[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన గురువరేణ్యులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]
విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుల ఎంపిక:
[dropcap]తొ[/dropcap]లి రోజుల్లో వైస్ ఛాన్స్‌లర్ల ఎంపిక ప్రక్రియ విశ్వవిద్యాలయ రాజపోషకుల ఓటింగ్ ద్వారా జరిగేది. విశ్వవిద్యాలయ చట్టంలో మార్పులు తెచ్చి రాష్ట్ర గవర్నరు ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు పంపిన మూడు పేర్లతో ఒక పేరు ఆమోదించే పద్ధతి మొదలైంది. సీనియారిటీ/ప్రతిభ ఆధారంగా వారు ఎంపికయ్యారు. కాలక్రమంగా రాజకీయ నియామకాలు మొదలయ్యాయి.
కుల ప్రాతిపదికగా దామాషా పద్ధతిలో ఉప’కుల’పతులు నియమింపబడుతున్నారు. రాష్ట్ర విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుల కాలపరిమితి, తొలుత ఐదేళ్ళు, తర్వాత మూడేళ్ళు కాగా, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఐదేళ్ళుగా ఏర్పరిచారు. ఈ సంవిధానంలో ఇప్పటివరకు తెలుగు శాఖ నుండి ఉపాధ్యక్షులైన ఆచార్యుల జాబితా ఒకటి రూపొందించాను. అందినంత మేరకు సమాచార సేకరణ చేశాను.
ఆచార్యుడు | మాతృ సంస్థ | ఉపాధ్యక్షులైన విశ్వవిద్యాలయం |
కట్టమంచి రామలింగా రెడ్డి | మైసూరు విశ్వవిద్యాలయం | ఆంధ్ర విశ్వవిద్యాలయం |
సర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు | పి.ఆర్. కాలేజ్, కాకినాడ | మద్రాసు విశ్వవిద్యాలయం
(1925-28) |
ఆచార్య జి. యన్. రెడ్డి | శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం | శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం |
ఆచార్య కొలకలూరి ఇనాక్ | శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం | శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం |
ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి (లింగిస్టిక్స్) | ఉస్మానియా విశ్వవిద్యాలయం | హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం |
ఆచార్య పి. కుసుమకుమారి | పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం | శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం |
ప్రత్యేక తెలుగు విశ్వవిద్యాలయం:
1983లో నందమూరి తారకరామారావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ప్రత్యేకించి తెలుగు విశ్వవిద్యాలయ స్థాపనకు సంకల్పించారు. 1985లో విశ్వవిద్యాలయ స్థాపన జరిగింది. ఆచార్య తూమాటి దొణప్ప వ్యవస్థాపక వైస్-ఛాన్స్‌లర్. కేవలం తెలుగు ఆచార్యులనే వి.సి.లుగా నియమించాలి. ఆ వరుసలో 2021లో తంగెడ కిషన్ రావు నియామకం జరిగింది. కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయం ఎన్.టి.రామారావుగారి సంకల్ప బలంతో 1997లో ప్రారంభమైంది. తొలి వి.సి.గా ఆచార్య విశ్వనాథ అరుణాచలం 1997-2001 మధ్య నియమితులయ్యారు.
ఆచార్యుడు | మాతృ సంస్థ | ఉపాధ్యక్షులైన విశ్వవిద్యాలయం |
ఆచార్య తూమాటి దొణప్ప | ఆంధ్ర విశ్వవిద్యాలయం | తెలుగు విశ్వవిద్యాలయం |
ఆచార్య సి. నారాయణ రెడ్డి | ఉస్మానియా విశ్వవిద్యాలయం | తెలుగు విశ్వవిద్యాలయం, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం |
ఆచార్య పేర్వారం జగన్నాధం | కాకతీయ విశ్వవిద్యాలయం | తెలుగు విశ్వవిద్యాలయం |
ఆచార్య నాయని కృష్ణకుమారి | ఉస్మానియా విశ్వవిద్యాలయం | తెలుగు విశ్వవిద్యాలయం |
ఆచార్య యన్. గోపి | ఉస్మానియా విశ్వవిద్యాలయం | తెలుగు విశ్వవిద్యాలయం |
ఆచార్య జి.వి. సుబ్రమణ్యం | కేంద్రీయ విశ్వవిద్యాలయం | తెలుగు విశ్వవిద్యాలయం |
డా. ఆవుల మంజులత | తెలుగు అకాడమీ | తెలుగు విశ్వవిద్యాలయం |
ఆచార్య అనుమాండ్ల భూమయ్య | కాకతీయ విశ్వవిద్యాలయం | తెలుగు విశ్వవిద్యాలయం |
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి | ఉస్మానియా విశ్వవిద్యాలయం | తెలుగు విశ్వవిద్యాలయం |
