అడుగేయ్ నిబ్బరంగా!

    3
    2

    [box type=’note’ fontsize=’16’]పిల్లల జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినయినా ఎదుర్కునే ధైర్యాన్నిస్తూ ప్రేమగా వెన్నంటి ఉండాలని చక్కగా చెప్పిన కథ “అడుగేయ్ నిబ్బరంగా!”.[/box]

     

    రోజంతా గడిచిపోయిన సూచికగా పొద్దు వాటారుతోంది. గోరువెచ్చని ఎండలో నిలబడి మొక్కలకు నీరు పెట్టుకుంటుంటే ఎంత హాయిగా ఉందో ! మొక్కల మొదట్లో పడిన నీటిని మట్టి ఆనందంగా పీల్చుకుంటోంది. తడిసిన ఆకులు, పువ్వులు ఊగుతూ నాతో మాట్లాడుతున్నట్టున్నాయి. ఇది ఆయన కిష్టమైన పని. ఈ ఇంట్లో ప్రతి అణువులో  మావారితో  నేను గడిపిన జీవితమంతా నిండి ఉంటుంది. అవన్నీ తలుచుకుంటుంటే తృప్తిగా ఉంటుంది. అందుకే  ఆయన పోయి నాలుగేళ్లయినా అబ్బాయి ఎంత  బతిమాలినా వాడి దగ్గరికి వెళ్ళలేదు.  ఇంతలో ప్రహరీ గోడపై పెట్టిన మొబైల్ మోగింది. తీసి చూసాను. కోడలు జానకి నుంచి ఫోన్.

     ” ఏం చేస్తున్నారత్తయ్యా? ” అనడుగుతున్న జానకి గొంతులో ఆవేశపు దుఃఖం నన్ను కంగారు పెట్టింది.” ఒక్క నిమిషంఉండు” అంటూ పైప్ కట్టేసి ” ఏమైయ్యిందమ్మా ? అంతా ఓకే కదా ” అన్నాను భయం దాచుకుంటూ.

    “ ఏం ఓకే ? మీ ముద్దుల మనవరాలు ఇక్కడ కొంప ముంచే పని చేస్తోంది.” జానకి దుఃఖం ఏడుపు లోకి మారింది.

    ” ఏమయ్యింది నాన్నా ? ” అడిగాను ఆత్రుతని అణచుకుంటూ.

    ” నా నోటితోనే చెప్పమంటారా ? ” ఆక్రోశంగా అంది జానకి.

    ” నువ్వు ముందు నిదానించు. తమాయించుకో. కూర్చుని చెప్పు” అన్నాను.

    ” అంత అదృష్టమా నాకు ? ఎవరో ముస్లిం కుర్రాడిని పెళ్లాడుతానంటోంది. ఇష్టపడిందట.”

    అతి కష్టం మీద ఆ మాట చెబుతుంటే జానకి గొంతులో నిస్సహాయతతో కూడిన బేలతనం. విన్నాక ఒక్క క్షణానికి విషయం అర్ధమై నా నోటి లోంచి మాట రాలేదు.

    “నేనిప్పుడేం చెయ్యాలి?ఒక్కగా నొక్క పిల్లని కాఫీ, టీ లందిస్తూ చెలికత్తెలా వెనకే తిరుగుతూ పెంచుకున్నాను.” దుఃఖంతో జానకి గొంతు పూడుకుపోతోంది.

    కొన్ని సెకన్లతర్వాత తేరుకుని ” రాంబాబేమంటున్నాడు ? ” అన్నాను

    “కూతురి మీద గుడ్డి ప్రేమ కదా ! మౌనం దాల్చారు. నేను నెత్తీ నోరు కొట్టుకుంటుంటే నన్ను సముదాయిస్తున్నారు” అంది ఉక్రోషంగా. నేను ఏం మాట్లాడాలో తోచనట్టుగా కొన్ని క్షణాలుండిపోయాను.

    ” రేపు మధ్యాన్నానికల్లా మీరిక్కడ ఉండాలి నా మీదొట్టు ” అంది జానకి బెక్కుతూ.

    ” సరే, సరే నువ్వు కొంచెం ఆవేశం తగ్గించుకో . రేపీపాటికి అక్కడుంటాను సరేనా ! ” అన్నాను .

    ” థాంక్స్ అత్తయ్యా !” అంటూ ఫోన్ పెట్టేసింది. గబా గబా సూట్ కేసు తీసి నాలుగు చీరలు, మిగిలిన సరుకులూ పెట్టుకుని పాలవాడికీ, పనమ్మాయికీ చెప్పి మర్నాడుదయం ఫస్ట్ బస్సు కి మంగళగిరిలో బయలుదేరాను. గుంటూరు లో బస్సు దిగి హైదరాబాద్ బస్సెక్కాను. మధ్యాహ్నం మూడు కల్లా అమీర్పేట్ లో దిగి ఆటోలో అబ్బాయింటికి చేరాను.

