[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
పాప్ గాయని నాజియా హసన్:
నాజియా 3 ఏప్రిల్ 1965 నాడు కరాచీలో జన్మించారు. సంఘసేవిక మునీజా, వ్యాపారవేత్త బాసిర్ హసన్ దంపతుల తొలి బిడ్డ ఆమె. నాజియాకు జోహెబ్ అనే తమ్ముడు, జహీరా అనే చెల్లెలు ఉన్నారు. ఈ తోబుట్టువులందరూ ఇంగ్లండ్‌లో తమ అమ్మమ్మగారింట పెరిగారు. సంగీతంపై ఆసక్తి ఉన్న నాజియా, జోహెబ్‍లు మాంచెస్టర్‌లో రాక్, పాప్ మ్యూజిక్ పట్ల ఆకర్షితులయ్యారు. శాస్త్రీయ సంగీతానికి దూరమయ్యారు. అమెరికన్ పాప్ బ్యాండ్ ‘జాక్సన్ 5’, ఇన్‌స్ట్రుమెంటలిస్ట్స్ ‘ది కార్పెంటర్స్’ వీరికి ప్రేరణగా నిలిచారు. ‘ది ఫ్యూజన్ ఆర్టిస్ట్స్’ – గిటార్‌పై సంగీతం పలికించి, తన చుట్టూ ఉన్న తూర్పు సంగీత ధ్వనుల వారసత్వంతో ‘రాక్’ సంగీతాన్ని అందించసాగారు.
నాజియాది ఆకట్టుకునే వదనం. చరిత్రలోని శత్రుత్వాన్ని విడనాడి ముందుకు సాగిపోయే తరం యొక్క స్వరం. యువతరపు ఆశల ప్రతిరూపం, సంప్రదాయాల కట్టడులని, సరిహద్దులను అధిగమించి, జీవన సంగీతాన్ని ఎలా వేడుక చేసుకోవాలో తెలిసిన తరానికి ప్రతినిధి. ఆమే పాకిస్తాన్ తొలి పాప్ స్టార్.
అప్పటి సూపర్ స్టార్ జీనత్ అమన్ – వీరిద్దరినీ – వినోద్ ఖన్నా, ఫిరోజ్ ఖాన్‌కి లండన్‌లో ఒక పార్టీలో పరిచయం చేశారు. ఫిరోజ్ ఖాన్ ఆ 14 ఏళ్ళ నాజియా పాటను వినగానే, తన కొత్త సినిమా ‘కుర్బానీ’ (1980)లో పాట పాడేందుకు అవకాశం ఇచ్చారు. ఫిరోజ్ ఖాన్ తీసిన ‘కుర్బానీ’ (1980)లో పబ్ డాన్సర్‌గా జీనత్ అమన్ అభినయించిన ‘ఆప్ జైసే కోయీ మేరీ జిందగీ మే ఆయే’ పాటని నాజియా పాడారు. Biddu సంగీతం సమకూర్చిన ఈ పాట భారతీయులనీ, పాకిస్తానీయులనీ ఆకట్టుకుంది. ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకోడమే కాక, రాజకీయాలకు అతీతంగా ఇరుదేశాలలోనూ ప్రాచుర్యం పొందింది ఈ పాట.
బడి మానడం ఇష్టం లేని నాజియా – ఈ పాటని – ఆదివారం పూట రికార్డు చేశారు. 15 ఏళ్ళ వయసులో ఆమె ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుపొందారు.
గాయని-గీత రచయిత ద్వయం మరో ఆల్బమ్ – ‘డిస్కో దీవానా’ రూపొందించారు. ఇందులో నాజియా, తమ్ముడు జోహెబ్‌తో కలిసి పాడారు. ఈ ఆల్బమ్ 14 దేశాలలో 60 మిలియన్ కాపీలు అమ్ముడుపోయింది. బెస్ట్-సెల్లింగ్ ఆసియన్ పాప్ రికార్ట్ ఆఫ్ ఆల్ టైమ్‍గా నమోదయింది. “నాజియా స్వరం ABBA గాయకుల స్వరంలా అనిపించింది. మైక్రోఫోన్‍లో విన్నప్పుడు – రెండు ధ్వనుల వలె తోచింది. డబుల్ ట్రాక్‌లా అనిపించింది, కానీ కాదు.” తర్వాత చెప్పారు ఆమె తమ్ముడు జోహెబ్. అలీషా చినాయ్, లకీ ఆలీ, శ్వేతా శెట్టి వంటి దేశీ పాప్ గాయకులకు ప్రోత్సాహం లభించడంతో – భారత్‌లో నాజియా జోరు తగ్గింది. స్వదేశీ గాయకులను ప్రోత్సహించే క్రమంలో భాగంగా Biddu షాన్, లక్కీ ఆలీ, సోనూ నిగమ్ వంటి వారికి మరిన్ని అవకాశాలిచ్చారు. అలి అజ్మత్, బాండ్ స్ట్రింగ్స్, జునూన్ వంటి బృందాలకు చెందిన గాయకులకు పాకిస్తాన్‌లో వేదిక దొరికింది.
