ప్రేమ పరిమళం-6

0
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి వావిలికొలను రాజ్యలక్ష్మి రచించిన ‘ప్రేమ పరిమళం‘ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]”ఉ[/dropcap]దయం ఆరుగంటలకే నిద్ర లేచి అందరం సముద్ర స్నానాలు చేసి, ఒడ్డున తల ఓ శివలింగాన్ని ఇసుకతో చేసి, పసుపు కుంకుమ పూలతో పూజించాము. తర్వాత తడి బట్టలతోనే గుడిలోకెళ్ళి క్యూలో నిల్చున్నాం. నాలుగు వైపులా నాల్గు ఎతైయిన గోపురాలతో వున్న ఈ గుడి కూడా చాలా పెద్దదే. గుడి లోపలవున్న ఇరువైరెండు పవిత్రమైన తీర్థాలలో కూడా స్నానం ఆచరించి రామేశ్వరుడిని దర్శనం చేసుకున్నాం. మన ద్వాదశ జ్యోతిర్లింగములలో ఈ రామేశ్వరం ఒకటి. గుడికి ఎదురుగా ఎంతో ఎత్తయిన నందీశ్వరుడు తెలుపు రంగులో.. చక్కటి ఆభరణాల అలంకారాలతో చాలా అందంగా వున్నాడు. ధ్వజస్తంభం నంది వెనకాలా ఉంటుంది. స్నానాలు చేయడం వలన భక్తులు తడిబట్టలతో తిరగడం వలన గుడి ప్రాంగణమంతా తడితో …ఇసుకతో చిత్తడి చిత్తడిగా వుంటుంది అనిందితా! ఈ గుడి ప్రాంగణం చాలా విశాలమైనది. కొత్తగా వచ్చిన భక్తులకు దారులు సరిగా తెలియకుండా అజాగ్రత్తగా వుంటే కుటుంబ సభ్యులతో తప్పిపోయే ప్రమాదం కూడా మెండుగానే వుంటుంది మరి”

“అవునా!? మరి మీకందరికీ ఆ రామలింగేశ్వర స్వామి దర్శనం అయిందా నాన్నా!?”

“ఆ, అయింది అనితా! కన్నులారా దర్శించుకున్నాము. అభిషేకం చేయించాం”

“రష్ లేదా?”

“ఆ మాట అడగొద్దమ్మా. కిక్కిరిసిన జనం. పిచ్చిపిచ్చిగా ఒకర్ని ఒకరు త్రోసుకుంటూనే నడుస్తారు జనాలు. ఆ బావుల దగ్గరైతే మరింకా విపరీతమైన తొక్కిసలాట”

“అంత రష్‌లో మీరెలా స్నానాలు చేశారు నాన్నా?”

“అలాగే చేశాం తల్లీ! నలుగురితో పాటు నారాయణ. ఆ బావుల దగ్గరుండేతనే బకెట్‌తో నీళ్ళు తోడి భక్తుల తలల మీదినుంచి గుమ్మరిస్తూనే వుంటాడు అదేపనిగా.”

“ఐతే అన్ని బావుల దగ్గర ఒక్కొక్కరు నీళ్ళు తోడి పోయడాన్కి వుంటారన్నమాట.”

“ఆ, ఎప్పుడో ఓసారి తప్పా ప్రతి బావి దగ్గర వుంటారు.”

“మీరైతే ఆ యిరువై బావుల దగ్గర స్నానాలు చేశారన్న మాట…”

“నేను మీ అమ్మే కాదు, మీ సర్పంచమ్మ దొరస్వామిగారితో పాటు ప్రతి ఒక్కరూ స్నానాలు చేశారు అనితా!”

“ఆ బావులలోని నీటి కున్న ప్రాముఖ్యతేంటి నాన్నా?”

