[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన గురువరేణ్యులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]
కాకతీయ ఘన చరిత్ర:
[dropcap]ఉ[/dropcap]స్మానియా విశ్వవిద్యాలయ అనుబంధంగా వరంగల్‌లో 1967లో పి.జి.సెంటర్ ప్రారంభమైంది. అదే సంవత్సరం వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అనంతపురంలోను, ఆంధ్ర విశ్వవిద్యాలయం గుంటూరులోను పి.జి. సెంటర్లు తెరిచాయి. మూడింటికీ ప్రారంభదశలో తెలుగు శాఖ ఆచార్యులే స్పెషల్ ఆఫీసరు/ప్రిన్సిపాల్ కావడం చరిత్ర. వరంగల్‌లో ఆచార్య బిరుదురాజు రామరాజు, గుంటూరులో ఆచార్య తూమాటి దొణప్ప, అనంతపురంలో ఆచార్య కోరాడ మహాదేవశాస్త్రి విశ్వవిద్యాలయ పునాదులు వేశారు.
వరంగల్‍లో తొలుత నాలుగే శాఖలు – తెలుగు, ఇంగ్లీషు, కెమిస్ట్రీ, మాథమెటిక్స్ మొదలుపెట్టారు. తర్వాత మిగిలిన శాఖలు కలిశాయి. 1976 ఆగస్టు 19న కాకతీయ విశ్వవిద్యాలయం పురుడు పోసుకొంది. తొలి వైస్ ఛాన్స్‌లర్‍గా విద్యావేత్త ఆచార్య కె. వెంకట్రామయ్య నియమితులయ్యారు. వారు ఆ పైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యులై ఎందరో తెలుగువారు సివిల్ సర్వీసుల్లో గెలవడానికి దోహదపడ్డారు. ప్రస్తుతం 530 అనుబంధ కళాశాలలు, 18 యూనివర్శిటీ కళాశాలున్నాయి. ఆ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య జయశంకర్ 1991-95 మధ్య వైస్ ఛాన్స్‌లర్. తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్.)లో ప్రధాన వ్యక్తి. వారి పేర వ్యవసాయ విశ్వవిద్యాలయం నామకరణం చేశారు.
తెలుగు శాఖ వర్తమాన సచివులు:
(1) డా. ఏ. జ్యోతి – శాఖాధ్యక్షులు (2) డా. జి. కిషన్ ప్రసాద్ (3) ఆచార్య బి. ఐలయ్య (4) డా. పి. వెంకటేశ్వర్లు (5) డా. వి. శ్రీదేవి. తెలుగులో ఎం.ఏ, ఎంఫిల్, పిహెచ్‌డి ప్రోగ్రామ్‍లు ఉన్నాయి. ఇప్పటి వరకు 100 దాకా పి.హెచ్‌డిలు, వంద ఎంఫిల్ డిగ్రీలు ప్రదానం చేశారు. ‘విమర్శిని’ అనే పరిశోధనా పత్రిక 20 సంచికలు వెలువడ్డాయి. ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి నలుగురు అధ్యాపకులు అవార్డులు, 25 సాహిత్య పురస్కారాలు అధ్యాపకులు పొందారు.
పాత తరం ఘనాపాఠీలు:
కాకతీయ తెలుగు సాహిత్య సామ్రాజ్య పరిరక్షకులుగా – ఆచార్యులు బిరుదురాజు రామరాజు, అమరేశం రాజేశ్వర శర్మ, కేతవరపు రామకోటిశాస్త్రి, పేర్వారం జగన్నాధం, కె. సుప్రసన్నాచార్య, సంపత్కుమారాచార్య, మాదిరాజు రంగారావు, హరి శివకుమార్, కాత్యాయనీ విద్మహే, కె. యాదగిరి, అనుమాండ్ల భూమయ్యలు నిలిచారు. సాహితీ పరిశోధనలు కొనసాగించి యావద్భారత ఖ్యాతి గడించారు.
