[box type=’note’ fontsize=’16’] తెలుగులో అక్షర దోషాలు, ఇతర తప్పులు లేకుండా ఎలా వ్రాయవచ్చో ఈ శీర్షిక ద్వారా తెలియజేస్తున్నారు శ్రీమతి నండూరి సుందరీ నాగమణి. [/box]
~
[dropcap]ఈ[/dropcap]రోజు మనం, కథారచనలో ‘పురుష’ల గురించి తెలుసుకుందాం.
కథను వ్రాయటం మూడు రకాలుగా ఉంటుంది. అవి కథకుడు తానే ఒక పాత్రగా మారి ‘నేను’ అంటూ చెప్పటం. దీనినే ‘ఉత్తమ పురుష’ అని అంటారు.
రెండవది ‘మధ్యమ పురుష’. ఇందులో కథకుడు ఎదుటి వ్యక్తిని (నీవు) సంబోధిస్తూ కథంతా నడిపిస్తాడు. ఇందులో పాత్రలు తక్కువగా ఉంటాయి. లేఖాసాహిత్యం మధ్యమ పురుషకు ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు.
మూడవది, సాహిత్యంలో ఎక్కువగా ప్రాచుర్యము పొందినదీ ‘ప్రథమ పురుష’. అనగా కథకుడు, వివిధ పాత్రల ద్వారా కథను నడిపిస్తాడు. ఇక ‘నేను’, ‘నీవు’ అనేవి పాత్రలుగా రావు. అతడు, ఆమె, సుబ్బారావు, సంధ్య, రాగిణి, సుధాకర్ – ఇలా పాత్రలు వివిధ నామాలతో ఉంటాయి.
ఈ ‘పురుష’లను స్థూలంగా ఇలా గుర్తు పెట్టుకోవచ్చు.
‘నేను ఉత్తముడను, నీవు మధ్యముడవు, వాడు ప్రథముడు.’
లేదా,
‘నేను ఉత్తమ, ఎదుటి వ్యక్తి మధ్యమ, ఈ రెండూ కాని వివిధ వ్యక్తులు ప్రథమ.’
ఈ కథనం చూడండి.
“ఇప్పుడేమైంది? వాళ్లకి మర్యాదలలో ఏం లోటు చేసాను?” చాకుని బంగాళాదుంప మీద కసా కసా ప్రయోగిస్తున్న నా గొంతు నాకు తెలియకుండానే కరుకుగా పలికింది. (ఇవి నా ‘నారికేళం’ అనే కథలోని నాయిక ‘అపూర్వ’ పాత్ర పలికే మాటలు. ఈ అపూర్వ ‘నేను’ అంటూ, ఉత్తమ పురుషలో కథను చెబుతుంది.)
‘నన్ను నేను నియంత్రించుకొంటూ, “సారీ లహరీ…” అని చెప్పాను.’ (ఇవి నా ‘బెస్ట్ ఫ్రెండ్’ కథలోని సుజిత్ మాటలు. ఇతడు ‘నేను’ అంటూ కథను మొదలు పెట్టి, కొనసాగిస్తాడు.)
పైవి రెండూ ఉత్తమ పురుషకు ఉదాహరణలు.
“ప్రియమైన సరళకు,
నేను క్షేమము. నీవు బాగున్నావని తలుస్తాను. పండక్కి చీర కొనుక్కోవటానికి అప్పుడు మనం షాపింగ్‌కి వెళ్ళినపుడు ఏం జరిగిందో గుర్తుందా నీకు? నేను నిన్ను ఆరెంజ్ కలర్ చీర తీసుకోమంటే, “వద్దు వదినా! సన్యాసినిలా ఆ చీరేం బాగుంటుంది?” అన్నావు. అదే రంగు చీర పెళ్ళిలో మీ అత్తవారు పెడితే ఎంత మురిసిపోయావో. పైగా సెలెక్షన్ మీ శ్రీవారిదంటూ పదిసార్లు నాతో చెప్పావు కదా! ఇంతలోనే మీ మధ్య పొరపొచ్చాలేమిటమ్మా? విడిపోయేంత పెద్ద గొడవలేమిటి?”
ఇలా సాగే లేఖను మధ్యమ పురుషలో ఉందని చెప్పవచ్చు
‘పక్కనున్న రిమోట్ తో టీవీని ఆపేసి, కళ్యాణిని గుండెల్లో పొదువుకొని ఆమె వీపు తట్టుతూ మౌనంగా సముదాయించసాగాడు, విష్ణు. ఆమె దుఃఖోధృతి కాస్త తగ్గిన తరువాత, ఆమె కనులు తుడిచి, గ్లాసు నిండా మంచినీళ్ళు పోసి తాగించాడు.’ (నా కథ ‘రాలిన పువ్వులు రెండు – పూచే గుత్తులు మూడు’ లోని ఘట్టమిది.)
ప్రథమ పురుషకు చక్కని ఉదాహరణ, ఇలాంటి ఎన్నో కథలు. ఇందులో పాత్రలన్నీ, ‘నేను’ ‘నీవు’ కాకుండా మూడవ వ్యక్తులే. అవే కథను నడిపిస్తాయి.
పురుషల గురించిన మరిన్ని విషయాలు వచ్చే వారం ముచ్చటించుకుందాము.
*