొబ్బరికాయ’ అని మాట్లాడుకోవడం నేను విన్నాను. ఆఫీస్‍కి యూనిఫామ్ లేకపోయినా, డ్రెస్ కోడ్ వుంటుంది. నేను ఎప్పుడైనా పూలు పెట్టుకుని వెళ్ళడం చూసావా? మన ఆస్పత్రిలో డాక్టర్స్ పూలు పెట్టుకుని, పసుపు రాసుకుని రావడం చూసావా?” అని వివరంగా చెప్పింది.
అమ్మ ఎప్పుడూ లేత రంగుల చిన్న ప్రింట్స్ కాటన్ శారీస్, హాఫ్ వాయిల్ శారీస్ కట్టుకుని ఆఫీస్‍కి వెళ్తుందీ, వాళ్ళ ఫ్రెండ్స్ సరస్వతీ, రాజమణిలా పట్టుచీరలూ, నెక్లెస్‌లతో ఆఫీసుకి వెళ్ళదు, అని నేను బాధపడిన రోజులూ వున్నాయి! ఇప్పుడు అర్థమైంది, ఆడా మగా కలిసి పని చేసే చోట ఇలా ప్రత్యేకంగా, పేరంటాలకి వెళ్ళినట్టు తయ్యారయి వెళ్ళకూడదు, మగపిల్లలు నిక్ నేమ్స్ పెడతారని! అమ్మ నాకు చాలా నేర్పించింది, కానీ అడిగితే కాని ఏదీ చెప్పేది కాదు! ముఖ్యంగా నేను సినిమా ఫీల్డ్ లోకి వచ్చాకా, ఆ రోజుల్లో స్టేజ్ ప్రోగ్రామ్స్ గాయనిగా ఇచ్చి, ఆర్.టి.సి.లో ఉద్యోగం చేసిన అమ్మ తన అనుభవాలు చెప్పి, నేను ‘లో’గా ఫీల్ అయినప్పుడల్లా నాలో ధైర్యం నింపేది! నేను వీరేంద్రనాథ్ గారి వర్క్‌షాప్‌కి వెళ్ళి, ఆయన శిష్యురాలిని అయినప్పుడు, ఆయన నాతో చెప్పిన మాట, “మీ అమ్మగారు వస్తుంటే, రఘుపతి రాఘవ రాజారాం నాటకం కోసం పాట పాడడానికి, మా వాళ్ళు ‘సత్యవతి గారొస్తున్నారు… సత్యవతి గారొస్తున్నారు…’ అని సెలెబ్రిటీ వస్తుంటే కంగారు పడేట్లు కంగారు పడి కుర్చీ వేసేవారు.” అని!
ఆ ఫేస్ నిజంగా నాకు తెలీదు అమ్మది! మా గురువు గారు చెప్తే నేను గర్వపడ్దాను. ఆర్.టి.సి.లో అమ్మని తెలిసినవాళ్ళంతా ‘సత్యవతక్కయ్యా’ అనే పిలుస్తారు. బహుశా అదే పరంపరలో ఇప్పుడు సినిమా ఫీల్డులో, నన్ను చాలామంది ‘అక్కయ్య గారు’ అని పిలుస్తున్నారు. నా పిల్లల వయసు వాళ్ళు ‘అమ్మ’ అని కూడా అంటారు. అది ఎంత గౌరవప్రదమైన పిలుపో నాకు తెలుసు!
ఇదంతా ఇంట్లో అమ్మమ్మా, అమ్మా కౌన్సిలింగ్ అయ్యాకా, నేను పూలు పెట్టుకొని వెళ్ళడం మానేసాను. కానీ రవి నన్ను ఏడిపించడం కోసమే ఆఫీస్ కొస్తున్నాడని నా అనుమానం. “ఇంత లేట్‍గా ఎందుకు వచ్చావ్?” అనేవాడు. త్వరగా వెళ్తే, “ఇంత త్వరగా ఎందొకొచ్చావ్?” అనేవాడు.