సాహితీ కేతనం కేతవరపు:
కాకతీయ విశ్వవిద్యాలయ సాహితీ కోటి కేతవరపు రామకోటిశాస్త్రి. 1931లో జన్మించిన వీరు ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి బి.ఎ. ఆనర్స్ చేసి 1954లో గుడివాడ ఎ.ఎన్.ఆర్. కళాశాలలో లెక్చరర్‌గా మూడు సంవత్సరాలు బోధించారు. త్రిపురనేని మధుసూధన రావు, చలసాని ప్రసాద్, శివసాగర్ అక్కడ ఈయన శిష్యులు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిరుదురాజు రామరాజు పర్యవేక్షణలో ‘తిక్కన కావ్యశిల్పము తత్త్వదర్శనము’ అనే సిద్ధాంత వ్యాసానికి పి.హెచ్.డి లభించింది. నిజాం కళాశాలలో అధ్యాపకులయ్యారు. పరిశోధకుడిగా ఆయన లబ్ధప్రతిష్ఠులు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలలో పని చేశారు. 1991 అక్టోబరు 28న రోడ్డు ప్రమాదంలో మరణించారు.
సాహిత్య వ్యాస సంపుటులు:
వీరి సాహిత్య వ్యాస సంపుటులు – నైమిశము, సమీక్షణ. డా. కొలకలూరి ఇనాక్ తన సిద్ధాంత గ్రంథంలో ఈ రెండింటిని ప్రస్తావించారు. ఈ సంకలనాలలో ఘటికాచల మాహత్యము, కన్యాశుల్కం, గయోపాఖ్యానం వంటి కావ్యగుణ పరిశీలన చేశారు. ఇందులో విమర్శ, గేయ వాఙ్మయం, భావకవిత్వం వంటి ప్రక్రియలోచనం ద్యోతకమైంది. దేవయాని, ఋష్యశృంగుల పాత్ర పరిశీలన వుంది. కవిత్వం పట్ల రచయితకు భక్తి, గౌరవం ఉన్నాయి. విమర్శకుడు, విమర్శనం ఏ హద్దులలో ఉండాలో రామకోటిశాస్త్రికి అవగాహన ఉంది. విపులీకరణంలో రచయిత ప్రత్యేక జాగ్రత్త వహించారని ఇనాక్ సిద్ధాంతీకరించారు. 20 గ్రంథాలు ప్రచురించారు.
కాకతీయ విశ్వవిద్యాలయ పి.జి.సెంటర్ వరంగల్‍లో ఉపన్యాసకులుగా చేరారు. విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధ్యక్షులయ్యారు. వీరి పర్యవేక్షణలో కోవెల సంపత్కుమారాచార్య ‘ఆధునిక తెలుగుసాహిత్య విమర్శ’ అనే అంశంపై, వరవరరావు ‘తెలంగాణ విమోచన ఉద్యమం తెలుగునవల’ అనే అంశంపై పరిశోధనలు జరిపి పి.హెచ్.డి పొందారు. రామకోటిశాస్త్రి కుమార్తె కాత్యాయనీ విద్మహే అదే విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఆచార్యులయ్యారు. రామకోటిశాస్త్రి రచనలు – విశ్వనాథవైఖరి, సాహిత్యసంభావన, ఆధునిక తెలుగు సామాజికకవిత్వ ఉద్యమాలు, కావ్యజిజ్ఞాస, పోతన్న వైచిత్రి, భారతీయ సాహిత్యశాస్త్రం: భిన్నసంప్రదాయాలు, నాచన సోముడు, నాటక విశ్లేషణ, తిక్కన కావ్యశిల్పము, చిచ్చేతన, శతృంజయము, మహాభారత దర్శనాదులు.
తండ్రి అడుగుజాడల్లో తనయ:
విశ్వవిద్యాలయాలలో – తెలుగు శాఖలలో – ఆచార్యుల తనయలు అదే పీఠాలను అలంకరించడం విశేషం. రామకోటిశాస్త్రి తనయ అయిన కాత్యాయనీ విద్మహే తెలుగు శాఖాధ్యక్షులయ్యారు. బెంగుళూరు విశ్వవిద్యాలయంలో అదే రీతిలో చన్నాప్రగడ తిరుపతిరావు కుమార్తె జయలక్ష్మి, కొలకలూరి ఇనాక్ కుమార్తె ఆశాజ్యోతి, పద్మావతీ విశ్వవిద్యాలయంలో మరో కుమార్తె మధుజ్యోతి తెలుగు శాఖాల అధిపతులయ్యారు. కాకతీయలో బిరుదురాజు రామరాజు కుమార్తె బి. రుక్మిణి ఆచార్య పదవి నలంకరించారు.
