కలగంటినే చెలీ-14

0
3

[box type=’note’ fontsize=’16’] శ్రీ సన్నిహిత్ వ్రాసిన ‘కలగంటినే చెలీ’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]సా[/dropcap]యంకాలం ఇంటికొచ్చాక అలసటగా సోఫాలో వాలిపోయాడు సూర్య. చింటూ హోంవర్క్‌ చేసుకుంటున్నాడు. సీత కిచెన్‌లో బిజీ (?) గా ఉంది. కాసేపటికి టీ కప్పుతో వచ్చింది.

“టీ తాగండి..” అంది. కప్పు అందుకుని సిప్‌ చెయ్యసాగాడు సూర్య.

“ఏంటి విషయాలు…?” అడిగాడు.

“ఆ… ఏముంటాయి.. అన్నీ మామూలే… మీరే చెప్పాలి.. రోజూ బయటకు వెళ్తారు… నాదేముంది… ఇంట్లో ఉండేదాన్ని” మూతి తిప్పుతూ అంది.

ఆ మూతి సౌందర్యాన్ని చూస్తూ “బయటకు వెళ్ళినంత మాత్రాన నాకు విషయాలు తెలుస్తాయా.. పొద్దున్న ఆఫీసులోకి వెళితే మళ్ళీ సాయంత్రమేగా బయటపడేది.. పైగా పని ఒత్తిడి” అన్నాడు.

“అబ్బో, పెద్ద పని ఒత్తిడి… నాకు తెలీని పని ఒత్తిడా” అంది.

“అవుననుకో… సిచ్యుయేషన్స్ ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా..”

“ఎందుకుండవు… మనం తిన్నగా ఉంటే అవి బాగానే ఉంటాయి… “

“వాడ్డూ యూ మీన్‌..?” కొంచెం కోపంగా అన్నాడు.

“యు నో వాట్‌ ఐ మీన్‌… దట్‌ ఈజ్‌… రోహిణి”

“ఏయ్‌… ఏం మాట్లాడుతున్నావ్‌..” విసురుగా అన్నాడు.

“అందరూ చెప్పుకొనేదేగా… నేను అనేదేముంది”

“ఎవరు చెప్పుకుంటున్నారు… నువ్వు చెబుతున్నావు.. అయినా నా గురించి ఇంత చీప్‌గా ఆలోచిస్తావనుకోలేదు” నొచ్చుకున్నట్టు అన్నాడు సూర్య.

“మీ గురించి ఇంకా మంచిగా అంటున్నాను.. ఇంతకంటే మీరు దారుణం అని నాకు తెలుసు.. మా అమ్మ ఎప్పుడో చెప్పింది…”

“అమ్మ..” పిడికిలి బిగుసుకుంది సూర్యకి. ‘ఛీ…’ అనుకున్నాడు. “కలిసి కాపురం చేస్తున్నావు… నా గురించి నీకు ఎవరో చెప్పాలా… నీకు తెలీదా” అతడి కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర.

“కాపురం చేస్తున్నాను కాబట్టే చెబుతున్నాను..” అని విసురుగా కప్పు తీసుకుని వెళ్ళిపోయింది.

ముక్కలైన మనసుతో బెడ్రూములోకి వెళ్ళిపోయాడు సూర్య. చింటూ ఇదంతా వింటున్నాడు హోం వర్క్‌చేస్తున్నట్టు నటిస్తూ…

అలాగే నిద్రలోకి జారుకున్న సూర్య కళ్ళు తెరిచి చూసాడు. వాల్‌క్లాక్‌లో టైము పదకొండున్నర సూచిస్తోంది… పక్కనే నిద్రపోతున్న సీత.. చింటూ!

