[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]చే[/dropcap]తులు విడిపించుకుని వెళ్ళిపోతున్న షరీఫ్‌తో “తొందరగా తిరిగొస్తావుగా?” అంది.
అతన్నుంచి ఏమీ సమాధానం రాలేదు. “నువ్వొచ్చేవరకు నేనేమీ తినను. నీ కోసం ఎదురుచూస్తుంటాను” అతనికి విన్పించేలా బిగ్గరగా చెప్పింది. వెంటనే పిచ్చి పట్టినట్టు అరుస్తున్న భర్తని సముదాయించుకోడానికి యింట్లోపలికి పరుగెత్తింది.
షరీఫ్ నవనాడులూ కుంగిపోయినట్టు నడుస్తున్నాడు. తన బతుకు మీద తనకే అసహ్యమేస్తోంది. బావ తమీజుద్దీన్ ఎంత దుర్మార్గుడో తెల్సు కాబట్టి యిన్నాళ్ళూ అతనికి వీలైనంత దూరంగా ఉండి తన గౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. తన వూళ్లో అందరికీ నోట్లో నాలికలా ఉంటూ వాళ్ళ ఆదరాభిమానాల్ని పొందాడు. ఎప్పుడూ ఎవరిచేతా పల్లెత్తు మాట పడకుండా బతికాడు. ఇప్పుడు ఈ వయసులో బావతో అన్నన్ని మాటలు పడినందుకు చచ్చిపోవాలనిపిస్తోంది.
తన వల్ల అక్క ఎన్ని తిట్లు తినాల్సి వస్తుందో తల్చుకుంటే బాధేస్తోంది. మళ్ళా తిరిగి అదే యింటికెళ్ళి అక్కను మరింత ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు.
కానీ అక్క చేతిలో చేయివేసి చేయించుకున్న ప్రమాణం గుర్తొచ్చి ఏం చేయాలో అర్థం కావడం లేదు. యింతక్రితం ఎన్నో సందర్భాల్లో బావ అక్కను గొడ్డుని బాదినట్టు బాదేవాడు. ఇప్పుడు రెండు కాళ్ళూ లేకపోబట్టి మంచంలో పడుకుని తిట్లతో సరిపెడ్తున్నాడు. లేకపోతే ఈ రోజు కూడా బావ చేతిలో అక్క తన్నులు తినాల్సి వచ్చేది. అంతా తన ఖర్మ. భార్యాబిడ్డలకు దూరమైనా అక్క యింట్లో అక్కకు తోడుగా ఉంటూ రోజులు నెట్టుకొద్దామనుకుంటే ఈ ఉపద్రవం ఏమిటి? బావకు కాళ్ళు తెగిపోయి ఉద్యోగం పోగొట్టుకుని యింట్లో మంచం పట్టడం తన దురదృష్టం కాక మరేమిటి?
అంతులేని ఆవేదనలో మునిగి, దిశాహీనంగా నడుస్తున్న షరీఫ్ పక్కనుంచి పిలుస్తున్న లతీఫ్‌ని గమనించలేదు. లతీఫ్ మరింత గట్టిగా పిల్చినా పలక్కపోవడంతో వేగంగా వచ్చి షరీఫ్ భుజం పట్టుకుని కుదుపుతూ “ఏంటీ పరధ్యానం? పిలుస్తున్నా విన్పించుకోకుండా ఎక్కడికెళ్తున్నావు?” అని అడిగాడు.
ఏదో పీడకల కంటూ ఎవరో తడ్తే ఉలిక్కిపడి నిద్రలేచినట్టు షరీఫ్ తన మిత్రుడి వైపు మొదట శూన్యంగా చూసి, వెంటనే గుర్తు పట్టి “ఓ నువ్వా లతీఫ్” అన్నాడు.
“ఏ లోకంలో ఉన్నావు దోస్త్? భాభీ గురొచ్చిందా లేక నీ జిగర్ కా తుకడా ఆస్‌మా జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయావా?” నవ్వుతూ అన్నాడు.
“లేదు లతీఫ్. నాకు సమస్యల మీద సమస్యలొస్తున్నాయి. మా బావ యుద్ధంలో రెండు కాళ్ళూ పోగొట్టుకుని యింటికొచ్చాడని తెల్సుగా.”