    * * * *

    తలుపు తీస్తూనే సూట్ కేసు అందుకుని కాళ్లు కడుక్కోగానే భోజనం వడ్డించింది జానకి.తిన్నాక నన్ను పడుకోమని చెప్పి పక్కనే కుర్చీ వేసుకుని కూర్చుని చెప్పడం మొదలు పెట్టింది.

    “నా మనవరాలు మంచిది, మంచిది అనేవారు కదా ఇప్పుడు చూడండి.ఏదో బి.టెక్ చేసింది క్యాంపస్ సెలక్షన్ వల్ల సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబొచ్చిందని మనమంతా మురిసిపోతుంటే ఎంత పని చేసిందో చూడండి. ఆ ముస్లిం కుర్రాడు మన పల్లవి తోనే బీ టెక్ చేసాడట. ఇక్కడిద్దరికీ జాబ్ వచ్చాక పరిచయం అయ్యిందట. నెల తర్వాత, నువ్వంటే ఎప్పటినుంచో నాకిష్టం. ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాట్ట. రెండు నెలల నుంచీ ఇది కూడా వాణ్ణి ప్రేమించడం మొదలు పెట్టిందట. చాలా మంచి వాడట.

                    ‘నువ్వొప్పుకుంటే చాలమ్మా ! నాన్నగారేమీ అనరు ’ అంటూ వారం రోజుల్నుంచి వేధిస్తోంది.   పోయి పోయి వేరే మతం వాణ్ని పెళ్లి చేసుకోవడం ఏమిటే ఖర్మ! “ అని నేను నెత్తీ నోరూ కొట్టుకుంటుంటే   ‘అమ్మా ! నువ్వు ఇంట్లో కూర్చుంటావు నీకు లోకం తెలీదు. మా ఆఫీస్ లో అమ్మాయిలైతే వేరే రాష్ట్రం వాళ్ళని కూడా చేసుకుంటున్నారు. మంచి కుర్రాడైతే చాలు కానీ ఇవన్నీ అనవసరం.’ అని నాకు పాఠాలు. నాకసలు మతి పోయింది. ఇక తట్టుకోలేక మీకు ఫోన్ చేసాను.”  అంటూ ఊపిరి పీల్చుకుంది. కోడలి వ్యధ,బాధ ఆమె కళ్ళలో కనబడుతోంది. జానకి నాతో కన్న కూతురిలా తన బాధంతా  చెబుతుంటే  నా కడుపులో పేగు కదిలింది. జానకి చేతిపై చెయ్యి వేసాను.

    “అసలు దాన్ని కాదు మీ అబ్బాయిననాలి. నంగనాచిలా ఏమీ మాట్లాడరు. అది ఏం చెప్పినా తలూపుతున్నారు. పిల్ల నొక్క మాటనట్లేదు.  ఇంకా చూడండి. దాన్ని పిలిచి మీ అమ్మిలా బాధ పడుతోంది ఏమంటావ్ ? అంటూ దానికి నా మాటగా చెబుతున్నారు. నన్ను చెడ్డ చెయ్యాలనే చావు తెలివి తప్ప దానికి బుద్ది చెప్పట్లేదు. ఇదీ సంగతి  “ అంటూ బొట బొటా కన్నీరు కారుస్తూ నా వైపు బాధగా చూసింది.

    “నేనొచ్చాను కదా ! నువ్వింక బాధ పడకు. చూద్దాం పరిస్థితి ఏంటో తెలుసుకుంటాను ” అన్నాను.

    కళ్ళు తుడుచుకుని “ మీరొచ్చారు నాకు  కొండంత బలం వచ్చేసింది.” అంటూ హుషారుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది జానకి. టీ స్నాక్స్ తీసుకొచ్చింది. ఇద్దరం తిన్నాక  ఆమె వంట ప్రయత్నంలో ఉండిపోయింది. సాయంత్రం ఆరయ్యేసరికి రాంబాబూ, పల్లవీ వచ్చారు.

    ” భలే వచ్చావే అమ్మా” అంటూ రాంబాబు మురిసిపోయాడు. పల్లవి ఎగిరి గంతేసి నన్ను చుట్టుకు పోయింది ఆనందంగా. అందరం బోలెడు కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసి కొంత సేపు  టీవీ చూసి పడుకున్నాం.

    నా పక్కనే నా పైన చెయ్యి వేసి తన ఉద్యోగం విశేషాలు చెబుతూ నిద్రపోయింది పల్లవి. నాకు నిద్ర రావడం లేదు.ఒక్క పిల్ల చాలనుకుని ఆపరేషన్ చేయించుకుని హాయిగా ఇన్నాళ్లూ  కాపురం చేసుకున్నారు కొడుకూ కోడలూ. ఇప్పుడీ సమస్య వచ్చింది. అసలిది సమస్యేనా , కాదా ? అంటే అనుకుంటే సమస్య కాదనుకుంటే కాదు ఇలా ఆలోచిస్తూ  తెల్లవారు జాముకి నిద్ర పోయాను.

    మర్నాడు రాంబాబు బ్యాంకు కి వెళ్ళాక  జానకి గుడికి వెళ్ళింది. నేనూ పల్లవీ మిగిలాం. శనివారం దానికి శలవు.

