[box type=’note’ fontsize=’16’] కోవిడ్-19 టీకా వేసుకున్నాక దాని ప్రభావం ఎంత కాలం నిలుస్తుంది అన్నది అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగంగా వి.బి. సౌమ్య రాసిన వ్యాసం ఇది. [/box]
[dropcap]గ[/dropcap]త వ్యాసంలో సాధారణంగా వివిధ టీకాల ప్రభావం ఎంతకాలం నిలుస్తుంది? అన్న అంశాన్ని కొంచెం పరిచయం చేశాను. ప్రత్యేకించి కోవిడ్ టీకాల ప్రభావం గురించి ఈ వ్యాసంలో పరిచయం చేస్తున్నాను.
కోవిడ్ టీకాలు వచ్చిన కొత్తల్లో అత్యంత వేగవంతంగా దేశ జనాభాకి టీకాలు ఇప్పిస్తూ, కేసులని బాగా తగ్గించేసిన సామర్థ్యానికి ఉదాహరణగా ఇజ్రాయెల్ తరుచుగా వార్తల్లోకి వచ్చేది. ఒక నెలక్రితం ఒక వార్త వచ్చింది. ఇపుడు అక్కడ మళ్ళీ కేసులు పెరిగిపోతున్నాయనీ, వందల్లో, వేలల్లో వస్తున్న కేసులకి కారణాలేమిటో వివరించే వ్యాసం ఇది. ఇందులో ఒక వాక్యం నన్ను ఆకర్షించింది: రెండు డోసులు పడ్డాక కూడా కోవిడ్ వచ్చిన వారిలో ఎక్కువ శాతం వ్యక్తులు జనవరిలో టీకా పుచ్చుకున్న వారు, ఏప్రిల్‌లో తీసుకున్న వాళ్ళలో మళ్ళీ కోవిడ్ వచ్చిన దాఖలాలు తక్కువా అని. దీనిని బట్టి టీకా ప్రభావం నెమ్మదిగా తగ్గుతోందనీ, మరో డోసు ఇవ్వాలని తీర్మానించి, ఇవ్వడం మొదలుపెట్టాక నెమ్మదిగా మళ్ళీ కుదురుకుంటోంది అని వ్యాసంలో రాశారు.
ఓహో, అంటే ఇదొక పద్ధతి టీకాల ప్రభావం ఎన్నాళ్ళు నిలుస్తుందో కొలిచేందుకు. ఇంకా ఏం చేస్తారు? టీకా ప్రభావాన్ని ఎలా అంచనా వేస్తున్నారు?
కోవిడ్-19 టీకా ప్రభావం ఎన్నాళ్ళుంటుందో తెలుసుకోవడానికి ప్రధానంగా మూడు పద్ధతులను అవలంబిస్తున్నారు.
టీకా తీసుకున్న వారిలో ప్రతిరక్షకాలు (ఆంటీబాడీస్) ఎన్ని ఉంటున్నాయి? అన్నది కాలం గడిచేకొద్దీ పరిశీలిస్తూ ఉండడం. ఇది బ్లడ్ టెస్టుతో తెలుసుకోవచ్చు కనుక తేలికైన పద్ధతి అనే అనుకోవచ్చేమో.
వ్యాధి గురించి దీర్ఘకాలిక జ్ఞాపకం గల టీ-సెల్స్ ఎన్నున్నాయో పరిశీలించడం. అయితే, ఇది కొంచెం కష్టమైన పద్ధతి అంటారు శాస్త్రజ్ఞులు.
టీకా వేసుకున్న వాళ్ళకి మళ్ళీ రోగం వచ్చిందా? లేదా? వస్తే ఎంతకాలానికి వచ్చింది? ఎంత తీవ్రంగా వచ్చింది? ఇలాంటివి నిరంతరాయంగా పరిశీలిస్తూ ఉండడం.