“ఆ విన్నాను. రేపో ఎల్లుండో వచ్చి పరామర్శించాలని కూడా అనుకున్నాను. ఐనా మీ బావతో మాట్లాడాలంటే వూళ్లో అందరూ జంకుతారు.. పెడసరం మనిషి కదా.”
“మా బావకు నేనింట్లో ఉండటం ఇష్టం లేదు. నాకిప్పుడు దిక్కు తోచడం లేదు.”
లతీఫ్ కొన్ని క్షణాలు ఆలోచించాడు. “పెద్ద సమస్య వచ్చిందే. మీ బావ మంచోడు కాదని తెలుసు కానీ చివరికి పెళ్ళాం పిల్లలకు దూరమై నిస్సహాయంగా ఉన్న బావమరిదిని యింట్లోంచి తరిమేసేటంత దుర్మార్గుడని అనుకోలేదు షరీఫ్.”
“నా వల్ల అక్కక్కూడా కష్టమే. నేను తనింట్లో ఉన్నన్ని రోజులు అక్కని మనశ్శాంతిగా బతకనివ్వడు.”
“ఓ పని చేయి. మా యింటికొచ్చేయి. ఇటువంటి పరిస్థితుల్లో నా ప్రాణ స్నేహితుడికి ఆసరా కల్పించకపోతే ఇక మన స్నేహానికి అర్థమేముంది?”
“షుక్రియా లతీఫ్. కానీ ఇప్పుడే కాదు. యిల్లొదిలి వెళ్ళాద్దని అక్క నాచేత ప్రమాణం చేయించుకుంది. నేను మీ ఇంటికి వచ్చేస్తే తను బాధపడ్తుంది. మరీ తట్టుకోలేనంత ఇబ్బందిగా ఉంటే నీ దగ్గరకే వచ్చేస్తాను. నాకు మా అక్క తర్వాత ఈ వూళ్లో నీకంటే ఆత్మీయులు ఎవరున్నారు?” అంటూ కంట్లో నీరు పెట్టుకున్నాడు.
“అరే యార్.. ఈ మధ్య ఎందుకు ప్రతి చిన్న విషయానికి కన్నీళ్ళు బొటబొటా కార్చేస్తున్నావు? మంచిది కాదు. అంత బేలగా మారిపోకూడదు. ఎంత పెద్ద కష్టమొచ్చినా కొండలా దాన్ని తట్టుకుని నిలబడగ లగడమే మగతనమంటే” షరీఫ్ భుజం మీద ప్రేమగా చేయి వేస్తూ అన్నాడు లతీఫ్.
“ఏమో తెలియదు. ఈ మధ్య వూర్కూర్కే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. రాత్రుళ్ళు అనాయాసంగానే ఏడుపొచ్చి దిండు తడిసిపోతోంది. పెద్దగా ఏడ్వాలనిపిస్తోంది లతీఫ్” అంటూనే పెద్దగా ఏడ్చేశాడు.
లతీఫ్ అతన్ని ఓదార్చి “మొదట మా యింటికెళ్దాం రా. నాస్తా చేశాక స్కూల్‌కి వెళ్తావుగానీ” అంటూ అతన్ని యింటికి పిల్చుకెళ్ళాడు.
***
మరో నెల భారంగా గడిచింది. బావ తిట్లని భరిస్తూ అక్కవాళ్ళింట్లో ఉండటం షరీఫ్‌కి దుస్సహంగా ఉంది. వీలైనంతవరకు అతనికి ఎదురుపడకుండా గడుపుకొస్తున్నాడు. వసారాలోనే పడుకుంటున్నాడు. జైనాబీ కూడా భర్త చూడకుండా తమ్ముడికి భోజనం చాటుగా పెడ్తోంది. తమీజుద్దీన్‌ది కోడి నిద్ర. అతను నిద్ర పోయాడనుకుని షరీఫ్‌కి రోటీలు వడ్డిస్తున్న సమయంలో “దోచిపెడున్నావా నీ తమ్ముడికి? యిల్లు గుల్ల చేస్తున్నావు కదే. నీ తమ్ముడికైనా సిగ్గుండొద్దూ.. సిగ్గూ శరం లేని మనిషి” అంటూ తిట్ల దండకం మొదలెడున్నాడు. రొట్టెల్తో పాటు అతని అసహ్యమైన తిట్లని కూడా తినడం షరీఫ్‌కి తప్పడం లేదు.
