[dropcap]1[/dropcap]952 తరువాత చరిత్ర ఆధారిత రచనలు చేసినవారి జాబితాలో నటరాజ రామకృష్ణ, నాయని కృష్ణకుమారి, బిరుదురాజు రామరాజులు కూడా చేరతారు. వీరి రచనల వివరాలతోపాటూ రచనలనుకూడా అందించారు కేపీ అశోక్ కుమార్.
****
1920 - 30 ప్రాంతంలో ఓ పరిశోధకుడు ఓ తీర్మానం చేశాడు. తెలుగు భాషలో ‘దీపం’ అన్న పదం లేదని, అందుకని తెలుగువారు అజ్ఞాన అంధకారాల్లో ఉండేవారు కాబట్టి అంధులు అనేవారనీ, కాలక్రమేణా అంధులు ఆంధ్రులు అయిందన్నది ఆయన తీర్మాన సారాంశం. ఈ విషయమై బహు తీవ్రమైన చర్చలు జరిగాయి. చివరికి ‘తిల్లిక’ అన్న పదం తెలుగులో దీపాన్ని సూచిస్తుందని, కాబట్టి ఆంధ్రులు అంధులు కాదని ఒప్పించారు.
కాలయంత్రంలో మొదటి కథ, డి.పి. అనురాధ రచించిన ‘మగాడు’ చదివితే పై సంఘటన గుర్తుకువస్తుంది.
చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలు చేసేటప్పుడు రచయితలు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది. రచయిత చరిత్ర ఆధారంగా సృజన చేసేవాడే తప్ప చరిత్రను సృష్టించేవాడు కాదు. చరిత్ర పరిశోధకులు తమకు లభించిన అనేక ఆధారాల ద్వారా చరిత్రను నిర్ణయిస్తారు. సృజనాత్మక రచయిత నిర్ధారితమైన చరిత్ర చుట్టూ కల్పన చేస్తాడు. అస్థిపంజరం లాంటి చరిత్రకు రక్తమాంసాలు ఇచ్చి ప్రాణం పోసి పాఠకుల ముందు చరిత్రను సజీవంగా నిలుపుతాడు. అంతే తప్ప రచయిత చరిత్రకారుడు కాదు. తాను స్వయంగా చరిత్రకు సంబంధించి తీర్మానాలు చేయలేడు. ఒకవేళ నిర్ధారిత చరిత్రకు భిన్నమయిన అబ్భిప్రాయంవుంటే, తన అభిప్రాయాన్ని రచయిత తార్కికంగా, ఆధారాలతో తన వాదనను కథలో వినిపించాలి. ఒకవేళ చరిత్ర పరిశోధకులు కనుగొనలేని, నిర్థారించలేని విషయాన్ని రచయిత ఊహించి నిర్థారించినా, తన రచనలో ఆ ఊహను సమర్థిస్తూ తార్కికంగా వివరించాలి. అంతే తప్ప గాల్లో నుంచి ఊహలు చేయకూడదు.
కాలయంత్రంలోని ప్రతి కథముందూ సంపాదకుడు చరిత్ర కథ నేపథ్యం వివరిస్తాడు. ( ఈ సంపాదక వ్యాఖ్యలగురించి కథల విశ్లేషణ పూర్తయిన తరువాత) కథ గురించి వ్యాఖ్యానిస్తాడు. ఇది మంచి పద్ధతి. చదివే పాఠకుడికి తాను చదవబోయే కథ గురించి ఒక ఆలోచన వస్తుంది. మానసికంగా ఆ కథ చదవటానికి సిద్ధమవుతాడు పాఠకుడు. అయితే దీనివల్ల ఒక ప్రమాదం కూడా ఉంది. తాను చదివిన కథ సంపాదకుడు కల్పించిన ‘ఊహ’కు భిన్నంగా ఉంటే పాఠకుడు కథను మెచ్చడు. మగాడు కథ గురించి సంపాదకుడు ‘ఆనాటి సమాజంలో ఆంధ్ర సంస్కృతి ప్రాభవాన్ని తెలియజెప్పిన తీరు ఇంతకు ముందెన్నడూ తెలుగు సాహిత్యంలో చూడలేదు’ అని వ్యాఖ్యానించారు. అంటే ఇది కథ ప్రత్యేకత, కథ ప్రాధాన్యం అన్నమాట.
కథ బర్మా దేశానికి సంబంధించింది.
ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వారికి ఓ రాగి పేటిక దొరుకుతుంది. దాన్లో తోలు మీద రాసిన రాతలు లభిస్తాయి. రచయిత వాటిని చదువుతుంటే బర్మా గతం కళ్లముందు నిలుస్తుంది. ఒకో అధ్యాయంలో గతం చదవటం, వర్తమానంలో ఆలోచించటం ఉంటుంది. అంటే కథ వర్తమానానికీ, ప్లాష్ బ్యాక్‍కూ నడుమ మారుతూ నడుస్తుందన్నమాట. ‘బర్మా’లో మాన్ (Mon) సామ్రాజ్య స్థాపన చేసిన ‘వరేరు’ లేక ‘వగారు’ అనే రాజు కథ ఇది. చరిత్ర ఆధారిత కథలలో ఒక రకమైన ఉద్వేగం ఉండాలి. ఉత్తేజం కలగాలి. కథలో ఎత్తుకు పై ఎత్తులు, కుట్రలు, కుతంత్రాలు పాఠకుల ఊహలను ఉత్తేజితం చేయాలి. రచయిత ఏ పాత్ర కేంద్రబిందువుగా కథను సృజిస్తాడో ఆ పాత్ర పాఠకుల మనస్సులలో స్థిరనివాసం ఏర్పరచుకోవాలి. అతని వ్యక్తిత్వం పాఠకుల మెప్పు పొందాలి. ముఖ్యంగా పాత్ర నేపథ్యం, అప్పటి రాజకీయ, సామాజిక పరిస్థితుల వంటివి పాఠకుడికి తెలియాలి. అప్పుడే అతడికి పాత్ర గొప్పతనం, ఎలాంటి ప్రతికూల పరిస్థితులను నాయకుడు తనకు అనుకూలంగా మార్చుకున్నాడో బోధపడుతుంది. ఇది చెప్తూ కథలో పలు సామాజిక, సాంస్కృతిక అంశాలను ప్రదర్శిస్తే కథకు ఒక సమగ్రత వస్తుంది. చదివే పాఠకుడికి ఎన్నో విషయాలు తెలుసుకున్న భావన కలుగుతుంది. రచయిత కథలో ప్రదర్శించిన చరిత్ర గురించి అవగాహన వస్తుంది. అది ప్రభావం చూపితే ఆ అంశం గురించి మరింత విస్తృతంగా తెలుసుకుంటాడు. అందుకే పాశ్చాత్య దేశాలలో ‘హిస్టారికల్ ఫిక్షన్’ రచనలను పిల్లలకు చరిత్ర గురించి అవగాహన కలిగించేందుకు సాధనంగా వాడతారు. హిస్టారికల్ ఫిక్షన్ రచనలు చదవటం, వాటిని విశ్లేషించటం, అవగాహన చేసుకోవటం వారి పాఠ్యాంశాలలో ఒకటి. అందుకే అక్కడ చరిత్ర ఆధారిత రచనలు చేసేవారు తమ రచనలను జాగ్రత్తగా చేస్తారు. ఎలాంటి అనృతాలు, అనౌచిత్యాలు లేకుండా కథను ‘లాజికల్’గా నిర్మిస్తారు.
‘మగాడు’ కథ చదివితే బర్మా గురించి, బర్మా చరిత్ర గురించి ఎలాంటి అవగాహన కలగకపోగా అయోమయం కలుగుతుంది. ప్లాష్‌బ్యాక్ వర్తమానం టెక్నిక్ చక్కటి టెక్నిక్. ‘జాన్ ఫౌల్స్’ అనే రచయిత ‘ఫ్రెంచి లెఫ్టినెంట్ వుమెన్’ అనే నవల ఇదే టెక్నిక్‍లో అత్యద్భుతంగా రాశాడు. డెస్మండ్ బాగ్లే ‘ది స్నో టైగర్’ అని ఓ అత్యద్భుతమైన థ్రిల్లర్ రాశాడు. దాన్లో ఈ ‘ఫ్లాష్‍బ్యాక్’ టెక్నిక్‍ను అత్యద్భుతంగా వాడతాడు. వర్తమానంలో హీరోపై ఆరోపణ వస్తుంది. దానికి గతంతో సంబంధం ఉంటుంది. గతంలో ఏం జరిగిందో తెలుస్తుంటే వర్తమానంలో ఉత్కంఠ పెరుగుతూంటుంది. చివరికి ‘ముగింపు’ అదిరిపోతుంది. ఇంకా అనేకులు ఈ టెక్నిక్‍ను వాడేరు. గొప్ప రచనలు సృజించారు. అయితే ఈ పద్ధతిలో కథ చెప్పాలంటే వర్తమానానికి గతానికి నడుమ సంబంధం ఉండాలి. గతంలో జరుగుతున్న దాని ప్రభావం వర్తమానంలో ఉండాలి. ఈ రెండింటి మధ్య ‘లంకె’ లేకపోతే ప్లాష్‍బ్యాక్ వ్యర్థం అవుతుంది. అయోమయాన్ని కలుగజేస్తుంది. థ్రిల్లర్ రచన ‘ది బోర్న్ ఐడెంటిటీ’లో రాబర్ట్ లుడ్లుమ్ ఈ ప్లాష్‍బ్యాక్ టెక్నిక్‍ను