    ” నానమ్మా ! నీకొక షాకింగ్ న్యూస్ ! నేనొకబ్బాయిని ప్రేమించాను.” అంది పల్లవి. నేను ఆశ్చర్యం నటించాను.

    “ఖదీర్ అని ముస్లిం అబ్బాయి. నాతో శ్రీనిధిలోనే బీ టెక్ చేసాడు. చాలా మంచివాడు. వెరీ ఫ్రెండ్లీ ! నువ్వు చూసావంటే మెచ్చుకుంటావు మంచి కుర్రాడని. కాలేజ్ లో చూసాను కానీ పరిచయం లేదు. అప్పట్నుంచే నేనంటే ఇష్టమట. ఇప్పుడు ఒకే చోట పనిచెయ్యడం తో మేం దగ్గరయ్యాం. నన్ను ప్రేమిస్తున్నాడు నానమ్మా ! చూడ్డానికి కూడా బావుంటాడు “అంటూ ఆపి నా మొహం చూసి “అమ్మ సినిమాల్లో అమ్మలా జుట్టు పీక్కుంటోంది. నాన్న సరే అనీ కాదనీ ఏమీ అనడం లేదు. కానీ పాజిటివ్ గానే కనబడుతున్నారు.నేనే నీకు ఫోన్ చే సి పిలవాలనుకున్నాను నువ్వే వచ్చేసావ్ ఇంచక్కా. నువ్వైతే అమ్మకి నచ్చ చెప్పగలవు. టీచర్ వి కాబట్టి ”  అంది నా భుజంమీద తల పెట్టుకుంటూ.

    ” నేను నీకు సపోర్ట్ చేస్తానని నీకేంటి నమ్మకం ? ” చిరునవ్వుతో అడిగాను.

    “నాకు తెలుసు నువ్వు మోడరన్ లేడీవి, ఉద్యోగస్తురాలివి. అమ్మ పాతకాలం మనిషి. లోకం తెలీదు. బంధువులంతా నవ్వుతారట. స్నేహితుల ముందు అవమానమట. ఇంకా మా మతాలూ వేరు కాబట్టి మాకు కలవదట. గొడవలు పడతామట. రోజుకో క్లాస్ పీకుతోంది. మేమేమన్నా భక్తులమా దేవుడి గురించి పోట్లాడుకోవడానికి ? చదువుకున్నవాళ్లం. ఉద్యోగాలు చేసుకుంటాం. కాపురం చేసుకుంటాం. అని చెబితే వినదే !   నువ్విక్కడే ఉండి అమ్మను కూల్ చెయ్యి ” అంది.

    ” నా అభిప్రాయం అక్కర్లేదన్న మాట”  నిష్టూరంగా అన్నాను.

    “ అయ్యో అలా కాదు నానమ్మా ! నువ్వు నాయిష్టాన్ని కాదనవని నమ్మకం నాకు. మా అమ్మ చాదస్తం చూసి  నేనెప్పుడూ అనుకుంటాను. నువ్వు మా అమ్మవైతే ఎంత బావుండునో అని “

    ” దీన్నేనా మీ యూత్ బిస్కెట్ అంటున్నారు? ” అన్నాను.

    ” అయ్యయ్యో ! ” అంటూ నన్ను గట్టిగా కౌగలించుకుని నవ్వేసింది పల్లవి.

     “పెళ్లి విషయం లో నిదానించి యోచించాలి ” అన్నాను చర్చకు పిలుస్తూ.

    ” బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను నానమ్మా !ఎవరికైనా ఏం కావాలి ? ఉద్యోగం, ప్రేమించే మనిషి. కులం, మతం అనేవి పాత కాలం మాటలు.”

    “ సరే అనుకుందాం. అతని ప్రేమ ఎంత లోతు అంటే ఎంత స్థిరం అనేది చూడాలి కదా !”

    ” ఓకే . ఒప్పుకుంటాను. అందుకేంచేద్దాం ? “అంది ఉత్సాహంగా పల్లవి.

    “ తొందర పడి పోకుండా కొన్ని రోజులు వేచి చూద్దాం ! “

    “డన్ ! నాకేమీ అర్జెంటు గా పెళ్లాడేయ్యాలని లేదులే  బట్ వన్ కండిషన్ నువ్విక్కడే ఉండాలి ” అంది.

    ” డన్ ! నీ లవ్ స్టోరీ పెళ్లి గా మారే వరకూ ఉంటానులే ” అని నవ్వాను.

                                                                                     *   *   *  *

    మర్నాడు సాయంత్రం మా వాడప్పుడే బ్యాంకు నుంచి వచ్చాడు. జానకి కూరలకి వెళ్ళింది. నేనూ వాడూ పక్క పక్కనే కూర్చున్నాం.  పల్లవి ఇంకా రాలేదు. నేను తలెత్తి వాడి వైపు చూసాను. ” నేనే వచ్చి నిన్ను తీసుకొద్దాం అనుకుంటున్నానమ్మా! “

    ” ఏంటి పరిస్థితి ? ” అన్నాను.

