మీరాభజన్‌ల సృష్టికర్త భక్త మీరాబాయి

3
3

[dropcap]01[/dropcap]-10-2021 నాటికి మీరాబాయి స్టాంపు ముద్రించి 70వ సంవత్సరం వచ్చిన సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

అనాదిగా భారతదేశం భక్తులకు, సాధుపుంగవులకి నిలయం. దేశం నలుమూలల నుండి స్త్రీ పురుష బేధం లేకుండా ఎందరో హిందూమత ఆధ్యాత్మిక భావనలని పద్యాలు, కవితలు, భజన్ల రూపంలో వెలయించారు. గానం చేశారు. వివిధ రకాల భక్తి ఉద్యమాలను నడిపారు. విశ్వవ్యాప్తంగా వీరి కీర్తనలు, పదాలు, భజన్లు మొదలయినవి మన దేశ కీర్తిని అగ్రస్థానంలో నిలిపాయి. స్వదేశీ, విదేశీ గాయకులు తమ స్వరాల నుండి అలవోకగా, అద్వితీయంగా, ఆధ్యాత్మికంగా ఈ భక్తి గీతాలను ఆలపించి సుసంపన్నం చేశారు. వీరిలో మీరాభజన్‌ల సృష్టికర్త మీరాబాయి ఒకరు.

ఈమె 1498లో రాజస్థాన్ లోని నాగపూర్ జిల్లాలో జన్మించారు. మెర్టాలో పుట్టారని, కుర్కిలో పుట్టారని కథనాలు చెపుతున్నాయి. ఈమె జన్మస్థలం గురించి వివాదాలున్నాయి.

తల్లిదండ్రులు వీరకుమారి, రతన్ సింగ్ రాథోడ్‌లు. తాతగారు రావ్ దుడాజీ పెంపకంలో పెరిగారు. రాజవిద్య, మతం, రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, సంగీతం మొదలయిన అంశాలను నేర్చారు.

బాల్యంలో ఈమె ఒక పెళ్ళి ఊరేగింపు చూశారు. తల్లిని దాని గురించి అడిగారట. పెళ్ళి గురించి వివరించారట తల్లి. తనకు వరుడిగా ఎవరు వస్తారని తల్లిని అడిగారట. ప్రతిగా తల్లి శ్రీకృష్ణుడి పేరు చెప్పిందట. ఆ తల్లి తమాషాకే అన్నప్పటికీ మీరా ఈ విషయాన్నే నమ్మారు. శ్రీకృష్ణుని భర్తగా ఆరాధించడం మొదలు పెట్టారు. ఇదే ఈమె జీవితంలో మలుపు. తల్లి సరదాగా చెప్పిన మాటలని ప్రాతిపదికగా తీసుకుని ఇలా భావించడం విచిత్రంగా అనిపిస్తుంది. ఈ ప్రేమ ఒక ఆధ్యాత్మిక భావానికి సంబంధించింది. ఇది అలౌకిక ప్రేమ.

1516లో మేవాడ్ యువరాజు భోజరాజ్‌తో ఈమె వివాహం జరిగింది. అయితే అత్తవారింట్లో గృహస్థు కార్యక్రమాలను నిర్వహించలేదు. శ్రీకృష్ణుని ధ్యానంలోనే ఉండేవారు. అత్తవారింట కుటుంబ దైవం దుర్గామాతని పూజించటానికి కూడా ఈమె ఇష్టపడలేదు.

భోజరాజ్ ఆమె దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారు. కాని ఆమెలో మార్పు రాలేదు. అది ఆమె దైవభక్తికి నిదర్శనం. చివరకు ఆమె ఆధ్యాత్మిక భక్తిని అవగాహన చేసుకున్నారు. కవితలు, గేయాలు వ్రాయమని కోరారు. ఆమెకి స్నేహితుడిగా, గురువుగా, రక్షకుడిగా మారారు. చివరకు ఆమె కోసం కోటలోనే శ్రీకృష్ణాలయాన్ని నిర్మించారు.

