[box type=’note’ fontsize=’16’] సిరికోన సాహిత్య విరికోన. ఈ సాహితీ సిరికోనలో నిరంతరం సాహిత్య చర్చల విరిజల్లు కురుస్తూంటుంది. ఆ జల్లులోంచి కొంత సాహిత్య సుగంధ రజాన్ని సంచిక సాహిత్యాభిమానులకోసం ఏర్చి కూర్చి అందిస్తున్నారు డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ. [/box]
‘గాసట బీసట’
చర్చ : ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, బులుసు, ఉప్పలధడియం, పాలడుగు, జీఎల్లెన్
వ్యాస నివేదన : ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ
~
[dropcap]పా[/dropcap]త మాటలు: వాటి అర్థాలు చర్చకు వస్తే చాలు, ఇక మా సిరికోనలో ముచ్చట్లే ముచ్చట్లు!! అందులో ‘గాసట బీసట’ లాటి మాటల విషయం వస్తే ఇక చెప్పవలసిన పనేముంది? అందునా ఆచార్య కోవెల సుప్రసన్న వంటి వారు, ఈ మాటల అర్థమేమిటో ఆలోచించమని మా పేర్లు పెట్టి మరీ చెబితే, ఇక మా ఉత్సాహానికి అడ్డుకట్ట ఏముంది?
ఆ మధ్య మార్చినెలలో అదే జరిగింది.
“భాసుర భారతార్థములభంగుల నిక్కమెఱుంగ నేరమిన్
గాసటబీసటే చదివి గాథలు త్రవ్వు తెనుంగు వారికిన్
వ్యాసముని ప్రణీత పరమార్థము తెల్లగఁ జేసినట్టి య
బ్జాసన కల్పుల” (= అంటే బ్రహ్మదేవునితో సమానులైన)
నన్నయ తిక్కనార్యులకు మొక్కుతూ ఎఱ్ఱన గారు చెప్పిన పద్యంలో సుప్రసిద్ధమైన మాటలు — ఈ ‘గాసటబీసట’లు. ఒక రకంగా అవి తెలుగువారి కీర్తికి బావుటాలుగా నిలిచిపోయిన జాతీయాలు. నాటికే మన మేధాసంపత్తి అలా ఉంది మరి!!
ఈ మాటల అర్థం ఏమిటి? ఆలోచించండి అన్నారు ఆచార్య సుప్రసన్న గారు.లు.
‘సలక్షణము కాని చదువు’ అని అర్థం చెబుతోంది శబ్దరత్నాకరం. బ్రౌణ్యం (తె-ఆం) అయితే మరింత సూటిగా ‘గందరగోళము’ ‘ పనికిమాలిన సంగతులు’ అని చెబుతూ, ఆంగ్లంలో నైతే రబ్బిష్-‘ rubbish’ అనేసింది…
“మహామహోపాధ్యాయ నిడదవోలు వెంకటరావు గారు కాబోలు, ‘గాసట’ అనేది గాథాసప్తశతికి, ‘బీసట’ అనేది బృహత్కథకు సంకేతాలుగా ఉంది అన్నారని, అది అంత సమంజసం కాదేమోనని, అలాగే అంతకు మునుపు శాసనాల్లో కనిపించే తెలుగు రసవంతమైన తెలుగు కాదనే భావంతో ఆ మాటలు వాడారా? అనేదీ ఆలోచించవలసి ఉంద”ని ఆచార్య సుప్రసన్న గారు ఆదేశించారు.