    “ఇద్దరూ చెప్పగా  అంతా వినే ఉంటావు. అది రెక్కలొచ్చిన పిల్ల. గట్టిగా కాదంటే ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే అదింకా దుర్భరమైన పరిస్థితి. ఒక్కగానొక్క పిల్లని వదులుకుని ఏం బావుకుంటాం ? “అంటుంటే వాడి గొంతులో దుః ఖపు జీర.  నేను చెయ్యి నొక్కాను.

    “వారం రోజుల కింద చెప్పింది. పిల్లని నేనేమీ అనలేక పోతున్నాను. తలూపి  ఊరుకున్నాను. రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. నాకేమీ తోచట్లేదు. నువ్వొచ్చాక నాకు ధైర్యంవచ్చింది. నువ్వెలా అంటే అలా చేద్దాం! బాగా ఆలోచించు.” అన్నాడు కానీ వాడి మొహం బాగా వాడిపోయి, నలిగి పోయినట్లుగా ఉంది. వాడెప్పుడూ అంతే. చాలా తక్కువగా మాట్లాడతాడు. నేనూ నిట్టూర్చి మౌనంగా ఉండిపోయాను. ఇంతలో జానకి వచ్చింది. మా ఇద్దరినీ చూసి ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది. టీవీ పెట్టి వంట  మొదలు పెట్టింది. ముగ్గురం ఊరి విషయాలు చెప్పుకున్నాం. ఇంతలో పల్లవి రావడంతో దాని కంపెనీ కబుర్లతో కబుర్లు కలిపాం.

    ఓ నాలుగు రోజులు గడిచాయి. నేను న్యూస్ పేపర్లు  చదువుకుంటూ, మా కోడలి  ఊహాపోహల మాటలు, విసుర్లూ, భయాలూ వింటూ తల పంకిస్తూ మధ్య మధ్య కళ్ళతో ఓదారుస్తూ రోజులు గడుపుతున్నాను. నలుగురికీ లోపల టెన్షన్ గానే ఉంది. బైటికి అందరం మాములుగా పనులన్నీ చేసుకుంటూ భోజనాలు చేస్తున్నాం. టీ వీ  చూసుకుంటున్నాం.

    ఒక రోజు పడుకున్నాక అంది పల్లవి.  ” నానమ్మా ! ఒక రోజు ఖదీర్ ని టీ కి పిలుద్దామా ? “

    ” నాన్నని అడుగుతాను రేపు ” అన్నాను.

    మర్నాడు చెప్పగానే రాంబాబన్నాడు ” ఇంటికొద్దమ్మా ! ఎక్కడన్నా హోటల్ లో కలుద్దాంలే మనం  ముగ్గురం. జానకి వద్దు. ” అన్నాడు. అన్నట్టుగానే మర్నాడు ఒక హోటల్ లో కూర్చున్నాం ఆ అబ్బాయి కోసం.

    ఖదీర్ అన్న సమయానికే వచ్చాడు.  పల్లవి నా పక్కనే కూర్చుంది. రాగానే నమస్తే చెప్పి నా పేరు ఖదీర్ అండీ అన్నాడు రాంబాబు తో చెయ్యి కలిపి వాడి పక్కన కూర్చుంటూ. నా వైపు తిరిగి నాక్కూడా నమస్కారం పెట్టాడు. పల్లవి మా ఇద్దర్నీ అతనికి పరిచయం చేసింది. నేను కూడా నమస్తే బాబూ అన్నాను. కుర్రాడు చాలా రంగున్నాడు. సరిపడా ఎత్తు, లావు ఉన్నాడు.  కొంచెం ముస్లిం యాస ఉన్నా తెలుగు కుటుంబాలతో మసిలిన అలవాటున్నట్టుంది. తడబడకుండా తెలుగు చక్కగా మాట్లాడుతున్నాడు.రాంబాబు ఆ కుర్రాడితో మీ పేరెంట్స్ ఏం చేస్తారు ?  అనడిగాడు. తండ్రి పేరు సలీం అట. సెక్రటేరియట్ లో ప్లానింగ్ డిపార్ట్ మెంట్లో సెక్షన్ ఆఫీసర్ అని చెప్పాడు. తల్లి ఇంట్లోనే ఉంటుందని చెప్పాడు. తనకి ఇద్దరు చెల్లెళ్ళు డిగ్రీ చేస్తున్నారని చెప్పాడు. ఇంతలో పల్లవి సర్వర్ ని పిలిచి స్నాక్స్ టీ ఆర్డర్ చేసింది.

    “మీరిక్కడే  ఉంటారా? “అని నన్నడిగాడు. “ రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ని, ఆంధ్ర ప్రదేశ్ లో ఉంటా”నని  చెప్పాను.

    స్నాక్స్ తిని టీ తాగాక ఓ పావుగంట ఉండి వెళ్లిపోయాడతను. మేం ముగ్గురం ఇందిరా పార్క్ కి వెళ్లి కొంత సేపు కూర్చుని ఇంటికి వెళ్ళాం. మేం ఎక్కడికి వెళ్లిందీ జానకికి చెప్పలేదు.