అలాగని అక్కాబావ ఉన్న వూళ్లో పరాయి పంచన చేరితే నలుగురూ ఏమనుకుంటారోనన్న సంశయం ఓ వైపు, తను వెళ్ళిపోతే అక్క బాధపడుందన్న ఆలోచన మరో వైపు.. ఏం చేయాలో తెలియక షరీఫ్ సతమతమౌతున్నాడు.
రోజులు గడిచేకొద్దీ యింట్లో పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది. తమీజుద్దీన్‌కి కాళ్ళు పోయినా పొగరు ఏమాత్రం తగ్గలేదు. తిట్టడంతో పాటు జైనాబీ ఎదురుగా ఉంటే ఆమె మీదకి చంకల్లో పెట్టుకునే చేతికర్రని విసిరేస్తున్నాడు. దెబ్బతగిలినా ఓర్చుకుని మళ్ళా జైనాబీనే ఆ కర్రని తెచ్చి అతని మంచం పక్కన పెట్టాలి, మళ్ళా కోపం వస్తే విసిరేయడానికి వీలుగా.. అలా తెచ్చి మంచం పక్కన పెట్టడం ఆలస్యమైనా మరో కర్రని విసిరి గాయపరుస్తున్నాడు.
తన ఎదురుగానే తనకిష్టమైన అక్కని అలా కొడ్తుంటే అక్కకెంత దెబ్బ తగుల్తోందో తెలియదు కానీ అతని ప్రాణం మాత్రం ఖంజర్తో గుండెల్లో పొడిచినట్టు విలవిల్లాడుతోంది. కాళ్ళు లేని తనకి అన్ని రకాల సపర్యలు చేస్తున్నా కొంచెమైనా కనికరం లేకుండా అంత కర్కశంగా తన బావ ఎలా ప్రవర్తించగలుగుతున్నాడో అతనికి అర్థం కావడం లేదు.
లతీఫ్ ఇచ్చిన ఆహ్వానం అతనికి ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంది. అక్క యింటినుంచి తను వెళ్ళిపోతే అక్క మానసికంగా బాధపడినా బావ పెట్టే శారీరక హింస, అసహ్యమైన తిట్లు అక్కకు తప్పుతాయి కదా అన్పించింది. అందుకే లతీఫ్ వాళ్ళ యింటికి వెళ్ళిపోవాలన్న నిర్ణయానికొచ్చాడు. లతీఫ్ తన స్నేహితుడు మాత్రమే కాదు. కాబోయే వియ్యంకుడు కూడా. అది తన కూతురు ఆస్‌మాకి కాబోయే మెట్టినిల్లు. అక్కడ ఉండటం వల్ల తన గౌరవానికేమీ భంగం వాటిల్లదనుకున్నాడు.
ఆ రోజు ఆదివారం. స్కూల్‌కి శెలవు. పనిదినాల్లో స్కూల్ కెళ్ళి సాయంత్రం వరకు గడిపేస్తుంటే అతని ప్రాణానికి హాయిగా ఉంటోంది. శెలవ రోజు వస్తే మాత్రం వూపిరి ఆగిపోయినట్టు ఇబ్బందిగా ఉంటోంది. ఆ రోజు ఎలా గడపాలో, ఎక్కడ గడపాలో అర్థం కావడం లేదు. బ్రోల్మో చాలా చిన్న వూరు. ఎన్నిసార్లని స్కర్దూకి వెళ్తాడు?? అదీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమేగా. ఈ రోజు ఎలాగైనా లతీఫ్ వాళ్ళ యింటికెళ్ళి ‘సాయంత్రానికి పెట్టే బేడా సర్దుకుని మీ యింటికొచ్చేస్తాను’ అని చెప్పి అతని అనుమతి తీసుకోవాలనుకున్నాడు.