సాహితీ విమర్శనా విద్మహే (1955):
కాత్యాయని 1955 అక్టోబరు 19న కృష్ణాజిల్లా మైలవరంలో జన్మించారు. విద్యాభ్యాసం తండ్రిగారి వరంగల్ విశ్వవిద్యాలయంలో నడిచింది. ఎంఏ, పి.హెచ్.డి డిగ్రీలు పొందారు. ‘చివరకు మిగిలేది మానసిక సామాజిక జీవన స్రవంతి నవలా మిమర్శ’ అనేది వీరి సిద్ధాంత గ్రంథం (1983). పర్యవేక్షకులు కోవెల సుప్రసన్నాచార్యులు.
అభ్యుదయ పథగామి:
కాత్యాయని అభ్యుదయ భావజాల రచయిత్రి. ‘సాహిత్యాకాశంలో సగం-స్త్రీల అస్తిత్వ సాహిత్యం కవిత్వం, కథ’ అనే కథా కవిత్వం విమర్శనా గ్రంథానికి 2014లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఈ గ్రంథాన్ని బండారు అచ్చమాంబ, వట్టికొండ విశాలాక్షి, రంగవల్లి – లకు అంకితమిచ్చారు.
ఉద్యోగ ప్రస్థానం:
22 ఏళ్ళకే కాకతీయ విశ్వవిద్యాలయంలో (1977) ఉపన్యాసకురాలిగా చేరి 1988లో ప్రొఫెసర్‍గా పదోన్నతి పొందారు. మహిళా జీవన దృక్పథంతో సాహిత్య విమర్శన వ్యాసాలు వ్రాశారు. మార్క్సిజం, స్త్రీవాద దృక్పథం, సామాజిక సిద్ధాంతాలపై 300 వ్యాసాలు వ్రాశారు. వీరి వద్ద 12 మంది పి.హెచ్.డి. పట్టా పొందారు. ప్రతీ ఏటా తండ్రి వర్ధంతి రోజు వారి పుస్తకం వెలువరిస్తున్నారు. ఆమె స్వయంగా 20 గ్రంథాలు వ్రాశారు. లింగ వివక్షను వ్యతిరేకిస్తూ రచనలు చేయడంతో సాహితీవేత్తలను ఆకర్షించారు. ప్రజాస్వామ్య రచయితల వేదిక నేర్పాటు చేశారు.
వీరి ప్రధాన రచనలు:
రాయప్రోలు వాఙ్మయ జీవిత సూచిక ( 1980), స్వాతంత్య్రనంతర భారతదేశం స్త్రీల స్థితిగతులు (2005), ఆధునిక తెలుగుసాహిత్యం స్త్రీవాద భూమిక (2006), ప్రాచీన సాహిత్యం మరోచూపు (2008), స్త్రీవాదం (2012), తెలంగాణ సాహిత్యం- ప్రాంతీయత (2013) తదితరాలు.
సాహిత్యాకాశంలో సగం గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం 2015లో లభించింది.
రామప్ప వొడిలో కోవెలలు:
కాకతీయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో రామప్ప వొడిలో రెండు కోవెలలు వెలిశాయి. ఒకరు కోవెల సంపత్కుమారాచార్య, మరొకరు సుప్రసన్న. బ్రతుకులో సృజనశీలం చివురుస్తున్న రోజుల్లో ఇద్దరూ కవిత్వ శాఖ మీది రెండు విహంగాలు. సుప్రసన్న తాతగారు సంపత్కుమారకు నాన్నగారైన రంగాచార్యుల వద్ద ఛందశ్శిల్పం నేర్చుకొన్నారు. సంపత్కుమారది శ్రీ వైష్ణవ ఉదార సంప్రదాయం కాగా సుప్రసన్న అరవిందుల తాత్విక ధోరణి అలవరుచుకున్నారు.
సంపత్కుమార (1933 – 2010):
చిట్టిగూడూరు ఓరియంటల్ కాలేజీలో చదివి 1953లో ఉపాధ్యాయ జీవితం ఆరంభించారు తెలుగు ఛందో రీతులపై సాధికార గ్రంథం వెలయించారు. 1967 ప్రాంతంలో జాతీయ ప్రజాస్వామ్య దృక్పథంతో చేతనావర్త కవులు బయలుదేరినప్పుడు ఆయన ముందు నిలిచారు. తెలుగు కవుల సిద్ధాంతాలను, ప్రతిపాదనలను, మౌలికతను నిరూపించే పరిశోధనలు తన పర్యవేక్షణలో కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిపించారు. సుప్రసిద్ధ విమర్శకులు, విశ్వనాథ శిష్యులుగా జీవించారు (1933 – 2010). ‘తెలుగు ఛందస్సుపై కొన్ని వెలుగులు’ అనే గ్రంథాన్ని చేకూరి రామారావు కంకితమిచ్చారు.
1933 జూన్ 26న సంపత్కుమారాచార్య జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో (1963), హిందీలో (1966) ఎం.ఎ. డిగ్రీలు పొంది, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి 1978లో తొలి డాక్టరేట్ – తొలి స్నాతకోత్సవంలో స్వీకరించారు. హృద్గీత (1954), ఆనందలహరి (1966) వీరి కావ్యాలు. 1993లో కాకతీయ ఆచార్య పదవీ నివృత్తి చేశారు. వీరి సిద్ధాంత గ్రంథం – ‘ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ -సంప్రదాయరీతి’ (1978).
సుప్రసన్న:
ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య సాహితీ విమర్శకులు, పోతన పంచశతి నిర్వాహకులుగా, చేతనావర్త కవితోద్యమ సారథిగా, వరంగ సాహితీ విరణ్మూర్తిగా సుప్రసిద్ధులు. వరంగల్‌లో 1936, మార్చి 17న జన్మించారు. 1959లో ఉస్మానియాలో ఎం.ఎ. చేసి; 1962లో రామరాజభూషణుని కృతులపై పి.హెచ్.డి పొందారు. 1962లో కాకతీయలో అధ్యాపకులుగా ప్రవేశించి, 1996లో ఆచార్యులుగా రిటైరై హైదరాబాదులో స్థిరపడ్డారు. 1990-93 మధ్య తెలుగు శాఖాధ్యక్షులు. పోతన విజ్ఞాన పీఠ కార్యదర్శి.
వీరు పర్యవేక్షకులుగా 26 మంది పి.హెచ్.డి, 16 మంది ఎం.ఫిల్ పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు(1971); శ్రీరామనవమి పురస్కారం (2007) లభించాయి. వీరి రచనలు హిందీ, ఇంగ్లీషు భాషలలోకి అనువదించబడ్డాయి. వీరి షష్టిపూర్తి సందర్భంగా ‘కోవెల సుప్రసన్న శారద’ వెలువడింది. వీరి రచనలపై పలువురు పరిశోధనలు చేశారు. ఆర్యసమాజ ఉద్యమము, జాతీయోద్యమము, వందేమాతర ఉద్యమము వీరిపై ప్రభావం చూపాయి. ‘జీవితమే నా జెండా!’ అని ప్రకటించారు. పద్య రూపంలో భాషలో, శైలిలో, ఛందస్సులో విలక్షణతను చూపారు. విశ్వేశ్వర సంస్కత కళాశాల, వరంగల్ – కార్యదర్శిగా, కరెస్పాండెంట్‌గా సుప్రసన్న సంస్కృత భాషా సేవ చేస్తున్నారు. “నా కవితలు నూతన యుగానికి ఆధార భూమికలు” అని ‘శతాంకుర’లో ప్రకటించారు సుప్రసన్న.
ఉస్మానియా ఆచార్యులు ననుమాస స్వామి (1952) 1989లో చేరి 2011లో రిటైరయ్యారు. ‘తెలుగు నవల – అస్పృశ్యతా సమస్య’ పై పి.హెచ్.డి (1987) లభించింది. ఉస్మానియా తెలుగు శాఖలో ప్రసిద్ధులాయన.