    ఆ రాత్రి పల్లవి నడిగాను. ” వాళ్ళింట్లో ఒకే అన్నారా మీ పెళ్ళికి ?”

    “ఇంకా చెప్పినట్టు లేదు “

    “ఏం ?” అన్నాను ఆశ్చర్యంగా

    “ఒప్పుకుంటారో లేదో అని కొంచెం భయపడుతున్నాడు.”

    ” మరెందుకొచ్చాడు ? ” అన్నాను ఆశ్చర్యంగా.

    ” నేనే రమ్మన్నాను నీకు చూపిద్దామని ” అంది నెమ్మదిగా.  ఆ పసిదాని మొహం చూస్తే జాలేసింది. పైకి గంభీరంగా ఉంది కానీ దానికీ భయంగానే ఉంది అనిపించింది.

    “కాలమే అన్నీ ముందుకు సాగేట్టు చూస్తుంది కానీ నువ్వు మాత్రం ఒక్క విషయం గుర్తుంచుకో. పెళ్లయ్యే వరకూ అతను నీకు సహోద్యోగి, మిత్రుడు మాత్రమే ! నిజమైన ప్రేమకు అధికమైన దగ్గరితనం అవసరం లేదు. అతి స్నేహం, చనువూ వద్దు. బైకెక్కి తిరగడం, హద్దులు మీరి మాట్లాడడం మంచిది కాదు. బిహేవ్ యువర్ సెల్ఫ్ .  చిన్న పిల్లవు కావు కదా ! ” అన్నాను కొంచెం గంభీరంగా.

    నా మాటలోని గట్టితనం గమనించిన పల్లవి ” నాక్కూడా తెలుసు. ఈ రోజువరకూ అతనికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు తెలుసా ? “అంది పౌరుషంగా. “గుడ్ గర్ల్” అన్నాను వీపు తడుతూ.

    రోజులు భారంగా గడుస్తున్నాయి. జానకి మాత్రం టెన్షన్ తట్టుకోలేక అప్పుడప్పుడూ బైటకి కక్కి గింజుకుంటూ ఉంది.  “ఎంత నిబ్బరమో మీ ముగ్గురికీ, తేలరు బైటికి. ఎలా నిద్ర పడుతుందో  మీకు ?  ఎంతైనా  మీరంతా ఒకే కుటుంబం వాళ్లు.  నేను పరాయి కుటుంబమే కదా అలా గుంభనంగా ఉండడం నాకెలా చేతనవుతుంది ?” అందొకసారి  ఉడుకుమోత్తనంతో.  నేనేమనాలో తెలీక మౌనంగా ఉండిపోయాను

    ”ఏమంటాడు ఖదీర్ ? రెండు రోజుల తర్వాత అడిగాను పల్లవిని. “వాళ్ళింట్లో ఇంకా చెప్పలేదుట నానమ్మా ! “అంది కాస్త నిరుత్సాహంగా.

    “సర్లే చెప్పనీయ్ నెమ్మదిగా ” అన్నాను.

    *  *  *  *

    మరో రెండు రోజులు పోయాక తానే చెప్పింది “మీ వాళ్లంత ఫార్వర్డ్ కాదు మావాళ్లు “అంటున్నాడు అని.”వాళ్ళు ఒప్పుకోరా ఏంటిప్పుడు ? “అని  పల్లవి నిలదీస్తే  “లేదు లేదు ఒప్పిస్తాను “అన్నాడట. ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉన్నారు వాళ్ళ కంపెనీ గురించీ, మిత్రుల గురించీ, సినిమాల గురించీ నా ఎదురుగానే.  రాంబాబు నేనొచ్చాను కదా అనేమో తన బ్యాంకు పని చేసుకుంటూ కాస్త నిశ్చింతగా  ఉన్నట్టు కనిపిస్తున్నాడు.

    చూస్తూ ఉండగానే మరో పది రోజులు గడిచాయి. నేను వెళ్ళిపోతాను అని  ఎలా అనగలను? సరే కానియ్ ఉందాం ఈ సమస్య ఏంటో తేలాలి కదా అన్నట్టున్నాను. జానకి కనబడ్డ దేవుళ్లందరికీ నాకు చెప్పి మరీ మొక్కుతోంది, ఈ ఆపద గట్టెక్కితే చాలు అంటూ. నిరంతరం ఇదే ఆలోచిస్తూ కాస్త పిచ్చి దానిలా అయిపొయింది కూడా. నేనేమైనా నచ్చ చెబితే వినే మనిషి కాదని తెలుసు కనక ఊరుకున్నాను.

     ఒక రోజు పల్లవి “నానమ్మా మా కంపెనీలో కొత్తగా ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేరింది. పేరు  అజీజా బేగం  ఎంత బావుందో !” అంది. వారం తర్వాత  “ ఇప్పుడు మేం ముగ్గురం ఫ్రండ్స్ అయిపోయాం, కాంటీన్ కెళ్ళి కాఫీ తాగినా, లంచ్ చేసినా కలిసే చేస్తున్నాం”అంది. ఇంకా చిన్న పిల్ల,  స్నేహాల వయసు దాటలేదు  అనుకుని నవ్వుకున్నాను.