ఉదయాన్నే బయల్దేరి లతీఫ్ వాళ్ళ యింటికి చేరుకున్నాడు. యింటి వాతావరణంలో ఏదో మార్పు.. అందరూ హడావిడిగా ఉన్నారు. కొత్త షేర్వాణీలో షెహజాదాలా మెరిసిపోతున్న హనీఫ్ ముందుకొచ్చి ‘ఆదాబ్’ చెప్పాడు. ఏం జరుగుతుందో అర్థం కాక షరీఫ్ అతని వైపు విస్మయంగా చూశాడు. షరీఫ్ వచ్చాడని తెలిసి లతీఫ్ కూడా యింటోంచి బైటికొచ్చి, తన మిత్రుడ్ని చూసి ఇబ్బందిగా నవ్వాడు. అతను కూడా కొత్త షేర్వాణీ ధరించి ఉన్నాడు.
“ఏంటీ యింట్లో ఏదో వేడుక జరుగుతున్నట్టుందే” అన్నాడు షరీఫ్.
“ఔను. నీకు ముందే చెప్పాలనుకున్నా. వీలు కాలేదు. అలా బైటికెళ్ళి మాట్లాడుకుందాం పద” అంటూ లతీఫ్ అతని భుజం మీద చేయి వేసి నడిపించుకుంటూ కొంత దూరం తీసుకెళ్ళాడు. అక్కడ చెట్టుకింద నాలుగైదు బండరాళ్ళు పరిచి ఉన్నాయి. లతీఫ్ ఓ రాతి మీద కూచుంటూ షరీఫ్‌ని కూచోమన్నట్టు సైగ చేశాడు.
అతను పక్క రాయి మీద కూచున్నాక “నేను చెప్పేది శాంతంగా విను షరీఫ్. పిల్లల మనసెరిగి మసలుకోవాల్సిన రోజులు మనవి. నా కొడుకు హనీఫ్ పెళ్ళికి తొందరపడున్నాడు. అప్పటికీ చెప్పి చూశాను. రెండు మూడు నెలలైతే ఆగుతానన్నాడు. మూడు నెలలు దాటిపోయాయిగా. మొన్ననే మా పక్కూరినుంచి ఓ రిస్తా వచ్చింది. అప్పట్నుంచి మా వాడు ఆ సంబంధమే కావాలని పట్టుపట్టాడు. నాకు ఒప్పుకోక తప్పలేదు. వాడేమో వయసులో ఉన్న కుర్రవాడాయె. ఏడాదో రెండేళ్లో ఆగమంటే ఆగుతాడా చెప్పు.. ఈ రోజు మంగ్నా. నువ్వు బాధ పడ్తావనే నీకు ముందుగా చెప్పలేదు” అన్నాడు లతీఫ్.
ఈ సంబంధాన్ని తెచ్చిందీ, కొడుకుని పెళ్ళికి ఒప్పించిందీ తనే అయినా ఆ నిజం తెలిస్తే షరీఫ్ బాధ పడ్తాడని తప్పంతా హనీఫ్ మీదికి నెట్టేసి, ఈ విషయంలో తన ప్రమేయం ఏమీ లేదని అతన్ని నమ్మించే ప్రయత్నం చేశాడు లతీఫ్.
తను ఏ రాతిమీదైతే కూచున్నాడో ఆ రాతిలా మారిపోయాడు షరీఫ్. తనకీ వూళ్లో మిగిలిన ఓ అందమైన కల.. ఆస్‌మా హనీఫ్‌కి భార్యగా ఈ వూరికి కాపురానికి రావడం.. చివరికి ఆ కల కూడా కళ్ళముందే కరిగిపోతోంది. ఎవర్నని ఏం ప్రయోజనం? తనని దురదృష్టం పగబట్టిన నాగుపాములా వెంటాడుతుంటే ఎవరేం చేయగలరు? లతీఫ్ చెప్పింది నిజమే కదా. పెళ్ళి చేసుకోకుండా ఎన్నాళ్ళు వేచి ఉండమని తనైనా హనీఫ్‌కి చెప్పగలడు? ఏడాదా రెండేళ్ళా.. ఏమో.. తన చేతుల్లో ఏముందని… అది పదేళ్ళు కూడా కావొచ్చు. అన్నాళ్ళూ ఏ కుర్రవాడైనా నిఖా లేకుండా ఎలా ఉండగలడు? అలా ఉండమని శాసించడం కూడా దుర్మార్గమేగా. లతీఫ్ చేసిన పని తప్పుగా అన్పించలేదు. అతని స్థానంలో తనున్నా అలాంటి నిర్ణయమే తీసుకునేవాడు.