ఆచార్య యస్.వి. సత్యనారాయణ | ఉస్మానియా విశ్వవిద్యాలయం | తెలుగు విశ్వవిద్యాలయం |
ఆచార్య తంగెడ కిషన్‌రావు | ఉస్మానియా విశ్వవిద్యాలయం | తెలుగు విశ్వవిద్యాలయం |
ఆచార్య రవ్వా శ్రీహరి | కేంద్రీయ విశ్వవిద్యాలయం | ద్రవిడ విశ్వవిద్యాలయం (2001-05) |
ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ | తెలుగు విశ్వవిద్యాలయం | ద్రవిడ విశ్వవిద్యాలయం (2005-2008 |
ఆచార్య కడప రమణయ్య | తెలుగు విశ్వవిద్యాలయం | ద్రవిడ విశ్వవిద్యాలయం (2008-11) |
ఆచార్య తుమ్మల రామకృష్ణ | హైదరాబాదు కేంద్రీయవిశ్వవిద్యాలయం | ద్రవిడ విశ్వవిద్యాలయం (2021-) |
ఆచార్య యస్.బి. రఘునాధాచార్య (సంస్కృతం) | శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం | రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠ్ |
ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ (సంస్కృతం) | రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠ్ | శ్రీ వేంకటేశ్వర వేదిక్ విశ్వవిద్యాలయం |
ఆచార్య మురళీధర శర్మ (సంస్కృతం) | రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠ్ | రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠ్ |
రిజిస్ట్రార్లు:
ఆచార్యుడు | హోదా | విశ్వవిద్యాలయం/సంస్థ |
డా. తూమాటి దొణప్ప | రిజిస్ట్రార్ | నాగార్జున విశ్వవిద్యాలయం |
డా. పి.యల్. శ్రీనివాస రెడ్డి | రిజిస్ట్రార్ | శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం |
డా. జె. ప్రతాప రెడ్డి | రిజిస్ట్రార్ | శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, డైరక్టర్ తెలుగు అకాడమీ |
డా. టి. గౌరీశంకర్ | రిజిస్ట్రార్ | తెలుగు విశ్వవిద్యాలయం |
డా. జి. యాదగిరి | రిజిస్ట్రార్ | డైరక్టర్ తెలుగు అకాడమీ |
డా. ఏ. కె. వేణుగోపాలరెడ్డి | రిజిస్ట్రార్ | ద్రవిడ విశ్వవిద్యాలయం |
డా. ఎల్. వి. కృష్ణారెడ్డి | రిజిస్ట్రార్ | విక్రమసింహపురి విశ్వవిద్యాలయం |
ప్రజ్ఞాభారతి – ‘సుబ్రమణ్య’భారతి (1935-2007):
కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో తెలుగు శాఖ ఆచార్యులుగా పని చేసిన గూడ వెంకట సుబ్రహ్మణ్యం సుప్రసిద్ధ విమర్శకులు, రచయిత, పరిపాలనా దక్షులు. మాటతీరులో, భావ వ్యక్తీకరణలో స్పష్టత కనిపిస్తుంది. సాహిత్య విమర్శలో మేరునగ శిఖరం. జీవిఎస్ జీనియస్ అని మిత్రులు పిలుచుకొంటారు. 2003-2006 మధ్య తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు. 1958 నుంచి 21 సంవత్సరాలు ఉస్మానియా అధ్యాపకులు. 1995లో కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు.
ప్రకాశం జిల్లా చీరాల మండలం ఆవిడిపూడి గ్రామంలో 1935, సెప్టెంబర్ 10న సుబ్రహ్మణ్యం సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏ. చేసి, 1969లో ప్రథమాంధ్ర మహాపురాణం మార్కండేయ పురాణం – అనే అంశంపై సిద్ధాంత వ్యాసం సమర్పించి పి.హెచ్.డి. పొందారు. పల్లా దుర్గయ్య పర్యవేక్షకులు. తిక్కన శిష్యుడైన మారన ఆ గ్రంథ రచయిత. దివాకర్ల గారు ఈ సిద్ధాంత గ్రంథాన్ని ప్రశంసిస్తూ –
“మాతృకయైన మార్కండేయ పురాణమునకును మనుచరిత్రాది పుత్రికలకును వస్తు విన్యాసమున గల సామ్య వైషమ్యములను విశదీకరించుటయందును వ్యాసకర్త చూపిన నేర్పు ప్రశంసింపదగియున్నది. వీరు కావించిన కృషియు, పరిశోధనయు విద్వద్విమర్శక వినుతములై యున్నవి”.
25 సంవత్సరాల వయస్సులోనే తెలుగులో వీరరసం గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం 1960లో వీరికి లభించింది. 1983లో రసోల్లాసం గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమతి; 1986లో ఆంధ్ర సాహిత్య విమర్శ- ఆంగ్ల ప్రభావం అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించాయి. ఆంధ్రభూమి, ఉదయం వంటి పత్రికలలో ‘కాలమ్’ అనే పేర సమకాలీన సాహిత్య స్థితిగతులపై సజీవ వ్యాఖ్యాన స్రవంతిని వెలువరించారు.
