నా జీవన గమనంలో…!-41

49
3

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

110

[dropcap]1[/dropcap]990 సంవత్సరం.

సంస్థలో శిక్షణా కార్యక్రమాలు, ముందుగా తయారు చేసుకున్న క్యాలెండర్ ప్రకారం, నెల నెలా క్రమం తప్పకుండా జరుగుతూనే వున్నాయి. శిక్షణకు వచ్చినవారందరూ, సంస్థలో సమకూర్చిన సౌకర్యాలతో సంతృప్తి చెందుతున్నారు. శిక్షణలో తాము నేర్చుకున్న విషయాలు తమకెంతో ప్రయోజనకరంగా ఉండబోతున్నాయని విశ్వసిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆంధ్రా బ్యాంకు శాఖల ద్వారా, ఋణాలు పొందిన లబ్ధిదారులు మా సంస్థలో, వివిధ అంశాల్లో శిక్షణ పొందేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నెలలో కనీసం మూడు లేక నాలుగు శిక్షణా కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. శిక్షణా కార్యక్రమాలపై మేము పంపుతున్న నివేదికలను పరిశీలించి, ఆంధ్రా బ్యాంకు, హైదరాబాద్, హెడ్ ఆఫీసు ఉన్నతాధికారులు, ముఖ్యంగా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ మాలకొండారెడ్డి గారు, తరచూ మమ్మల్ని మెచ్చుకుంటూ, ఉత్తరాలు పంపుతూ, మమ్మల్ని ఉత్సాహపరుస్తూ, మాలో ఉత్తేజాన్ని నింపుతున్నారు. తద్వారా, నేనూ, మా సిబ్బంది, మా విధుల నిర్వహణలో లీనమై, కార్యక్రమాలన్నింటినీ సమర్థవంతంగా నిర్వహిస్తూ, అందరి మన్ననలను పొందుతూ ముందుకు సాగుతున్నాము.

111

మా సంస్థ భవనానికి ముందు, వెనుక చాలా పెద్ద విశాలమైన ఖాళీ స్థలం ఉంది.

భవనానికి ముందువైపు మంచి పూలతోటను పెంచుతూ, వచ్చే వారందరికి అందులో తిరుగుతున్నంతసేపు, మంచి ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించదలచుకున్నాము. తద్వారా సంస్థ యొక్క అందచందాలు కూడా ద్విగుణీకృతం అవుతాయి.

అలాగే భవనానికి వెనుక వైపు వున్న ఖాళీ స్థలంలో ఆకుకూరలు, కాయగూరలు – రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడకుండా, పచ్చిరొట్ట ఎరువులు, వేపచెట్టు ఆకుల రసంతో తయారు చేసిన సంరక్షకాలను వాడుతూ పెంచాలనుకున్నాము. అలా పండించిన ఆకుకూరలను, కాయగూరలను, మా సంస్థలో శిక్షణ కోసం వచ్చే వారికి క్యాటరింగ్ కాంట్రాక్టరు ద్వారా వండించి, వడ్డించాలనుకున్నాము.

అనుకున్నదే తడవుగా ఒక తోటమాలిని, అతనికి సహాయకులుగా ఒక ఆరుగురు కూలీలను, నెలవారీ జీతాలపై తీసుకున్నాము. వారు వెంటనే పూలతోటను పెంచేందుకు, ఆకుకూరలు, కాయగూరలను పండించేందుకు, భవనం ముందూ, వెనుక ఉన్న ఖాళీ స్థలాలను తయారు చేసే పనులు మొదలుపెట్టారు. రాజమండ్రిలో వున్న విత్తన విక్రయ కేంద్రంలో ఆకుకూరలు, కాయగూరలను పండించేందుకు కావలసిన విత్తనాలను కొని తెచ్చాము. ముందుగా ఆ సీజన్‌లో పండే వాటికే ప్రాముఖ్యతను ఇచ్చి, భవనానికి వెనుక వున్న ఖాళీ స్థలంలో, ఒక క్రమబద్ధమైన పద్ధతిలో విత్తనాలను నాటించాము. అవి చక్కగా మొలకెత్తి, మాలో ఆనందాన్ని రేకెత్తించాయి.

భవనం ముందు వైపున ఉన్న ఖాళీస్థలం – పూలతోటను పెంచేందుకు తయారైంది. రాజమండ్రికి దగ్గరలోనే ఉన్న కడియం నర్సరీలలో, పూలమొక్కలను కొని తెచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నాము.

112

ఆ రోజు ఉదయమే నేను, జగన్నాధ రాజు, హరకృష్ణ కడియంకి బయలుదేరాము. ముందుగా ధవళేశ్వరం దగ్గర గోదావరి నదిపై నిర్మించబడిన ధవళేశ్వరం బ్యారేజీని, మ్యూజియంను చూసుకుంటూ, కడియం వెళ్దామనుకున్నాము.