“రామేశ్వర దేవాలయ ఆవరణంలో వున్న బావుల రూపములో వున్న తీర్థాలన్నమాట. వీటియందు భక్తి శ్రద్ధలతో స్నానం ఆచరించిన వారికి ఎలాంటి దేహ రుగ్మతలున్న అవన్నీ మటుమాయమవుతాయట. రోగాలు పోవడమే గాక మనస్సు కూడా పునీతమగునట. మొదటిది మహాలక్ష్మి తీర్థం మొదలుకొని చివరిది, యిరువై రెండోవది కోటితీర్థమంటారు. కంస సంహారం వలన కలిగిన పాపదోషమును పోగొట్టుకొనుటకు శ్రీకృష్ణుడు స్నానం చేసిన పుణ్యతీర్థం ఈ కోటి తీర్థమంటారు. ఈ తీర్థములన్నీ పరమ పవిత్రమైనవేకాక, ఈ జలాల్లో ఔషధగుణములు కలవనే చెప్తారిక్కడ. ఈ బావులన్నీ పాండవులైన ధర్మరాజు వాళ్ళు నిర్మించి, వాళ్ళు కూడా స్నానాలు ఆచరించారని ఏవేవో కథలున్నా యీ బావుల పైన.”

“బాగున్నాయి నాన్నా! మీరు చెప్పిన విశేషాలు. మరి అక్కడ రెండు సముద్రాల సంగమం కూడా వుందంటారు కదా ! ఆ విశేషాలేవీ చెప్పరేం?”

“అవునమ్మా, వుందక్కడ, బంగాళాఖాతం, హిందూ మహా సముద్రం సంగమమును ‘సేతు’ అని పిలుస్తారు. సేతు అంటే వారధి అని అర్థం కదా! అది ధనుష్కోటి దగ్గర… లంకాధిపతైన రావణాసురుడు సీతాదేవిని ఎత్తుళ్ళి లంక యందు బంధించగా, ఆమెను రక్షించుటకు శ్రీరాముడు రామేశ్వరం నుండి లంకకు వెళ్ళేందుకు ‘సేతు’ని నిర్మించినట్లు మనకు రామాయణ ఇతిహాసం తెల్పుతుంది కదా! సముద్ర దేవునిని శ్రీరాముడు శాంతం వహించి హనుమంతునికి దారిమ్మని కోరి పెద్ద పెద్ద బండరాళ్ళతో వారధి నిర్మించి, వానర సైన్యంతో లంకకు వెళ్ళి రావణాసునితో యుద్ధం చేసి చంపి సీతని తెచ్చి ఆమెతో రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేసెనట. మహాభక్తుడైన రావణబ్రహ్మను వధించినందుకు కలిగిన బ్రహ్మహత్య పాతకమును పోగొట్టుకోమని శివున్ని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి, సీత యిసుకతో తయారుచేసిన లింగంతో పాటూ, ఆంజనేయస్వామి కైలాస పర్వతం నుండి తెచ్చిన లింగమును శ్రీరాముడిక్కడ ప్రతిష్ఠించాడట. సీత చేసిన లింగాన్ని రామలింగమనీ, ఆంజనేయుడు తెచ్చిన లింగమును విశ్వలింగమని పిలుస్తారు తల్లీ!”

“అలాగా. మరి మీరు ధనుష్కోటికెళ్ళలేదా నాన్నా?”

“వెళ్ళాం అనితా! రామేశ్వరం నుండి యించుమించు యిరువై కిలోమీటర్లు వుండవచ్చు. గ్రంధమాన పర్వతంపై వున్న గుడిలో రాములవారి పాదాలున్నాయి. ఆ సముద్రతీరం, ఆ పరిసరాలు కంటికింపుగా చూడడాన్కి చాలా మనోహరంగా వుంటుంది. రామేశ్వరం నుండి నాల్లు ఐదు మైళ్ళదూరాన అందంగా కట్టబడిన కోదండరామ స్వామి దేవాలయం వుంది. విభీషణుడు రామున్ని శరణాగతి ఇక్కడనే స్వీకరించిబడినట్లు, లక్ష్మణునిచే విభీషణున్ని పట్టాభిషేకం కూడా ఇక్కడనే జరిగిందంట. మొత్తం మీద ఈ రామేశ్వర పుణ్యక్షేత్రం ప్రతి ఒక్కరూ దర్శించవల్సిన పవిత్రమైన పుణ్యస్థలం అనితా!”