ఢిల్లీ సుల్తానులకు, రాజపుత్ర రాజులకు మధ్య (బాబర్‌తో) జరిగిన కణ్వా యుద్ధంలో భోజరాజ్ మరణించారు. నాటి ఆచారం ప్రకారం సతీసహగమనం చేయమని కుటుంబీకులు ఈమెను కోరారు. కాని ఆమె తిరస్కరించారు. తరువాత విక్రంసింగ్ మేవాడ్‌కు రాజయ్యాడు. ఇతను మీరాబాయి భక్తి మార్గాన్ని వ్యతిరేకించాడు. తమ రాజవంశపు పరువు పోయిందని భావించాడు. మీరాను నిలువరించే సమయం కోసం నిరీక్షించాడు. ఇతను మీరాను చంపడానికి కొన్ని ప్రయత్నాలు చేసినట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

విషపూరితమైన పామును పూజ పూలబుట్టలో ఆమెకు పంపారట. ఆమె బుట్టను తెరవగానే అందులో శ్రీకృష్ణుని చిత్రం కనిపించిందట. అలానే విషం కలిపిన పాలు ఇచ్చారు. ఆమె తాగినా హాని జరగలేదు. ఒకసారి రాజాజ్ఞ మీద నీటిలో మునిగిపోయారు. అయినా చనిపోలేదు నీటిపై తేలారు.

ఈ ఈతి బాధలు భరించలేక పుట్టింటికి వెళ్ళారు మీరాబాయి. అక్కడ కూడా నిరాదరణ ఎదురయింది. ఏటికి ఎదురీదాలనుకున్నవారికి ముఖ్యంగా ఆడపిల్లలకి ఆనాడు ఈనాడు కూడా పుట్టింట మెట్టినింట నిరాదరణే ఎదురవడం మామూలు విషయమే (కొన్ని విషయాలలో మినహాయింపులుంటాయి అనేది నిజమే!).

ఇక శ్రీకృష్ణుడు నివసించిన బృందావనానికి వెళ్ళడమే మంచిదనుకున్నారు. అక్కడికి వెళ్ళి (సన్యాసిని) ఆధ్యాత్మిక సాధువుగా మారారు. ఆమెకి బృందావనం నందనవనంలా అనిపించింది. ప్రశాంత చిత్తంతో మనసారా శ్రీకృష్ణుని సేవించారు. కవితలు వ్రాసుకునేవారు. పాడుకునేవారు. భక్తులతో సంభాషించేవారు. అందరితో కలిసి బృందగానాలు ఆలపించేవారు.

అక్కడ జీవగోస్వామిని కలవాలని ఆకాంక్షించారు. ఆయనకి మహిళలంటే అయిష్టం. అయితే మీరా శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషుడు, మహిళలంతా ప్రకృతే అనేవారు. ఆమె కృష్ణ భక్తిని అవగాహన చేసుకున్న జీవగోస్వామి ఆమె మాటలను విశ్వసించారు. ఆమెతో కలిసి కృష్ణ భగవానుని సేవించి తరించాలని ఆశించారు. ఆమెని కలిసి సంభాషించారు. చివరకు ఇద్దరూ కలిసి భక్తుల సమక్షంలో ఆధ్యాత్మిక చర్చలు జరిపి వారికి భక్తి తత్వాన్ని బోధించడం మొదలు పెట్టారు.

మీరా వివిధ శ్రీకృష్ణ దేవాలయాలను సందర్శించి తన భజనలను గానం చేస్తూ, భక్తులతో చేయిస్తూ భక్తి పారవశ్యంలో తేలియాడేవారు.

చివరి రోజుల్లో ద్వారక చేరారు. అక్కడ తన భక్తి కార్యకలాపాలను కొనసాగించారు.

1547 లో రాంచార్జీ కృష్ణాలయంలో రాత్రిపూట గడపడానికి ఆలయనిర్వాహకుల దగ్గర అనుమతిని తీసుకున్నారు. ఆ రాత్రే శ్రీకృష్ణుడిలో ఐక్యమయి మోక్షం పొందారని అంటారు. మరునాడు గర్బాలయ ద్వారం తెరిచి చూస్తే ఆమె కనపడలేదు. అందరూ ఆశ్చర్యంలో మునిగారు. ఆ తరువాత ఆమె ఎవరికీ కనపడలేదు.

“మార ది గిరిధర్ గోపాల్ దుస్రా నా కోయీ”:

“బసో మేరే నైనా మే నందలాల్, సానారే సూరత్ మోహిని”:

“నందనందనే దిక్ పర్ యామయి”:

“కిను సంగా ఖేలు హోలీ”:

“థానే కాయీ కాయీ బోల్ సునావా”

“పాయోజీ మైనే రామ్ రతన్ ధన్ పాయో”

“గడ్ సే తో మీరాబాయి ఉత్ కరావాలే నో సాత్” వంటి మీరాభజన్లు వివిధ గాయకుల చేత ఈనాటికీ పాడబడుతూ ప్రాచుర్యంలో ఉన్నాయి. వందలాది రికార్డులు, లభ్యమవుతున్నాయి. సంగీత ప్రియులను, భక్తులను అలరిస్తున్నాయి.