అయితే కోవిడ్ టీకా ప్రభావం ఎన్నాళ్ళుంటోంది? ఈ పై మూడు పద్ధతులనీ ఒక్కోటీ తీసుకుని శాస్త్రవేత్తలు ఏం తెలుసుకుంటున్నారో చూద్దాము.
ప్రతిరక్షకాలు: ఒకసారి కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళని దాదాపు ఏడాది పాటు గమనించాక వారిలో ఈ వ్యాధికి ప్రతిరక్షకాలు మొదట తగ్గుతూ పోయి, క్రమంగా ఒక స్థాయికి చేరుకుని అలాగే ఉన్నాయని శాస్త్రవేత్తల మాట. గతంలో ఇలాంటిదే మరో వైరస్ (సార్స్) కి కూడా ఇలాగే జరిగి, పదిహేనేళ్ళు దాటినా ఆ ప్రతిరక్షకాలు అలా ఉండిపోయాయంట వ్యాధి వచ్చిన వారిలో. కనుక కోవిడ్-19 కి కూడా అలా జరిగే అవకాశం ఉందంటారు. అయితే, వ్యాధి వచ్చిన వాళ్ళు సరే. టీకాలు కూడా ఇదే ఎఫెక్టు ఇస్తాయా? టీకా రెండు డోసులు వేసుకున్న ఆర్నెల్లకి ఈ ప్రతిరక్షకాల తరుగుదలకి ఆగి కొంచెం స్థిరంగా ఉందని మాడర్నా వంటి వారు చేసిన పరిశోధనల్లో తేల్చారు. కనుక కొంతవరకూ టీకా ప్రభావం నిలుస్తుందన్నట్లే. ప్రతిరక్షకాల సంఖ్యని దీర్ఘకాలం పరిశీలించే పరిశోధన ఒకటి మా ఊరు అట్టావాలో కూడా చేస్తున్నారు -కోవిడ్ వచ్చిన వారూ, టీకా తీసుకున్న వారూ అంతా కలిపి దాదాపు వెయ్యి మంది పౌరులు నెలనెలా తమ రక్తం, సలైవా సాంపిళ్ళని ఈ పరిశోధనకి పంపుతున్నారట. వీళ్ళు చివరికి ఏం చెబుతారో చూడాలి.
టీ–సెల్స్: ఈ టీసెల్స్ విషయంలో పైన చెప్పిన ప్రతిరక్షకాలలాగా కాక వ్యాధి వచ్చిన కొన్ని నెలలకి కూడా అవి అలాగే స్థిరంగా ఉన్నాయంట పరిశోధనలు చేసిన పేషెంట్లలో. అసలు వందేళ్ళ క్రితం వచ్చిన మహమ్మారి స్పానిష్ ఫ్లూ తట్టుకుని బ్రతికిన కొందరిలో ఇలాంటి టీ-సెల్స్ తొంభై ఏళ్ళు దాటాక కూడా అలాగే ఉన్నాయంట! కనుక కోవిడ్ విషయంలో కూడా జరిగే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తల అభిప్రాయం. మళ్ళీ వ్యాధి రాని, టీకా వేసుకున్న వాళ్ళ పరిస్థితేమిటి? అన్న ప్రశ్న వస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాలని బట్టి టీసెల్స్ కూడా టీకా రెండు డోసులూ వేసుకుంటే నెలలు, ఏళ్ళ తరబడి కూడా కోవిడ్ నుంచి రక్షణ ఇవ్వొచ్చు అని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. అయితే, కరెక్టుగా ఎంతకాలం? అన్నది మనకింకా తెలియదు.