“మీరిక అక్కడి నుంచి ఎక్కడికెళ్ళుతారు నాన్నా?”

“కన్యాకుమారికెళ్ళుతాం… అవునూ, నీకు యింకో విషయం చెప్పడం మర్చిపోయాను తల్లీ! రామేశ్వరం ఊరి బయటే మన దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ గారి సమాధి చూసి అంజలి ఘటించాము. ఆ మహానుభావుని సేవల్ని గుర్తు తెచ్చుకున్నాం. సాయంత్రం వస్తూ అబ్దుల్ కలామ్ గారిల్లు చూశాం. దాన్ని వాళ్ళ బంధువులే ఓ పెద్ద షాపింగ్ మాల్‌గా మార్చినట్లుగా చెప్పారిక్కడ.”

“అవును నాన్నా! మన రాష్ట్రపతులలో అందరికన్నా అతి నిరాడంబరమైన మంచి మనస్సున్న మనిషి కలామ్ గారు. ఎంతో మంది విద్యార్థులు ఈనాడు ఆయన స్ఫూర్తితోనే ముందుకెళ్ళుతున్నారు గూడాను. ఎలాంటి కల్మషం లేని నిండు మనస్సున్న మనీషి ఆయన.”

“అవును నీవన్నది నిజమే తల్లీ! ఇదిగో మీ అమ్మ వచ్చింది. దీపుని మాట్లాడమను.”అంటున్నాడు పాండురంగం.

“అమ్మా!” అంటూ హుషారుగా దీపు అక్క చేతిలోనుంచి సెల్ అందుకున్నాడు.

***

అంగన్‌వాడిలో చిన్నచిన్న పిల్లలంతా బయట ఆవరణంలో చెట్ల నీడల్లో హాయిగా ఆడుకుంటున్నారు. కొంత మంది లోపలి గదిలో అన్నం తిని పైన తిరుగుతున్న ఫ్యాన్ గాలికి క్రింద పరచిన చాపలపై ఆదమరచి నిద్ర పోతున్నారు.

అంగన్‌వాడి టీచర్ లోపల కూర్చుని వరసలుగా పేర్చిన ఎగ్ బాక్స్ లను, బాలామృత బ్యాగ్ లను లెక్క సరిచూసుకుంటూ పొడగాటి ఓ బుక్‌లో జాగ్రత్తగా రాస్తుంది.

ఆయమ్మ బయటే వుంది. పిల్లలు ఆడుతున్న ఆటల్ని గమనిస్తూ నిల్చుంది. చుట్టుతా ఎత్తుగా వున్న కాంపౌండు గోడ, పెద్ద యినుప గేట్ వుంది. సువిశాలమైన ఆ ఆవరణంలో రకరకాల కూరల పాదులు ఎన్నో రకాల పూలమొక్కలు పొందికగా పెట్టారు. అంగన్‌వాడి గదిని ఆనుకొని ఆ ఊరి ప్రాథమిక పాఠశాల కూడా అక్కడే వుంది. అందులో ఒకటవ తరగతి నుంచి నాలుగవ తరగతి వరకూ వుంది. అందులో ఒక పంతులు, ఓ లేడీ పంతులమ్మ పని చేస్తారు. మధ్యాహ్నం భోజనాలు అయిపోయి ఆ స్కూల్ పిల్లలు కూడా బయటే ఆడుతున్నారు…

భోజనం చేయడానికి కొళాయి దగ్గర చేతులు కడుకుంటున్న టీచర్లు ఇద్దరూ గేట్ తీసిన చప్పుడు వినిపించే సరికీ ఆయమ్మతో పాటూ చటుక్కున ఇటు చూశారు.