….శాసనాల్లో తెలుగు రాజకీయ శాసన ప్రచారానికి మాత్రమే ఉద్దేశించింది కనుక, దానికీ రసవత్తతకు ఆచార్యులవారే అనుమానించినట్లు సంబంధమే లేదు. పోతే, ఇందులో గాథ శబ్దం వచ్చిందనేమో నిడుదవోలు గారి దృష్టి గాథాసప్తశతి వైపు వెళ్ళింది. తోడుకు బకారానికి బృహత్కథను కలిపారు… వాటిని చదివే, ఆ అరకొర జ్ఞానంతో, నాటివారు గాథలు తవ్వేవారని వారి ఉద్దేశ్యం… చమత్కారంగా బాగుంటుంది కానీ, ఇక్కడ ఎఱ్ఱన చెబుతున్నది భారతార్థాన్ని గూర్చి కదా! అంత అనన్వయంతో సెలవివ్వడు కదా ప్రబంధ పరమేశ్వరుడు!
జాతీయులుగా నిలిచిపోయిన మాటల అర్థం తెలుసుకోవాలంటే నిఘంటువులు చూడటం కంటే, వాటికి అలవాటు పడ్డ నవీన విద్యాచంద్రులను అడగటం కంటే, నిరక్షరాస్యులైన పల్లెటూరి వయో వృద్ధులను అడగడం మంచిదని నా అనుభవం, దానిపై ఆధారపడ్డ నిశ్చితాభిప్రాయం.. గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వాణ్ణి కదా, ఆ పక్షపాత దృష్టి కాబోలు!
“రాయలసీమలో మా వైపు ఒక మాట ఉంది. పాత రేనాడు లోనూ, అటూ ఇటూ పొరుగుల్లోనూ ఉండే మాటే అనుకొంటాను..
అర్థమయ్యీ కాకుండా, సగం తెలిసీ తెలియనట్లు గోలగోలగా మాట్లాడుకొంటున్న సందర్భంలో -“యేoదిరా ఇది? క్యాసర బీసరగా కొట్టుకొంటున్నారు” అంటాము. అంటే అరుస్తూ అర్థం కాకుండా మాట్లాడుతున్నాము అనే భావం. … మా క్యాసరబీసరకూ ఈ గాసటబీసటకు ఏమైనా సంబంధం ఉందా? ఎలాగూ అక్కడ గ కారం, ద్రుత కార్యం వల్ల క కారాన్ని త్రోసిరాజని వచ్చిందే కదా? అనే అనుమానం చాలాకాలం క్రితమే నాకూ కలిగి, నాకు బాగా చనువున్న మా హరిజన ఓబయ్యను అడిగాను. అతనెప్పుడూ ఊరు దాటి వెళ్లినవాడు కాదు. అంచేత ఇలాటివాటికి సరైన ‘ఇన్ఫార్మెన్ట్’. పాత తెలుగు పలుకుల అర్థం తెలుసుకోవాలంటే, అలాటి కష్టజీవుల వద్దనుంచే తెలుసుకోవాలి. “సేన్లో (పొలంలో) బీసు పోయినంక ఏముంటుందప్పా, క్యాసర బీసర కాకుండా” అన్నాడు.. ఈ బీసు అనే మాటను భిన్న సందర్భాల్లో, భిన్నార్థాల్లో వాడతాం… ఇంటికి పిల్లలు వస్తారు. నాలుగు రోజులు సందడిగా గడుస్తుంది. తర్వాత వెళ్ళిపోతారు.. అప్పుడు “ఏందో, బీసు పోయినట్లుంది” అని నిట్టూరుస్తాం. సర్కారు ప్రాంతం వాళ్ళు ‘వెలితిగా ఉంది, బావురుమంటోంది’ అంటారే, అలాగా!… అలాగే పొలంలోని పంటంతా ఇంటికి చేరాక, ఆ నేల బీసుపోయి ఉంటుంది. అక్కడక్కడ మిగిలిపోయిన గడ్డీ గాదెంతో! కాసర/ గాసర> కాసట/ గాసట ― కసవు, గాసం నుంచి వచ్చిన మాటలే కావచ్చు. ఒట్టి ‘తాలు’ వంటిది అనే అర్థాన్ని బోధిస్తుండవచ్చు..