కడుపులో పేగులు కరకరలాడటంతో హాల్లోకి వచ్చాడు. డైనింగ్‌ టేబుల్‌ మీద పదార్థాలు చూసాడు. అన్నీ చల్లగా అయిపోయాయి. ఆకలి చచ్చిపోయింది. కొంచెం మంచి నీళ్ళు తాగి బాల్కనీ లోకొచ్చి నిలబడ్డాడు… బయటంతా అదే చీకటి… అంతులేని చీకటి.. దాన్ని పారద్రోలడానికి ప్రయత్నిస్తున్న వీధి లైట్లు…

అసలు తను చేసిన తప్పేంటి? వైవాహిక జీవితంపై తను ఎన్ని కలలు కన్నాడు… ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు…? అవన్నీ ఒట్టి ఆశలేనా!

కాదు.. కాకూడదు… కానీ.. కానీ.. అంతా తాను అనుకున్నదానికి విరుద్ధంగా జరుగుతోంది. అందరి జీవితాలు ఇంతేనా… లేక తన ఒక్కడి జీవితమేనా…!

తన పెళ్ళి… ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు అతని కళ్ళు ముందు కదిలాయి.

***

ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక… హైదరాబాద్‌ వచ్చి జాబ్‌లో చేరిన కొన్ని రోజులకి… తెలిసిన వాళ్ళ ద్వారా ఒక సంబంధం వచ్చింది. పెళ్ళిచూపులకి వెళ్ళాలా వద్దా అని సందిగ్ధంలో పడ్డాడు. ఎందుకంటే ‘సంతలో పశువును చూసి బేరమాడినట్టు’ ఉండే పెళ్ళిచూపులంటే అతనికి అసహ్యం. పైగా ‘అలా పెళ్ళిచూపులకి వెళ్ళి, ఆ అమ్మాయిని తిరస్కరించే అధికారం.. ఆ అమ్మాయి మనసుని బాధించే హక్కు మగవాళ్ళకి ఎవరిచ్చారు’ అన్నది అతని ఆలోచన. అలా అని ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకొనేంత ఓపిక కూడా అతనికి లేదు. ఒక మంచి అమ్మాయిని పద్ధతి ప్రకారం చూసుకుని పెళ్ళి చేసుకుందామని అనుకునేవాడు. అందుకే పెళ్ళిచూపులకి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు.

“ఏరా… ఏం చేస్తున్నావు?” ఫ్రెండ్‌ రాజు ఫోన్‌ చేసాడు.

అప్పుడే ఆఫీసు నుండి వచ్చి రూములో రిలాక్స్‌ అవుతున్నాడు సూర్య. “ఏముంది రా…. కంప్యూటర్‌లో టీవీ చూస్తున్నాను.. ఏంటి విషయం?”

“నైట్‌కి పార్టీ చేసుకుందామా..” అడిగాడు రాజు.

“ఏంటి అకేషన్‌?”

“ఏం లేదురా… బోర్‌ కొడుతోంది..”

కాసేపు ఆలోచించి “…సరే..” అన్నాడు సూర్య.

శిల్పి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ కళకళలాడిపోతోంది. డిం లైటింగ్‌… కంసీల్డ్‌ స్పీకర్స్‌లో నుండి వినవస్తున్న సన్నటి మ్యూజిక్… నిశ్శబ్దంగా అటూ ఇటూ తిరుగుతున్న సర్వర్స్‌… ఒక కార్నర్‌ టేబుల్‌ వెతుక్కుని కూర్చున్నారు ఇద్దరూ…. పక్కనే ఫేమిలీ సెక్షన్‌.. అందమైన జంటలు తమ కుటుంబాలతో కూర్చుని ఫుడ్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. వీళ్ళు కూర్చున్న చోటుకి ఫేమిలీ సెక్షన్‌లో కూర్చున్న వాళ్ళు కనిపిస్తున్నారు.

“ఏం తీసుకుందాం రా..” అడిగాడు రాజు.

“నాకైతే స్ట్రాంగ్‌ బీర్‌… గ్రీన్‌ పీస్‌ మసాలా..”