అనిందిత చిరునవ్వు ముఖంతో లోపలికొస్తూ కన్పించింది

“రండి, రండి మేడమ్. మా భోజనం టైంకి వచ్చారు” ఉత్సాహంగా నవ్వుతూ సాదరంగా ఆహ్వానించారు.

“అవునా!? మీరంతా బాగున్నారా?” అంటూ తనచుట్టూ సంతోషంతో మూగిన ఆ చిన్న పిల్లల్ని ఆప్యాయంగా ప్రేమతో పలుకరిస్తూ హ్యాండ్ బాగ్ లోనుంచి పెద్ద చాక్లెట్స్ పాకెట్ తీసి అందులోనుంచి తలా రెండు చొప్పున మొత్తం యిస్తూ నడుస్తుంది.

“ఏయ్, పిల్లలూ! రండిటు… మేడమ్‌ని అసలు లోనికి రానిస్తారా లేదా?” అంటూ గదమాయించింది టీచర్.

అప్పుడు పిల్లలు కాస్త వెనక్కి తగ్గారు.

“ఈ మేడమ్ వచ్చిందంటే సరి, పిల్లలకు పండుగంటే పండుగే మరి” అంటూ ఆయామ్మ అనిందితకు దగ్గరగా వచ్చింది. తన చేతిలోని పాకెట్ ఆమెకిచ్చి “అందరికీ యివ్వు ఆయమ్మా!” అంటూ టీచర్స్ దగ్గరగా వచ్చింది.

“ఏంటి మేడమ్! ఈ మధ్య మీరిటు వైపే రావడం లేదు. పనులతో బిజీగా వున్నారా? లేక మమ్ముల్ని పూర్తిగా మర్చిపోయారా?”

“అదేం లేదులెండి. మర్చిపోతే ఇప్పుడెలా వస్తాను? కానీ, ఎప్పుడూ అనుకుంటూనే వుంటాను. పిల్లల దగ్గరికి వెళ్ళుదామనీ. మరే, అనుకున్న ప్రతిసారీ ఏదో పని రావడం… మానుకోవడం. ఇలా జరిగిపోతుంది. ఈ రోజు ఏమైనా సరే వెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకొని వచ్చాను”

“మాపై, పిల్లలపై దయ కలిగి బాగొచ్చారు మేడమ్! రండి, భోజనం చేస్తూ మాట్లాడుకుందాం”

“లేదు. నేను లంచ్ ఆఫీస్‌లో చేసే వచ్చానండీ. మీరు కానివ్వండి.”

ఆయమ్మ వెళ్ళి చెప్పింది కాబోలు. అంగన్‌వాడి టీచర్ కూడా గదిలో నుంచి బయటికొచ్చి అనిందితని సంబరంగా పలుకరించింది.

“రండి మేడమ్! మాతో పాటు మీరూ కాస్తా భోజనం చేద్దురు. ఈ రోజు మా ఆయమ్మ గుత్తివంకాయ కూరొండినది. మీకు బాగా యిష్టం కదా!”

“ఈమారు మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా మీతో పాటు కల్సి భోజనం చేస్తాను. ప్రస్తుతం మీరు కానివ్వండి”

“సర్పంచమ్మతో వాళ్ళతో పాటు దక్షిణదేశ యాత్ర మీ అమ్మనాన్నగారు కూడా వెళ్ళారటగా. అంత బాగున్నారటనా? ఫోన్స్ చేస్తున్నారా?” వాళ్ళు భోజనాలు చేస్తూనే అనిందితతో మాట్లాడుతున్నారు.