1929లో సంత్ మీరాబాయి, 1933, 1934, 1937లలో మీరాబాయి, 1938లో భక్త మీరా, 1940లో మీరాబాయి, 1945లో మీరాబాయి (యం.యస్.సుబ్బులక్ష్మి హిందీ, తమిళ్ ద్విభాషా చిత్రం), 1976లో మీరాశ్యామ్, 1992లో మీరా కే గిరిధర్ వంటి చిత్రాలు భారతీయ సినిమా రంగంలో మీరాబాయిని అగ్రస్థానంలో నిలిపాయి.

వివిధ టెలివిజన్ ఛానలో మీరాబాయి గురించిన సీరియల్స్ ప్రసారమవుతున్నాయి.

ఈ విధంగా భారతదేశంలో భక్తి కార్యక్రమాలు, మీడియా ప్రసారాలు మీరాబాయికి ప్రాముఖ్యతని కల్పిస్తున్నాయి. మెర్టాలో మీరామహల్ మ్యూజియంను ఏర్పాటు చేశారు.

ఈమె భజనలు రాజస్థానీ మాండలికంలో వ్రాశారు. ఈ భజన్లు వివిధ భాషలలోకి అనువదించబడినాయి. భారతదేశంలో అలిస్టన్, సుబ్రహ్మణియన్‌లు ఆంగ్లభాషలోకి అనువదించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో షెల్లింగ్, లాండెస్-లెవిలు ఆంగ్లభాషలోనికి అనువదించారు.

రాబర్ట్ బ్లై, జేన్ హిర్ప్షీల్డ్‌లు మీరాభజన్లను ‘మీరాబాయి: ఎక్సాటిక్ పోయమ్స్’ పేరుతో ఆంగ్ల భాషలోకి తర్జుమా చేశారు. ఈ విధంగా ఆంగ్లంలోనే చాలా మంది అనువదించారు. ‘ది హిందీ క్లాసికల్ ట్రెడిషన్’ పేరుతో స్నెల్ అనువదించి అందించారు.

ఈమె కవితలు మధ్యయుగం నాటి భక్తి కవుల బలమైన ఉత్తర భారతదేశ సంప్రదాయానికి చెందినవి. ఉద్వేగభరితంగా, అతీంద్రియ భక్తి, అపరిమిత ప్రేమ, ఆధ్యాత్మికత విలువలతో నిండిన కవితలని వెలయించి భక్తకోటికి అందించారు. ఆమె మనసు నుండి ఉద్భవించిన కవితలు, పద్యాలు, భజన్లు జీవితంలోని వివిధ పార్శ్వాలకు ప్రతీకగా నిలిచాయి.

మిలియన్ల కొద్దీ కవితలు వ్రాసిన గొప్ప కవయిత్రి అని ప్రచారం జరిగింది. అయితే కొన్ని వందల కవితలు మాత్రమే వ్రాశారని పండితులు, విశ్లేషకుల అభిప్రాయం.

ప్రస్తుతం సుమారు 1300 వందల దాకా భజన్లు లభ్యమవుతున్నాయి. ఇవన్నీ శ్రీకృష్ణుని స్తుతించే భజనలే! మీరా తన ఆధ్యాత్మిక భక్తి తత్వాన్ని నిక్షేపించి భక్త కోటికి అందించిన భజనలే ఇవి.

ఈమె జ్ఞాపకార్థం 1952 అక్టోబర్ 1వ తేదీన 2 అణాల విలువతో ఒక స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ (స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1956 వరకు అణాకానీల ద్రవ్య విధానం అమలులో ఉంది).

‘INDIAN SAINTS AND POETS’ శీర్షికన మనదేశ కవులు కబీర్ దాస్, తులసీదాస్, సూర్దాస్, మీర్జాగాలిబ్, గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్‌లతో పాటు మీరాబాయిని కూడా కలిపి 6 స్టాంపులు ఒక సిరీస్‌గా విడుదలయ్యాయి.

అణాల సీరీస్‌లో విడుదలయిన ఏకైక మహిళా స్టాంపు ‘భక్త మీరాబాయి’దే కావడం భారతీయ స్టాంపుల చరిత్రలో ఒక చారిత్రక విశేషం.

ది.01-10-2021 నాటికి మీరాబాయి స్టాంపు విడుదలై 70వ సంవత్సరములో అడుగిడుతున్న సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here