ఎటొచ్చీ తన బతుకే అనాథ బతుకైపోయింది. తన ప్రతి అవసరాన్ని దగ్గరుండి చూసుకునే భార్య దూరమైంది. తను కంటి పాపల్లా అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని కళ్ళారా చూసుకునే భాగ్యం లేకుండా పోయింది. అక్క యింట్లో ఉండలేక తనక్కాబోయే అల్లుడి యింట్లో ఉందామని ఆశపడితే చివరికి ఆ అల్లుడే ఇప్పుడు పరాయివాడై పోతున్నాడు.
షరీఫ్ మెల్లగా లేచి నిలబడ్డాడు. మరో వ్యక్తి అక్కడ కూచుని ఉన్నాడన్న స్పృహే లేకుండా నడిచి వెళ్తుంటే వెనకనుంచి లతీఫ్ పెద్దగా అన్నాడు. “నువ్వేమీ దిగులు పడకు షరీఫ్. నా కొడుకు ఎవర్ని చేసుకున్నా నువ్వు నా దోస్త్‌వి కాకుండా పోవు. నిరభ్యంతరంగా మా యింటికొచ్చి ఉండు. నీ కోసం మా యింటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.”
మధ్యాహం ఒంటిగంట దాటినా అతనికి ఆకలన్పించలేదు. అక్క ఎదురుచూస్తూ ఉంటుందని తెల్సినా యింటికెళ్ళాలనిపించలేదు. షింగో నది ఒడ్డున కూచుని, శబ్దం చేస్తూ ప్రవహిస్తున్న నీళ్ళను చూస్తుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు పరుగులు పెడ్తూ రాసాగాయి. అక్క జైనాబీ తననీ, తమ్ముడు బషీర్‌ని ఎంత ప్రేమగా చూసేదో గుర్తుకొచ్చే కొద్దీ అతని కళ్ళల్లో నీళ్ళూరసాగాయి. అలాంటి అక్కకు తను తిరిగి ఏమిస్తున్నాడు? దుఃఖం.. ఏడుపు.. తిట్లు.. దెబ్బలు…
లతీఫ్ వాళ్ళ యింటికెళ్ళినా అక్క బాధ పడకుండా ఉండదుగా. తనకా ఆలోచన రావడమే తప్పు. దానిక్కారణం స్కూల్లో దొరికిన ఉద్యోగాన్ని వదులుకోలేకపోవడమే. ఏం ఆ ఉద్యోగం లేకుండా బతకలేడా? పొలంలో కాయకష్టం చేసి రాటుదేలిన శరీరం. ఎలాగైనా బతగ్గలడు. ఎక్కడికెళ్ళినా బతగ్గలడు. ఏం చేసైనా బతగ్గలడు. అసలీ వూరే వదిలిపెట్టి వెళ్ళిపోతే… అవును. వెళ్ళిపోవాలి. దూరంగా.. తనెవరో ఎవ్వరికీ తెలియని చోటుకెళ్ళి బతకాలి. ఒంటరిగా బతకాలి. ఒంటరి.. అవును.. తను ఒంటరి. తనవాళ్ళంటూ ఎవ్వరూ లేని ఒంటరి..
అతను రోజూ రాత్రుళ్ళు బాగా చీకటి పడ్డాకే యింటికెళ్తున్నాడు. అక్క వసారాలోకి తెచ్చి పెట్టే రోటీలు తినేసి అక్కడే పడుకుంటే, బావ తిట్టే తిట్లు ఎక్కువ సేపు వినకుండానే నిద్రలోకి జారిపోవచ్చని ఆశ.
ఆ రోజు కూడా ఎప్పటికిమల్లే ఆలస్యంగానే యింటికెళ్ళాడు. లోపల్నుంచి బావ పెద్దగా అరవడం విన్పించింది. “అదుగో వచ్చాడు చూడు పరాన్న జీవి.. పో.. పోయి పెట్టు.. పందికొక్కులా పడి మెక్కటాని కొచ్చాడుగా.”