    మరో వారం గడిచింది. రోజూ పల్లవి ముగ్గురూ కలిసి మాట్లాడుకున్న జోక్స్ చెబుతోంది. ఒక సండే ముగ్గురూ కలిసి ఒక సినిమాకి వెళ్లి హోటల్ లో లంచ్ కూడా చేసి వచ్చారు.

    ” మీరిద్దరూ మనసు విప్పి మాట్లాడుకోకుండా మధ్యలో ఎందుకే ఆ పిల్ల ? ” అన్నానొకరోజు విసుగ్గా.

    ” అంటే ,అది నానమ్మా ! అలా ఎలా వదిలేస్తాం దాన్ని ?  ఫ్రెండ్ అయ్యింది కదా ” అంది మొహమాటంగా.

    ” ఖదీర్ ఇంట్లో ఏమన్నారు ? అడిగావా ? “

    ” అడిగాడేమో, వాళ్ళు కూడా ఆలోచించుకోవడానికి టైం తీసుకుంటారు కదా ! “

    ” ప్రేమించాక ఆలస్యం ఎందుకు, కాస్త స్పీడప్ చేసుకోమను ” అన్నాను.

    ” నాకంటే నీకే తొందరెక్కువుందే ! ” సిగ్గుపడుతూ అంది పల్లవి.

                                                                          *  * *  *

     “పల్లవి చూస్తే అట్లా, జానకి చూస్తే ఇట్లా . ఎలా అమ్మా ? “అన్నాడొకరోజు రాంబాబు

    ” జానకికి డైజెస్ట్ అవ్వట్లేదు. ఇద్దరం మెల్లగా నచ్చ చెబుదాంలే ” అన్నాను.

    ” నా వల్ల కాదు. చెబితే నువ్వే చెప్పాలి ” అన్నాడు.

    మరో పది రోజులు గడిచాయి. ప్రోగ్రెస్ లేదు. పల్లవి తలకి హెన్నా పెడుతూ “ ఏంటే , నీ ప్రేమ కథ టీవీ సీరియల్ లా సాగుతోంది” అని ఉడికించాను. ఏమీ జవాబు చెప్పలేనట్లు ఊరుకుంది పల్లవి.

     ఇంకో పది రోజులు గడిచాయి. ఆ రోజు పల్లవి వచ్చేసరికి నేనొక్కదాన్నే ఇంట్లో ఉన్నాను.

    వస్తూనే “నానమ్మా” అంటూ సోఫాలో కూర్చున్న నా ఒడిలో వాలి పోయింది. మరుక్షణమే ఏడుపు మొదలు పెట్టింది. ఏమయ్యింది బంగారూ ?” అన్నాను తల మీద రాస్తూ, జుట్టు సర్దుతూ. పిల్ల కళ్ళలో నీరు చూస్తూనే,  అది నోరు విప్పే లోపే నా కళ్ళలో నీళ్లు జల జలా రాలిపోతున్నాయి.

       అడగ్గా, అడగ్గా చాలా సేపటికి నోరు విప్పింది పల్లవి. ” ఖదీర్ వాళ్ళింట్లో మా విషయం నలుగుతూనే ఉంది అప్పటినుంచీ. ఏదో ఒక రోజు ఒప్పుకుంటారనీ గుడ్ న్యూస్  చెబుతాననీఅన్నాడు . ఈ రోజు కాంటీన్ కి పిలిచి చెప్పాడు. వాళ్ళింట్లో  అజీజాని చేసుకో అంటున్నారట.ఆమె వాళ్ళకి బంధువుకూడానట.” అంది కళ్ళు తుడుచుకుంటూ

    ” నువ్వేమన్నావ్ ?  నిన్ను ప్రేమించాను, కాలేజ్ రోజుల్నుంచీ ఇష్టం అన్నాడు కదా ” అన్నాను కోపంగా.

    “నేను  కోపంగా వచ్చేస్తుంటే బతిమాలాడు ఉండమని. చాలా సేపు మాట్లాడాడు. ఏదేదో చెబుతున్నాడు.  నా కర్దమయ్యిందేమిటంటే అతనికి ఇంట్లో వాళ్ళని బ్రతిమాలి ఒప్పించడం,  కాదంటే గొడవ పెట్టుకోవడం ఇష్టం లేదు. ఖదీర్ కి నా పై పెద్దగా ప్రేమేమీ లేదు. జస్ట్ నచ్చాను. ఇద్దరికీ ఒకే చోట ఉద్యోగం కాబట్టి లైఫ్ బావుంటుందని ప్లాన్ చేసాడు. అంతే ! అతని మాటలు నమ్మి అతను నన్ను ప్రేమిస్తున్నాడు అనుకున్నాను. “

     ” మరీ ఇంత అన్యాయమా ! మనమేమో చాలా సీరియస్ గా తీసుకున్నాం. నాన్నా, నేనూ అమ్మని మెల్లగా సమయం చూసి ఒప్పించాలని చూస్తున్నాం. “

    “ఇంకో సంగతేమిటంటే అజీజాని చేసుకున్నా అతననుకున్నభవిష్యత్తు అతని కుంటుంది కాబట్టి ఖదీర్ కన్విన్స్ అయ్యాడని నాకనిపించింది. ” అంది ఆలోచిస్తూ.