మరో మాట కూడా మావైపు తరుచూ వినబడేది ఉంది: “యేందో వాడి గ్యాసాడం/ గ్యాసారం వాడిది పాపం” అంటూ జాలిపడతారు. ఈ గ్యాసారం గ్రహచారానికి వ్యవహార రూపం. ర -డ ల అభేదంతో గ్యాసాడం అయింది. బాధ, పీడ అనే అర్థాలను బోధిస్తోంది.
దానికి జంటగా మరో మాట ఉంది… “యేందప్పా, ఆ బీసరం!.. యెవురికి మేలు?” అని మందలింపుగా ఆ మాటను వాడుతుంటారు… అంటే అనవసర పౌరుషం, ప్రగల్భాలు అనే అర్థంలో! వీరం నుంచి వీసరం అనే మాట వస్తూ, దానికి ప్రాకృత ప్రభావంతో ఈ బీసరం ఏర్పడి ఉండవచ్చు. కొన్ని ప్రాంతాల్లోవాడే బీరం/ బీరాలు అనేది తెలుగువారందరికీ పరిచయమైన మాటలే!.. గ్రహచారం బాగాలేక బాధలు అల్లుకొన్నా, పౌరుషాలు మాత్రం తగ్గలేదు అనే అర్థంలో “ఈ గ్యాసర, బీసర్లెందిలే?” అనటం ఒక పల్లెటూరి వాడుక!
కాబట్టి గాసట, బీసట అంటే–అర్థమయ్యీ కానట్లుగా కలగాపులగంగా, పంటచేను వదిలి, పైన తాలుగడ్డి, చెత్తా చెదారం ఏరుకొన్నట్లో, లేక దుఃఖ పీడతో, డొల్లపోయిన సందర్భాల్లో కూడా బీరు పోకుండా ప్రవర్తిల్లటాన్నో బోధిస్తుందని భావించటంలో దోషం లేదనుకొంటాను.. భారతకథ అంతా ఈ రెండో సందర్భపు గాథే కదా!!
-ఒకమారు నా ఈ ఊహలన్నిటినీ కలిపి ఒక అర్థంగా కూరుస్తూ, ఓ మిత్రుడితో పంచుకొందామని చూస్తే –” ఆ క్యాసర బీసర ఏదో తురకపదం ( ఈ మాటనిలానే వాడినందుకు మన్నించాలి*) అయి వుంటుందిలే. క్యారే.. అంటే బ్యార్..అనేలాగా” అంటూ తేల్చేశాడు… ఏం చెప్పను? కేర్ మని మన తెలుగులోనే ఏడిస్తే సరిపోదా, అని నసిగాను… అంతే…
***
బులుసుగారిని కూడా చర్చించమన్నారు కదా ఆచార్య సుప్రసన్నగారు… అందుకని బులుసు వేంకటేశ్వర్లు గారు కూడా … “ఆచార్యులకు ప్రణామాలు! ” అంటూ చర్చలోకి ప్రవేశిస్తూ…” గాసట బీసట ..అంటే సలక్షణమైన చదువు కానిది అని శ.ర. ఈ పద్యాన్నే ప్రయోగంగా చూపింది. సంస్కృత భారతం చదివే యోగ్యతలేని తెలుగువారికి నన్నయగారు తెనిగించేదాకా, గీర్వాణ పండితులే దిక్కయ్యారు. కానీ అందరికి ఆ భారత కథ అంటే వల్లమాలిన ఇష్టం. ఎవరో ఎక్కడో రాజాస్థానాల్లో గీర్వాణపండితులు చెప్పిన ఆ సంస్కృత భారతం ముక్కలు….. అలా అలా చిలవలు పలవలతో మారిపోయి తెలుగువాళ్ళకి అందేవి. సకారణ సోపపత్తికంగా తెలిసే అవకాశం లేదు. గీర్వాణులు సామాన్యప్రజలకు చేరువయ్యింది లేదు.(ఇప్పటికి అదేస్థితి!) తమ ప్రాభవం తగ్గిపోతుందని ఆంధ్రీకరణను వ్యతిరేకించారు కనుక మొదట ఒక సంస్కృత శ్లోకంవ్రాసి, తరువాత వారికి మ్రొక్కి ప్రసన్నం చేసుకోవలసి వచ్చింది నన్నయ్యగారికి. తిక్కన గారి కాలానికి అంత వ్యతిరేకత లేదు.