“అలా అనకండి. వాడసలే బాధల్లో ఉన్నాడు” జైనాబీ గొంతు..
“అతను యింట్లో ఉంటే నాకూ బాధగానే ఉంటోంది.. వెళ్ళిపొమ్మని చెప్పు.”
“మనం తప్ప వాడికింకెవరూ లేరండి. వెళ్ళిపొమ్మంటే ఎక్కడికెళ్తాడు? ”
“జహన్నుంలోకి వెళ్ళమను.”
“తప్పండీ.. అలా అనకూడదు.”
“ఎవర్దీ తప్పు? నీ తమ్నుడ్ని యింట్లో పెట్టుకుని నా యిల్లు గుల్లచేస్తున్న నీదీ తప్పు.. సిగ్గులేకుండా నా యింట్లో వేలాడుతున్న నీ తమ్ముడ్ది తప్పు. నాది తప్పంటావా ఛినాల్” అంటూ చేతికర్రని తిప్పి ఆమె మీదికి విసిరేశాడు. అది నేరుగా వెళ్ళి ఆమె నుదుటిని తాకింది. “అమ్మీ” అంటూ జైనాబీ కుప్పకూలిపోయింది.
తన బావ వచ్చినప్పటి నుంచి అతనున్న గదిలోకి అడుగు పెట్టని షరీఫ్ అక్క పెట్టిన కేక వినగానే మరో ఆలోచన లేకుండా లోపలికి పరుగెత్తాడు. అక్క నుదుటి నుంచి రక్తం ధారలుగా కారుతోంది.
లోటాతో నీళ్ళు తెచ్చి గాయాన్ని కడిగి, రక్తం ఆగేవరకు రుమాల్తో అదిమి పట్టాడు. ఆమె షరీఫ్‌ని చుట్టుకుని మెల్లగా రోదించసాగింది. ఆ రాత్రి అక్కా తమ్ముళ్ళిద్దరూ ఎంగిలి పడలేదు.
ఉదయం జైనాబీ స్నానానికి వెళ్ళినపుడు, షరీఫ్ లోపలికెళ్ళి తను ఆస్‌మా పెళ్ళి కోసం కొన్న బట్టల మూట తీసుకున్నాడు. ఆ యింట్లో తను దాచుకున్న తన ఆస్తి అదే. క్రూరంగా చూస్తున్న తమీజుద్దీన్ చూపుల్ని తప్పించుకుంటూ బైట పడ్డాడు. బస్టాండ్ చేరుకుని స్కర్దూ వెళ్ళే బస్సెక్కాడు.
***
భారతదేశ సరిహద్దు రేఖ నుంచి కేవలం పదిహేను మైళ్ళ దూరంలో ఉన్న లాహోర్ నగరం.. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి రాజధాని…
రావి రోడ్‌లో భర్త పక్కన భీతహరిణేక్షణలా నడుస్తోంది గోరీబీ. ఆమె శరీర లావణ్యమంతా నల్లటి బురఖాలో కప్పబడి ఉండటంతో మగవాళ్ళ చూపులు ఆమెను తాకవన్న ధీమాతో ఛాతీ పొంగించి పులిలా నడుస్తున్నాడు అస్లంఖాన్. గోరీబీ అతనికి రెండో భార్య…
అస్లంఖాన్ భార్యల సమక్షంలోనే పులిలా వ్యవహరిస్తుంటాడు. తన గాండ్రింపులతో ఇద్దరు భార్యల్ని లేడి కూనల్ని పులి భయపెట్టినట్టు భయపెడ్తుంటాడు. అతను అరవడమే కాదు రక్తం కారేలా కరుస్తాడన్న విషయం ఇద్దరికీ అనుభవమే. అందుకే అతనికి అణగిమణగి వ్యవహరిస్తుంటారు. ఆరడుగుల ఎత్తు… ఎత్తుకు తగ్గ లావు… ట్రిమ్ చేసిన తెల్లటి గడ్డం… మెలి తిప్పిన మీసం… అతని వయసు అరవై దాటి నాలుగేళ్ళయినా ఆరోగ్యం చెడలేదు… బలం తగ్గలేదు…
(ఇంకా ఉంది)