చంద్రరాజకవి మదన తిలకము – నన్నెచోడుని కుమార సంభవము : సాదృశ్యసమీక్ష

3
2

[dropcap]సా[/dropcap]హిత్య విద్యార్థులకు అవిస్మరణీయులైన మాన్యమహోదయులు శ్రీ మానవల్లి రామకృష్ణకవి గారు తెలుగు సాహిత్యంలో ఉత్తమోత్తమమైన మహాకవి రావిపాటి త్రిపురాంతకుని త్రిపురాంతకోదాహరణము ను తొలిసారిగా పరిష్కరించి నూటపదేళ్ల క్రితం 1912 లో ప్రకటించినప్పుడు దాని పీఠికలో త్రిపురాంతకుని రచనలను మనకు పరిచయం చేశారు. త్రిపురాంతకుడు వల్లభరాయల క్రీడాభిరామమునకు మూలమైన ప్రేమాభిరామమును సంస్కృతంలోనూ; త్రిపురాంతకోదాహరణము, చంద్ర తారావళి, అంబికా శతకము, మదనవిజయము అన్న కృతులను తెలుగులోనూ రచించాడని పేర్కొన్నారు.

‘త్రిపురాంతకోదాహరణము’ మన అదృష్టం వల్ల పూర్తిగా దొరికింది. పాల్కురికి సోమనాథుని ‘బసవోదాహరణము’ కంటె ఎన్నో విధాల ఎంతో మనోహరమైన రచనమది. ‘చంద్ర తారావళి’ లోని నాలుగు పద్యాలు వివిధ సంకలన గ్రంథాలలో లభించాయి. రసోల్లాసమైన కవితకు ఉదాహరణీయమైన కృతి అది. ‘అంబికా శతకము’ లోనివి మొత్తం ఏడు పద్యాలు దొరికాయి. ప్రతి అక్షరంలోనూ తీయదనం ఉట్టిపడే పీయూష లహరి ఆ కావ్యఖండం. తెలుగు శతక సాహిత్యానికి వెలలేని రత్నాల కోహళి. ప్రతిపద్యాన్నీ పదిమార్లు పారాయణగా చదువుకొన్నా పూర్తిగా లోతులు మనకు అందీ అందలేదనిపించేటంత అందమైన కవిత్వం నిండిన ఒకే ఒక్క శతకం అది. వందనీయ చందనీయం అంటే అదే. తక్కిన పద్యాలన్నీ దొరికి ఉంటేనా! “ఇదీ మా తెలుగంటే” అని ప్రపంచమంతటా రొమ్ము విరుచుకొని చాటింపు వేసేందుకు వీలుండేది. ఏ భాషానువాదానికీ లొంగని తెలుగు వాక్యచమత్కారాలకు పుట్టిల్లు.

వీటిలో చివరిదైన మదన విజయము కామశాస్త్రగ్రంథమట. ఆ కృతి వ్రాతప్రతిని ఒకరి ఇంటిలో చూశామని, అయితే ఆ ఇంటివారు గ్రంథాన్ని పరిశీలించేందుకు అనుమతింపలేదని – అప్పటి ఆ వివరాలను రామకృష్ణకవి గారు ఎంతో బాధాతప్తహృదయంతో నెమరువేసుకొన్నారు:

మదనవిజయ మెనిమిదాశ్వాసముల సంజ్ఞాభియోగిక భార్యాధికార పారదారిక వైశికాది ప్రకరణములు గలిగి యభినవకామసూత్రమో యన విలసిల్లుచున్నది. నాకుఁ జూడఁ దటస్థించిన ప్రతిలోఁ బూర్వపీఠిక లేదు. మఱియుఁ దాళపత్రములు బూజువట్టి విడదీసినచో సహస్రశకలాకారము లందుచుండెను. తద్గ్రంథస్వాము లయ్యది పైతృకధనమని యీ నొల్లకుండిరి గాక రెండవమాఱు చూపకయు నుండుట చోద్యమయ్యెను.

అని వ్రాశారు.

