[dropcap]22[/dropcap]-09-2021న శ్రీమతి దుర్గా ఖోటే వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.
***
మూకీ సినిమాలతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి, స్టూడియో ఒప్పందాన్ని విజయవంతంగా రద్దు చేసుకోగలిగిన తొలి నటిగా రికార్డు సృష్టించి/హిందీ సినిమా రంగంలో తొలి నిర్మాత్రి, దర్శకురాలుగా, ప్రకటన చిత్రాల నిర్మాత్రి అయిన తొలి మహిళగా పేరుపొంది/హిందీ, మరాఠీ, గుజరాతీ, చిత్రాలలో కథానాయిక, తల్లి, అత్త, బామ్మ పాత్రలలో వైవిధ్యతను ప్రదర్శించి/సమాంతరంగా రంగస్థలం మీద రాణించిన ప్రముఖ నటీమణి/టి.వి. సీరియల్ నిర్మాతగాను మెప్పించిన మహిళామూర్తి/దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత శ్రీమతి దుర్గాఖోటే.
ఈమె 1905 జనవరి 14వ తేదీన నాటి బొంబాయి ప్రెసిడెన్సీలోని బొంబాయిలో జన్మించారు. ఈమె మాతృభాష కొంకణీ. తల్లి మంజులాబాయి, తండ్రి పాండురంగశ్యామలరావు లాడ్‍లు. అసలు పేరు వీటా లాడ్. తల్లిదండ్రులకు విద్య అంటే ఇష్టం. అందుకే కుమార్తెను కాథడ్రెల్ హైస్కూల్‌లో మాధ్యమిక విద్యని, సెయింట్ గ్జేవియర్ కాలేజిలో డిగ్రీ చదువును చదివించి, ఉన్నత విద్యావంతురాలిని చేశారు.
ఇంజనీర్ విశ్వనాథ్ ఖోటేతో ఈమె వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు మగపిల్లలు. సంతోషంతో హాయిగా సాగిపోతున్న సంసారం విశ్వనాథ్ మరణంతో కష్టాలపాలైంది.
ఉమ్మడి కుటుంబంలో పిల్లలతో సహా అత్తగారింటి మీద ఆధారపడడం ఇష్టం లేకపోయింది. సినిమా నటనవైపు దృష్టి సారించారు. ఈమె సోదరి షాలిని సినీ నిర్మాత జె.బి.హెచ్.వాడియా స్నేహితురాలు. షాలిని అక్కను సినిమాలలో నటించేందుకు ఒప్పించింది. ఈ విధంగా 1931 ప్రభాత్ ఫిలిమ్ కంపెనీ సినిమా ‘ఫరేబీ జాల్’లో చిన్నపాత్రను ధరించి హిందీ సినిమా రంగంలో ప్రవేశించారు. తరువాత ‘మాయామశ్చీంద్ర’లో రాణిగా రాణించారు.
1932లో ద్విభాషా చిత్రం ‘అయోధ్యెచా రాజా’ సినిమాలో తారామతిగా కథానాయిక పాత్రలో జీవించి ఉవ్వెత్తున తారాస్థాయికి చేరుకున్నారు. ఈ చిత్రం హిందీ, మరాఠీ భాషలలో విడుదలయింది. మరాఠీ బాషలో తొలిటాకీ సినిమా ఇది.
ఆరోజుల్లో నటీనటులకు నిర్మాణ సంస్థలతో లిఖిత పూర్వక ఒప్పందాలుండేవి. వాటి ప్రకారం ఆయా నిర్మాణ సంస్థలలోనే నటించాలి. బయటి సంస్థ చిత్రాలలో నటించాలంటే ఒప్పందం చేసుకున్న సంస్థ అనుమతి తప్పనిసరి. అయితే ఆ ఒప్పందాల నుండి బయటకు వచ్చి ఇతర సంస్థలలో నటించిన తొలినటిగా దుర్గా ఖోటే రికార్డు సృష్టించారు.
కలకత్తాకు చెందిన న్యూ థియేటర్స్ ఈస్టిండియా ఫిలిమ్ కంపెనీ, విజయభట్‌కి చెందిన ప్రకాష్ పిక్చర్స్ వారి సినిమాల కోసం పనిచేశారు.