“మీరిక్కడికి వచ్చాక ఈ ఊరి రూపురేఖల్నే పూర్తిగా మార్చి వేశారు మేడమ్! పల్లె ప్రగతి కార్యక్రమంలో ఊరు అంచెలంచెలు పచ్చదనం పరిశుభ్రత సంతరించుకుంది. మీ గురించీ ఈ ఊరిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గురించి పేపర్‌లో ప్రతిరోజూ ఏదో ఓ వార్త వస్తూనే వుంటుంది. సంపూర్ణంగా ప్లాస్టిక్ సంచుల నిషేధం, గన్ని బ్యాగ్‌లని యింటింటికి ఒకటి చొప్పున పంపిణీ చేయడం అవన్నీ మీ వలనే సాధ్యమైనాయి.”

“నాదేముంది యిందులో… ఈ ఊరిలో వుండే ప్రజలంతా కలిసికట్టుగా శ్రమదానం చేసి, ఈ ఊరి రూపరేఖల్ని మార్చి వేశారు. ఇంకా చేయాల్సిన ఎన్నెన్నో ముఖ్యమైన పనులు, యింకా జరగాల్సినవి చాలా వున్నాయి. చక్కటి నర్సరీ ఏర్పాటు చేయాలి, ట్రాక్టర్ కొనాలి”

“నిన్న మీరు రంగమవ్వ ఇల్లు కూల్చారట కదా మేడమ్ నిజమేనా?”

“అవునండీ. పూర్తిగా శిధిలావస్థలో వుందా యిల్లు. ఇప్పుడో అప్పుడో పడి పోయేలా వుంది. అలాంటి ఇండ్లని ప్రభుత్వమే కూల్చేయాలని మాకు ఆర్డర్స్ యిచ్చింది. రంగమవ్వకి ఓ పదివేలు ఇప్పిస్తానని చెప్పాను. మా ఎమ్.డి. సార్ ఏమంటారో చూడాలి ..ఆ రంగమవ్వ కూతురు, మనవడు కూడా ఒప్పుకున్నాకనే కూల్చడం జరిగింది.”

“ఆ ఇంట్లో ఓపాము పుట్ట కూడా వుంటుంది మేడమ్ మీరు చూశారా?”

“ఆ, చూశాను. కాని అందులో పాములాంటిదేది లేదు. చాలా ఏళ్ళ నుంచి ఆ పుట్ట వాళ్ళింట్లో వుందట. రంగమవ్వ కూతురే చెప్పింది.”

“అన్నట్లు, మన జిల్లాకి కొత్త కలెక్టర్ గారొస్తున్నారట అనిందితా మేడమ్. మీకు తెలుసా ఈ విషయం. చాలా యంగ్ కలెక్టరట. న్యూ ఫోస్టింగట. చాలా మంచి మనిషట. మీలా పని చేసే వారి పట్ల ప్రశంసల జల్లు కురిపిస్తారట. పని చేయని వారి పట్ల చండశాసనుడిగా మసలుకుంటారట…”

“అవునట. మొన్నీమధ్య మండలాఫీసుకు వెళ్ళితే మా ఎమ్.పి.ఓ. సార్ చెప్పారు. అలా సక్రమంగా విధి నిర్వహణ చేసే వారుంటేనే సమాజం, ప్రజలు బాగు పడుతారు కదా! మరిక వెళ్తాను” అంటూ లేచిందామె.

“అయ్యో, అదేమిటీ? అప్పుడే వెళ్తారా? ఇంకాసేపు వుండండి”

“లేదు మళ్ళీ ఓ మారు వస్తాను. ఊళ్ళో తిరిగి చూసే పనులింకా రెండు మూడున్నాయి” అంటూ నవ్వుతూ అనిందిత వెనుదిరిగింది.

ఎత్తుకు తగ్గ లావుతో బారెడు నల్లని ఒతైన పొడగాటి… అడుగులకు అనుగుణంగా అటుఇటు ఊగుతున్న అందమైన పిడికిలి బిగించేంత లావుగా వున్న జడని అబ్బురంగా చూడసాగారు వాళ్ళు.

ఆయమ్మ గబగబా వచ్చి గేట్ తెరిచింది. పిల్లలందరికీ బై బై చెప్పి చేయి ఊపి స్కూటీ స్టార్ట్ చేసింది అనిందిత.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here