‘మహా భారత బద్ధ నిరూపితార్ధము’..ద్వారా వ్యాసముని ప్రణీత పరమార్ధమును తెనుగున తెల్లముచేసి, భారతార్ధాన్ని భాసురము చేశారు, నన్నయతిక్కనలు.
గాథాసప్తశతి, భేతాళ పంచవింశతి అర్ధాలు మీరు అన్నట్లు చమత్కారాలే అని అనుకొంటున్నాను. అమూలకాలు, అసంబద్ద యోజనాలతో భారత కథల్ని “త్రవ్వు” కోవడాన్నే ఎఱ్ఱన గాసట బీసట అనే జాతీయంతో సూచించాడని నా భావన….
ఆంధ్ర భారతం అవతరణ పూర్వం తెలుగు వారు ప్రాకృతభాషల్లో ప్రవీణులని కాదు. అప్పటికే తెలుగు వ్యవహారికంగా బలపడివుంది. నన్నయగారు వాడిన జాతీయాలు సామెతలు బట్టి మనకు తెలుగు సుస్థితి తెలుస్తున్నది. ఆచార్యుల వారికి ఇలాంటి విషయాల్లో నా జ్ఞానం “పూర్ణమ్” అని తెలియదు… వారు నా పేరు చెప్పినందుకే ఈ నాలుగు వాక్యాలు)” అంటూ సకుండలీకరణ వ్యాఖ్యతో తమా భావాలు నమోదు పరిచారు బులుసుగారు…
హిందీ సాహిత్య వేత్త అయిన డా. ఉప్పలధడియం గారు దానిపై స్పందిస్తూ : “నన్నయ గారి శ్రీ వాణీ… శ్లోకం గురించి తెలుగు సాహిత్యంలో చర్చ జరుగుతుండడం పరిపాటి. పెద్దలు బులుసు వారు మొదట ఒక సంస్కృత శ్లోకం వ్రాసి, తరువాత గీర్వాణులకు మ్రొక్కి ప్రసన్నం చేసుకోవలసి వచ్చిందన్నారు. తులసీదాసు రామచరిత మానస్ కూడా సంస్కృత శ్లోకాలతోనే ప్రారంభమవుతుంది – వరుసగా ఏడు శ్లోకాలు ఆ తరువాత అవధీ భాషలో పద్యాలు. అంతేకాదు, అయోధ్యాది ప్రతి కాండా ఒక సంస్కృత శ్లోకంతో ప్రారంభమవుతుంది. తులసీదాసు సంస్కృత శ్లోకాలు రాయడం గురించి అక్కడ చర్చే లేదు.” అంటూ తెలిపారు..
***
సంస్కృతాంధ్రాలలో ఉద్దండులు మా పాలడుగు శ్రీచరణ్ గారు. ఆయనన్నారు కదా: “భాగవతారంభమున చెప్పినట్లుగా ఈ ఐతిహ్యాన్ని వినడమైంది.
“వ్యాసులవారు వ్యాకులచిత్తులై ఉండగా, నారదుల వారిలా అన్నారట…
‘(గా)కాసట బీసటగానున్న వేదరాశిని ఋగ్యజ్జుస్సామాథర్వాలుగా విభజిత క్రమోపదేశము జేసిన ధాతవు, ఇలా చింతించెదవేల?’
”భగవతత్త్వము అనన్య రసానుభవము అని, నిత్యము అందు రమించు భాగవతులను వెదకుచు తానే వారి వద్దకు వచ్చిన పరమాత్మ సగుణావిష్కరణమున నీ మనోవ్యాకులతను అతిగమించుము’, అని ప్రబోధించారట. ఇచ్చట కాసట బీసట అని వాడారట.
