[dropcap]”అ[/dropcap]య్యో! బిడ్డలు బిడ్డలు మా బిడ్డలు పా” అనిరి వాళ్లు.
“మీ బిడ్డలేమా ఎవరు కాదనిరిపా” అంట్ని నేను.
“కాదనిరని కాదుపా మాకు కాకుండా పోతారని” తిరగా అనిరి.
“ఓ… అట్లనా?” అంటా అందాజు చేస్తిని.
“ఊపా!” అని తలలు గుంకాయిచ్చిరి.
“అయితే మీరు మీ అబ్బా అమ్మకి అయినారా?” అట్లే అడిగితిని.
“ఆ… ఆ… అంటే… అంటే… అదిపా” అంటా తడబడిరి.
“అంటేలే గింటేలే మీ బిడ్డలు మీనింకా వచ్చిరి అంతే కాని అంతా మీరే అని కాదు పోండా” ములాజు లేకుండా అంట్ని.
“ఆ… ఆ…” అని అంగలాసిరి వాళ్లు.
“అదేల అట్ల అంగలాస్తారు. అంగలాసింది సాలు, ఇంగైన్నా ఆలోచనకి రాండా… అన్నీ కాకున్నా కొన్ని జీవిత సత్యాలు తెలుస్తాయి. ఏదీ మనది కాదు మన తోడు ఎవరు రారు” అని ఆడనింకా వచ్చిస్తిని.
***
మీనింకా = మీ ద్వారా