పై ప్రకరణ వివరణలో మొదటిదైన సంజ్ఞా ప్రకరణం అన్ని శాస్త్ర గ్రంథాలలోనూ ముమ్మొదటగా కనుపించే అధ్యాయమే. వాత్స్యాయనుని ‘కామసూత్రము’, బాభ్రవ్యుని ‘స్మర దర్శనము’, వీరభద్రదేవుని ‘కందర్ప చూడామణి’, పద్మశ్రీ ‘నాగర సర్వస్వము’, కళ్యాణ మల్లుని ‘అనంగ రంగము’, ప్రౌఢదేవరాయల ‘రతిరత్నప్రదీపిక’, కొక్కోకుని ‘రతిరహస్యము’ ఇత్యాదిగా అనంతముఖీనములై వెలసిన కృతులలో సంజ్ఞా ప్రకరణాన్ని చదువుతున్నప్పుడు తెలుగు కవులు ఆ పారిభాషిక పదాలను ఎంతటి కల్పనాశిల్పంతో తమతమ కావ్యాలలో అనువర్తించారో తెలుసుకొంటే, మనకు ప్రబంధవిద్యలోని గంభీరిమ కొద్దిగానైనా పరిచితం కాగలదు.

సామాన్యంగా కామశాస్త్ర లక్షణగ్రంథాలు అన్నింటిలోనూ సాంప్రయోగిక ప్రకరణం రెండవదిగా ఉంటుంది. రామకృష్ణకవి గారు త్రిపురాంతకుని మదన విజయములో రెండవదిగా ఆభియోగిక ప్రకరణం ఉండినదని పైన పేర్కొన్నారు. “ఆభియోగికశ్చ కన్యాయాః ప్రతిపత్తిః” అని వెలసిన వాత్స్యాయనుని సూత్రాన్ని బట్టి ఈ ఆభియోగికం కన్యా సాంప్రయోగిక ప్రకరణమే అయివుంటుందని మనము అర్థం చేసుకోవచ్చును.

శ్వేత వరాహకల్పంలో హిరణ్యగర్భుడనే పేరిట శ్రీమహావిష్ణువు నాభికమలం నుంచి ఉదయించిన బ్రహ్మదేవుని వంశంలో సువర్ణనాభుడనే మహర్షి ఉదయించాడట. ఈ సాంప్రయోగిక ప్రకరణానికి ప్రవక్త ఆయనేనట.

ఆ తర్వాత పరమేశ్వరాంశతో జన్మించిన గోనర్దీయుడు భార్యాధికార ప్రకరణానికి నియామకుడు.

గోవు అంటే వృషభము అని కూడా అర్థం. గోవును నందింపజేసేవాడు కనుక పరమేశ్వరుడు గోనర్ది. ఆయన అంశతో జనించిన మహర్షి గోనర్దీయుడు అన్నమాట. మహాభాష్య నిర్మాత భగవత్పతంజలి కూడా గోనర్దీయుడే. వీరంతా లోకోపదేశానికై తమ జీవితాలను కర్పూరం లాగా ఖర్చుపెట్టిన పుణ్యధనులు.

పూర్వం జగత్తంతా ఏకార్ణవమై తోచినప్పుడు యజ్ఞవరాహావతారంలో శ్రీమహావిష్ణువు భూదేవిని తన దంష్ట్రాగ్రాన పైకి లేవనెత్తాడు. ఆ తరుణంలో భూదేవి ఆయన కోర కొసమీద చిన్న నలుసు లాగా ఉండినందువల్ల ఆమెకు ‘అణికా’ అని పేరువచ్చింది. గోరూప ధారిణి కనుక ఆమె ఆ నాటినుంచి ‘గోణిక’ అయింది. ఆ గోణికకు శివుని అంశతో జన్మించిన అంగారకుని గోణికాపుత్రుడు అంటారు. ఆ అంగారకుని వంశంలో ఆయన వరప్రసాదం వల్ల జన్మించినవాడే గోణికాపుత్రుడు. ఆయన ఒక కామశాస్త్ర గ్రంథాన్ని వ్రాసి అందులో పారదారిక ప్రకరణాన్ని కల్పించాడట.

అటువంటిదే వైశికమున్నూ. ఒకప్పుడు బాభ్రవ్యుడు చెప్పిన మహామ్నాయాన్ని దత్తకుడు సంక్షేపించాడని యశోధరుడు తన జయమంగళ వ్యాఖ్యలో వివరించాడు. ఆమ్నాయము అంటే, పరంపరగా చెప్పుకొనే సూత్రసారమని ఇక్కడి అర్థం.

ఈ విషయాలను రామకృష్ణకవి గారు చెప్పకపోయినా మనము అన్వయించుకోవాలని ఇంత వివరంగా వ్రాశాను.

2

ఆరోజు ‘మదన విజయము’ వ్రాతప్రతిని చూసిన ఆ కొద్దిసేపటిలోనే తాము గుర్తుంచుకొన్న రెండు పద్యాలను ‘త్రిపురాంతకోదాహరణము’ పీఠికలో రామకృష్ణకవి గారు ఉదాహరించారు. ఆ పద్యాలు రెండూ ఇవి:

సతి గుణవతి యగునేనియుఁ
బతి కది రత్నంబ, ప్రాణబంధువ, యమృతం
బతివయ, దుర్గుణి యగునేఁ
బతి కెడపని చిచ్చు; కాలుపక యది గాల్చున్.

గుణమున్, సుందరరూపమున్, విభవముం,
గూటంబు, సౌభాగ్యల
క్షణముం, జారుచరిత్రమున్, వినయమున్,
జాతుర్యమున్, ధర్మభూ
షణముం గల్గి, పతివ్రతామహిమ మిం
చన్ గల్గెనేఁ దత్సతీ
మణి చింతామణి; దానిఁ దాల్పఁగలుగన్
మర్త్యుండె ధన్యుం డిలన్.

అని.

1937 లో ‘త్రిపురాంతకోదాహరణము’ను శ్రీ నిడుదవోలు వేంకటరావు గారు విపులమైన మంచి పీఠికతో పునర్ముద్రించారు. 1945 లో దాని పునర్ముద్రణ వెలువడింది. పీఠికలో వేంకటరావు గారు త్రిపురాంతకుని మదన విజయంలోనివి అని రామకృష్ణకవి గారు మునుపు పేర్కొన్నట్లే మళ్లీ పేర్కొన్నారు.

‘త్రిపురాంతకోదాహరణము’ను ప్రకటించిన కొంతకాలానికి శ్రీ నిడుదవోలు వేంకటరావు గారు శ్రీ రామకృష్ణకవి గారు రావిపాటి త్రిపురాంతకుని ‘మదన విజయము’ లోనివిగా ఉదాహరించిన పద్యాలు రెండూ నిజానికి స్వతంత్ర పద్యాలు కావనీ, వీటికి మూలములైన ప్రతీకలు కన్నడంలో క్రీ.శ. 1040 నాటి చంద్రరాజకవి రచించిన మదన తిలకము అనే కావ్యంలో ఉన్నాయనీ గుర్తించారు. ‘భారతి’ పత్రిక (సర్వధారి ఫాల్గుణ మాస సంచిక) లో ‘పూర్వ సాహిత్య వీథులు’ అన్న వ్యాసంలో వారు ఆ సమాచారాన్ని ప్రకటించారు. వారు పోల్చి చూపిన ఆ కన్నడాంధ్ర పద్యాలివి:

సతి గుణవతి దొరెకొండడె
పతిగా స్త్రీరత్నమెంబ హెసరుం పడెగుం
సతి దుర్గుణి దొరెకొండడె
పతిగా స్త్రీవ్యాధియెంబ హెసరుం పడెగుం.

సతి గుణవతి యగునేనియుఁ
బతి కది రత్నంబ, ప్రాణబంధువ, యమృతం
బతివయ, దుర్గుణి యగునేఁ
బతి కెడపని చిచ్చు; కాలుపక యది గాల్చున్.

గుణముం సుందరరూపముం విభవముం
సౌభాగ్యముం భాగ్యల
క్షణముం చారుచరిత్రముం కులముమొ
ళ్పుం సత్యముం ధర్మభూ
పణముం సంద పతివ్రతామహిమెయుం
దానత్వముం బంధుల
క్షణముం పెండి రొళక్కుమెయ్దె పురుషర్
యోజిప్పుదొందోజెయం.

గుణమున్, సుందరరూపమున్, విభవముం,
గూటంబు, సౌభాగ్యల
క్షణముం, జారుచరిత్రమున్, వినయమున్,
జాతుర్యమున్, ధర్మభూ
షణముం గల్గి, పతివ్రతామహిమ
మించన్ గల్గెనేఁ దత్సతీ
మణి చింతామణి; దానిఁ దాల్పఁ గలుగన్
మర్త్యుండె ధన్యుం డిలన్.

పై పద్యాలలో కన్నడ పద్యాలు రెండూ ‘మదన తిలకము’ అష్టమాధికారంలో 3, 19 సంఖ్యలతో ఉన్నాయి. వీటిలో రెండవదైన “గుణముం సుందరరూపముం” అన్న పద్యం మల్లికార్జున మునీశ్వరుని ‘కన్నడ సూక్తిసుధార్ణవము’లో కూడా (7-100) ఉదాహృతమై కనబడుతుంది. ఈ మల్లికార్జునుడు ‘శబ్దమణిదర్పణ’ కర్త కేశిరాజుకు తండ్రి అని, హోయసల రాజు వీరసింహుని (క్రీ.శ. 1234-1254) కాలం నాటివాడని, ఎడ్వర్డ్ పి. రైస్ గారు 1915 లో అచ్చయిన A History of Kanarese Literature లో వ్రాశారు. ‘మదన తిలకము’, ‘మదన విజయము’ల లోని పద్యాలను మనమిప్పుడు పోల్చి చూసినప్పుడు – రావిపాటి త్రిపురాంతకుడు కన్నడ కావ్యానికి శబ్దానుసరణపూర్వకమైన యాథాతథ్యానువాదాన్ని చేశాడనే భావింపవలసి ఉంటుంది. అది త్రిపురాంతకుని వంటి మహాకవి స్వభావం కాకపోయినా, రామకృష్ణకవి గారి యందలి ప్రామాణ్యభావంతో మనము దానిని విశ్వసింపవలసి ఉంటుంది.

కూచిరాజు ఎఱ్ఱన తన ‘కొక్కోకము’ అనువాదంలో వాత్స్యాయనాది పూర్వ శాస్త్రవేత్తలకు నమస్కరిస్తూ, “రావిపాటి తిప్పరాజాది ముఖ్య శృం,గార కవుల నెల్ల గారవించి” అని స్మరించినందువల్ల అది ‘మదనవిజయము’ కావ్యవిషయమో, లేక రావిపాటి త్రిపురాంతకుడు సంస్కృతంలో చెప్పిన ‘ప్రేమాభిరామము’ కావ్యరచనాప్రశంసమో మనమిప్పుడు చెప్పలేము.

3

చిత్రమేమిటంటే, త్రిపురాంతకుని మదన విజయము మాటెలా ఉన్నా, రామకృష్ణకవి గారు 1909 లో ప్రకటించిన నన్నెచోడుని కుమార సంభవములో ఈ మదన తిలకము లోని పద్యాలనేకం ఉన్నాయి. కుమార సంభవము కావ్యకర్తృత్వం వివాదాస్పదమైన రోజులలోనూ విమర్శకులెవరూ ఈ రెండు గ్రంథాలకు గల పోలికలను పరిశీలింపలేదు. ఆర్. నరసింహాచార్య గారి History of Kannada literature ప్రకారం ఈ చంద్రరాజకవి చాళుక్య జయసింహదేవుని (క్రీ.శ. 1014–42) వద్ద మాండలికుడైన సమధిగత పంచమహాశబ్ద మహాసామంతాధిపతి రేచమహీపతి యొక్క ఆస్థానకవి. నా దగ్గరున్న ‘మదన తిలకము’ ప్రతి ధార్వాడ కన్నడ పరిశోధన సంస్థ వారు ఆర్.ఎస్. పంచముఖిగారి పరిష్కరణతో 1953 లో వెలువరించినది. దురదృష్టవశాత్తూ దీని పరిష్కరణమూ, గ్రంథముద్రణమూ ఏ మాత్రం ఆ మహాలాక్షణికుని స్థాయికి తగినట్లుగా లేవు. కన్నడాంధ్ర భాషా సాహిత్య పరిశోధకులకు ఆసక్తిదాయకమని – కొంత విస్తరమే అయినా, ఆ పోలికలు కొన్నింటిని ఇక్కడ పొందుపరుస్తున్నాను:

