[dropcap]నీ[/dropcap]డనిస్తుందనుకున్న చెట్టే
నెత్తిమీద విరిగి పడ్డట్టు
నమ్మశక్యంగాక
నన్ను నేనే నిందించుకుంటూ
ఎవర్నీ ఏమనలేక
చేసేది ఏమీ లేక
చితికిన మనసుతో
చిన్నబుచ్చుకుంటూ
కళావిహీనంగా కన్నీటి పర్యంతంగా
బాధల్లో పాలు పంచుకోలేని వాళ్ళు
పై పూతలు పూస్తుంటే
నవ్వాలో ఏడ్వాలో తెలీక
నా సహాయం పొందిన వారే
నా పతనాన్ని వాంఛిస్తుంటే
నన్ను వంచిస్తుంటే
ఆచరించిన ఆదర్శమే
అపహాస్యం చేస్తుంటే
నమ్ముకున్న మనిషే
నట్టేట ముంచేస్తుంటే
విస్మయం విషాదం చుట్టుముడుతుంటే
నన్ను నేనే మౌనంగా హింసించుకుంటూ/ధ్వంసించుకుంటూ
నాకు నేను సానుభూతి ప్రకటించుకుంటూ
నన్ను నేను సంతోషపరుచుకుంటూ
నాలో నేనే కుమిలిపోతూ
నాకు నేనే ప్రశ్నార్థకంగా
అయోమయంగా, అన్యమనస్కంగా…!