1981లో నాజియా, జోహెబ్ లిద్దరూ – Biddu రూపొందించిన ‘డిస్కో దీవానా’ ఆల్బమ్‌కి పాడారు. ఇది భారత్, పాకిస్తాన్‌లలో అనేక రికార్డులు సృష్టించడమే కాక, వెస్టిండీస్, లాటిన్ అమెరికా, రష్యా వంటి చోట్ల కూడా ప్రథమ స్థానంలో నిలిచింది.
‘Star’ (1982) అనే చిత్రంలో నటించేందుకు Biddu ఈ ద్వయానికి అవకాశం ఇచ్చారు. కానీ వారు నటన వైపు మొగ్గక, గాయకులుగానే ఉండిపోయారు. ఈ సినిమాలో కుమార్ గౌరవ్, రతి అగ్నిహోత్రి నటించారు. ఈ సినిమాలో బూమ్ బూమ్ ఆల్బమ్‍లోని పాటలని ఉపయోగించారు.
1984లో విడుదల చేసిన వారి ఆల్బమ్ ‘యంగ్ తరంగ్’లో లండన్‌కి చెందిన డేవిడ్ రోస్, కాథీ రోస్‌ల వీడియోలు ఉన్నాయి. ఈ ఆల్బమ్ లోని ‘ఆంఖే మిలానే వాలే’ సంచలనం సృష్టించింది. ‘Hotline’ (1987) ఆల్బమ్ సూపర్ హిట్ అయింది, అందులోని ‘ఆ హాఁ’ పాట ఎందరినీ ఆకట్టుకుంది.
ఈ తోబుట్టువులిద్దరూ పాకిస్తాన్ టివీలో ప్రసారమైన తొలి పాప్ షో ‘మ్యూజిక్ 89’ని అందించారు. గాయకులు అలీ అజ్మత్, సూఫీ రాక్ బ్యాండ్ జునూన్‍లను పరిచయం చేశారు.
వారి కొత్త రకం సంగీతం సాంప్రదాయవాదులకు నచ్చలేదు. “మేమందించే సంగీతం ఇదే, ఇష్టం ఉంటే ఆస్వాదించండి, లేదంటే లేదు. శాస్త్రీయ సంగీతమే అసలైన సంగీతమని వారంటారు. ఎప్పుడైనా ఏదైనా శాస్త్రీయ సంగీతం కార్యక్రమానికి హాజరైతే… అంత్యక్రియలకి హాజరయినట్లు తోస్తుంది. నిశ్చలంగా, నిశ్శబ్దంగా కూర్చోవాలి…” అన్నారామె (హెరాల్డ్). ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న కళాస్పందనకు అనుగుణంగా కొత్త తరపు స్వప్నాలుండాలని ఆమె ఆకాక్షించారు. ‘కల్చరల్ వారియర్స్’ – 1992లో ‘కెమెరా కెమెరా’ ఆల్బమ్ విడుదల సందర్భంగా అదే తమ చివరి ఆల్బమ్ అని ప్రకటించారు. ఆ తర్వాత నాజియా తన వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించారు.
సూపర్ హిట్ అయిన ‘మేడ్ ఇన్ ఇండియా’ పాటని Biddu తొలుత నాజియానే పాడమన్నారట, కానీ ఆమె పాడకపోవడంతో – అలీషా చినాయ్ ఆ పాట పాడి ప్రశంసలు పొందారు.