పురుషులు స్త్రీ పాత్రల ద్వారా ప్రాచుర్యం పొందిన రోజులలో స్త్రీ పాత్రలలో నటించడానికి ధైర్యం చేశారామె. అంతేకాదు తన తరువాత నటీమణులకు మార్గదర్శిగా నిలిచారు.
ముఖ్యంగా ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే పాత్రలు ధరించే అవకాశం లభించడం ఆమె అదృష్టం. మహిళా సాధికారతని, ఆదర్శ మహిళల మనస్తత్వాన్ని చిత్రీకరించిన పాత్రలు ఈమె పోషించిన తీరు అద్వితీయం. కథానాయిక పాత్రల నుండి గుణచిత్రనటిగా మారి కాలానుగుణంగా, వయసుకి తగిన పాత్రలు ధరించి వైవిధ్యభరిత నటిగా పేరు పొందారు.
అయోధ్యెచా రాజాలో తారామతిగా, రాజారాణిలో మీరాగా, సీత సినిమాలో సీతగా, అమర్ జ్యోతిలో సౌదామిని, నర్సీ భగత్ (గుజరాతీ, హిందీ ద్విభాషా చిత్రం) లో మానిక్ బాయ్‌గా, గీతలో దుర్గగా, భరత్ మిలాప్‌లో కైకేయిగా, హైద్రాబాద్ కీ నజ్‌నీన్‌లో మిసెస్ జ్వాలా ప్రసాద్, మీర్జాగాలిబ్ లో అమ్మగా, మొఘల్-ఎ-ఆజమ్‌లో జోధా బాయిగా, బాబీలో అమ్మమ్మగా, బిదాయ్‌లో పార్వతిగా, కర్జ్‌లో తల్లిగా చాలా చాలా ప్రముఖ పాత్రలలో నటించారు.
1983లో ‘దౌలత్ కీ దుష్మన్’ ఈమె నటించిన చివరి సినిమా.
ఈ విధంగా సాంఘిక, రాజకీయ, చారిత్రక, పౌరాణిక పాత్రలలో నటించి, జీవించి ఆయా చిత్రాలను సుసంపన్నం చేసి, భారతీయ సినిమా చరిత్రలో సజీవంగా ఈ నాటికీ నిలిచారు.
సాత్విక పాత్రలు, గడసరి పాత్రలు, అసూయపూరిత పాత్రలు, ప్రతికథానాయికగా విలనిజం పండించిన పాత్రల ద్వారా ఆమె భారతీయ సినిమా చరిత్రలో నిలిచారు. ముఖ్యంగా హిందీ, మరాఠీ, గుజరాతీ సినిమాలను సుసంపన్నం చేశారు.
1980 తరువాత దుర్గా ఖోటే ప్రొడక్షన్స్‌ను స్థాపించారు. ఈ బ్యానర్ పైన లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు, యాడ్స్ (ప్రకటనల) చిత్రాలను నిర్మించారు. యాడ్స్ నిర్మాణంలో పాల్గొన్న విజయవంతమయిన వ్యాపారమహిళగా పేరు పొంది చరిత్రను సృష్టించారు.
దూరదర్శన్ వారి టి.వి. సీరియల్ నిర్మాణంలోనూ ప్రవేశించారు. ‘వాగ్లీకి దునియా’ సీరియల్‌ను నిర్మించారు. 1988 నుండి 1990 వరకు ఆమె ఆధ్వర్యంలో నిర్మాణం జరిగింది.
ఈమెకు రంగస్థలం మీద మక్కువ ఎక్కువ. మరాఠీ రంగస్థలం మీద పలు నాటికలలో వైవిధ్యమైన పాత్రలను ధరించారు. 1954లో షేక్‌స్పియర్ ప్రసిద్ధ నాటకం ‘మాక్‍బెత్’ మరాఠీ అనుకరణ ‘రాజ్ ముకుట్’లో లేడీ మాక్‌బెత్‌గా నటించి జీవించి మెప్పించారు.