చాలా సృజనాత్మకంగా వాడుకున్నాడు. రూథ్ ప్రవర్ ఝాబ్వాలా హీట్ అండ్ డస్ట్ నవలలోనూ ఈ టెక్నిక్ వాడుతుంది. తన తల్లి గురించి తెలుసుకునేందుకు ఇంగ్లండ్ నుంచి అమ్మాయి భారత్ వస్తుంది. ఆమె తల్లి పెళ్ళయికూడా ఒక రాజుమోహంలో పడుతుంది. ఆమె గురించి తెలుసుకుంటూ,ఈమె కూడా ఒక భారతీయుడి ప్రేమలో పడుతుంది. తల్లి కథ, ఈమె కథ సమాంతరంగా నడుస్తూంటాయి. ఒకో విషయం తెలుసుకుంటూంటే సస్పెన్స్ పెరుగుతూంటుంది. భారతదేశంలో బ్రిటీష్ మహిళల మానసిక సమస్యలు, పరిస్థితులు తెలుస్తాయి. ప్రస్తుత సమాజం గురించి అవగాహన కలుగుతుంది. ముదిగొండ శివప్రసాద్ ఆవాహన కూడా ఫ్లాష్ బాక్ టెక్నిక్తో అద్భుతంగా సాగుతుంది. విశ్వనాథ సత్యనారాయణ బాణావతి నవల కూడా ఫ్లాష్ బాక్, వర్తమానాల నడుమ సాగుతుంది. అత్యద్భుతమయిన రచన అది. అయితే ఈ టెక్నిక్‍ను వాడటానికి రచయితకు ఈ టెక్నిక్ పట్ల అవగాహన ఉండాలి, పట్టుండాలి, రచనలో ఈ టెక్నిక్ అవసరం ఉండాలి. అంటే గతానికి వర్తమానంతో సంబంధం ఉండటమే కాదు, ఆ గతాన్ని తెలుసుకుంటున్న వాడికో, చెప్తున్న వాడికో, గతం ప్రభావం ఉండాలి. లేకపోతే ‘ప్లాష్‍బ్యాక్’ అర్థం లేనిదవుతుంది. ఈ టెక్నిక్ వాడే రచయితకు కథను చెప్పటంలో, నడపటంలో ఎంతో అనుభవం ఉండాలి. కథను అల్లటం ఒడుపు తెలియాలి. అవి తెలియకపోతే ప్రక్రియ కథకు ప్రతిబంధకం అవుతుంది. అధికంగా ఈ టెక్నిక్ ను సస్పెన్స్ కథలకో, ఎమోషనల్ గాథలకో వాడతారు.
రచయిత్రి మగాడు కథను రచించేందుకు ఈ టెక్నిక్‍ను ఎంచుకుంది. ఈ కథను డ్రమటైజ్ చేసి ఉద్విగ్నత, కుతూహలం వంటివి కలిగించే కన్నా, కథను ఒక వ్యాసంలా, కేవలం సమాచారం ఇవ్వటంపైనే దృష్టిపెట్టారు తప్ప, రచయిత్రి కథను ఆసక్తికరంగా చెప్పటం, ఉత్కంఠ కలిగించటం కూడా లేదు. కథలో సస్పెన్స్ లేదు. ఉద్విగ్నత లేదు. పాత్ర చిత్రణ, పాత్ర పోషణ అసలే లేదు. దాంతో పాఠకుడు కథతోకానీ, పాత్రతోకానీ స్పందించే వీలులేకుండాపోయింది.. సామాన్య పాఠకుడు కథలోని అంశంతో మమేకం చెందడు. అంటే కళ్ళముందు దృశ్యాలు కనబడవు. నాటకీయత లేదు. ఒక వ్యాసం ‘అనువాదం’ చదువుతున్నట్టుంటుంది. ఇంతకీ ‘ప్లాష్‍బ్యాక్’లో కథను చెప్తున్న పాత్రకీ తెలుసుకుంటున్న పాత్రకీ ఎలాంటి సంబంధం ఉండదు. దొరికిన పత్రాలు నిర్మొహంగా చదువుతుంది. నీరసంగా కథ చెప్తుంది. నిర్లిప్తంగా పాఠకుడు కథ చదువుతాడు. ప్లాష్‍బ్యాక్‍లో ఉద్విగ్నత లేదు. వర్తమానంలో ఉత్తేజం లేదు. రెంటికీ సంబంధం లేదు. దాంతో కథ చదివిన తరువాత ఎలాంటి భావన కలగదు. అటు చరిత్ర తెలియదు. ఇటు వినోదం లేదు. ఇందుకు ప్రధాన కారణం బహుశా రచయిత్రికి అంతగా రచనానుభవం లేకపోవటం కావచ్చు. చరిత్ర గురించి తెలిసి ఉండటం వేరు. చరిత్ర రచన వేరు. చరిత్ర ఆధారిత కాల్పనిక రచన వేరు. చరిత్ర ఆధారిత కాల్పనిక రచనచేసే రచయిత చరిత్రలో నిష్ణాతుడు కానవసరం లేదు. తనకు అవసరమైనంత తెలుసుకుని కథను అందంగా అల్లగల నైపుణ్యం ఉంటే చాలు. చరిత్రలోని ఒక్క వాక్యంతో అందరినీ అలరించే అద్భుతమైన రచనను సృజించవచ్చు.