ప్రతిభాశాలి అయిన విద్యార్థినిగా పేరు తెచ్చుకున్న నాజియా – లండన్ లోని రిచ్‌మండ్ అమెరికన్ యూనివర్శిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్ లలో బాచిలర్స్ డిగ్రీ చేశారు. అంతే కాదు, లండన్ యూనివర్శిటీ నుంచి ఎల్.ఎల్.బి. పట్టా కూడా పొందారు.
సంఘసేవకి మొగ్గు చూపిన నాజియా, పేద కుటుంబాల పిల్లలు, యువత కోసం కరాచీలో పని చేశారు. BAN (Battle Against Narcotics) అనే సంస్థను స్థాపించారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఇండియా సంస్థకు నిధులు సమకూర్చడంలో సాయపడ్డారు.
1991లో ఐరాస లోని సెక్యూరిటీ కౌన్సిల్‍లో చేరి న్యూయార్క్‌లో రెండేళ్ళు పని చేశారు. ఆ పిమ్మట ఆమెకు కొలంబియా యూనివర్శిటీ వారి లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌లో స్కాలర్‌షిప్ లభించింది. కానీ తనకు కాన్సర్ ఉందని తెలియడంతో, ఆమె అక్కడ చేరలేకపోయారు.
ఖలీజ్ టైమ్స్ రిపోర్ట్‌ని ప్రస్తావిస్తూ, రీడిఫ్.కామ్ – 1995లో ఆమె శస్త్రచికిత్స చేయించుకున్నారనీ, స్టేజ్ వన్ ఒవేరియన్ కార్సినోమా సోకిందని, ఆ తర్వాత నాలుగేళ్ళు పాటు ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపింది.
పాట ద్వారా ఆకట్టుకోడమే కాకుండా నాజియా ‘యూత్ ఐకాన్’లా ఉండేవారు. దుంగారీస్, జంప్ స్యూట్స్, లెదర్ జాకెట్స్, మిడీస్, బ్రైడెడె ట్రెస్సెస్ ధరించేవారు. వేదిక పైన అసాంప్రదాయకంగా ఉండేవారు. ఆ కాలంలో నాజియా ఓ పోస్టర్ గర్ల్. బూమ్ బూమ్, యంగ్ తరంగ్, హాట్‌లైన్ వంటి అత్యంత వేగంగా అమ్ముడుపోయిన ఆల్బమ్లు ఈ తోబుట్టువులకి ఎంతో పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. బీటిల్స్ వారితో పోలిక తెచ్చాయి. కానీ నాజియా వీటన్నింటినీ విడిచిపెట్టారు.
కాన్సర్‍కి చికిత్స చేయించుకున్నాకా, నాజియా వ్యాపారవేత్త మీర్జా ఇస్తియాక్ బేగ్‍ని 30 మార్చి 1995 నాడు వివాహం చేసుకున్నారు. 7 ఏప్రిల్ 1997 నాడు వారికి అరెజ్ అనే కుమారుడు కలిగాడు. కుటుంబం పరిపూర్ణమయింది అని అనుకున్నారు. కానీ 1998 చివరికి వచ్చేసరికి కాన్సర్ మరింత తీవ్రతతో తిరగబెట్టింది. తన బిడ్డ కోసమైనా బతకాలనుకుని, కఠినమైన చికిత్సకి ఒప్పుకున్నారు నాజియా. కానీ చికిత్సా కాలంలో ఎంతో భావోద్వేగాలకు లోనయిన నాజియా, 13 ఆగస్టు 2000 నాడు చనిపోవడానికి పది రోజుల ముందు భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. జబ్బు చివరి దశలో ఉండగా, అంత అత్యవసరంగా భర్త నుండి ఎందుకు విడిపోవాలనుకున్నారో రహస్యంగానే ఉండిపోయింది. బహుశా ఆమె అనుభవించిన వేదన కూడా ఒక కారణం కావచ్చు.
1999లో ఒకసారి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాకా, ఒక ఇంటర్వ్యూలో… అదే ఆమె చివరి ఇంటర్వ్యూ… “ఈ జబ్బులో కొన్ని మంచి రోజులు ఉంటాయి, కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి… వీటి మధ్యలో నేను భయంకరమైన క్షణాలు గడిపాను… ఇప్పుడు కొద్దిగా నయం” అని అన్నారు (జీ టీవీ, యుకె, జూన్ 1999).
