[dropcap]ఏ[/dropcap]కాంత క్షణాలిప్పుడు నాకెంతో అవసరం
నిరంతరం సతమత మవుతున్న ఉద్యోగిని నేను
తల్లి పాత్రను సక్రమంగా పోషించలేక
తల్లడిల్లుతున్న తల్లిని నేను
నాకిప్పుడు ఏకాంతం కావాలి!
మంచి గృహిణిని కాలేక
భార్యగా అసంతృప్తనై
అల్లాడుతున్న అతివను నేను!
దశావతారాలను వీడాలి
ద్వైదీభావం నుండి బయటపడాలి
మనసుకు నచ్చిన విధంగా
గడిపే రోజు రావాలి!
గుండెల్లో గూడు కట్టిన నా గోడు వినిపించాలి!
ఒంటరి గువ్వల్లా అనాథల్లా
బాల్యం గడుపుతున్న నా పిల్లలకి
నిజమైన తల్లిగా మారాలి
నాకు ప్రశాంతత కావాలి
గడియారం ముల్లై గిరగిర తిరిగే జీవితం
అలసట తప్ప ఆనందం విశ్రాంతి ఎరుగని శరీరం!
సేద తీరాలి!
ముక్క చెక్కలై పోతున్న నా మనసు
ఒక్కటి కావాలి
అంతరాంతరాల్లో దాగున్న
తీయని అనుభూతిని వెలికి తీయాలి
పచ్చని చెట్టుపై చిలకలా
స్వేచ్ఛాగీతం పాడాలి
నిర్లిప్తమైన, వ్యథాపూర్తితమైన
నా గుండెను గులాబి చేయాలి
అసలైన అమ్మనై
కమ్మని నా కౌగిలిలో పిల్లలు
గువ్వలై ఒదిగి పోవాలి
నవ్వుల పువ్వులై విరబూయాలి!