సంబంధ బాంధవ్యాలు…

0
3

[dropcap]స[/dropcap]మాజంలో రకరకాల మనుషుల్ని చూస్తూంటాము.. ఒక్కోరిది ఒక్కోరకం.. కొంతమందికి అందరితోనూ, స్నేహం చేయాలనుంటుంది.. సాధ్యమైనంతవరకూ అవకాశం ఉన్నప్పుడల్లా, అందరితోనూ మాట్టాడుతూంటారు.. అవతలివారు స్పందించారా సరే.. లేకపోతే తనే సద్దుకుపోతాడు.. పోనీ.. ఇష్టం లేదేమో… అనుకుని. ఎవరైనా పలకరించడం పాపం, ఏమీ దాచుకోకుండా, అవతలవాడు అడిగినా అడక్కపోయినా, తనకి తెలిసిన విషయాలు లొడలొడా వాగేస్తాడు.. ఏదో ‘బోళా మనిషి’ అని సంఘంలో పేరు రావొచ్చేమో కానీ, లాభాలకంటే, నష్టాలే ఎక్కువ.. ఛాన్సు వచ్చినప్పుడు, అవతలివాడు లౌక్యం తెలిసినవాడైతే, ఈ బోళా మనిషి పేరు ఎడాపెడా ఉపయోగించేసి, ఈయనకి చెడ్డపేరు తెస్తాడు.. పైగా ఈ పెద్దమనిషి పేరు వాడితే, ఓ రకమైన authenticity కూడా వస్తుంది ఈయనకున్న రెప్యుటేషన్ మూలాన.. చివరకి చెడేదెవరూ? ఈ పెద్దమనిషే… ఏదో పుణ్యానికి వెళ్తే పాపం ఎదురయిందిట.. పోనీ, అలాటి చేదు అనుభవం వచ్చాకైనా, స్వభావం మార్చుకుంటాడా అంటే.. అబ్బే.. అలాటిదేమీ ఉండదు.. పుట్టుకతో వచ్చిన బుధ్ధి పుడకలతోనే పోతుందిట.. వీళ్ళకి మరో గుణం ఒకటుంది.. ఈ రోజుల్లో, చాలామంది ‘ఎవరికివారే యమునా తీరే’ అనుకుంటూ, తమ సంబంధీకులు కానీ, సగోత్రీయులు కానీ, ఒకే ఇంటిపేరువారు కానీ.. ఇలా ఎవరితోనూ సంబంధ బాంధవ్యాలు తెలుసుకోడానికి కూడా ప్రయత్నించడం లేదు వివిధ కారణాల వలన.. అలాటి పరిస్థితుల్లో, ఏ పుణ్యాత్ముడో, పాపం నడుం కట్టుకుని ఓ వంశవృక్షం తయారీలో పడి, తనకున్న సాధనాలతో, అందరినీ సంప్రదించి, మొత్తానికి ఓ పేద్ద జాబితా తయారుచేస్తాడు.. ఈ బోళా మనిషికి ప్రాణం లేచొస్తుంది.. ఇన్నాళ్ళూ, తన దగ్గరి చుట్టాలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి.. కానీ ఇప్పుడు ఈ వంశవృక్షం ధర్మమా అని, తెలుస్తాయి.. తన తరం వారికి ఫోనుచేసి, క్షేమ సమాచారాలడిగి సంతోషిస్తాడు.. అక్కడితో పోనీ ఆగుతాడా? అబ్బే.. తను పలకరించిన వాడి తరవాత తరం వాడిని పలకరిద్దామని తపన. ముందు తన స్వపరిచయం చేసుకుంటూ, తన ఫోను నెంబరు కూడా పెడతాడు.. పైగా నీతో మాట్టాడాలనుందీ.. అంటూ సిగ్గు విడిచి మెసేజ్ కూడా పెడతాడు.. ఈ మెసేజ్‌కి జవాబుగా, ఫోను మాట దేవుడెరుగు, కనీసం మెసేజ్‌కి జవాబు కూడా రాదు… అప్పటికీ ఈ ఫోన్ల భాగోతం విని విని, ఇంటావిడ అడిగేస్తుంది కూడానూ.. “ఏమండీ.. మీరు ఇంతంత పూసుకుని, అభిమానంతో ఫోన్లు చేస్తున్నారే.. ఆ లిస్ట్‌లో ఉన్న మీ చుట్టాలొక్కరైనా మీకు ఫోను చేయడానికి ప్రయత్నించారా పోనీ…” ..నిజం చెప్పాలంటే దీనికి జవాబు లేదు ఈ పెద్దమనిషి దగ్గర.. ఏదో సమర్థించడానికి, “పోనిద్దూ అందరూ అలాగే అనుకుంటే ఇంక సంబంధాలేం నిలుస్తాయీ..” అంటాడు.

ఇంటావిడకూడా ఈ వెర్రిమనిషిని చూసి జాలి పడుతుంది. సంబంధ బాంధవ్యాలు అటకెక్కాసాయంటే మరి ఇదే ముఖ్యకారణం.. ఈ రోజుల్లో చుట్టపక్కాల గురించి తరవాతి తరం వారికి తెలియదు, తెలుసుకోడానికి ప్రయత్నించినా స్పందన కూడా ఉండకపోవడం ఓ దౌర్భాగ్యం.