ఇక ఈ కథలో ‘ఆంధ్ర సంస్కృతి ప్రాభవం’ ఎక్కడా కనబడదు. ఆంధ్ర సంస్కృతి ప్రాభవం అంటే ఏమిటో? కథలో కూడా ఆ ప్రస్తావన రాదు. బహుషా తెలంగాణావాడయిన మగాడు బర్మాలో రాజ్యం ఏలాడని చెప్పటమే ఆంధ్రసంస్కృతీ వైభవాన్ని ప్రదర్శించటం అనుకునివుంటే అంతకన్నా పొరపాటు లేదు. ఎందుకంటే తెలుగు మగాడు, బర్మా మా గేడు కాడు. కాబట్టి ఇలా ‘ఆంధ్ర సంస్కృతి ప్రాభవాన్ని తెలియజెప్పిన తీరు ముందెన్నడూ కాదు, ఇప్పుడూ తెలుగు సాహిత్యం చూడలేదు’. కాబట్టి ‘ఆగ్నేయాసియాలో ఆంధ్ర సంస్కృతి అడుగుజాడలు స్పృశించిన వ్యక్తి సాధికారం’గా చెప్పే కథ కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది.
ఈ కథలో ప్రదర్శించిన చరిత్ర దాదాపుగా వికిపీడియాలో వరేరు (wareru)అన్న హెడింగ్ క్రింద ఉన్నదానికి అనువాదం అనిపిస్తుంది. అయితే చరిత్రకు సంబంధించి రచనలో ‘సాధికారికత’ కనబడదు. ముఖ్యంగా కథ పేరు కథను అభాసుపాలు చేసే అంశం. ఒకే రకమైన ఉచ్చారణ ఉన్నంత మాత్రాన చరిత్రకారులు ఎన్నో ఏళ్ళుగా తేల్చలేని విషయాల గురించి తీర్మానం చేయటం రచయితను, కథను, సాహిత్యాన్ని హాస్యాస్పదం చేస్తుంది. చరిత్ర ఆధారిత కాల్పనిక కథలను బలహీనం చేసి అపహాస్యం పాలు చేస్తుంది. అతని పేరు Ma gadu ‘మే గేడు’ అంటారు. అతని తమ్ముడి పేరు ma gada. మే గేడును ‘మగాడు’గా ప్రకటించినపుడు మా గాడును ‘మా గోడు’ గానో ‘మీ గడ’ గానో తీర్మానించి ఉంటే కథకు బలం వచ్చేది! వాళ్ళ ఇంట్లో అంతా తెలుగువారే అనేవీలువచ్చేది. కానీ, మగాడుని తీసుకుని మగాడి తమ్ముడిని’ చెల్లెలిని ప్రస్తావించకపోవటం, తాము చెప్పాలనుకున్నదే చెప్పి తీర్మానించేసినట్టు తోస్తుంది. కాని వారి సోదరి పేరు నిన్ యు యైంగ్. ఇక్కడెక్కడా తెలుగుదనం లేదు! అన్న తెలుగువాడు. తమ్ముడు మా గెడో, మ గాడాయో?? .. చెల్లెలిది బర్మా పేరు. ఏదో ఒకటి చేసి మసిపూసి మారేడుకాయ చేసి మన తెలుగువారు గొప్పవారు, బర్మాలో ‘మగాడు’ మనవాడే అని ఢంకా బజాయించి చెప్పటం, అదే నిజమని నమ్మించాలని ప్రయత్నించటం వల్ల రచయిత, సంపాదకుడితో సహా దాన్ని సమర్థించినవారు అభాసు పాలవటమే కాదు తెలుగు చరిత్ర ఆధారిత రచన సాహిత్యం కూడా విలువను కోల్పోతుంది. History is a set of lies agreed upon అన్న నెపోలియన్ మాట గుర్తుకువస్తుంది.
ఈ కథలో చరిత్రపరంగా పలు తీర్మానాలు రచయిత్రి ‘సాధికారికత’ను ప్రశ్నార్థకంలో పడేస్తాయి.