నిరంతర పరిశీలన: మే – జులై మధ్య కాలంలో న్యూయార్కులో గతంలో టీకా తీసుకున్న వాళ్ళలో దాని సాఫల్యత (effectiveness) ఏ స్థాయిలో ఉందన్నది CDC వారు పరిశీలించారు. టీకా వేశాక వ్యాధి రాకుండా నిరోధించడం 91.8 శాతం నుండి 75 శాతానికి పడిపోయిందట. కానీ, ఆసుపత్రి పావలడాన్ని నిరోధించడంలో మటుకు దాదాపు అంతే ప్రభావవంతంగా ఉందట ఈ రెండు నెలల కాలంలోనూ. అంటే ఈ పద్ధతి ప్రకారం చూస్తే టీకా ప్రభావం వ్యాధి రాకుండా నిరోధించడం విషయంలో తగ్గినా, వ్యాధి తీవ్రత నిరోధించడం విషయంలో కొంతవరకూ అలాగే ఉందనమాట ఓ ఆరునెలల తరువాత! ఇలాంటి పరిశోధనలు ఎక్కడికక్కడ పలుచోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు కొత్త విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఎంతో కొంత రక్షణ కొంతకాలం పాటు ఉండేలాగే ఉంది.
మరి వేరియంట్ల విషయం ఏమిటి? ఇక్కడ ఒక విషయం గమనించాలి. టీకాలు తయారు చేసినపుడు ఉన్న కోవిడ్ వేరియంట్లు వేరే. ఇపుడు ప్రబలంగా ఉన్నవి వేరే. మరి, కేసులు మళ్ళీ పెరగడం అన్నది టీకాల ప్రభావం తగ్గడం వల్లనా? లేకపోతే ఈ టీకాలు ఇపుడు ఎక్కువగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ తో పోరాడలేకపోవడం వల్లనా? అన్న సందేహం రావొచ్చు ఎవరికైనా. ప్రస్తుతం లభిస్తున్న టీకాలు మునుపటి వేరియంట్ల కంటే కొంచెం తక్కువ స్థాయిలోనైనా డెల్టా వేరియంట్ నుండి కూడా మంచి రక్షణ ని కల్పిస్తాయని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఇప్పటికీ డెల్టా వేరియంట్ వల్ల ఆసుపత్రి పాలవడం, మరణించడం ఇవన్నీ టీకాలు తీసుకోని వారిలోనే ఎక్కువగా ఉన్నాయి. టీకా తీసుకున్నాక వ్యాధి వచ్చిన వారు టీకా లేకుండా వ్యాధి వచ్చిన వారితో పోలిస్తే దాన్ని ఇంకోళ్ళకి అంటించే కాలం కూడా తక్కువ అంటున్నారు శాస్త్రవేత్తలు. కనుక, టీకాల ప్రభావం కాలంతో పాటు తగ్గుతూ వస్తోంది అన్న విషయం నిజమే కానీ, దీనికి డెల్టా వేరియంటే కారణం అనుకోనక్కరలేదు.
బూస్టర్ షాట్లు అవసరమా?: ప్రభావం తగ్గుతున్న కొద్దీ బూస్టర్ షాట్ అన్నది ఒక మార్గం అన్నది గత వ్యాసంలో ప్రస్తావించాను. మరి కోవిడ్‌కి బూస్టర్ అవసరమా? ఇది కూడా ఇంకా ఎవ్వరికీ ఖచ్చితంగా తెలియని విషయమే అనిపిస్తుంది. కొన్ని ప్రత్యేక గుంపులకి (పెద్దవాళ్ళు, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఇలా) బూస్టర్ షాట్లు ఇవ్వొచ్చని యూఎస్‌లో అంటూండగా, ఇజ్రాయెల్‌లో అందరికీ బూస్టర్ అంటున్నారు. ఇజ్రాయెల్‌లో జులై-ఆగస్టుల మధ్య జరిగిన ఒక పరిశోధనలో అరవై ఏళ్ళు పైబడిన, బూస్టర్ తీసుకున్న వారి మధ్య కోవిడ్ శాతం బూస్టర్ తీసుకోని వారికంటే తక్కువగా ఉంది అని తేలింది. అసలు ఆ దేశంలో రెండు డోసులు పడ్డ అందరికీ (12 పైబడిన పిల్లలతో సహా) మూడో డోసులు వేయడానికి అనుమతి నిచ్చారు. నాలుగో డోసు గురించి కూడా ఇప్పటికే ఆలోచించడం మొదలుపెట్టారు. మూడో డోసు పడ్డం మొదలుపెట్టాక మళ్ళీ కేసులు తగ్గుతున్నాయంట అక్కడ. ఇపుడు యూఎస్, యూకే, కొన్ని ఐరోపా దేశాలు – ఇలా చాలామంది మూడో డోసు దిశగా పోతూ ఉంటే, ఓ పక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ముందసలు ప్రపంచంలోని పేద దేశాలకి ఒక డోసన్నా పడనివ్వండంటూ ఈ ధనిక దేశాలని బూస్టర్లు ఇవ్వడం కొన్నాళ్ళ తరువాత చేయండంటున్నారు. అయితే, డెల్టా వేరియంటు కొత్తదైనా కూడా ఈ టీకాలు/బూస్టర్లు కొంతవరకు అదుపు చేయగలిగేటట్లే ఉన్నాయి ఇప్పటి దాకా వస్తున్న పరిశోధనలు చూస్తే.