    “నువ్వేమన్నావ్?ఆఖరికి” అన్నాను. “ఆల్ ది బెస్ట్ చెప్పొచ్చేశాను హర్ట్ అయినట్టు కనబడకుండా “అంది పసి పిల్లలా నా కళ్ళలోకి బేలగా చూస్తూ. నేను దగ్గరగా జరిగి పిల్లని గుండెల్లోకి పొదువుకున్నాను. వీపు నిమిరాను.ఇద్దరం చాలా సేపు అలాగే ఉండిపోయాం. తానే  ముందు తేరుకుని ” ఓకే నానమ్మా ! లైట్ తీసుకుందాం ” అంది విసురుగా లేచి ఫ్రిజ్ లోంచి నీళ్ల సీసా తీసుకుని తాగుతూ. నేను బొటన వేలు పై కి చూపించి నవ్వాను. ఆ రాత్రి మేమిద్దరం మనసు విప్పి బోలెడు మాట్లాడుకుంటుండగా ” నానమ్మా ! ప్రేమ పెళ్లిళ్లన్నీ విఫలం అవుతాయేమో కదా !” అంది.

    ” అలా ఏమీ ఉండదు. పెద్దలు చూసి చేసినవి కూడా విఫలం అవుతాయి ” అన్నాను

    ”  మరెందుకూ అందరూ ప్రేమ పెళ్ళిళ్ళను వ్యతిరేకిస్తారు ? ” అడిగింది.

    ” కొంత మంది యువత వెర్రి వ్యామోహాలకీ, ఆకర్షణలకీ  లోనయ్యి ముందూ, వెనకా చూసుకోకుండా పెళ్ళాడి తర్వాత దెబ్బ తినడం చూసి న అనుభవంతో !” అన్ననా మాటలకి పల్లవి ఇంకేమీ మాట్లాడ కుండా నిద్ర పోయింది.

    మర్నాడు ఆదివారం. బ్రేక్ ఫాస్ట్  తింటుండగా అంది పల్లవి. “అమ్మా! నాన్నా! నేనొక నిర్ణయం తీసుకున్నాను. మీకు  నచ్చిన సంబంధం చూడండి ” అంది టిఫిన్ తింటూ తల పైకెత్తకుండా. జానకి ఆనందంతో టిఫిన్ తినడం మానేసి గబుక్కున చెయ్యి కడుక్కుని దేవుడి దగ్గరికి పోయి సాష్టాంగ నమస్కారం పెట్టి  ఏదో మంత్రం చదువుకుంటూ కూర్చుంది. రాంబాబు “ చట్నీ నువ్వు చేసేవామ్మా ? చాలా బావుంది ” అన్నాడు ఏమనాలో తెలీక. పల్లవి సీరియస్ గా  ఇడ్లీ తినేసి మారూమ్ లోకి వెళ్ళిపోయింది. రాంబాబూ, నేనూ బ్యాంకు పని మీద బైటికి వెళ్ళినప్పుడు ఖదీర్ విషయం వాడికి చెప్పాను. “బతికి పోయాం”అంటూ నవ్వాడు. మర్నాడే, రెండు రోజుల్లో బయల్దేరతానని చెప్పి రాంబాబు చేత బస్సుకి టికెట్ బుక్ చేయించుకున్నాను.

     *  * *  *

    ఆరోజు ఆదివారం. రాత్రికే నా ప్రయాణం. కాఫీ టిఫిన్ లయ్యాక సోఫాలో నేనూ, రాంబాబు టీవీ ముందు కూర్చున్నాం. పల్లవి మరో కుర్చీ లో కూర్చుంది.  జానకి స్నానం చేసి గుడికి తయారయ్యింది. పూజ బుట్ట టీపాయ్ మీద పెట్టి నా కాళ్ళకి దణ్ణం పెట్టి పక్క కొచ్చి కూర్చుంది. నా చేతులు పట్టుకుని ” అత్తయ్యా ! మీరు దేవుడు పంపిన దూతలా వచ్చి దాని మనసు మార్చారు. నా నెత్తి మీద పడ్డ బండను తీసేసారు. మా అమ్మా నాన్నలకి కూడా నా కష్టం చెప్పలేదు మీకే చెప్పాను. మీరు సమర్ధులని నాకు తెలుసు” అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది.