ఒక రోజు కార్లో ఎం.డి. గారి భార్య ఆండాళ్ళూ నారాయణ దాస్ గారు, దామోదర్ గారి భార్యా వచ్చారు. ముక్కుకి బేసరితో, తెల్ల జుట్టు ఎం.ఎస్. సుబ్బులక్ష్మిలా పెద్ద కొప్పు వేసుకుని పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని, గద్వాల పట్టుచీరలో ఆమె కేలండర్‍లో లక్ష్మీదేవిలా, ఫొటోల్లో చూసిన ఎం.ఎస్. సుబ్బులక్ష్మిలా వున్నారు. ఆవిడ నవ్వుతూ నన్ను చూసి, కారు దగ్గరకి పిలిచారు. నేను వెళ్తే, నా చేతిలో పెద్ద మల్లెపూల చెండు పెట్టారు. ఆవిడ కొప్పు చుట్టూ కూడా పెద్ద మల్లెపూల దండ పెట్టుకుని వున్నారు! ఎందుకిచ్చారా అని నా మతి పోయింది. రవి అన్నీ వాళ్ళమ్మకి చెప్తాడా అని అనుమానం వచ్చింది. నేను నమస్కారం పెట్టాను. దామోదర్ గారొచ్చి నన్ను పరిచయం చేస్తుంటే, ఆవిడ “నాకు తెలుసు. రోజూ ఇంట్లో మాట్లాడుకుంటాం తన గురించి” అని స్వచ్ఛమైన ఇంగ్లీషులో చెప్పారు. ఆవిడ ఎంతో అందంగా వున్నారు. నా గురించేం మాట్లాడుకుంటారో? మళ్ళీ అనుమానాలు… వాళ్ళ వంటతను ‘మంజు’ ఒరియా అతను. రోజూ ఎం.డి.గారికి, విజయ్‌కి క్యారేజ్ తెచ్చేవాడు. ఆ క్యారేజ్ తెరవగానే, అందులోంచి ఘుమఘుమలు! ఎంత బావుండేవో! ఇలా రవితో నేను నానా పాట్లు పడ్తూ వుండగానే ఫస్ట్ తారీఖు వచ్చింది.
నాకు 300/- రూపాయల శాలరీ కవర్ ఇచ్చారు. అమ్మకి ఆనందంగా ఎదురెళ్ళి ఆ కవర్ ఇచ్చాను. “బయటకి వెళ్దాం, రెడీ అవ్వు” అంది. నేనూ అమ్మా ఎప్పుడు బయటకి వెళ్ళినా సుధా హోటల్‍లో ఇడ్లీ తినేవాళ్ళం. మా పెద్దమ్మ నాగపూర్ నుండి వచ్చినా, మొదట సుధా హోటల్‌కే వెళ్ళేవాళ్లం. అక్కడ ఇడ్లీ సాంబార్ అంత బావుండేది! అక్కడి నుండి నల్లీస్ సిల్క్స్ షోరూం కెళ్ళి, శాంతి థియేటర్‌కి ఎదురుగా వున్నది, అమ్మ ఓ ‘స్నఫ్ కలర్’ పట్టుచీర కొంది. ఆ చీర ఎంత బావుండేది అంటే, అది కట్టుకున్న ప్రతి సందర్భంలో ఎవరో ఒకరు వచ్చి నన్ను స్పెషల్‌గా పొగిడేవారు! మా వారు ప్రభాకర్ కూడా ఆ చీర కట్టుకున్నప్పుడే నన్ను చూసి ప్రపోజ్ చెయ్యాలనుకున్నానని చెప్పారు!
అలా రెండు శాలరీలు తీసుకున్న నేను, ఒక నెల పట్టుచీరా, ఒక నెల ఒక గ్రాము బంగారం కొనుక్కున్నాను. ఇంకా బంగారం కొనేదాన్నేమో, కానీ ఆఫీసులో రవి నాకోసం వెయిట్ చేస్తూ వుండడం, ఒకసారి నేను వెళ్ళేసరికి టైప్ రైటర్‌లో ‘I Love You’ అని టైప్ చేసి పెట్టడం, ఇలాంటి పనుల వల్ల నేను చాలా కంగారు పడ్డాను. ఇంట్లో ఈ విషయం చెప్పాలా వద్దా అనుకుంటూ వుండగా, ఒకనాడు మా అన్నయ్య మిత్రుల్లో జయరాం అనే మిత్రుడు ఆఫీసుకొచ్చాడు. నేను ఆశ్చర్యంగా “ఏంటి ఇలా వచ్చావు?” అని బయటకొచ్చాను. “ఓ ముఖ్యమైన విషయం మాట్లాడ్డానికొచ్చాను” అన్నాడు.
(సశేషం)