“అయితే నేను విస్కీ తీసుకుంటారా…” అని సర్వర్‌ని పిలిచి ఆర్డర్‌ ఇచ్చాడు రాజు. నెమ్మదిగా మాటల్లో పడ్డారు..

“కమింగ్‌ సండే… ఒక పెళ్ళిచూపులకి వెళ్ళాల్రా.. నువ్వు కూడా రా…” నెమ్మదిగా అన్నాడు సూర్య.

ఆశ్చర్యపోయాడు రాజు. “అదేంట్రోయ్‌… పెళ్ళి మీదకు గాలి మళ్ళింది…” నవ్వుతూ అన్నాడు రాజు.

“అదేం లేదురా… మా ఇంటి ఓనర్‌ ద్వారా వచ్చింది సంబంధం.. ఒకసారి వెళ్ళి చూస్తే అయిపోతుందిగా..”

“ఎంతో ఏంబిషయస్‌గా ఉంటావు… బోలెడన్ని లక్ష్యాలు పెట్టుకున్నావు… ఇప్పుడే పెళ్ళి చేసుకుని ఆ బరువు నెత్తి మీదకు తెచ్చుకుంటే అవన్నీ సాధించగలవా” అన్నాడు రాజు. ఇంతలో డ్రింక్స్‌, స్నాక్స్‌ వచ్చాయి. సర్వర్‌ డ్రింక్స్‌ గ్లాసుల్లో పోసి, స్నాక్స్‌ ప్లేట్లలో సర్దాడు.

ఇద్దరూ చీర్స్‌ చెప్పుకుని సిప్‌ చెయ్యసాగారు. చల్లటి ద్రవం గొంతులో దిగేసరికి ఇద్దరికీ హుషారు వచ్చింది.

సూర్య అన్నాడు “పెళ్ళి చేసుకుంటే ఇక ఏమీ సాధించలేమంటావా..? “

“నేను అనేదేంటి… జనాలే అంటున్నారు… పెళ్ళయితే టీవీ రిమోట్‌తో చానెల్‌ కూడా మార్చే స్వాతంత్ర్యం ఉండదనే జోకులు సోషల్‌ మీడియాలో చూడలేదా!” నవ్వుతూ అన్నాడు రాజు.

“ఆ.. జోకులకేముందిలే… అదంతా టైం పాస్‌… వాస్తవంగా ఆలోచిద్దాం”

“అలా అంటావా.. సరే అయితే నీ ఇష్టం… ఇంతకీ అమ్మాయి డిటెయిల్స్‌ ఏంటి”

“అమ్మాయి కూడా మన లాగే సాఫ్ట్‌వేర్‌… ఇద్దరం వర్క్‌చేస్తే జీవితం హాయిగా గడిచిపోద్ది కదా” ఎటో చూస్తూ తన్మయంగా అన్నాడు సూర్య.

రాజుకి అర్థమైంది… సూర్య ఆల్రెడీ ఫిక్స్‌ అయ్యాడని. మందు నెమ్మదిగా ఎక్కి, కొంచెం కొంచెం ఓపెన్‌ అవసాగారు ఇద్దరూ. సర్వర్‌ వచ్చి ఫుడ్‌ ఆర్డర్‌ ఇమ్మన్నాడు.

“రెండు చికెన్‌ బిర్యానీ …” చెప్పాడు రాజు. సర్వర్‌ వెళ్ళిపోయాడు.

సూర్యకి అభిముఖంగా ఉన్న ఫేమిలీ సెక్షన్‌ టేబుల్‌లో ఒక అందమైన అమ్మాయి… తన ఫేమిలీ మెంబర్స్‌తో ఉంది. సూర్య అప్రయత్నంగా ఆమెనే చూడసాగాడు. కళ్ళు తిప్పుకోనివ్వని అందం ఆమెది. యవ్వనంతో మిస మిస లాడుతోంది. అలా చూడటం సంస్కారం కాదని తెలిసినా తనని తాను కంట్రోల్‌ చేసుకోలేకపోతున్నాడు సూర్య.. పైగా తన ప్రభావం చూపిస్తున్న స్ట్రాంగ్‌ బీర్‌!

