99 పదాల కథ – 4: యథా రాజా…

0
4

ఆఫీసునుండి అలసిపోయి ఇంటికి వచ్చిన రాజారాం, సిగరెట్టు ముట్టించి దమ్ము పీల్చి వదులుతూ, భార్య లలిత అందించిన కమ్మటి కాఫీ ఆస్వాదిస్తుండగా “నాన్నా నాతో రా” తండ్రి చేయిపట్టి లాగుతూ షంటసాగాడు నాలుగేళ్ళ బాబి.

“ఎక్కడికిరా?”

“రా ముందు” తండ్రిని సరాసరి తమ గదిలోకి తీసుకెళ్ళాడు.

గదిలో కనపడిన దృశ్యం దిమ్మతిరిగించింది రాజారాంకి …వాలు కుర్చీలో దర్జాగా కాలు పై కాలు వేసుకుని, అతడి ఆరేళ్ల కూతురు, పెదిమల మధ్య చీపురు పుల్లలు పెట్టుకుని, అంటించినట్లుగా చేసి, అచ్చం తండ్రిలాగానే, గుండెలనిండా పొగ పీల్చి వదులుతున్నట్లు చేస్తోంది…

“ఏం చేస్తున్నావే?” పట్టరాని ఆవేశంతో కూతురి గూబపై ఒక్కటిచ్చేటప్పటికి తారస్థాయిలో ఏడుపు లంకించుకుంది. అక్క ఏడుపు చూసి బాబీ కూడా ఏడుపు లంకించుకున్నాడు.

“నువ్వూ అలాగే చేస్తావుగా మరెందుకు అక్కని కొట్టావు?” బాబిగాడి దబాయింపు తూటాలాగా గుండెలో దిగి ‘యథారాజా తథా ప్రజా’ నానుడి గుర్తొచ్చి వీపుపై వాత పెట్టినట్లైంది రాజారాంకి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here