అధ్యయనముతో బాటు పరిశోధనలో వీరు సవ్యసాచి. విశ్వనాథ అనుయాయిగా పేరు పొందారు. తెలుగు సాహిత్య విమర్శలో నవ సంప్రదాయ ధోరణికి బీజావాపన చేశారు. 1996లో వీరి షష్టిపూర్తి సందర్భంగా వీరి గ్రంథ సంపుటులు వెలువరించారు. కథలు, నవలలు, నాటకాలు, పద్యాలు, గేయాలు, తాత్విక గ్రంథాలు, విమర్శ – అన్ని ప్రక్రియలలో రచనలు చేశారు. 2006లో వీరి సప్తతి ఘనంగా జరిపారు. 70 మంది కవులు, రచయితలు, విమర్శకులు, అధ్యాపకులకు తమ గ్రంథాలు ఆ సందర్భంగా బహుకరించారు.
మహాభారత సమగ్ర వ్యాఖ్యాన సంపాదకత్వం:
సుబ్రహ్మణ్యం జీవిత చివరి దశకంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి పక్షాన ఆంధ్ర మహాభారత సమగ్ర వ్యాఖ్యానం సంపాదకత్వం చిరస్మరణీయం. 15 సంవత్సరాలుగా మూలనబడిన ఆ గ్రంథాల పరిష్కరణ బాధ్యతలను స్వీకరించి దాదాపు ఒక దశాబ్ది కృషిగా 15 సంపుటాలు పరిష్కరించారు. అందులో విరాటపర్వంలో కొంతభాగానికి నేను వ్యాఖ్యానం వ్రాసే అవకాసం శ్రీనివాసుడు నాకు కల్పించాడు. ఆ సంపుటాలు 2007లో తిరుమలలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి డా. వై.యస్. రాజశేఖరరెడ్డి ఆవిష్కరించారు.
బహుముఖ భారతి:
సోదరులు వెంకట శేషయ్య వద్ద అలంకార శాస్త్ర విషయాలు జి.వి.యస్. నేర్చుకొన్నారు. సాధు శ్రీనివాస శాస్త్రి వద్ద ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుని దత్త మంత్రోపదేశం పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యూనివర్శిటీ ఫస్ట్ వచ్చిన వారికి ఉద్యోగ కల్పన ప్రణాళికలో భాగంగా వరంగల్‍లో తెలుగు ఉపన్యాసకుడిగా ఉద్యోగ జీవితం ఆరంభించారు. రీడర్‍గా పదోన్నతిపై ఉస్మానియాకు బదిలీ అయ్యారు. హైదరాబాదులో యువభారతిలో అలుపెరుగని సైనికుడిలా ముందు నిలిచారు.
ఉద్యోగ ప్రస్థానం:
1979 నుండి 1995 వరకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వివిధ హోదాలలో పని చేశారు. 1985 సెప్టెంబరులో కొత్తపల్లి వీరభద్రరావు పదవీ విరమణాంతరం జి.వి.యస్. శాఖాధ్యక్షులై 1988 సెప్టెంబరు వరకు తెలుగు శాఖ అధ్యయన అధ్యాపనాలకు దిశానిర్దేశం చేశారు. 1995-98 మధ్య విజిటింగ్ ప్రొఫెసర్. 1998-2000 మధ్య యుజిసి ఎమిరిటస్ స్కాలర్. వీరి పర్యవేక్షణలో 20 పిహెచ్‌డిలు, 43 ఎంఫిల్ పట్టాలు పొందారు. 2006 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం నాడు వారి స్వర్లోక ప్రస్థానం.
హైదారాబాదు విశ్వవిద్యాలయం హ్యుమానిటీస్ డీన్‍గా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌గా, అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఇన్‌ఛార్జ్ వైస్-ఛాన్స్‌లర్‌గా, సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్‍గా, జ్ఞానపీఠ కమిటీ సభ్యులుగా, సత్యసాయి స్టడీ సర్కిల్ రాష్ట్ర కన్వీనర్‍గా విశేష ఖ్యాతి గడించారు. 40 గ్రంథాలు పరిశోధనాత్మకంగా ప్రచురించారు. వీరి రచనలలో ప్రముఖాలు – మహాభారత యుద్ధ వీరులు, సోదర భాషల సామెతలు, భారతంలో రసవద్ఘట్టాలు, వీరరసం, తిరుపతి వేంకట కవుల కావ్యసమీక్ష, విశ్వనాథ నవ్య సంప్రదాయము, నవయుగ రత్నాలు, 20వ శతాబ్ది విశ్వ సాహిత్య విమర్శ, జి.వి.యస్. రూపకాలు, జి.వి.యస్. నవలలు – కథలు, అనుశీలన, జీవియస్ సాహితీ సమాలోచన.
వీరు సాహిత్య పోషణ కోసం జి.వి.యస్. సాహితీ కళాపీఠం స్థాపించారు.