[dropcap]గ[/dropcap]ర్భవతి అయిన తమ కోడలు
కొడుకునే కనాలని
ఓ అత్తగారి ఆశ.
పుట్టబోయే చిట్టి తండ్రి
ఇంజినీరో, డాక్టరో కావాలని, అమెరికా వెళ్లాలని,
ఓ కాబోయే తల్లి ఆశ.
కేలిఫోర్నియాలో కాలు మోపిన తనయుడు
డాలర్ల వర్షం కురిపిస్తాడని
ఓ తల్లిదండ్రుల ఆశ.
అమెరికాలో ఉన్న తమ కొమరుడు
అమెరికను అమ్మాయికు కాక
తమ కులం అమ్మాయికే తాళి కట్టాలని
ఓ దంపతుల ఆశ.
కొత్త కోడలు తమ ఇంట అడుగు పెట్టినా
కొడుకు, తన మాటే దాటరాదని
ఓ కాబోయే అత్తగారి ఆశ.
చాటుగా నోటులు పుచ్చుకొన్న ఓటర్లంతా
మాట తప్పక, ఓటు తనకే వేస్తారని
ఓ రాజకీయ పార్టీ అభ్యర్థి ఆశ.
లెఖ్ఖకు తక్కువయినా
నిఖ్ఖచ్చిగా తామే గద్దెక్కుతామని
ఓ రాజకీయ పార్టీ ఆశ.
పదవుల అవకాశాలకు ఆహుతులై
తమ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని
మరో రాజకీయ పార్టీ ఆశ.
వరుణుడు కరుణించి
హలాలన్నీ పొలాలు దున్నితే
ధాన్యలక్ష్మి తమ ఇళ్ల కొలువు తీరునని
అన్నదాతల ఆశ.
తరాలనుండి పూరి గుడిసెలే
చిరునామాగా జీవిస్తున్న జనాలకు
ఏనాటికయినా
మారుతుంది, తమ తలరాతని ఆశ.