మా బాల కథలు-15

0
3

[dropcap]బా[/dropcap]ల అందమైన ఏడేళ్ళ పాప. అందమైనదే కాదు, తెలివైనది కూడా. వయస్సు రీత్యా కొంత అమాయకత్వమూ ఉంది. అన్నీ తనకు తెలుసుననుకుంటుంది. అంతే కాదు, అన్నిటి లోనూ తల దూర్చి అందరికీ సలహాలు కూడా ఇస్తుంది. ఆ బాల చేసిన పనుల్లో కొన్ని కథల్లాగా చెప్పచ్చు. అందులో ఇది ఒకటి.

బాల కోరిక

బాలమ్మ గారి ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది. కారణం నాలుగు రోజులుగా బాలమ్మ గారికి జ్వరం. ఆవిడ మందలింపులు, సూచనలు, సలహాలు, అప్పుడప్పుడు కేకలు లేక ఇల్లు చిన్నబోయింది. ఆ సందులోని వారికి కూడా వెలితి గానే ఉంది. మధ్యాహ్న కాలక్షేపాలు ఉండవు కదా.

బాలమ్మ గారికి ఓ వింత అలవాటు ఉంది. ఎంత అనారోగ్యమైనా పథ్యం చేయదు. డాక్టర్ చెప్పినా వినదు. అనుకున్నవన్ని అడిగి చేయించుకుని తినేస్తుంది.

బాలమ్మ గారు ఉత్తప్పుడు ఏమీ తినదు, కానీ జ్వరం వచ్చినప్పుడు మాత్రం రకరకాల కోరికలు కోరుతుంది. అందులోను కష్టమైన అరిసెలు, సున్నుండలు, బొబ్బట్లు లాంటివి. భోజనము లోను అంతే. రకరకాలు ఉండాలి.. దానితో శాంతకి, చిన్నకోడలు రూపకి ఎంత చేసినా పని తెమిలటం లేదు. ఎందుకంటే అప్పుడు మిక్సీ లాంటివి లేవు. రుబ్బటం, దంచటం, విసరటం అన్నీ స్వయము గానే చెయ్యాలి.. అనారోగ్యంతో ఉన్న మనిషి అడిగితే కాదనలేరు కదా.. అందులోను అడిగేది అత్తగారూ బాలమ్మగారు. ..అందుకని తినకూడదని తెలిసినా తప్పనిసరిగా చేసేవారు.

మరో సమస్య ఏమిటంటే అడిగిందని ఆమెకే చేసి ఊరుకోలేరు కదా అందరికి చెయ్యాలి. పెద్ద కుటంబం కదా. భారీ ఎత్తున చెయ్యాలి. అందుకే వాళ్లకి పని తెమిలేదే కాదు.

కోడళ్ళే కాక చూడటానికి వచ్చే చుట్టూ పక్కల వారు, బాలమ్మ గారి సంగతి తెలిసిన వారు కూడా వాళ్ళ ఇంటిలో చేసినవి ఏదో ఒకటి తెచ్చేవారు. అవి మాత్రం బాలమ్మ గారికి, బాల వరకే ‘పరిమితం’.

బాలది నాయనమ్మలాగే అప్పటినుంచే జాలి మనస్సు. ఎవరికైనా బాగా లేకపోతే మంచినీళ్ళో పాలో అందించటమో కాళ్ళు తొక్కడమో ఇలా తనకు చేతనయిన సేవ చేసేది. అందువల్ల బాలమ్మ గారి దగ్గర ఉండటం వల్ల నాయనమ్మ ఎవరేది ఇచ్చినా బాలకి కూడా ఇచ్చేది..

బాలమ్మ గారిది మంచి ఆరోగ్యం. సాధారణముగా జబ్బు పడదు. పడినా ఒక రోజో, మహా అయితే రెండు రోజులు. పథ్యం ఏమాత్రం పాటించకున్నా కూడా తగ్గిపోయేది.

ఈసారి మాత్రం వారం రోజులయినా తగ్గలేదు. ఇంటిలో వారికీ, ఇరుగు పోరుగుకీ కూడా ఆమె పడుకోవటం బాధగా ఉంది. ఎందుకంటే బాలమ్మ గారి మాట కురుకు గానీ మనసు మంచిది. అందరి బాగోగులు చూస్తుంది.

ఆరోజు అత్తగారి జ్వరం త్వరగా తగ్గిపోవాలని కోరుకోవాలని గుడికి బయలు దేరింది రూప. వెళ్లబోయే గుడి అమ్మ వారు చాలా మహిమ కలదని పేరు.

రూప, శాంతకి కావలసిన సాయం చేసి బుట్టలో అన్నీ పెట్టుకుని బయలుదేరింది. బాల తను కూడా పిన్నితో పాటు గుడికి వెళ్తానని బయలుదేరింది. బాలకి భక్తీ ఎక్కువే.

ఇద్దరూ గుడినుంచి వచ్చేసరికి నాన్న వచ్చేసాడు. తండ్రిని చూసి పరిగెత్తుకు వచ్చింది.

నాన్న దగ్గరకు తీసికుంటూ “ఏమికోరుకున్నవురా దేముణ్ణి? కొత్త బట్టలా? మంచి మార్కులా?” అని అడిగాడు.

“అవి కాదు” అంది బాల.

“మరి?”

“నాన్నమ్మ గురించే కోరుకున్నాను.”

“ఏమని జ్వరం త్వరగా తగ్గిపోవాలనా?” అడిగాడు మురిపెముగా.

“కాదు త్వరగా తగ్గకూడదని, ఇంకా బోలెడన్ని సార్లు జ్వరం రావాలని కోరాను.”

నాన్న తెల్లబోయాడు “అలా కోరచ్చా, తప్పుకదా” అన్నాడు మందలింపుగా.

“మరి అప్పడే కదా బోలెడన్ని అప్పచ్చులు చేస్తారు” అంది.

నాన్న అమ్మ వైపు చూసాడు. బాలకి తగిన రీతిలో అలా కోరడం తప్పని తెలియ చెప్పమని ఆ చూపు అర్థం. అమ్మకి మరో సమస్య. అయితే ఈసారి బాల అమ్మకే కాక దేముడికీ సమస్య తెచ్చింది.

బాల కోరిక తీర్చాలా? పిన్ని కోరిక తీర్చాలా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here