ఆ కఠినమైన సమయాల్లో, కీమోథెరపీ ఆమె శరీరంపై తీవ్ర ప్రభావం చూపింది. “ఏది ముఖ్యమో గ్రహించండి. కుటుంబం… మీ సన్నిహితులతో సమయం గడపండి. చిన్న చిన్న సమస్యలకి దూరంగా ఉండండి. రోజూ వారీ జీవితంలో వీటిని అధిగమించాలి…”
“ఏదో ఒక రోజు అందరూ చనిపోవలసిన వాళ్ళమే, కానీ నా సమయం ఇంకా రాలేదనిపిస్తోంది. పునరుక్తి అనుకోండి… మీ అందరి ప్రార్థనలే నన్ను కాపాడాయి” అని ఒకసారి అన్నారామె.
జీ టీవీ, యుకె కి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో… “భవిష్యత్తు కోసం మీరు బెంగ పడవచ్చు… మృత్యువు గురించి బెంగ పడవచ్చు… కానీ జీవితంలో సానుకూల దృక్పథంతో ఉండాలి. నేను ప్రతీ రోజుని ఆస్వాదిస్తున్నాను. నా కుటుంబంతో సమయం గడపడం నాకెంతో ఇష్టం. నాకో కొడుకు ఉన్నాడు… రెండేళ్ళ పిడుగు…” అని చెప్పారామె.
కానీ ఆ తర్వత కొద్ది రోజులకే ఆమె తీవ్రంగా జబ్బు పడ్డారు, లండన్ లోని నార్త్ లండన్ హాస్‌పైస్ లో చేరారు. స్వల్పంగా కోలుకున్నారు, మరునాడు డిశ్చార్జ్ అవుతారగా, ఆ తర్వాతి రోజు ఉదయం, ఆమెకి విపరీతంగా దగ్గు వచ్చింది.
13 ఆగస్టు 2000 నాడు ఆమె లంగ్ కాన్సర్‌తో మృతి చెందారు.
35 ఏళ్ళ నాజియాని లండన్ లోని హెండన్ సెమెటరీలో సమాధి చేశారు.
“తన కొడుకు కోసం జీవించాలనుకుంది అక్క. కీమోథెరపీని ఇంకా ఎక్కువ చేయమని వైద్యులని అడిగింది. కానీ అలా చేస్తే ఆమె జీవించదని వైద్యులు చెప్పేసారు. అప్పటికే ఆమె శరీరం బాగా క్షీణించింది. తర్వాత చనిపోయింది…” అని గుర్తు చేసుకున్నారు జోహెబ్ ఒక ఇంటర్వ్యూలో.
“చనిపోయేటప్పుడు తను సంతోషంగా లేదు. చాలా బాధలో ఉంది. అంత త్వరగా చనిపోతుందని ఆమె నాకెన్నడూ చెప్పలేదు. ఈ విషయంలో తనని నేను క్షమించలేను…” అన్నారు జోహెబ్. పైగా తన జబ్బు గురించి కుటుంబానికి ఏమీ చెప్పలేదని ఆయన అన్నారు. చనిపోయే ముందు కొద్ది రోజుల ముందు విడాకులు తీసుకునేదాక ఆమె తన వేదనని ఎవరికీ తెలియనివ్వలేదు. “ఆ గాయం ఎన్నటికీ మానదు” అన్నారు జోహెబ్.
దాతృత్వం అంటే ఇష్టం ఉన్న నాజియా తన రాయల్టీస్ అన్నింటినీ దానం చేసేసారు, 2003లో ఆమె తల్లిదండ్రులు నాజియా హసన్ ఫౌండేషన్‌ని స్థాపించి, ఆమె చేపట్టిన సంఘ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నారు.
2013లో ఆమె 16 ఏళ్ళ కుమారుడు అరెజ్ హసన్ – నాజియా హసన్ ఫౌండేషన్ కోసం – ‘Music That Becomes A Message’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఉపఖండం లోని ఎవరైనా ఈ పాటల పోటీలో పాల్గొనవచ్చని చెప్పారు.
“అమ్మకి సంగీతం అంటే ఇష్టం. ఏదో ఒక రోజు నేను సంగీతం సమకూరుస్తానను. అమ్మని గర్వపడేలా చేయడమే కాకుండా, అందరికీ సంతోషాన్నిస్తాను” చెప్పాడు అరెజ్.
