[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]
[dropcap]ఆ[/dropcap]ఫీసు వద్దకొచ్చి అక్కడ బయట బల్ల మీద కూర్చున్న నలభై ఏళ్ళ స్త్రీ మూర్తిని చూస్తూ, “అమ్మా! ముందు అన్న ప్రసాదము తీసుకురండి. నేనిక్కడే ఎదురుచూస్తూ ఉంటాను…” అన్నారు.
ఆ ఆశ్రమవాసితో వంటశాల వైపు పంపారు సాపాటు పెట్టమని.
వంటశాలనానుకొని వున్న భోజనశాలలో ఒకేసారి ఐదు వందల మంది భోంచెయ్యవచ్చు. ముందుగా విద్యార్థులకు వడ్డన ఉంటుంది. వారు వచ్చి ప్రార్థన చేసి భోంచేసి వెళ్ళాక ఆశ్రమ సందర్శకులకూ, మిగిలిన వారికీ వడ్డన జరుగుతుంది. కొన్ని సార్లు రాఘవాచార్యులు కూడా వచ్చిన అతిథులతో పాటూ అక్కడే సాపాటు చేస్తూ ఉంటారు. అటువంటి సమయాలలో ప్రసన్నలక్ష్మికి కబురు వెడుతుంది.
అతి శుభ్రమైన భోజనం, పెరమాళ్ళుకు నివేదించినది ప్రసాదముగా నారాయణ యతివరేణ్యుల నుంచి అందరికీ అదే భోజనం. తేడా చూపటం అక్కడ కనపడదు.
ఆ వచ్చినావిడ భోజనము చేసి వచ్చాక, గదిలోకి పిలిచి కుర్చీ చూపాడు. ఆమె కూర్చొని స్థిమితపడినాక అడిగాడు ఆచార్యులు, “ఎక్కడ్నుంచి వచ్చారు? ఏం పని మీద వచ్చారు?”
ఆమె నమస్కరించి, “కరీంనగరు నుంచి స్వామీ. నరసింహాచార్యులు నాకు అన్న వరస. వారు పంపారు…” అంటూ ఒక ఉత్తరము బ్యాగు లోంచి తీసి ఆయన ముందు బల్ల పైన పెట్టింది.
“అవునా, సంతోషం. ఎలా వున్నారు వారంతా?” ఆప్యాయంగా అంటూ ఆ ఉత్తరాన్ని చేతిలోకి అందుకున్నారు.
నరసింహాచార్యులు కరీంనగరులో వున్న వెంకటేశ్వర దేవాలయ అర్చకులు. ప్రసన్నలక్ష్మికి దూరపు చుట్టరికం. ప్రసన్నలక్ష్మి కుటుంబము దిగువ మధ్యతరగతికి చెందినవారు. ఆచారము పాటించటములో మాత్రం నిష్ఠాగరిష్ఠులు. పెరుమాళ్ళు సేవలో తరించిన వంశము వారిది. వారి కుటుంబములో ఇంకా అర్చకత్వం కొనసాగుతోంది. ప్రసన్నలక్ష్మికి ఈ నరసింహాచార్యులు పెంతండ్రి కొడుకు.
రాఘవాచార్యులు తండ్రి పేరుమోసిన లాయరు. సంప్రదాయమంటే ఉదయము పెరుమాళ్ళుకు చేసే చిరుసేవ తప్ప, మరో మాట వారింట వుండేది కాదు. ప్రసన్నలక్ష్మి కుటుంబమంటే చాలా గౌరవము వారికి.
ఆయన ఆ ఉత్తరము తీసుకొని చూశాడు. అందులో వివరాలు బట్టి వచ్చినావిడ నరసింహ దూరపు చుట్టమని, భర్తను కోల్పోయిన స్త్రీ యని, ఉన్న ఒక్కానొక్క కుమారుడు ఆచారము లేక భ్రష్టత్వానికి పోతున్నాడని, చెడు అలవాట్లు మరిగాడని, వాడిని ఎలాగైనా దారిలో పెట్టి ఆమెకు సహాయము చెయ్యమని బావగారిని ప్రాధేయపడుతూ పంపిన ఉత్తరం.
ఆమెను చూచి “ఏడీ మీ అబ్బాయి?” అడిగారు ఆచార్యులు.
ఆమె “ఇప్పుడే….ఇక్కడే వున్నాడు…” అని తత్తరబడి బయటికి వెళ్ళి ఒక పదహారేళ్ళ కుర్రాడిని పట్టుకువచ్చింది.
నలిగిన బట్టలు, చెదరిన జుట్టు, కొద్దిగా సిగరెట్ వాసన, చేతిలో ఫైలుతో వచ్చాడా కుర్రాడు.
“నీ పేరేమి?” అడిగారాయన.
“అనంత్!” అన్నాడు ఆ కుర్రాడు కొద్దిపాటి నిర్లక్ష్యంతో.
“అనంతా…” అడిగారాయన.
“అనంతాచార్యులు…” అంది తల్లి వెంటనే.
తల పంకిస్తూ ఆ కుర్రాడ్ని చూస్తూ ఉండిపోయారు రాఘవాచార్యులు.
‘వీడి కళ్ళ లోతులలో ఏదో మెరుపు వుంది’ అనుకున్నారు.
“ఏమిటా ఆ ఫైలు?” అడిగారాయన.
“నా మార్కులు!” ఇంటరు మార్కుల షీటు తీసి చూపాడు ఆ అబ్బాయి.
మార్క్సు బానే వచ్చాయి.
“వైదీకమేమైనా చెయ్యగలవా? ఉపనయనమైనదా?” అన్నారాయన.
తల్లి కంగారుపడింది.
“లేదండీ…. వారు లేరుగా…” అన్నదామె గొంతులో దుఃఖమణుచుకుంటూ…
“మార్కులు బానే వచ్చేయే…” అన్నారు ఆచార్యులు చిన్నగా తల ఊపుతూ.
“మా కాలేజీ టాపరు నేనే!” కొద్దిగా పొగరు కూడా ధ్వనించిందా కుర్రాడి గొంతులో.
“ఆహా!!” అంటూ “మీకెలా సాగుతుందమ్మా?” అడిగారాయన జాలిగా చూస్తూ ఆమెను…
“మా అన్న ఇంట్లో ఉంటానండి, వంటలకూ అదీ వెడతాను…” తల వంచుకు చెప్పిందామె.
“సరే. ఈ రోజుకు మీరు వసతిగృహములో ఉండండి. రేపు స్వామి వారి దర్శనము చేసుకుందురు. స్వామికి మీ విషయము విన్నవిస్తాను. వారు ఏమి చెబితే అది చేద్దాం…. ఒక సారి ఇంటికి వెళ్ళి రండి. గుడి వెనకే. ప్రసన్నలక్ష్మీ సంతోషిస్తుంది…” అన్నాడు.
ఒక ఆశ్రమవాసిని పిలిచి, వారిని తన ఇంటికి తీసుకు వెళ్ళమని చెప్పి, పనిలో మునిగి పోయాడు.
ఆమె లేచి నమస్కరించి బయటకు నడచింది. వెనకనే ఆ కుర్రాడు కూడా.
వాళ్ళు వెళ్ళిన వైపై చూస్తూ అలా వుండిపోయారు ఆచార్యులు.
ఆయన చూపులు ఎక్కడో దిగంతాల వైపుగా చూస్తున్నట్లుగా…. లోతుగా వున్నాయి.
ఆయన కళ్ళు ముందు గతం కదలాడింది…
(సశేషం)