“ద్వాపరాంతము వరకు అవ్యవహితముగా, సంసక్తముగా నున్న వేదరాశిలోని అక్షరములలో బీజరూపాన అంతర్గతముగానున్న రసానుభూతిని గ్రహించగలిగే శక్తిమంతమైన సాధనను అనుష్ఠింపగల వారు, పిదప యుగధర్మాన కొదువ కాగలరు కనుక, ఆ అవ్యవహిత స్వరూపము దురవగాహమగునను భావమున కాసట బీసట వాడి ఉండవచ్చునేమో!” అని మరో అరుదైన ఐతిహ్యం నేపథ్యంలో తనకు తోచిన అర్థం వివరించారు..
***
ఆ మధ్య కృష్ణాజిల్లా వారి రచనల్లో ఒక మాట చూశాను….
“ఏమిటో గందరగోళంగా ఉంది” అనటానికి “అంతా కీసర బాసరగా ఉంది” అనే మాటల్ని చదివాను… వెంటనే నేను ఇష్టంగా దాచుకున్న మధుబాబు ‘షాడో’ నవలల్ని తీసి చూశాను… ఇంకేముంది? దాదాపు ప్రతి నవలలోనూ అదేమాట! ప్రింటింగ్ మిస్టీకు అనుకోటానికీ లేదు… విభిన్న సంవత్సరాలలో, విభిన్న ప్రెస్సుల్లో ముద్రితమైన పుస్తకాలు.. అన్నిట్లోనూ అదే రూపమే! రచయిత హనుమాన్ జంక్షన్ వాస్తవ్యులట… కనుక అది ఆ ప్రాంతం నుడికారమే అయివుండాలి… ఒకవేళ, అది ఆయన వైయక్తికమైన పలుకుబడేమో అనే అనుమానం వచ్చి మరొకరిద్దరు రచయిత మిత్రుల్ని అడిగాను. అందులో ఒకరు తెనాలివారు.. వారూ అలాగే వాడతామన్నారు. కనుక ఇది జాతీయమే అని ధ్రువపరచుకొన్నా…
ఈ జాతీయం వెనుక ఎంత చక్కటి సాంస్కృతిక చరిత్ర ఉంది..
ఇందులో కీసర, ఇప్పుడు సికింద్రాబాద్‌కు సమీపంలోని కీసరగుట్ట. ఒకప్పుడు అది ఇక్ష్వాకుల అనంతరం వచ్చిన విష్ణుకుండినుల రాజధాని. అప్పట్లో ఒక వెలుగు వెలిగింది. ఘటికా కేంద్రంగా కూడా ప్రసిద్ధి…. ఇటీవలి కాలంలో,ఎన్.టి.ఆర్.గారు ముఖ్యమంత్రి అయ్యాక, దాని పూర్వ వైభవాన్ని పెద్దలు వారి దృష్టికి తీసుకురాగా, సంస్కృతి అభిమానులైన ఎన్.టి.ఆర్. గారు టీటీడీ వారిని ఆదేశించి, అక్కడ వేదపాఠశాల నెలకొల్పడానికి వీలుగా భవనాన్ని నిర్మింప చేశారు. పాఠశాల కూడా ప్రారంభమై, అచిరకాలంలోనే మూత పడినట్లు ఉంది. ఆ భవనమైనా అక్కడి రామలింగేశ్వర స్వామి సేవకు కూడా ఎక్కువ ఉపయోగపడుతున్నట్లు లేదు… కీసర ప్రభ, విష్ణుకుండినుల తర్వాత వచ్చిన ఆనందగోత్రీకుల కాలంలోనే, కనుమరుగు కావడం మొదలై, దీనావస్థలో పడ్డట్లుంది…. ఆ దీనత, నాటికే అక్కడి చదువుల మీద పడి, అదో నానుడిలా మారినట్లుంది. అలాగే వ్యాసక్షేత్రంగా పిలువబడ్డ బాసర కూడా! ఇప్పటికీ అది సరస్వతీ క్షేత్రంగానే ప్రసిద్ధి. ఒక పాతిక ముప్ఫయ్యేళ్ళ క్రితం వరకు ఆ గౌరవం అంతంత మాత్రమే! కనుక ఒకప్పుడు మంచి విద్యాస్థానాలై కూడా, తర్వాత, బహుశా కాకతీయులకు పూర్వమే, తమ ప్రభను కోల్పోయిన విద్యాకేంద్రాలు ఆ కీసర బాసరలు. అక్కడి చదువులు నాటికే గందరగోళంలో పడి, చివరకు ఆ పేర్లు గందరగోళానికే పర్యాయ పదాలుగా పర్యవసించినట్లున్నాయి..