ధవళేశ్వరం చేరుకుని గోదావరి నదిపై కట్టిన బ్యారేజీని చూస్తుంటే, మా ఆనందాల వెల్లువ కట్టలు తెంచుకుని పారిందంటే అతిశయోక్తి కాదు.

నిజానికి, ఈ బ్యారేజి నిర్మాణం వెనుక పెద్ద చరిత్రే వుంది!

ఈ బ్యారేజీ నిర్మించక ముందు, ఉభయ గోదావరి జిల్లాల్లో అతివృష్టి, అనావృష్టిలతో కరువు కాటకాలు తాండవించేవట! ఆఖరికి, ఆకలిదప్పులకు తట్టుకోలేక, కన్నబిడ్డలను సైతం, అంగట్లో సరుకుల్లా, అక్కడి ప్రజలు అమ్ముకొనేవారట! 1839 సంవత్సరంలో గోదావరి నదిపై వచ్చిన ఉప్పెనలో రెండు లక్షలమంది మృతి చెందారుట!

అలాంటి విపత్కర సమయాల్లోనే, బ్రిటీష్ ఆర్మీ జనరల్ సర్ ఆర్థర్ కాటన్ (1803-1899) మద్రాసు ఆర్మీలో జనరల్‍గా చేరారు. వారు స్వతహాగా ఇరిగేషన్ ఇంజనీర్. అప్పట్లో ఉభయ గోదావరి జిల్లాల్లో నెలకొన్న భయానక పరిస్థితులను చూసి చలించిపోయారట!

గలగలా పారుతున్న గోదావరి నదీజలాలు వృథాగా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలిసిపోవడం చూసిన కాటన్ దొర మదిలో ఆలోచనలు మొలకెత్తాయి. ఆ ఆలోచనల పర్యవసానమే ఈ ధవళేశ్వరం బ్యారేజీ. ఏ మాత్రం రవాణా సౌకర్యాలు లేని, ఉభయ గోదావరి జిల్లాల్లోని మారుమూల గ్రామాలకు సైతం, గుర్రంపై ప్రయాణిస్తూ, పూర్తిగా అధ్యయనం చేశారు. ఆ అధ్యయనంలో బయటపడిన వాస్తవాలతో ధవళేశ్వరం బ్యారేజీకి రూపకల్పన చేస్తూ తయారు చేసిన ప్రాజెక్టు రిపోర్టును బ్రిటీషు గవర్నమెంటుకు పంపారు. గవర్నమెంటు ఆ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తే, కాటన్ దొర స్వయంగా వెళ్ళి, అక్కడి అధికారులను తన సోదాహరణ విశ్లేషణతో ఒప్పించి, ఆ ప్రాజెక్టుకు అనుమతి సాధించారు.

113

1846 సంవత్సరంలో బ్యారేజీ నిర్మాణాన్ని మొదలెట్టారు కాటన్ దొర. తాటి ఓదెలు, టేకు, సున్నపు రాళ్లను ఉపయోగించి, మొదటిగా, మూడు అడుగుల ఎత్తున ఆనకట్టను నిర్మించి, తరువాత ఆ ఎత్తును పెంచుకుంటూ పోయారు. ప్రభుత్వ సహకారం అంతంత మాత్రంగా ఉన్నా, నిరాశ చెందక, మొక్కవోని పట్టుదలతో, రోజుకి 2000 నుండి 3000 మంది కార్మికుల శ్రమ సేవలను వినియోగించుకుంటూ, 1852 సంవత్సరంలో బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేయగలిగారు కాటన్ దొర.

బ్యారేజీ పొడవు 3,599 మీటర్లు… వుంటుంది. 600 కి.మీ. పొడవున్న కాలువలు, 3500 కి.మీ. పొడవున్న ఛానెల్సు, పంట ఓదెల ద్వారా, ఉభయ గోదావరి జిల్లాల్లోని లక్షల ఎకరాల పంట సాగుకు నీరందిస్తుంది ధవళేశ్వరం బ్యారేజీ. ఆ కాటన్ దొర పుణ్యమా అని, ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలు, పచ్చని పొలాలతో, సస్యశ్యామలంగా ఓలలాడుతున్నాయి. ఆ ప్రాంత ప్రజల సుఖ సంతోషాలకు పూలబాటలు వేసింది… కాటన్ దొర కట్టించిన ఆ బ్యారేజీ.