***
ఆమె పాటల లింక్‌లలు యూ-ట్యూబ్‌లో:
https://www.youtube.com/watch?v=af9RjcwwDCE…
https://www.youtube.com/watch?v=mWzTZE-B1fM
https://www.youtube.com/watch?v=1Wjo1rVbCeY
సినిమా రాణి – తమిళంలో తొలి నటి, గాయని, దర్శకురాలు టి. పి. రాజలక్ష్మి:
తిరువయ్యూరు పంచపకేశ రాజలక్ష్మి – అలనాటి బ్రిటీష్ ఇండియాలోని తిరువయ్యూరులోని శాలియమంగళం అనే గ్రామంలో ఓ ఎకౌంటెంట్ కూతురుగా జన్మించారు. కళారంగంలో తన ప్రవేశానికి భావి సూచికగా – ఒక పాటని విన్న వెంటనే – సునాయాసంగా – అదే విధంగా పాడగలిగే అసాధారణ ప్రతిభ ఆ పాపకి ఉండేది. టి.పి. రాజలక్ష్మి స్వతంత్ర్యంగా ఎంచుకున్న మొదటి కళారంగం – గానం/సంగీతం. అందుకే జీవితాంతం, ఓ గాయనిగా నిలిచారామె.
అయితే వాళ్ళ సాంప్రదాయక బ్రాహ్మణ కుటుంబంలో ఆమె ప్రతిభను గుర్తించలేదు. ఆమెకు ఏడేళ్ళ వయసులో, ఆమెకంటే వయసులో ఎంతో పెద్దవారైన వ్యక్తితో వివాహం చేస్తే, ఆమె ఎదురు చెప్పలేకపోయారు. అయితే ఈ దంపతలకు పొసగక, పెళ్ళయినా కొద్ది రోజులకే రాజలక్ష్మి తిరిగి పుట్టింటికి వచ్చేసారు. అదే కాదు, పెళ్ళిలో ఇస్తామన్న కట్నం కూడా ఆమె తండ్రి పూర్తిగా ఇవ్వలేకపోయారు. అందుకే ఆయన తన భార్యని, కూతురుని విడిచి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా అక్కడ ఉండలేక ఆ తల్లీ కూతుళ్ళు తమ నివాసాన్ని తిరుచిరాపల్లికి మార్చుకున్నారు. ఇక్కడ రాజలక్ష్మికి రెండవ కళారంగం – రంగస్థలం!
రంగస్థలం మీద ఆమె ప్రవేశానికి కారకులు శంకరదాస్ స్వామిగళ్. ఆయన ఆధునిక తమిళ రంగస్థల కార్యక్రమాల ఆద్యుడు. ఆమె ప్రతిభని గుర్తించి, నగరంలోని ఓ సుప్రసిద్ధ నాటక సంస్థలో చేర్పించారు. మగవారే స్త్రీల పాత్రలను ధరించే ఆ కాలంలో – తొలినాటి ఆధునిక తమిళ రంగస్థలంపై నటించిన స్త్రీలలో రాజలక్ష్మి ఒకరయ్యారు. ఆమె ఎదుగుదలలో ఇది తొలి అడుగు.
ఆమెకి ఈ విధంగా పేరు రావడం, భర్తకి ఇష్టం లేకపోయింది, ఆమెతో సంబంధం తెంచుకున్నారు. అన్ని బంధనాల నుంచి విముక్తి కలగడంతో, రాజలక్ష్మి తన శక్తినంతా కూడదీసుకుని రంగస్థలంపై రాణించి మరిన్ని పేరు ప్రతిష్ఠలు పొందారు. భారత ఉపఖండంలోనే కాకుండా, బ్రిటీషువారి ఆధిపత్యంలో ఉన్న సింగపూర్ వంటి దేశాలలోనూ జరిగిన నాటక ప్రదర్శనలలో పాల్గొన్నారు. కాంట్రాక్టు నటిగా మొదలుపెట్టి, 18 ఏళ్లకే ప్రత్యేక నాటకాల నటిగా ఎదిగారు. అంటే ఫ్రీలాన్స్ ఆర్టిస్టుగా ప్రదర్శనలు ఇవ్వగలిగే సౌలభ్యం వచ్చింద్నన మాట… ఏ థియేటర్ కంపెనీకి లొంగి ఉండాల్సిన అవసరం లేదు. ఈ సౌలభ్యం సాధారణంగా ఈ రంగంలోని అత్యంత అనుభవజ్ఞులకు లభిస్తుంది… ఆమెకు లభించడం ఆమె ప్రతిభకు నిదర్శనం!