ఆ అమ్మాయి పక్కనే ఉన్న వ్యక్తికి ఏదో చెప్పింది. అతను లేచి వీళ్ళ దగ్గరికి వచ్చాడు.

“ఏరా.. ఏంటి ఆ చూపు… ఎప్పుడూ అమ్మాయిలని చూడలేదా?” కోపంగా అడిగాడు. చాలా బలిష్టంగా ఉన్నాడతను.

“సార్‌.. అదీ.. అదీ..” అంటూ ఏదో చెప్పబోతున్నాడు సూర్య. అభిముఖంగా కూర్చున్న రాజుకి ఏమీ అర్థం కాలేదు. “ఏంట్రా సూర్య.. ఏమైంది” అన్నాడు.

“నేను చెబుతాను” అన్నాడు ఆ అపరిచితుడు “నీ ఫ్రెండ్‌ సూర్య నా చెల్లెలికి సైట్‌ కొడుతున్నాడు..”

రాజుకి నవ్వొచ్చింది. “మా వాడు అలాంటి వాడు కాదు సార్‌.. ఏదో పొరపాటున చూసుంటాడు.. ప్లీజ్‌ సార్‌.. వదిలెయ్యండి” అని బ్రతిమాలుకున్నాడు.

ఆ అపరిచితుడు కాసేపు ఆలోచించి, “సరే.. జాగ్రత్త అని చెప్పు నీ ఫ్రెండ్‌కి” అని తన టేబుల్‌ దగ్గరికి వెళ్ళిపోయాడు.

కన్నీళ్ళు వచ్చాయి సూర్యకి. “ఏయ్‌.. లైట్‌ తీస్కోరా.. ఇంకో బీర్‌ తాగు” అని చెప్పి ఆర్డర్‌ ఇచ్చాడు రాజు.

తర్వాత నిశ్శబ్దంగా తమ పని కానిచ్చి, బిల్లు పే చేసి అక్కడి నుండి లేచారు. వస్తూ వస్తూ క్రీగంట ఆమెని చూసాడు. సన్నటి చిరునవ్వు ఆమె పెదాలపై. ఆమె పేరు రోహిణి అని …త్వరలోనే ఆమెతో తనకు పరిచయం అవుతుందని… తన జీవితంలో కల్లోలానికి ఆమె కారణం అవుతుందని అస్సలు ఊహించలేకపోయాడు సూర్య.

***

సూర్య పెళ్ళిచూపులకి వస్తున్నాడని తల్లిదండ్రులు చెప్పగానే ‘వద్దంది’ సీత. అప్పటికే ఎబ్రాడ్‌వెళ్ళి జాబ్‌ చెయ్యాలనే ప్రయత్నాల్లో ఉంది తను. ఇప్పుడు పెళ్ళి చేసుకుంటే అది తన భవిష్యత్తుకు ఆటంకం అని భావించింది. కానీ ఆమె తల్లిదండ్రులు “ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా… ఆ తర్వాత నీ ఇష్టం” అని బ్రతిమాలాడారు. ‘సరే..’ అంది.

పెళ్ళిచూపులకి రాజుని తీసుకుని వెళ్ళాడు సూర్య. హైదరాబాద్‌లో అతనికి బంధువులు ఎవరూ లేరు. తల్లిదండ్రులు ఊళ్ళో ఉంటారు కదా.. అందుకని ఒకసారి సీతని చూసాక వాళ్ళకి చెబుదామని ఫ్రెండ్‌ని తీసుకుని వచ్చాడు.