శ్రీయ నురఃస్థలదొ ళ్వా
క్ఛ్రీయం నిజవదనకమలదొళ్ కూర్త జయ
శ్రీయం భుజదొళ్ కీర్తి
శ్రీయం దిక్తరుదొళ్నిలిసిదం రేచనృపం. మదన (1-2)

శ్రీశ్రితవక్షుఁడు ముక్తి
శ్రీశ్రితసహజావదాతచిత్తుఁడు వాణీ
శ్రీశ్రితసుముఖుఁడు గీర్తి
శ్రీశ్రితదిఙ్ముఖుఁడు శేముషీనిధి పేర్మిన్. కుమార (7-1)

భవనెనసిద మహిమె భవో
ద్భవనెనసిద శక్తి నాకలోకేశ సం
భవనెనసిద గండు మనో
భవనెనసిద సొబగు రేచభూపాలకనే. మదన (1-22)

భవమరణాంభఃపూరిత
భవసాగరతరణసేతుపద్ధతిఁ జేతో
భవనిశితకుసుమబాణో
ద్భవరాగవిముక్తుఁ గమలభవకులతిలకున్. కుమార (1-131)

సుర దనుజ గరుడ యక్షా
సుర భూత పిశాచ సిద్ధ విద్యాధర కి
న్నర పన్నగ గంధర్వర్
సురతసుఖం పరమసుఖ మిదెందెరగిర్దర్. మదన (1-66)

సురగరుడోరగవిద్యా
ధరపురవరసతులతోడ దనుజేశ్వరు కిం
కరులు రమింతురు దోషా
చరులకును వెలి లోపు గలదె చతురాననుఁడా. కుమార (4-18)

నోటం మన్మథమార్గణం నుడిగళె
ల్లం మారహృద్భేదనం
కూటం కామరసామృతం తవధరా
ముత్సాహ మింపాగమం
బేటం చిత్తజతర్తవారియుర మ
త్యంతాదిమిం నాకదిం [?]
కూటాకూటమిశేషముం గనెయ రొ
ళ్సంభోగ మార్గదొళ్. మదన (11-25)

మాటలఁ జెయ్వుల బేటం
బేటముగా నలవరించె నెసఁగఁగ సతి లా
లాటతటనయనుఁ డింపగు
కూటముల కపూర్వసురతగుణకోవిదుఁడై. కుమార (1-76)

ఒకరిని చూసి ఒకరు వ్రాసినట్లున్న ఇటువంటి స్పష్టమైన ప్రతిబింబాలు నన్నెచోడుని ‘కుమార సంభవము’ కావ్యానికీ, చంద్రరాజకవి ‘మదన తిలకము’ కావ్యానికీ ఇంకా అనేకం ఉన్నాయి. నేను కొన్నింటిని మాత్రమే చూపాను. ఈ పోలికలకు కారణం ఏమిటో పరిశోధింపవలసి ఉన్నది. చంద్రరాజే నన్నెచోడుని అనుకరించాడని భావించేవారికి చెప్పగలిగిన సమాధానమేమీ నాకు తోచటం లేదు.

రావిపాటి త్రిపురాంతకుని వంటి మహాకవి ఛాయోపజీవిగా కేవల శబ్దానుసరణపూర్వకమైన ‘మదన విజయము’ యొక్క తెలుగు అనువాదాన్ని చేపట్టి ఉంటాడని భావించటం కష్టం.