Mon లు తెలుగువారే అనటానికి, నిశ్చయంగా చెప్పటానికి ఎలాంటి ఆధారాలూ చూపలేదు. మగాడి పూర్వీకులు ఎవరు? రాజమాత తెలంగాణా అని ఏ ఆధారంతో చెప్పారు? దీనికి శాసనాలేమయినా దొరికేయా? పోనీ ప్రాచీన తాళపత్రాల్లో ఎక్కడయినా రాశారా? బౌద్ధుల గ్రంథాలలో ఎవరయినా రాశారా? కనీసం, ఇంతవరకూ బర్మా చరిత్ర రాసినవారెవరయినా ఈ విషయం ప్రస్తావించారా తమ పుస్తకాల్లో? కనీసం తెలంగాణా శాసనాల్లో, వీరగాథల్లో, చరిత్ర రచనల్లో ఎక్కడయినా ఈ విషయం ప్రస్తావించారా? అదీగాక, తెలంగాణా చరిత్ర రచయితలు తెలంగాణా అన్న పదానికి భౌగోళిక గుర్తింపు 18వ శతాబ్దం చివరలో వచ్చిందని ప్రతిపాదించారు. మరి బర్మా వెళ్ళినవారు అప్పుడే తెలంగాణా అన్న పదం ఎలావాడేరు? బర్మాలోవారు తెలంగాణాను గుర్తుచేసుకుంటూ జోలపాట పాడాలంటే తెలంగాణా అన్న పదం 10,11 శతాబ్దాలకల్లా ప్రాచుర్యంలోకి వచ్చివుండాలి. .. ఒకవేళ మా గేడు తెలంగాణా వాడని నిర్ధారిస్తే, మొత్తం తెలంగాణా చరిత్రను తిరగదోడాల్సివుంటుంది.
“ఆ రాజులిద్దరూ ‘మన’ జాతీయులే? వారి పూర్వపు పేరు తైలంగులు” (8 పేజి)
‘తైలంగులు’ అన్న పదం గురించి విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి ఇంకా. వాదోపవాదాలు విపరీతంగా సాగుతున్నాయి. ‘తైలంగుల’ని Mon జాతివారిని ఉద్దేశించి అంటారు. ఇది నీచమైన, అవమానకరమైన పదం. ఈ పదం 18వ శతాబ్దంలో ‘తిట్టు’ పదంలా అమలులోకి వచ్చింది.
The king Alaungpaya in the eighteenth century had conducted a war of extermination of the Mon people, enslaved them, and had deliberately created a derogatory Burmese term (talaing) to be used thence forth for the Mon people
– The Mists of Ramanna Desa by MA Aung-Thwin (page no 261)
‘ఆన్ ది హిస్టరీ ఆఫ్ పెగు’ అనే వ్యాసంలో ‘ఫాయరే’ అనే ఆయన ‘తలైంగ్’ అనే పదం తలింగానా (talingana) అన్నపదం నుంచి వచ్చిందని, ఇది దక్షిణ భారతంలోని ఒరిస్సా ప్రజలను సూచిస్తుందని అభిప్రాయపడ్డాడు. ‘తలింగా’ ‘కళింగ’ నుంచి వచ్చిందన్నాడు.
రెవరెండ్ జేమ్స్ మాడిసన్ ’’గ్రామాటికల్ నోట్స్ అండ్ వకాబులరీ ఆఫ్ ది పెగువన్ లాంగ్వేజ్’ అన్న పుస్తకంలో ‘తలైంగ్’ అన్నపదం ఇలా లూయిమ్ ‘ila luim’ అనే రెండు Mon పదాల నుండి వచ్చిందని అభిప్రాయపడ్డాడు.
ఎమిల్ ఫోర్డ్ హామర్ ప్రకారం అలౌంగ్‍సాయా పెగును గెలుచుకునే వరకూ ‘తలైంగ్’ అన్న పదం ఉన్నట్టు దాఖలాలు లేవన్నాడు. తాళ పత్రాలలో కానీ, శాసనాలలో కానీ ఎక్కడా ఈ పదం కనబడలేదు. ‘తలైంగ్’ అన్నపదం Mon లు తమ ఓటమిని ఒప్పుకునేందుకు వాడిన పదం అనీ, ఇది ‘బానిస’ అన్న అర్థం ఇస్తుందని తీర్మానించారు. ఈయన ప్రకారం ‘talaing’ అంటే ‘trodden under foot’ అని అర్థం. ‘స్టీవెన్‌సన్’ ప్రకారం ఈ పదం Monల పదమే కాదు, ‘హిస్టరీ ఆఫ్ బర్మా’ పుస్తకంలో ‘తలైంగ్’ అన్న పదం ‘తలిన్‍గానా’ అన్నపదం నుంచి వచ్చిందన్న అభిప్రాయం కనిపిస్తుంది.
‘కళింగ అండ్ బర్మా – ఎ స్టడీ ఇన్ ఏన్షియన్ట్ రిలేషన్స్’ అన్న పరిశోధన పత్రంలో డాక్టర్ బేణుదర్ పాత్ర ప్రకారం “From the Burmese traditions, it is gleaned that the people of kalinga had established colonies in Burma since time immemorial”. టాలమీ ప్రకారం అశోకుడి కన్నా ముందు నుంచి కళింగులు బర్మాలో స్థిరపడ్డారు. మజుందార్ ప్రకారం ‘The Kalingans established an empire in Burma perhaps many hundred years before the rise of Buddhism”. క్రీ.పూ ఏడవ శతాబ్దంలో బర్మాను కళింగారత్ (కళింగ రాష్ట్ర) అనేవారు. బర్మాలో పవిత్రమైన బౌద్ధ గ్రంథం ‘బుద్ధిగత’ ప్రకారం “A steady commercial interaction with Burma by the Buddhism merchants of Kalinga, which soon led to the missionary undertakings for the propagation of their religion, and afterwards to the assumption of political supremacy in the land”. బేణీ ప్రసాద్ పరిశోధన ప్రకారం “There are evidences to prove that certain sections of the people migrated from kalinga and had their settlement there who were known as Talaing people. The new Kalingarat in Burma was given the designation Mudu Kalinga. (Mudu means three, Mudu Kalinga is Trikalinga)”.