    “నువ్వలా కళ్ళ నీళ్లు పెట్టుకోకూడదు తప్పు” అన్నాను జానకి భుజం తడుతూ. జానకి కళ్ళు తుడుచుకుని లేచి “మీరుండగానే ముందుగా వినాయకుడి గుడికెళ్ళి మొదలుపెట్టి నా మొక్కులన్నీ ఒకటొకటీ తీర్చుకుంటాను”అంది మా ఇద్దరివైపూ చూస్తూ. ” సరే !  పోయిరా ! ” అన్నాను లేచి గుమ్మం వరకూ వెళుతూ.

    తిరిగి వచ్చి కూర్చుని అబ్బాయి వైపు చూసాను. టీవీ కట్టేసి ” చెప్పమ్మా !” అన్నాడు రాంబాబు నిశ్చింతగా నవ్వుతూ. పల్లవి మా ఇద్దరి వైపూ చూస్తూ కూర్చుంది.

    నేను చెప్పాలనుకున్నది మొదలు పెట్టాను. “తల్లి తండ్రుల బాధ్యతంటే, సమస్య వచ్చిందని దేవుళ్లందరికీ  ముడుపులు కట్టి  అది తీరాక మొక్కులు తీర్చుకోవడం కాదురా. ఇప్పుడొచ్చిన సమస్య సమసిపోగానే కథ సుఖాంతం అయినట్లు కాదు.  ప్రాబ్లెమ్ మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. మనం చేయాల్సిందల్లా పిల్లలు వేసే ప్రతి అడుగు వెనకా మన సలహా సహకారం ఉండేట్లు చూడడం, మన పరిణతి వారి లోకజ్ఞానానికి తోడవటం అంతే. ప్రేమ వివాహాలు చేసుకున్న పిల్లల్ని ఇంట్లోంచి వెళ్లగొట్టి చేతులు దులుపుకోవడం కూడా తల్లితండ్రుల బాధ్యతా రాహిత్యమే అవుతుంది. వీలయినంతగా వాళ్ళకి ముందు వెనుకలు వివరించి, హెచ్చరించి వారి దారిన వారిని పోనివ్వాలి. ఆ కష్ట నష్టాలు వాళ్లే పడతారు. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళది.”

    “అవునమ్మా ! ఇప్పుడు నావయసు వాళ్లందరికీ ఇదే పరిస్థితి ” అని నవ్వాడు రాంబాబు.

     నేను మళ్ళీ అందుకుని “పిల్లలు జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని ఎదుర్కోవడానికి వాళ్ళని మానసికంగా సమాయత్తం చేయాలి అలా వాళ్ళ వ్యక్తిత్వాలని మలచాలి.  అంతే కానీ మన భయాలూ,ఆందోళనలూ వాళ్లపై రుద్ద కూడదు. అలా అని వాళ్ళేం చేసినా పిచ్చి ప్రేమతో తలూపకూడదు.

    ఇప్పుడు మన పల్లవి మనం చెప్పిన పెళ్లి చేసుకున్నా దాని వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందని గారంటీ లేదు కదా ? ఆ వచ్చే భర్తతో ఇబ్బంది రావచ్చు.  పిల్లకి అన్నివేళలా జీవితాన్ని ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యస్థయిర్యాలిస్తూ ప్రేమగా దాని వెన్నంటి ఉండాలి. దాని బ్రతుకది తీర్చి దిద్దుకునేలా, జీవితంలో అది   తప్పటడుగులు వెయ్యకుండా స్థిరమైన అడుగులు నిబ్బరంగా వేసేలా చూడాలి అంతవరకే మన బాధ్యత.” అన్నాను నిదానంగా.

    “నిజమేనమ్మా ! నువ్వన్న మాటలో నూటికి నూరు పాళ్ళు సత్యం ఉంది “అన్నాడు.

    ” ఇంకేంటి సంగతులు ? ” అన్నాను.

    “అమ్మా ! నీకు గుర్తుందా ? నేను ఎమ్మే చదివేటప్పుడు  మా క్లాస్ మేట్ రవి కులాంతర వివాహం చేసుకుంటుంటే నువ్వు  రవినీ ఆ అమ్మాయినీ పిలిచి కౌన్సిలింగ్ చేసావు. తర్వాత వాడి పెళ్ళికి రిజిస్టర్ ఆఫీస్ కొచ్చి సాక్షి సంతకం కూడా చేసావు. ఈ సంగతి జానక్కి చెప్పుంటే నిన్నిక్కడికి పిలవక పోయేది. నీకీ కీర్తి దక్కక పోయేది ” అన్నాడు రాంబాబు గట్టిగా నవ్వుతూ.

    నేను వాడి నవ్వుతో శృతి కలిపి నవ్వుతుండగా పల్లవి వచ్చి నా పక్కనే సోఫాలో కూర్చుంటూ ” వెళ్ళిపోకు నానమ్మా !  నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండాలి ” అంది నా చుట్టూ చెయ్యి వేస్తూ.

    ” విన్నావుగా ! నా ఆశీస్సూ, నా సూచనా ఎప్పటికీ ఒకటే .  నేనెక్కడున్నా అవి నీ వెంటే ” అన్నాను దాని తలపై ముద్దు పెడుతూ.

     

    అల్లూరి గౌరీలక్ష్మి

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here