చంద్రరాజకవి రచించిన ‘మదన తిలకము’లో మానవల్లి రామకృష్ణకవి గారు రావిపాటి త్రిపురాంతకుని ‘మదన విజయము’లో ఉన్నాయని చెప్పిన కామశాస్త్రానికి సంబంధించిన సంజ్ఞాభియోగిక – భార్యాధికార – పారదారిక – వైశికాది ప్రకరణాలు లేవు. ఆ ప్రస్తావనలను కలిగిన ఒక వచనము మాత్రమే మొదటి అధికరణంలో ఉన్నది. పైగా అది కామశాస్త్రగ్రంథమే గాక కవిత్వలక్షణపూర్వకంగా దేశిచ్ఛందోరీతులను, చిత్రకవిత్వాన్ని పొందుపరిచిన ఒక లక్షణశాస్త్రగ్రంథం. గ్రంథం పూర్తిగా లభింపలేదు.

ఆ కన్నడ ‘మదన తిలకము’లో అక్కడక్కడ ఉన్న కామశాస్త్ర ప్రస్తావనలను చూసి రామకృష్ణకవిగారు చంద్రరాజకవి రచనకు అనుసరణమైన తెలుగు ‘మదన విజయము’ కూడా కామశాస్త్రగ్రంథమని పొరబడ్డారో, లేక ఎవరి కృతినో చూసి ఏమనుకొన్నారో ఊహించటం కష్టం.

అసలు ‘మదన విజయము’ అన్న పేరే అది కామశాస్త్రగ్రంథము కాకపోవచ్చునని సూచిస్తున్నది. కామశాస్త్రరచన కావించే శాస్త్రకారుడు వేదాంతసూత్ర ప్రవక్త లాగా వైరాగ్యాన్ని బోధించి, సంఘంలోని వ్యక్తులు ఇంద్రియనిగ్రహాన్ని అలవరచుకొని మదనునిపై ఎట్లా గెలుపును సాధించాలో వివరించే విషయాన్ని చేపట్టి, ఆ రచనకు ‘మదన విజయము’ అనే పేరుపెట్టి ఉంటాడని నమ్మటం కష్టం. ‘మదన విజయము’ అన్న పేరే అది కామశాస్త్రగ్రంథం కాకపోవచ్చునని సూచిస్తున్నది. అటువంటప్పుడు రామకృష్ణకవి గారు ఆ విధంగా ఎందుకు చెప్పారో తెలియదు. ఒకవేళ ‘మదన విజయము’ అంటే ‘మదనుని యొక్క విజయము’ అని చెప్పుకొన్నా, అదీ కామశాస్త్రగ్రంథానికి శీర్షిక అయ్యే అవకాశం తక్కువ.

‘త్రిపురాంతకోదాహరణము’ 1915 లోనూ; నన్నెచోడుని ‘కుమార సంభవము’ మొదటి భాగం 1909 లో, రెండవ భాగం 1914 లోనూ అచ్చయ్యాయి. మానవల్లి రామకృష్ణకవి గారు త్రిపురాంతకుని ‘మదన విజయము’ ప్రతిని ఎక్కడ చూశారో, ఎప్పుడు చూశారో చెప్పలేదు. మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథ భాండాగారంలో చంద్రరాజకవి ‘మదన తిలకము’ ప్రతి ఉన్నప్పటికీ, డానిని చూసినట్లుగా వారెక్కడా పేర్కొనలేదు.

పైని నేను చూపినవే గాక కల్పనలలో నిస్సంశయంగా పోలికలున్న పద్యాలు రెండు కావ్యాలలోనూ ఇంకా అనేకం ఉన్నాయి. కుమారసంభవములోని అపూర్వములైన పదాలు కొన్నింటికి ఆకరాలు మదనతిలకములోనూ కనుపిస్తాయి.

ఈ విషయమై ఇంకా లోతుగా పరిశోధన జరిగితే కాని, తెలుగు సాహిత్య చరిత్రలో మరుగునపడిన అనేక సత్యాలు వెల్లడి కావు.

ఆ అంశాన్ని సూచించేందుకే ఈ ప్రసంగం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here