బాగానే రిసీవ్‌ చేసుకున్నారు వాళ్ళు. ఇల్లూ వాకిలీ బాగానే ఉన్నాయి అనుకున్నాడు. కూర్చున్న పది నిముషాలకి సీతని తీసుకొచ్చి కూర్చోబెట్టారు.

సీత ప్రొఫైల్‌ ఆల్రడీ తెలుసు. అతని లాగే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఫోటోలో కంటే బయట బాగానే ఉంది. ఇక పెద్దగా అడగడానికి ఏమీ లేదు. కానీ ఏదో మాట్లాడాలి కదా అని “ఎలా ఉంటుంది మీ జాబ్‌” అని అడిగాడు సూర్య.

నెమ్మదిగా తలెత్తి “ఇట్స్‌ ఓకే …బాగానే ఉంటుంది.. నాట్‌ సో మచ్‌ ప్రెజర్‌..” అంది సీత.

ఇంతలో ఆమె తల్లి అందుకుంది “చిన్నప్పటి నుండీ చదువులో ఫస్ట్‌ బాబూ మా అమ్మాయి.. బాగా చదువుకుంది.. డిగ్రీ అవగానే జాబ్‌ తెచ్చుకుంది…” అని నవ్వుతూ చెప్పింది.

పక్కనే ఉన్న ఆమె తండ్రి “అవునవును… అవునవును..” అంటూ తలాడించాడు. ఆ ఇంటి పరిస్థితి రాజుకి, సూర్యకి బాగా అర్థమైంది.

సూర్య అన్నాడు “సరేనండీ… మా అమ్మా నాన్నను కూడా ఒకసారి రమ్మంటాను.. వాళ్ళు కూడా చూసాక నా అభిప్రాయం చెబుతాను” అంటూ లేచాడు.

‘నమస్తే’ చెప్పి అక్కడి నుండి బయటపడ్డారు ఇద్దరూ.

“ఎలా ఉందిరా అమ్మాయి” అడిగాడు సూర్య.

“పర్వాలేదురా.. బాగానే ఉంది. పైగా వర్కింగ్‌ కాబట్టి నీక్కూడా హెల్పింగ్‌గా ఉంటుంది” చెప్పాడు రాజు.

సూర్య మనసులో కూడా అదే అభిప్రాయం ఉంది, కానీ బయటపడలేదు. “సరే రా.. ఒక్కసారి మా పేరెంట్స్‌ని పిలుస్తాను.. వాళ్ళు కూడా చూడాలి కదా” అన్నాడు. ఆ రాత్రి తల్లిదండ్రులకి ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్పి వీలు చూసుకుని వాళ్ళని హైదరాబాద్‌ రమ్మన్నాడు. ఆ తర్వాతి వారమే హైదరాబాద్‌ వచ్చారు సూర్య తల్లిదండ్రులు. సీత ఇంటికి ఆమెను చూడ్డానికి అందరూ వెళ్ళారు. సూర్య తల్లిదండ్రులకి కూడా సీత బాగా నచ్చింది. సూర్య తల్లి “అమ్మాయి మనలో కలిసిపోయేలా చాలా చక్కగా ఉంది రా..” అని తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. అతని తండ్రి మాత్రం “అవునవును… అవునవును..” అని తలాడించాడు. ఇది చూసి సీత తండ్రి చాలా పొంగిపోయాడు, తనకో జోడీ దొరికాడని. సీత తల్లి మాత్రం ఎందుకో అసహనంగా ఉంది. కట్న కానుకల విషయం మాట్లాడదామని ప్రారంభించారు.

ముందు సూర్య నోరు తెరిచి “ఇలాంటివి నాకు ఇష్టం ఉండవు.. మీ అమ్మాయి జాబ్‌ చేస్తుంది కాబట్టి నాకు అది చాలు. పెళ్ళి ఖర్చుల గురించి మాట్లాడుకోండి.. చాలు” అని చెప్పి బయటకు వచ్చేసాడు. సీత తల్లి మొహంలో విపరీతమైన ఆనందం. …మాట ముచ్చట అయిన తర్వాత సూర్య తన తల్లిదండ్రులతో పాటూ రూం కి వచ్చేసాడు.