ఇంతకీ ఏంటంటావ్? “We can only say that a vaccine is protective as long as we are measuring it,” అంటారు ఈ విధమైన రోగాల అధ్యయనంలో నిపుణులైన జేమీ మేయర్ అన్న డాక్టర్ గారు. కనుక ఇపుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య శాఖలు నిరంతరం ఈ విషయం పరిశీలిస్తూనే ఉన్నారు… కొన్నేళ్ళ దాకా పరిశీలిస్తూనే ఉంటారేమో కూడా. మనం చేయగలిగేది: ఇంకా టీకా తీసుకోకపోతే, ఆల్రెడీ కోవిడ్ వచ్చినవారైనా సరే, ఆరోగ్య పరిమితులు లేనంత వరకూ వీలైనంత త్వరగా తీసుకోవడం, ప్రభుత్వం/ఆరోగ్యాధికారులను నమ్మి వారు సూచించిన పద్ధతులు పాటించడం ముఖ్యం. ఎవరు పడితే వారు ఏది పడితే అది చెప్పగానే నమ్మేసి, కంగారుపడిపోయి, వాళ్ళు చెప్పిందల్లా చేసేయకుండా, ఈ విషయాలపట్ల అవగాహన ఉన్న వైద్యులు, శాస్త్రవేత్తలు ఏమి సూచిస్తున్నారో కొంచెం పరిశీలించడం అందరం నేర్చుకోవాలి. అంతే.
ఈ వ్యాసం కోసం చదువుతున్నపుడు బూస్టర్ డోసులెందుకు? పని చేస్తాయా? అసలు బూస్టర్ అంటే ఏం చేస్తుంది? అన్న అంశం మీద ఆసక్తికరమైన వ్యాసాలు చదివాను. వీలు చిక్కినపుడు తరువాతి వ్యాసంలో దానిని గురించి పరిచయం చేస్తాను.
References:
- “How long will your Corona virus vaccination last?” (యేల్ మెడిసిన్ వారి వ్యాసం, సెప్టెంబర్ 24, 2021)
- “Will COVID-19 Vaccines Give Lifelong Immunity to the Disease? What We Know” (healthline.com వెబ్సైటు వ్యాసం)
- “New COVID-19 Cases and Hospitalizations Among Adults, by Vaccination Status — New York, May 3–July 25, 2021” (CDC వారి వ్యాసం, సెప్టెంబర్ 17, 2021)
- “Delta Variant: What we know about the science” CDC వారి వ్యాసం, ఆగస్టు 26, 2021)
- Radbruch, Andreas, and Hyun-Dong Chang. “A long-term perspective on immunity to COVID.” Nature. 2021.
- Bar-On, Yinon M., et al. “Protection of BNT162b2 vaccine booster against covid-19 in Israel.” New England Journal of Medicine (2021, September)
- Baraniuk, C. (2021). How long does covid-19 immunity last?. BMJ, 373.