1925 నాటికి రాజలక్ష్మి మద్రాసుకి (నేటి చెన్నై) మకాం మార్చారు. అప్పుడే అక్కడ సినీరంగం వేళ్ళూనుకోడం ప్రారంభమైంది. రంగస్థలంపై పేరుపొందిన నటీనటులను సినీరంగం ఆకర్షించింది. తొలినాటి స్టూడియోలు రంగస్థలంపై రాణిస్తున్న నటీనటులతో ఒప్పందాలు కుదుర్చుకుని తమ స్టూడియో తీసే సినిమాలలో వరుసగా నటించేలా చూశారు. ఆ విధంగా రాజలక్ష్మికి, జనరల్ పిక్చర్స్ కార్పోరేషన్ వారితో ఒప్పందం కుదిరింది. 1929లో మూకీ సినిమా ‘కోవలన్’ తో వెండితెరపై తొలిసారిగా దర్శనమిచ్చారు. దాంతో తమిళ సినిమాలలో నటించిన తొలి నటి అయ్యారామె. ఆ తరువాత ఆమె అసోసియేటెడ్ ఫిల్మ్ కంపెనీకి మారి కొన్ని సినిమాలలో నటించారు. ఆపై ఆమెకు తొలినాటి తమిళ, తెలుగు సినిమాల దర్శకులు కె. సుబ్రహ్మణ్యంతో పరిచయం అయింది.
1931లో, దేశపు తొలి టాకీ చిత్రం ‘అలం ఆరా’ విజయవంతం కావడంతో, ఆ చిత్ర నిర్మాత అర్దేషిర్ ఇరానీ తన కార్యరంగాన్ని దక్షిణాదికి కూడా విస్తరించాలనుకున్నారు. తన మాజీ అసిస్టెంట్ హెచ్.ఎమ్.రెడ్డిని దర్శకులుగా నియమించి, సుప్రసిద్ధ కవి కాళిదాసు జీవితం ఆధారంగా ‘కాళిదాస్’ అనే చిత్రాన్ని తీయాలనుకున్నారు. ఈ చిత్రంలో నాణ్యమైన నటీనటులు, కథానాయిక కొరకు అన్వేషిస్తుంటే – సుబ్రహ్మణ్యం గారు కొన్ని పేర్లు సూచించారట.
ఈ విధంగా టి. పి. రాజలక్ష్మి భారతదేశ చరిత్రలోనే తొలి తమిళ – తెలుగు – టాకీ చిత్రంలో కథానాయికగా నటించారు. నటించడమే కాకుండా సినిమాలో నాలుగు పాటలు పాడారు. ఒక చిన్న నృత్యానికి నృత్యదర్శకత్వం వహించారు. చిత్రమేమిటంటే – ఈ సినిమా బహు భాషా చిత్రం! నాయిక రాజలక్ష్మి తమిళంలో మాట్లాడితే, కథానాయకుడు పి. జి. వెంకటేశన్ తెలుగులో మాట్లాడుతారు. ప్రిన్సిపాల్ పాత్రలో నటించిన ఎల్. వి. ప్రసాద్ హిందీలో మాట్లాడుతారు.
కాళిదాస్ చిత్రంలో ఎంత వైవిధ్యం ఉన్నప్పటకీ, రాజలక్ష్మికి రావల్సినంత గుర్తింపు రాలేదు. ఆమెకు అసలైన గుర్తింపు 1933లో వచ్చిన ఎస్. విన్సెంట్ గారి ‘వల్లి తిరుమానం’ చిత్రంలో లభించింది. ఈ చిత్రాన్ని కలకత్తాలో చిత్రీకరించడంతో, బెంగాల్‌తో వారి మూడేళ్ళ సహచర్యం- అలా మొదలైంది (సినీ పరిశ్రమలో అప్పటికి ప్రాంతీయవాద ధోరణులు తలెత్తలేదు, సినిమాలను అన్ని భాషలలోనూ, అన్ని నగరాలలోనూ తీసేవారు). అక్కడ ఆమె ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. తోటి నటుడు టి.వి. సుందరం గారిని ప్రేమించి పెళ్ళి చేసుకుని ఆయనతొ కలిసి 1936లో మద్రాసుకు వచ్చారు. ఈ సమయానికి తన నటన ద్వారా ఆమె ‘సినిమా రాణి’ అనే పేరు సంపాదించుకున్నారు.