మరికొందరు.. అసలు నోరు విప్పితేనే పాపమన్నట్టుంటారు.. తమంతట తాము పలకరించరు.. మరొకరు పలకరించడానికి ప్రయత్నించినా.. ముభావంగా ఉండి, మొహం ముటముటలాడించుకుంటారు.. అవతలివాడికి, చెప్పకుండానే, బాడీ లాంగ్వేజ్ ద్వారా చెప్తారు.. వీళ్ళ సంగతి బెస్ట్.. లేనిపోని టెన్షన్లు పెట్టుకోరు.. ఎవడెలాపోయినా పట్టించుకోరు.. తను సుఖంగా ఉంటే చాలు.. అవసరానికి చెయ్యందించేవాడు ఒక్కడూ ఉండడు ఇలాటివారికి.. మరాఠీలో ‘ఏక్ థా జీవ్ సదాశివ్’ అంటారు ఇలాటివారిని..

మరో రకం ఉంటారు.. బహు ప్రమాదం వీరితో.. సొసైటీలో ఓ పేద్ద ఇమేజ్.. ఆయనకేమిటిలెండి.. ‘నిండుకుండ లాటివాడు’ అంటారు.. తనంతట తాను, ఒక్క విషయం పంచుకోడు అవతలివారితో.. సమాచారం ఎలా లాగుదామా అనే తాపత్రయమే ఎక్కువ.. అవతలి వాడు బోళా మనిషైతే, ఈయనకి పండగే పండగ.. పురెక్కించి వదిలితే చాలు.. లొడలొడమంటూ, అడిగినవాటికీ, అడగనివాటికీ, అడగబోయేవాటికీ కూడా సమాధానాలు చెప్పేస్తాడు.. కీ ఇచ్చి వదిలేసిన మర బొమ్మలాగ… పోనీ అవతలాయన ఇన్నేసి విషయాలు చెప్తున్నాడే, మనం కూడా ఏదో చెప్తే బావుంటుందేమో అన్న ఆలోచన కూడా రానీయడు.. ఏమో, ఈయనతో అన్నీ చెప్పేస్తే రేపెప్పుడో సహాయం అడిగితే.. వామ్మో.. ఏదో ఇలాగే బావుందనుకుంటాడు కానీ, ఛస్తే తనకి తెలిసినది మాత్రం మరొకడికి తెలియనీయరు.. మళ్ళీ ఓ పేద్ద ఇమేజీ.. పాపం అన్నీ ప్రశాంతంగా వింటారూ.. అవసరమైనదానికి మాత్రమే స్పందిస్తారూ.. అంటూ.. అదొక టైపు స్వభావం.. ఇలా అవతలివారి ద్వారా సేకరించిన సమాచారం, (ఇందులో స్వంతంగా పరిశోధించిందేమీ ఉండదు) అక్కడకి అంతా తనకే తెలుసున్నట్టు ప్రవర్తించడం.. వీళ్ళని so called ‘మేధావులు’ అంటారు.. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా వీళ్ళే… సమాజంలో ఓ పేద్ద పేరూ, ‘అవతలివారు చెప్పేది శ్రధ్ధగా వినడం వీరికున్న ఓ సుగుణం.. మధ్యలో మాట్టాడరు.. పూర్తిగా విన్న తరవాతే అవసరమైనదానికి మాత్రమే స్పందిస్తారూ..’ అని.. అసలు విషయమేమిటంటే, అవతలివాడు మాట్టాడేదాని గురించి, ఈ ‘మేధావి’ అసలు అవగాహన అనేదే లేదు.. అలాగని తేలిపోతే, ముందరే తేలికైపోతాడు.. అందుకనీ ఆ వేషాలన్నీ.. తెలుసుకోవాలనుకున్నవన్నీ తెలిసేసుకుని ఓసారి “ఓహో.. అలాగా..” అంటూ తలూపితే చాలు.. తను ఏర్పరుచుకున్న ఇమేజ్‌కి ఎటువంటి భంగమూ రాదు… ఇలాటి విషయాలు తెలుసుకోడానికి, ఏవేవో మనస్తత్వశాస్త్రంలో పరిశోధనలూ, ఔపోసనలూ అక్కర్లేదు.. జీవితం నేర్పే పాఠాలు చాలు…

వీరందరినీ మించిన మరికొందరున్నారు… సామాజిక మాధ్యమాల్లో వీళ్ళ హవా చాలా ఎక్కువ. ‘చెప్పేవాడికి వినేవాడు లోకువ..’ అని ఓ సామెత ఉంది. ఈరోజుల్లో ‘రాసేవాడికి చదివేవాడు లోకువ..’ అనుకోవచ్చు.. ఏదో అదృష్టం బాగుండి, అప్పటికే ఓ పేరు ఉండుండొచ్చు.. ఇంక చూసుకోండి.. ఏది పడితే అది రాసేయడం.. ప్రతీదానికీ రివ్యూలు.. వారానికోసారి Profile update అంటూ ఓ ఫొటో.. అడక్కండి ఏదో ఓ కారణంతో ప్రతీరోజూ ఓ పోస్టుండాల్సిందే.. వీళ్ళకి ఓ ప్రమథ గణం లాటిదుంటుంది.. వారి పేరన పోస్ట్ కనిపించడం తరవాయి.. వందల్లో లైక్‌లు, వ్యాఖ్యలూ.. “అబ్బ ఎంత బాగా చెప్పారండీ..” అంటూ.. పోనీ అంత శ్రమపడి పాపం స్పందించారే, ప్రతిస్పందన కూడా ఉంటే, ఆ స్పందించిన వ్యక్తి ఎంత సంతోషిస్తారూ అనే సంస్కారం కూడా ఉండదు ఈ ‘సోకాల్డ్ సెలెబ్రెటీ’లకి.. పైకి వెళ్ళినదేదైనా కిందకు రావాల్సిందే కదా.. వీళ్ళకి ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి..

మనుషుల రకరకాల మనస్తత్వాలు హాయిగా తెలుస్తాయి…  పోనీ తెలిసాకైనా బాగుపడతాడా అంటే.. అబ్బే.. అలాటిదేమీ ఉండదు.. జీవితం సాగుతూనే ఉంటుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here