ఆ కాలంలో Kale, అరకన్ నది లోయ, మార్తబాన్ గల్ఫ్ వద్ద ఉన్న పెగు ప్రాంతాలు కళింగులు అధికంగా ఉన్న ప్రాంతాలు. ‘పెగు’ పాత పేరు ‘ఉస్సా’ – ఇది ‘ఓధ్ర’ ‘ఒరిస్సా’ల రూపాంతరంగా భావిస్తున్నారు. “Lower Burma is the land of the people who were and are still called ‘Tailangas’. The term used as early as 1107 AD in Mon records is but a derivation of ‘Telingana’ or ‘Trikalinga’ a name used to mean almost the whole of andhra kalinga zone”.
అంటే బర్మాలో ‘తెలాంగ్’ అన్న పదం ప్రాచీన పదమైనా ఆ పదం అధికంగా ‘కళింగ’ ప్రాంతం నుంచి వచ్చిన వారిని ఉద్దేశించి వాడేవారని, కళింగ అప్పటి ‘అఖండ ఆంధ్ర’ లో భాగమని అర్థమవుతుంది.
‘Yekhaing Minthamiegyin’ అనే ఆయన క్రీ.శ 1456లో ‘Thakin Twe Egyin’ అని 1468లో జన్మించిన ఓ రాకుమారి, 1530 ప్రాంతంలో రాజ్యం చేసిన Tabin Shwehti అనే రాజులకు అంకితం ఇచ్చిన కవిత Mindaya Shwehti Nadaw-thwin అనే దానిలో ‘తెలాంగ్’ అనే పదం కనిపిస్తుంది. Manng kala రాసిన చరిత్ర రచనలు ‘Yazawingyi, The yagawin-lat yazawin – gyok లలో కూడా ‘తలైంగాన’ పదం కనిపిస్తుంది.
17వ శతాబ్దానికి చెందిన Kon-Tson-Yu రాసిన ‘Ton che fang yn kiyao’లో పెగును ఆగ్నేయలో ఉన్న ప్రజలను To-leng అనేవారని, వీరే Talaing లనీ రాశాడు. వీరు క్రీ.శ. 1610లో చైనీయులతో చేతులు కలిపి బర్మా వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ‘SOAS బర్మా రీసెర్చి బులెటిన్’లో కూడా ‘The derivation of phrase which makes it (Taling) come from telinga – kalinga is no doubt the right one’ అని తీర్మానించింది. జర్నల్ ఆఫ్ ది బర్మా రీసెర్చి సోసైటి Vol II Part II page 246లో క్రీ.శ. 1082కు చెందిన శాసనంలోనూ ‘తలైంగ్’ అనే పదం ఉందని నిరూపించారు.
అంటే బర్మాపై పరిశోధిస్తున్న చరిత్ర పరిశోధకులు తలైంగన అన్న పదం కళింగ ప్రాంతానికి చెందినదని భావిస్తున్నారు తప్ప వారి దృష్టిలో ‘తెలంగాణ’ అన్నదే లేదని అర్థమవుతుంది. కాబట్టి ఈ కథలో రచయిత్రి ఊహించి ఆ ఊహను నిర్థారించినట్టు ‘తలైంగన’ ‘తెలంగాణ’ అని నమ్మటం కష్టం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం ఇది వాస్తవ చరిత్ర ఆధారిత ‘ఊహ’ కాదు.
ఇక రచయిత్రి ప్రస్తావించిన జోల పాటను పరిశీలిద్దాం.
Khin May Aung 2015లో ‘International conference on Burma/ Myanmar Studies’ లో Historical Perspectives on Mon Settlements in Myanmar’ అని ఒక పత్రం సమర్పించారు. ఆ పత్రంలో Mon లు Mon-Khmer stock of Austro-Asiatic sub-family కి చెందిన వారని ప్రస్తావించారు. వాళ్ళు మంగోలు నుంచి బర్మా వచ్చారని అభిప్రాయపడ్డారు. “Originally Mon and Khmer were one and the same people” అని ప్రస్తావించారు. “The Mon migrated from the valley of the Yangtze Kiang to the south west along the rivers of Mekong, Thanlwin and Ayeyarwaddy inhabited mostly lower Myanmar and lower Thailand” అన్నారు. అంటే Mon లు తరువాత భారతీయులతో కలిసిపోయినా వారి పుట్టుక మాత్రం భారతీయం కాదన్నమాట.