‘ముంబై మరాఠీ సాహిత్య సంఘం’ తరపున అనేక నాటికలను ప్రదర్శించారు. ఆ సంఘంతో ఆమెకు అవినాభావ సంబంధముంది.
IPTA (INDIAN PEOPLE’S THEATRE ASSOCIATION) తో ఈమెకు మంచి సంబంధాలుండేవి. శ్రీయుతులు బాలరాజ్ సహాని, పృథ్వీరాజ్ కపూర్, కె. అబ్బాస్ వంటి ప్రముఖులతో కలిసి ఈ సంస్థ కార్యకలాపాలలో పాలు పంచుకున్నారు.
ఈమెకు అనేక పురస్కారాలు లభించాయి. 1958లో సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. బెంగాల్ ఫిలిమ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (BFJA) వారి అవార్డులు రెండు సార్లు ఈమెను వరించాయి. ‘చరణోంకి దాసి’కి 1942లో, భరత్ మిలాప్’కి 1943లో లభించాయి. 1975లో ‘బిదాయ్’ లోని నటనకు ఫిలిమ్‌ఫేర్ అవార్డు లభించింది. 1968లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం లభించింది. 1970లో మహారాష్ట్ర ప్రభుత్వం వారి పురస్కారం లభించింది. 1983లో భారతీయ హిందీ సినిమా ప్రపంచంలో అత్యన్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఈమెను వరించింది. ఈ విధంగా ఈమె భారతీయ సినిమా రంగానికి చేసిన సేవలకు సరయిన ఫలితాన్ని దక్కించుకున్నారు.
ఇండియాటుడే మిలీనియం ప్రత్యేక సంచికలో 100 మంది ప్రముఖులను గురించి ప్రస్తావించారు. వీరిలో ఈమె పేరును నమోదు చేసి గౌరవించారు. ఇది కూడా భారతీయ సినిమా చరిత్రలో ఈమెకు గల ప్రముఖ స్థానాన్ని తెలియజేస్తుంది.
ఈమె వైవిధ్యభరితమైన తల్లి పాత్రలతో ఆయా సినిమాలను సుసంపన్నం చేశారు. తల్లి ప్రాతలకు పేరు పొందిన తొలి పది మంది నటీమణులలో ఈమె స్థానం అజరామరం.
తన ఆత్మకథను మరాఠీ బాషలో ‘మీ-దుర్గా ఖోటే’గా వెలయించారు. దీనినే ఆంగ్లభాషలో ‘I DURGA KHOTE’ గా వ్రాశారు.
1991 సెప్టెంబర్ 22వ తేదీన ముంబైలో మరణించారు. ఆమె వారసులు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె పేరు ప్రఖ్యాతులకు మరింత సొబగులని చేకూర్చి ఋణం తీర్చుకుంటున్నారు. మనవళ్ళు రవి, దేవెన్, మనవరాలు అంజలిఖోటేలు నటులుగా, నిర్మాతలుగా పేరు పొందారు. విశ్వనాధ్ ఖోటే సోదరుని పిల్లలు విజు ఖోటే, శుభ ఖోటేలు కూడా నటీనటులుగా పేరు పొందారు. ఈ విధంగా దుర్గా ఖోటే వంశస్థులు భారతీయ సినిమా రంగంలో కొనసాగుతూ ఆమె గౌరవాన్ని నిలబెట్టడం విశేషం.
ఈమె జ్ఞాపకార్థం 2013 మే 3వ తేదీన 5 రూపాయల విలువతో ఒక స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ. స్టాంపు మీద ఎడమవైపున కైకేయి పాత్రధారిణిగా దుర్గా ఖోటే కనిపిస్తారు. కుడివైపున నవ్వులొలికించే దుర్గా ఖోటే దర్శనమిస్తారు. ‘నూరేళ్ళ భారతీయ సినిమా సిరీస్’లో విడుదలయిన 50 స్టాంపులలో ఈమెకి స్థానం కల్పించి గౌరవించింది భారత తపాలాశాఖ.
సెప్టెంబర్ 22వ తేదీ వీరి వర్ధంతి సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet