జ్ఞాపకాల పందిరి-79

38
3

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

అలా ఎప్పుడూ ఊహించలేదు..!!

[dropcap]మ[/dropcap]నిషి ఎదిగే కొద్దీ వివిధ దశలు దాటుకుంటూ ముందుకు సాగిపోతుంటాడు. వయసు పెరగడం అనేది అందరి విషయంలోనూ ఒకేమాదిరిగా ఉంటుంది. కానీ మనిషిలోని దశలూ వాటి స్వరూపము అందరిలో ఒకే మాదిరిగా వుండే అవకాశం లేదు. ఆర్థిక పరిస్థితులు, తల్లిదండ్రుల పెంపకం, చుట్టుపక్కల వాతావరణ ప్రభావం, స్నేహాలు, ఇలా ఎన్నో అంశాలు దీనితో ముడిపడి ఉంటాయి. బాల్యంలో వున్న సమస్యలు, యవ్వనంలో వుండాలని లేదు, యవ్వనంలో వున్నజీవితం వృద్ధాప్యంలో వుండాలని లేదు. ఎవరికైనా ఇది వర్తిస్తుంది.

చదువుసంధ్యలు పూర్తయ్యాక, ఉద్యోగంకోసం వేట, తర్వాత పెళ్లి తంతు ఆ.. తర్వాత పిల్లలు, వాళ్ళ ఎదుగుదల, ఇలా ఇదొక జీవిత చక్రం. ఈ జీవిత చక్ర గమనంలో తరాలు మారిపోతాయి, కాలమూ మారిపోతుంది. ఈ నేపథ్యంలో మన జీవితం ఒక ఆనందమయ జీవితంగా మారడానికి, మలుచుకోవడానికి కాలం కలిసిరావాలి, పరిస్థితులు అనుకూలించాలి, కుటుంబ సహకారం తగినంత అందుబాటులోకి రావాలి. ప్రయత్నం చేయకుండా, కష్టపడకుండా అనుకున్నవి అనుకున్నట్టు జరిగిపోవాలంటే అది జరిగే పనికాదు. కొందరు “అన్నింటికీ.. ఆ దేవుడివున్నాడు” అంటూ తాము ప్రయత్నించకుండానే భారం అంతా దేవుడి నెత్తిమీద పెట్టేస్తారు. మరికొంతమంది “మనదేముందీ అంతా ఆ దేవుడి దయ.. నారు పోసినవాడు నీరు పోయకుండా ఉంటాడా?” అని సామెతల వర్షం కురిపిస్తారు. మన మెదడు స్పందించకుండా, మన శరీరం కదలకుండా, మన జీవితం ఊహాలోకంలో విహరించడం వల్ల ప్రయోజనం ఉండదు.

ముందుచూపు వున్నవాళ్లు సంసార సాగరంలోకి అడుగు పెట్టకముందే, తమ ఆర్థిక పరిస్థితిని బట్టి, అందుబాటులో వున్న వనరులను బట్టి, గ్రహించిన అనుభవ సారంతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. దీనివల్ల తమను తాము ఉద్ధరించుకోవడమే గాక, కుటుంబ ఉద్ధరణ, పిల్లల భవిష్యత్తు, పిల్లల ఆలోచనా విధానం మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి. సమాజంలో చక్కని పౌరులుగా ఎదగడానికి అవకాశాలు కలిసి వస్తాయి. ఇక్కడ పిల్లలు చెప్పిన మాట వినడంలేదు అని, పిల్లలు చదవడం లేదని, పిల్లలలో క్రమశిక్షణ కరువయిందని, పిల్లలు జీవితం పాడు చేసుకున్నారన్న మాటలు వినపడవు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పరిస్థిలు అనుకూలించకపోతే అది మన దురదృష్టం అనుకోవాలి. అందుచేత పిల్లల విషయంలో, కుటుంబం విషయంలో మంచి జరిగినా, చెడు జరిగినా, అది తల్లిదండ్రుల జీవన విధాన వైఫల్యమే అని చెప్పక తప్పదు. అందువల్ల పిల్లలు ఎదుగుతున్న సమయంలో, తల్లిదండ్రులు వేసే ప్రతి అడుగు, మాటలాడే ప్రతిమాట, చేసే ప్రతి పని, ఆలోచించి చేయాలి. ఎందుకంటే పిల్లల్లో అనుకరణ అప్పటినుంచే ప్రారంభం అవుతుంది.

అందరిలానే నాకూ జీవితం గురించిన కొన్ని కోరికలు ఉండేవి. పెద్దల నుండి వారి జీవిత విధానం నుండి, పుస్తక పఠనం ద్వారా తెలుసుకున్నవి అనేక విషయాలు వున్నాయి. వీటన్నింటినీ మస్తిష్కంలో నిక్షిప్త పరుచుకుని, నా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కలలు కన్నాను. అవి ఎంతవరకూ నెరవేరాయో నేను చెప్పలేను గాని నాకంటూ వున్న అనుభవాలు పాఠకులతో పంచుకుంటే కొంతవరకైనా నేను సాధించిన విజయాలు అవగాహనకు రావచ్చని నా ప్రగాఢ విశ్వాసం.

బాల్యంలో రాహుల్

నా మొదటి సంతానం పుత్రరత్నం. నా వంశోద్ధారకుడన్న మాట. కొడుకు పుడితే ఏమి పేరు పెట్టాలో ముందే అనుకున్నాను. నామకరణం విషయంలో నాకు ఎవరూ అడ్డు రావద్దని ముందే మా ఇంటి ఆశాజీవులకు ముందే చెప్పేసాను. దానికి అనుగుణంగానే నా పుత్ర రత్నానికి నామకరణం చేసేసాను. ‘రాహుల్ కానేటి’ అని పేరు పెట్టాను. రాహుల్ అసలు పేరు, కానేటి మా ఇంటి పేరు. చాలామంది ‘రాహుల్’ అంటే మనదేశ పాలకులు ‘గాంధీ కుటుంబం’కు సమందించిన పేరు అనుకున్నారు. నిజానికి నేను పేరు పెట్టినది ఆ రాహుల్ కాదు. నేను అనుకున్నది మహాపండితుడు, సంస్కృత సాహితీవేత్త శ్రీ రాహుల్ సాంకృత్యాయన్ లోని ‘రాహుల్’. నా కొడుకు అంత మహా పండితుడు కావాలన్న అత్యాశ లేకున్నా తండ్రిగా నా పుత్రుడు గొప్పవాడు కావాలన్న తపన అత్యాశ కాదేమో!

చిన్న మేనమామ జాషువాతో రాహుల్ కానేటి
తల్లి అరుణతో రాహుల్ కానేటి

స్కూల్‌కి వెళ్లాల్సిన వయసు వచ్చాక రాహుల్‌ను విజయవాడలోని ‘బిషప్-అజరయ్య’ స్కూల్‌లో వాళ్ళ తాతగారు గిల్బర్ట్ గారి కోరిక మేరకు ఎల్.కేజీ క్లాసులో చేర్పించాము. రాహుల్ తల్లి కూడా అదే స్కూల్‌లో చదవడం గమనించదగిన విషయం, కలిసొచ్చిన అదృష్టం. ఇది అందరికీ కలిసొచ్చే అదృష్టం కాదేమో! విజయవాడలో చదివిస్తున్నానన్న ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఇంట్లో అందరూ ప్రేమగా చూసుకునేవారు, కానీ గారాబం మోతాదు కాస్త ఎక్కువైంది. డల్‍గా ఉండేవాడు. క్లాసులోనుంచి అందరికంటే ఆఖరున వచ్చేవాడు. టీచర్ తోనే కాదు, ఇంట్లోవాళ్ళు తప్ప ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఇది నాకూ నా మనఃస్తత్వానికీ భిన్నంగా తయారయ్యే సూచనలు కనిపించాయి. మా దగ్గరే మానుకోటలో చదివించుకోవాలనే నిర్ణయానికి వచ్చాము. అందుకే ఆ సంవత్సరం అయ్యేవరకూ ఓపికపట్టి, మరు సంవత్సరం నేను పనిచేస్తున్నచోట (మానుకోట/మహబూబాబాద్)ఫాతిమా హైస్కూల్‌లో చేర్చాను. అనుకోకుండా అదే స్కూల్‌లో నా శ్రీమతికి ఉద్యోగం రావడం నాకు మంచిది అయింది (ఆమె బి. ఎస్.సి, బి. ఎడ్). అబ్బాయికి చదువు చెప్పడంలో నేను ఘోరంగా విఫలమయ్యాను. అందుకే ఆ పని వాళ్ళమ్మకే అప్పగించాను. చదువులో మెరుగయ్యాడు గానీ బిడియంలో మార్పు రాలేదు. బంధువులు తప్ప ఇంటికి ఎవరువచ్చినా, మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోయేవాడు. బడిలో కూడా ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఇది పిల్లవాడిలో నాకు పెద్ద లోపంగానే అనిపించింది. క్రమశిక్షణ విషయంలో ఎలా చెబితే అలా చేసేవాడు. ఉదయం నడకలో నేను ఎంత దూరం వెళ్లినా, నాతో సమానంగా నడిచేవాడు. ఎత్తుకోమని అసలు వేధించేవాడు కాదు. ఈలోగా నా శ్రీమతికి స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ లో ఉద్యోగం రావడం, మహాబూబాబాద్ లోనే పోస్టింగ్ రావడం జరిగాయి.

ఫాతిమా స్కూల్ (మహబూబాబాద్) మిత్రుడితో రాహుల్
తండ్రికి బ్రాండ్ అంబాసిడర్ రాహుల్ కానేటి

అలా రాహుల్ నాల్గవ తరగతి వరకూ మహబూబాబాద్ ఫాతిమా హైస్కూల్ లోనే చదివాడు. ఈలోగా నాకు జనగాంకు బదిలీ కావడం, కొద్దినెలల తర్వాత నా శ్రీమతికి వరంగల్ బదిలీ కావడంతో, పిల్లల చదువులు హన్మకొండకు మారాయి. అక్కడ స్నేహితుల సలహా మేరకు, సెయింట్ పీటర్ స్కూల్లో జాయిన్ చేయాలని అనుకున్నాము. కానీ ఆ సంవత్సరం ఆ స్కూల్లో వీలు కానందువల్ల అదే సంస్థకు చెందిన జె.ఎం.జె స్కూల్‌లో జాయిన్ చేశాము. రాహుల్‌లో కొద్దిగా మార్పు కనిపించింది. కొద్దిమంది స్నేహితులను ఏర్పరచుకున్నాడు. ఈ మార్పుకు కొద్దిగా నేను తృప్తిపడ్డాను. మరుసటి సంవత్సరం నారాయణరెడ్డి గారి అద్వర్యం లోని సెయింట్ పీటర్ స్కూల్‌లో అడ్మిషన్ దొరికింది. అక్కడ టీచింగ్ బాగుండడంతో పదవతరగతి వరకూ అక్కడే కొనసాగించాము.

కాలేజీ విద్యార్ధిగా రాహుల్ కానేటి

అది ఎంసెట్‌ల కాలం (ఇప్పుడు కూడా అనుకోండి), అందరూ మెడిసిన్/ఇంజనీరింగ్ కోసం తల్లిదండ్రులు మంచి మంచి కాలేజీల కోసం వెతుక్కుంటున్న తరుణం. అప్పుడు నా స్థాయికి తగ్గట్టుగా విజయవాడ లోని నలందా జూనియర్ కళాశాలలో చేర్చాను. రాహుల్‌కి అక్కడ జీవితం అంటే ఏమిటో తెలిసినట్టు వుంది. ఇరుకు గదుల్లో నిరంతరం చదువులు, తమ పనులు తాము చేసుకోవడం, అప్పుడప్పుడూ తప్ప తల్లిదండ్రులూ – బంధువులు కనిపించక పోవడం, ఒక కొత్త జీవితం అక్కడ ఎదుర్కొనక తప్పలేదు. అక్కడ చాలా విషయాలు తెలుసుకున్నాడు. కానీ నేను గ్రహించలేకపోయాను. రెండు సంవత్సరాల ఇంటర్మీడియెట్ విజయవాడలో గడిపి ఇంటికి వచ్చిన రాహుల్ తాను గడిపిన జీవితం గురించి చెబుతూ తాను ఇన్నాళ్లూ గడిపింది హాస్టల్ జీవితం కాదు అనీ.. అదొక సెంట్రల్ జైలు అన్నాడు. అతను అక్కడ చదువు పేరుతో ఎంత దుర్భర జీవితం గడిపింది అర్థం అయింది. ఆ జీవితం అతనిలో ఎంతో మార్పును తీసుకు వచ్చింది. అంత మాత్రమే కాదు ఎంసెట్‌లో తనకు ఇంజనీరింగ్ సీట్ వరంగల్ జిల్లాలో వస్తేనే చదువుతానని డిక్లేర్ చేసాడు. రాహుల్ అనుకున్నట్టుగానే ఇంటర్మీడియెట్ మంచి మార్కులతో పాస్ కావడం, ఎంసెట్‌లో అవసరమైన రాంక్ రావడం, అప్పటి వరంగల్ జిల్లాలోని క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ రావడంతో జనగాం సోదరమిత్రుడు డా సుగుణాకర్ రాజు సహకారంతో అందులో జాయిన్ చేసాను.

తల్లిదండ్రులతో రాహుల్ కానేటి

కొద్దిరోజులు హన్మకొండ నుండి జనగాం బస్సులో వెళ్ళాడు. తర్వాత వాళ్ళమ్మతో బైక్ కొనిపించుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత రాహుల్ కదలికలను గమనించిన నా మిత్రుడు డా. రాజకుమార్ ఫోన్ చేసి “నీ కొడుకు నువ్వు ఊహిస్తున్నట్టు అమాయకుడు కాదు, నువ్వు నిశ్చింతగా వుండు. అతను తప్పక మంచి పౌరుడిగా తయారవుతాడు” అని కితాబు ఇచ్చాడు. ఆయన ఆలా ఎందుకు చెప్పాడో అప్పుడు తెలియలేదు. కానీ నాకు అతడి అసలి మార్పు వ్యక్తిత్వం ఎప్పుడు తెలిసిందంటే, ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత ఒక రోజు నా దగ్గరకు వచ్చి “డాడీ.. నేను ఎం.ఎస్. చేయడానికి అమెరికా వెళతాను” అన్నాడు. ఒక్కసారి నా గుండె ఝల్లుమంది. నేను ఎప్పుడూ అలాంటి ఆలోచన చేయలేదు, నా కొడుకు అంతగా సాహసిస్తాడని ఊహించలేదు. అయినా అతడిని నిరుత్సాహ పరచకూడదనే ఉద్దేశంతో “ఆ చదువు మనకి అందుబాటులో ఉంటుందా బాబూ..! అయినా.. దానికి ఏవో పరీక్షలుంటాయి కదా? ముందు వాటి సంగతి చూడు, తర్వాతి విషయాలు ఆలోచిద్దాం” అన్నాను.

వెంటనే “ఆ పరీక్షలన్నీ అయిపోయాయి డాడీ.. నాకు అర్హత లభించింది. అంతేకాదు.. టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఒక కళాశాలలో నాకు సీట్ కూడా ఆఫర్ చేసారు. మీరు అనుమతి ఇస్తే మిగతా పనులు చూసుకుంటాను” అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అమెరికాలో చదువుకునే అవకాశం వచ్చినందుకు కొడుకును అభినందించాలా? లేక నన్ను వదలి వెళ్లిపోబోతున్నందుకు బాధ పడాలా? అర్థం కాలేదు. వద్దంటే జీవితాంతం నన్ను తిట్టుకుంటాడు, రెక్కలొచ్చిన పక్షి తప్పక అనుకున్న చోటికి ఎగిరి వెళ్లిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. దానిని ఆపే హక్కు తల్లి పక్షికి లేనే లేదు. ఇది కూడా అంతే. నా స్వార్థం కోసం రాహుల్ భవిష్యత్తును అడ్డుకునే హక్కు నాకు లేదు. అందుకే “నీ ఇష్టం బాబూ” అనేశాను. బ్యాంక్‌లో ఎడ్యుకేషన్ లోన్ మంజూరు అయిన తర్వాత మిగతా పనులన్నీ చకచకా పూర్తి అయినాయి. ఇవన్నీ ముందు నాకు తెలియకపోయినా, నాకు తాను అమెరికాకు వెళ్లడం ఇష్టం వుండదు కనుక, తల్లి, చెల్లి అందించిన ప్రోత్సాహంతోనే రాహుల్ ఈ పనికి పూనుకున్నడని అర్థం అయింది. తర్వాత టెక్సాస్ వెళ్లడం, తర్వాత మిన్నియాపోలీస్, ఆ తర్వాత మంచి ఉద్యోగిగా బోస్టన్‌లో స్థిరపడడం జరిగిపోయాయి.

అమెరికాలో రాహుల్

మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఎం.ఎస్. చేసిన రాహుల్ ఒక మంచి కంపెనీలో ‘క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్’ గా స్థిరపడి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇదంతా నా కొడుకు గొప్పతనం గురించి గొప్పలు చెప్పడం కోసం రాసిన వ్యాసం కాదు. అందరిలోనూ,తమ లక్షణాలు బాల్యంలోనే బయటపడిపోవు. కొందరిలో అవి అంతర్గతంగా నిభిడీకృతమై, అవసరం వచ్చినప్పుడు బయట పడతాయి. కొందరిలో సాధన ద్వారా మెరుగుపడతాయి. ఇది జీవన సూత్రం అంతే.

కుటుంబంతో రచయిత
మేనకోడలు ఆన్షితో రాహుల్

అలాగని, రాహుల్ జీవితం అంతా సాఫీగా సాగిపోతుందని నేను చెప్పలేను. మనిషి అన్న తర్వాత ఏదో సమస్య అతడి చుట్టూ తిరుగుతూ ఏదో ఇబ్బంది పెట్టక తప్పదు. స్వల్పకాలం పాటు వాటిని ఎదుర్కోక తప్పదు, అనుభవించక తప్పదు. ఆశాజీవిగా సాగిపోవడమే మనిషి జీవిత లక్ష్యం కావాలి. అందులోనే ఆనందాన్ని అనుభవించాలి. నాలాంటి తల్లిదండ్రులకి, రాహుల్ జీవితం ఒక గొప్ప అనుభవం కావాలి.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here