“ఏరా.. కట్నం ఎందుకు వద్దన్నావురా.. నీలో ఏదో లోపం ఉందనుకుంటారు” అంది సూర్య తల్లి.

“ఏమోనమ్మా..  నాకు అలాంటివి ఇష్టం ఉండవు…. అయినా ఈ కాలంలో కూడా ఏంటమ్మా ఇవన్నీ”

“సరేలేరా… నీ ఇష్టం” నిట్టూర్చిందామె.

***

పెళ్ళిచూపుల ప్రహసనం ముగిసాక.. అందరూ వెళ్ళిపోయాక… తల్లి అనసూయమ్మ అడిగింది “సీతా.. అబ్బాయి నచ్చాడా..” అని

“నచ్చాడమ్మా… కానీ నాకు అప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు” అని తన మనసులో మాట బయట పెట్టింది.

“ఎందుకు లేదు..” అంది అనసూయమ్మ.

“నేను ఇప్పుడు జాబ్‌ చేస్తున్న కంపెనీ నన్ను ఎబ్రాడ్‌ పంపించాలని అనుకుంటోంది… అక్కడికి వెళ్ళి కొన్ని నెలలు పని చెయ్యాలి. ఇప్పుడు పెళ్ళి పెట్టుకుంటే అవన్నీ కష్టం కదమ్మా”

 “అబ్బ.. అవన్నీ నేను చూసుకుంటాను కదా.. నీకెందుకు.. మీ ఆఫీసు వాళ్లకి ఇవేమీ చెప్పకు” అని సీత నోరు మూయించింది. “…అబ్బాయిది మన హైదరాబాద్‌ కాదు.. జాబ్‌ కోసం ఇక్కడికి వచ్చాడు …వాళ్ళ అమ్మా నాన్నా కూడా ఎక్కడో ఊళ్ళో ఉంటారు. అన్ని విధాల మనకు అనుకూలమైన సంబంధం ఇది… ఒప్పుకో..” అంది.

“అలాగేనమ్మా.. ఆలోచిస్తాను” అని చెప్పి తన రూములోకి వెళ్ళిపోయింది సీత.

కొన్ని రోజుల్లో సీతకు, సూర్యకు ఎంగేజ్‌మెంట్‌ అయింది. జంట చాలా బాగుందని వచ్చిన బంధువులంతా మెచ్చుకున్నారు.

‘తనకు అప్పుడే పెళ్ళి వద్దని, కొన్ని రోజులు పోస్ట్‌పోన్‌ చేద్దామ’ని సీత చెబుతున్నా ఆమె గొంతు బలహీనమై.. ఈ గోలలో కలిసిపోయింది. ఆమె ఇష్టానికి ఎవ్వరూ ప్రాముఖ్యత ఇవ్వకుండా ఎంగేజ్‌మెంట్‌ అయిపోయింది.  ‘అవును.. కాదు’ అని ఏమీ చెప్పలేని స్థితి లోకి వెళ్ళిపోయింది సీత.

ఇక తనను తాను మానసికంగా మార్చుకోవడమే బెటర్‌ అని నిర్ణయించుకుని సూర్యతో చక్కగా మాట్లాడేది. ఒక సారి సూర్య టేంక్‌బండ్‌ దగ్గర కలుద్దామని ప్రపోజ్‌ చేసాడు. అయిష్టంగానే ఒప్పుకుంది.

టేంక్‌బండ్‌ పైన సాయంకాలపు గాలి చల్లగా వీస్తోంది. హుస్సేన్‌సాగర్‌ మధ్యలో ఉన్న బుద్ధుడు ‘మీలాంటి జంటలని ఎంతమందిని చూడలేదు’ అన్నట్టు ముసి ముసిగా నవ్వుతున్నాడు. సూర్య, సీత ఒక బెంచీ మీద కూర్చుని హుస్సేన్‌సాగర్‌లోని బోట్లని చూస్తున్నారు.