అందుకే ఇప్పటికీ, ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాల్లో, ఆ ప్రాంత ప్రజలు, ముందుగా సర్ ఆర్థర్ కాటన్ దొరకు పిండ ప్రదానం చేసి, ఆ తరువాతనే తమ పితృ దేవలతకు పిండ ప్రదానం చేస్తూ, కాటన్ దొరపై తమకున్న ప్రేమాభిమానాలు చాటుకుంటున్నారు.

114

అక్కడి నుండి, కాటన్ మ్యూజియం దగ్గరకు వెళ్ళాము. ముందుగా, గుర్రంపై ప్రయాణిస్తున్న సర్ ఆర్థర్ కాటన్ దొర నిలువెత్తు విగ్రహాన్ని చూసి రెండు చేతులు జోడించి నమస్కరించాము. ఆయనకే సొంతమైన ఆ ఠీవీని, ఆ దర్జాను చూసి అచ్చెరు వందాము.

సర్ ఆర్థర్ కాటన్ దొర ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణంలో ఎంత కృషి చేశారో, ఎన్ని కష్టాలు పడ్డారో, మన కళ్ళకు కట్టినట్టు చూపించే దాదాపు వంద చిత్తరువులను చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లాయి.

బ్యారేజీ నిర్మాణం కోసం… 1847 నుండి 1852 వరకు ఉపయోగించిన అసలైన యంత్రాలను, ఇతర పనిముట్లను, సందర్శకుల దర్శనార్థం అక్కడ ప్రదర్శించారు. వాటిని చూస్తుంటే, ఒక్కసారి ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో, ఇంత గొప్ప కట్టడాన్ని నిర్మించి, ఉభయ గోదావరి జిల్లావాసులకు కానుకగా అందించి, వారి అభ్యున్నతికి ముఖ్య కారకుడైన సర్ ఆర్థర్ కాటన్ దొర గారు, నిజంగా శ్లాఘనీయులు!!

115

అక్కడి నుండి కడియం వెళ్ళి నర్సరీలను చేరుకున్నాము. ఒక్క అందమైన పూవును చూస్తేనే… మనసు పులకరిస్తుంది. అలాంటిది, కొన్ని లక్షల పూలను ఒక్క ప్రాంతంలో, ఒకేసారి చూస్తుంటే, మనసు పురివిప్పిన మయూరిలా నాట్యం చేసింది.

కడియం మండలంలోని 13 గ్రామాల్లో సుమారు 40 వేల ఎకరాల్లో ఈ నర్సరీలు విస్తరించి ఉన్నాయి. అక్కడి నర్సరీ యజమానులు పూల మొక్కలను, పండ్ల మొక్కలను, కంటికి రెప్పలా చూసుకుంటూ కన్నబిడ్డల్ని సాకినట్టు పెంచుతారు. మన రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు, దేశంలోని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు చేరవేసేటప్పుడు, అటు ప్యాకింగులోనూ, ఇటు రవాణాలోనూ, అత్యంత జాగ్రత్తలు పాటిస్తారు వారు. థాయ్‌ల్యాండ్, మలేషియా, జపాన్ వంటి దేశాల నుండి, వివిధ రకాల మొక్కల విత్తనాలను తెప్పించుకుని, ఇక్కడ నర్సరీలు పెంచుతూ, వేరెక్కడా కనబడని మొక్కలని సైతం ఇక్కడ పెంచుతారు. అందుకే కడియం నర్సరీల్లోని మొక్కలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది.

ఇక్కడ సాధారణ మొక్కల నుండి, అరుదైన మొక్కలు, దృష్టికి గోచరమగునంతటి ప్రదేశంలో తోటలను పెంచేందుకు, అనువైన నాణ్యమైన మొక్కలు మనకు కనువిందు చేస్తాయి. ఇక్కడ నర్సరీలలో పెంచబడే బోన్సాయి మొక్కలు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఒకసారి… ఇక్కడ పెంచబడిన ఒక బోన్సాయి మొక్క విదేశీ మార్కెటులో 13 లక్షల రూపాయలు పలికిందంటే, అది నమ్మశక్యం కాని నగ్నసత్యం. కడియం నర్సరీలు దేశవిదేశాలల్లో వ్యాపారం, రోజుకి కోట్ల రూపాయల్లో వుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

***

ఆ నర్సరీలోనే మాకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. భోజనానంతరం… మా సంస్థ భవనం ముందు పెంచబోయే పూలవనానికి అవసరమైన పూల మొక్కలను, కొన్ని పండ్ల మొక్కలను ఎన్నుకోవడంలో, నర్సరీ యజమానులు మాకు తగిన సలహాలను ఇచ్చారు. ఆ మొక్కలను కొనుగోలు చేసిన పిమ్మట, ఆ పూదోటల అందచందాలను, మరొక్కమారు తనివితీరా ఆస్వాదించి, తిరుగు ప్రయాణమయ్యాము.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here