Mon అన్న పేరు క్రీ.శ 6 - 7 శతాబ్దాలకు చెందిన థాయ్‍లాండ్ శాసనాలలో లభించింది. Raman, Rmman గా ప్రస్తావించిన ఈ ప్రాంతం 10వ శతాబ్దంలో ‘రమణ్య’ అయింది. క్రీ.శ 1012లోని శాసనంలో Rmen అయింది. 15వ శతాబ్దంలో ‘రమన్’ అయింది. Rmen, Rman, నుంచి Mon వచ్చిందని భావిస్తున్నారు. అంటే Mon లని ‘మన్’ అని కథలో రాసినా, ఈ Mon ల పూర్వీకులు సంపూర్ణంగా భారతీయులు అని నిర్థారించే వీలులేదు. దాంతో వీరంతా తెలంగాణ వారు అని, ఆంధ్రులు అని, బర్మా చరిత్రలో తెలుగు ‘మగాడు’ ప్రధాన పాత్ర పోషించాడని తీర్మానించటం హాస్యాస్పదమే కాదు అనృతం, అనౌచిత్యం కూడా. దీన్ని రచయిత్రి చెప్పిన జోల పాటనే కాదు చెప్పని జోల పాటలు కూడా నిరూపిస్తాయి.
Mon లలో ప్రాచుర్యం పొందిన జోల పాటలు తాటి ఆకుల మీద రాసి లభ్యమయ్యాయి. వీటిలో భారతీయులను స్ఫురింపచేసే పాటలు మూడు ఉన్నాయి. ఈ మూడు భారతదేశం నుంచి బర్మాకు వచ్చి స్థిరపడ్డ మూడు విభిన్నమైన ప్రాంతాల వారికి చెందినవి.
వీటిలో మొదటి జోలపాట ‘Mon danng’ కు చెందినది.
Hi Le Yole! From the banks of river Ganges
law and country of the Mons
We, the Mon danng, for our part cross of over the sea and
reached Lagon Tikumbha city
Due to our deeds done in the previous lives and according to our fate,
We have been separated from our parents,
in what year and what time,
shell we return to our original place of abode?
Oh! my beloved son!
ఈ జోల పాట పాడింది గంగానది ప్రాంతం నుంచి వచ్చిన వారని తను స్వదేశానికి దూరమవటం దురదృష్టకరమని భావిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది.
రెండవ జోల పాట Mon da కు చెందినది.
Hi Le Yole!
From the mouth of the river Godavari
The country and place of Mons
The coast of Coromandal at the shore of the sea is
our original region
Being without a king and because of the past acts
performed in the former existences
We have to be parted and come over to
smang island (Bilngyun)
on the flank of zaya (mudon) country side
Oh! my beloved Son!
‘కోరమండల్ తీరం’ అంటే మలబారు, శ్రీలంక, కావేరీ డెల్టా ప్రాంతాలు వస్తాయి. వీరు బహుశా కృష్ణా, గోదావరీ తీరానికి , తమిళనాడు, శ్రీలంక, కేరళ ప్రాంతాలకు చెందిన వారై ఉంటారు. వారి రాజు యుద్ధంలో ఓడిపోయి ఉంటే శత్రువుల నుంచి తప్పించుకుని తీరం వెంబడి ప్రయాణించి బర్మా చేరుకుని ఉంటారు. ఈ పాటలో వారు బర్మాలో చేరిన ప్రాంతాలు కూడా ప్రస్తావించటంతో వారు ప్రయాణించిన మార్గాన్ని ఊహించే వీలు కలుగుతుంది.
మూడో గీతం Mon na కు చెందినది.
Heh! from our beloved realm Tilangana
The Mon land.
The king being poor in merit and defeated
we fled hastily in eastern direction
and reached Donwun, the laterite land mark
which was the old country side of the barbarians milikkha
a young man suddma by name,
lead the way and we have come over here,
Oh! my beloved Son!
