[dropcap]క[/dropcap]దిలే గోదారిలా మెదిలే భావాలను
దశ,దిశలా పరశంతో పరవళ్ళు తొక్కిస్తూ
సాహితీ దాహాన్ని తీర్చేది పుస్తకం
మస్తిష్కాన్ని నిరంతరం మేల్కొలుపుతూ
చైతన్య విజ్ఞాన దీపికలు వెలింగించేది
అజ్ఞాన తిమిరంలో కాంతిపుంజం పుస్తకం
సమిధలౌతున్న భారమైన బ్రతుకులను
ఆశలనే ప్రమిదలుగా నిత్యం వెలిగించేది
దారిచూపే జీవన రేఖ పుస్తకం
బాధాతప్త మదిని మధురంగా మీటి
కోటి వీణల నాదాలను మురిపెంగా మ్రోగించే
సరస్వతి మానస పుత్రిక పుస్తకం
విరామ కాలాన్ని సద్వినియోగం పరిచేలా
విశాల ప్రపంచ అంచుల ఆనందాలను చూపేది
ఒంటరి మనసుకు ఊతకర్ర పుస్తకం