ఇక్కడొక ప్రశ్న రావచ్చు. కీసర లో ‘కా’ (లేదా ‘గా’ ) గా ఎలా మారింది? అని. నుడికారంగా మారుతున్న జమిళి పదాలు లో పదాది అచ్చులు పరస్పర స్వరభక్తి చాటుకోవటం సహజమే కదా! సామాన్యంగా తొలి పదం మొదట్లోని స్వరంతో, తర్వాతి పదాది స్వరం భక్తిని పాటించి సమానం కావటం సహజం. కానీ ఇక్కడ ‘బా’ (బాసర) లోని ‘ఆ’తో ముందున్న కీసరలోని పదాది స్వరం ‘ఈ’ స్వరభక్తిని (అంటే అచ్చుల సామ్యం) పాటించి ‘ఆ’ గా మారింది… కారణం? అప్పటికింకా కాస్తాకూస్తో బాసర విద్యారంగంలో తన ప్రాముఖ్యం నిలుపుకొని ఉండగా, కీసర ఘటికా కేంద్రం మూతబడి, తన ప్రాధాన్యం పూర్తి కోల్పోయి ఉంటుంది. అయితే పూర్వ ప్రసిద్ధి ఒకటి, వర్ణమాలలో ముందు వచ్చే ధ్వని కావటం వల్ల ఒకటి కారణాలు కాగా, జమిళి పదాల్లో, మొదటే స్మరింపబడుతూ ‘కాసరబాసర’ అయి, జమిళి పదాల్లో రెండవది ఇత్వంతో రావడం తెలుగు పద్ధతి కనుక , అదే ‘కాసర బీసర’ గా మారి, తర్వాత ఔప విభక్తిక రూపంతో ‘కాసట బీసట’ గా జనం వాడుకలో నిలిచిందన్నమాట. ద్రుతప్రకృతిక కార్యం వల్ల ‘గా’ అయినా, తర్వాతి బీ కూడా సరళమే కనుక, రెండూ సరళాది రూపంతో గాసటబీసట గా స్థిరపడి పోయాయి… ఈ భాషా పరిణామం కంటే మించి, ఈ జాతీయం మౌనంగా చెప్పే తెలుగువారి విద్యాచరిత్రే బాధాకరమైంది….
జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ప్రతి జాతీయమూ, ఆ జాతి సాంస్కృతిక చరిత్రను ఎంతో కొంత వ్యాఖ్యానిస్తూనే ఉంటుంది… ప్రాచీన చరిత్ర పునరవగాహనకు భూమి తవ్వకాల్లో బయటపడే శిథిలనిర్మాణాలే కాదు, ప్రాచీన కావ్య పుటల్లోనూ, జనం నాల్కల మీదనూ నిలిచివున్న ఇలాటి జాతీయాలు, నుడికారాలు కూడా ఎంతో ఉపయోగపడతాయి..
వాటికి ఒక చిన్న ఉద్దీపికే ఈ ‘గాసట బీసట’!!
గంగిశెట్టి లనా.