సీత అంది “కట్నం ఎందుకు వద్దన్నారు?”

సూర్య ఆశ్చర్యపోయాడు. ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక ఇద్దరూ బయట కలుసుకున్నది ఇప్పుడే. ఇలాంటి ప్రశ్న సీత వేస్తుందని అతడు ఊహించలేదు.

“ఎందుకో నాకు అలాంటివి ఇష్టం లేవు..” చెప్పాడు సూర్య.

“మంచివాడు అనిపించుకుందామనా..”

“అబ్బ.. కాదండీ… ఎలాగూ మనిద్దరం జాబ్‌ చేస్తున్నాం కదా… ఇక కట్నం ప్రసక్తి ఎందుకు?.. అందుకే వద్దన్నాను” వివరంగా చెప్పాడు.

“ఓహ్‌.. గ్రేట్‌…” అంటూ నవ్వేసింది సీత.

టాపిక్‌ మారుద్దాం అని “రోజూ ఆఫీసుకి ఎలా వస్తారు?” అని అడిగాడు

“నాకు స్కూటీ ఉందిగా… దానిపైనే వస్తాను.. మీరు?” అంది.

“నా బైక్‌ పైన వస్తాను….”

 “సరే అయితే మన పెళ్ళయిన వెంటనే కారు కొనుక్కుందాం.. అప్పుడు ఎంచక్కా ఇద్దరం ఆ కార్లోనే వెళ్ళొచ్చు” అంది.

“వెరీ గుడ్‌.. మంచి అయిడియా… కానీ ముందు ఇల్లు కొనుక్కుంటే మంచిదేమో..”

“అబ్బా.. ఇంటికేం తొందర.. అవసరమైతే మా ఇంట్లోనే ఉందాం…”

సూర్య కొంచెం షాక్‌ అయ్యాడు “అంటే ఇల్లరికం రమ్మంటారా..? “

“అబ్బ.. ఇల్లరికం అని ఎవరన్నారు… మనం కొంచెం కుదురుకున్న దాకా మా ఇంట్లో ఉంటే తప్పేముంది. పైగా మనకు రెంట్‌ కూడా మిగులుతుంది..” సూర్యకు ఈ ప్రతిపాదన నచ్చలేదు. అయినా ఇంకా పెళ్ళి కాకుండానే ఇన్ని డిస్కషన్స్‌ అనవసరం అనుకున్నాడు. “సరే లెండి, పెళ్ళి అయ్యాక చూద్దాం..” అని ఆ సంభాషణ ముగించాడు.

చాలా సేపు ఇద్దరూ తమ భవిష్యత్‌ ప్రణాళికలు గురించి మాట్లాడుకున్నారు. సంజె చీకట్లు ముసురుకున్నాయి. “ఇక వెళ్దామా..” అంది సీత.

“అప్పుడేనా..” అంటూ అసంతృప్తిగా మొహం పెట్టాడు సూర్య.

“తప్పదండీ.. అసలు ఇలా రావడమే ఎక్కువ.. పదండి” అంది.

సీతను ఆమె ఇంటి బయట దింపి తన రూముకి వెళ్ళిపోయాడు సూర్య. తనను అర్థం చేసుకునే అమ్మాయి… అన్ని విషయాల్లోనూ మంచి అవగాహన ఉన్న అమ్మాయి తనకు భార్య కాబోతున్నందుకు ఎంతో మురిసిపోయాడు సూర్య…

తన లాగే భవిష్యత్తు పట్ల ఎన్నో ఆశలున్న సూర్య ఆమెకు బాగా నచ్చాడు. అతనితో కలిసి ఒక అందమైన జీవితాన్ని నిర్మించుకోవాలని కలలు కనడం మొదలెట్టింది సీత.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here