ఈ గీతం ప్రకారం తమ రాజు బలహీనుడై ఓడిపోగా ‘సుద్మ’ అనే యువకుడిని అనుసరించి వీరు బర్మా చేరారని తెలుస్తోంది. తెలింగాన అన్నది కళింగులను సూచిస్తుందని చరిత్ర పరిశోధకుల అభిప్రాయం. అంటే గంగా నది, గోదావరి నది, మలబారు తెలింగన ప్రాంతాల నుంచి భారతీయులు బర్మా వచ్చి చేరారని తెలుస్తోంది. వీరికన్నా ముందు అశోకుడు పంపిన బౌద్ధమత ప్రచారకులు, అంతకుముందు గంగా నది ప్రాంతాల నుండి భారతీయులు బర్మా వచ్చి చేరారు. ఇంకా శ్రీలంక నుండి బౌద్ధులు, శ్రీలంకలోని తమిళులు బర్మాలో స్థిరపడ్డారు. ఇది చరిత్ర. ఇదంతా వదిలి ఒక్కపాటలో ఒక్క పదం పట్టుకుని, అదీ రాణి పాడినట్టు ఒక్క వాక్యంలో రాసి, తెలంగాణ/తెలుగు వారే బర్మాను పాలించారని తీర్మానించటం ఏ రకంగానూ సమంజసం కాదు. ఔచిత్యం కాదు. తర్కబద్దం కాదు. అలాగయితే, ఇదే వాదన ప్రకారం, గంగా నదీ తీరంవారూ, కోరమాండల్ ప్రాంతంవారూ మేమే Mon లము, మేమే పాలకులము అనవచ్చు. నిజానికి ఈ రచయిత్రి కథలో చూపిన చరిత్ర అసలు బర్మా చరిత్రకూ తేడా ఉందని నిరూపించాలంటే బర్మా చరిత్రను మొదటి నుంచీ చెప్పాల్సి వస్తుంది. ఈ కథ చదువుతూంటే ఓ సందర్భంలో రచయిత్రి కళ్ళు మసకబారినట్టే బర్మా చరిత్రతో పరిచయం ఉన్న పాఠకుల కళ్ళు కూడా మసకబారతాయి. కానీ కారణం వేరే!
ఇంకా బర్మా చరిత్రలో అనేక వైరుధ్యాలున్నాయి. వాదవివాదాలున్నాయి. ముఖ్యంగా బ్రిటీష్ వారు బర్మాపై ఆధిపత్యం సాధించి బర్మాలోని వివిధ తెగల నడుమ వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు కావాలని రచించిన చరిత్ర, తీర్మానాల విషయాల్లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బర్మా చరిత్రలోని ఈ వివాదాలు తెలుసుకుంటే, మన దేశ చరిత్రతో బిటీష్ వారు చేసిన అకాండ తాండవాల్ని , వాటిని పరిశోధనల ద్వారా కోట వెంకటాచలం, సృజనాత్మక రచనల ద్వారా విశ్వనాథ వంటి వారు ఎదుర్కొన్న విధానం తెలుస్తుంది.
చరిత్ర ఆధారిత కాల్పనిక రచన ఆషామాషీ కాదు. ఎంతో జాగ్రత్తగా అన్ని అంశాలను పరిశీలించి రాయాల్సి ఉంటుంది. కథకు ఒక లక్ష్యం ఉద్దేశం ఉండాలి. ఈ కథ ఉద్దేశం ఏమిటని పరిశీలిస్తే తెలుగు వారి గొప్పతనం చెప్పాలని, బర్మా ఔన్నత్యం తెలుగువారి (తెలంగాణ వారి) చలవ అని ఆనందబాష్పాలతో నిరూపించి చూపించాలని అనిపిస్తుంది. అదే ఈ కథ లక్ష్యం అయితే కథ అందులో విఫలమవటమే కాదు చారిత్రక రచనను అభాసుపాలయ్యే ప్రమాదంలోకి నెట్టిందనిపిస్తుంది. దీనికి తోడు తెలుగు సాహిత్యంలో వాస్తవిక చారిత్రక రచనలు లేని లోటును పూరించే ప్రయత్నంలో భాగం కాలయంత్రంలోని కథలు అన్నమాటను గుర్తు తెచ్చుకుంటే ఈ ‘మగాడు’ ఆ ‘మా గేడు’ కాదని, నిజంగా ‘మగాడు’ కాదని ఇలాంటి ‘మగాడు’ ఏ రకంగానూ వాస్తవిక చారిత్రక కథ కాదని స్పష్టం అవుతుంది. అలాంటి sweeping statements తో , ఇలాంటి కథలతో వేదికమీదకు రావటమే తెలుగు సాహిత్య ప్రపంచంలో నెలకొన్న పరిస్థితికి దర్పణం పడుతుంది. తెలుగు విమర్శకుల స్థాయి పట్ల ఉన్న విశ్వాసం , తెలుగు పాఠకుల పట్ల ఉన్న గౌరవానికి , గొప్ప అభిప్రాయానికి నిరూపణగా నిలుస్తుంది.
అయితే బర్మా చరిత్రలోని రెండు కీలకమైన ఘట్టాల ఆధారంగా భవదీయుడు ఈ సంకలనం ప్రచురితమయ్యేందుకు నాలుగు సంవత్సరాల ముందే రెండు చరిత్ర ఆధారిత కాల్పనిక కథలు రాశాడు. బర్మా దేశ పితగా భావించే అనిరుద్ధదేవ గాథ ధర్మపథగామి, బర్మాలో థేరవాడ బౌద్ధాన్ని వ్యాపింపచేసిన అనాహర్త షిన్ అర్హాన్ ల గాథ ‘చరిత్ర పుటల్లోంచి’ అనే కథల సంపుటిలో ఉన్నాయి.
మిగతా కథల విశ్లేషణ వచ్చేవారం.