నటిగా బాగా విజయవంతమవడంతో, టి.పి. రాజలక్ష్మి సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. 1936లో శ్రీ రాజమ్ టాకీస్ ప్రారంభమైంది. తొలి సినిమా ‘మిస్ కమల’. ఈ చిత్రానికి కథ, ఎడిటింగ్, దర్శకత్వం బాధ్యతలు వహిస్తూనే, నాయికగా నటించారామె. ఈ చిత్ర కథకి, స్క్రీన్‌ప్లేకి ఆధారం – ఆమె రచించి, ప్రచురించిన ‘కోమలవల్లి’ అనే నవల ఆధారం.
చారిత్రక ప్రమాణాల ప్రకారం, ఎలా చూసినా ‘మిస్ కమల’ ఒక ఫెమినిస్ట్ (లేదా కనీసం ప్రొటో-ఫెమినిస్ట్) చిత్రం. టైటిల్ పాత్రను టి.పి. రాజలక్ష్మి పోషించారు. కథలో ఆమె పాత్ర మధ్య తరగతి యువతి, బలవంతంగా పెళ్ళి చేసుకున్న భర్తని విడిచిపెట్టడం వల్ల, కుటుంబ సభ్యులే దూరం పెట్టిన యువతి పాత్ర – పేదరికంలో మగ్గి – జీవితంలో ఎదిరిన యువతి పాత్ర (ఆమె నిజజీవితానికి ఈ పాత్ర దగ్గర ఉందన్న సంగతి చదువరులు గ్రహించవచ్చు). ఈ సినిమా గొప్పగా విజయవంతమైంది. తన కూతురుకి ఈ సినిమా లోని నాయిక పేరు మీద కమల అని పేరు పెట్టారామె.
ఆమె దర్శకత్వం వహించిన రెండో సినిమా ‘మదురై వీరన్’ (1939). ఈ చిత్రం కూడా ఘన విజయం సాధించింది. తాను దర్శకత్వం వహించిన రెండు సినిమాల విడుదల మధ్య కాలంలో ఆమె కొన్ని పెద్ద సినిమాల్లో నటించారు. అందులో 1936లో ఎల్లిస్ ఆర్. దుంగన్ గారి ‘సీమంతిని’ సూపర్ హిట్ అయ్యింది. అయితే ఆమె రెండవ చిత్రం ఘన విజయం సాధించిన తర్వాత నుండి ఆమె మూడవ చిత్రం ‘Indhiya Thaai ‘ తరువాత ఆమె ట్రాక్ రికార్డ్ క్షీణించింది.
తన తొలి రోజుల నుంచి టి.పి. రాజలక్ష్మి తమిళ బ్రాహ్మణ పితృస్వామ్య వ్యవస్థతో పోరాడుతూనే ఉన్నారు. ఆమె వయసు పెరిగే కొద్దీ, ఆమె పై ఎన్నో పుకార్లు పుట్టించారు, పైగా సినిమాల్లో నటించడం అంత గౌరవప్రదం కాని వృత్తిగా ముద్రపడింది. తన చుట్టూ ఉన్న ఛాందసవాదులతో ఆమె తన పోరాటం కొనసాగించారు. తన స్వేచ్ఛను ఉపయోగించుకుని, ఆమె సంఘ సంస్కరణ కోసం కృషి చేశారు.
సొంత కూతురు కమల కాకుండా, రాజలక్ష్మి మల్లిక అనే అమ్మాయిని దత్తత తీసుకుని పెంచారు. అప్పట్లో దేశంలో విస్తృతంగా ఉన్న భ్రూణహత్య నుంచి మల్లికను కాపాడారామె. విధవరాళ్ళు తెల్ల చీరలు కాకుండా రంగు చీరలు ధరించే హక్కు ఉండాలని వాదించారు. పైగా, విధవలు అవకాశముంటే తమకి నచ్చినవారిని మరో వివాహం చేసుకోవచ్చని ప్రతిపాదించారు. ఈ అంశాలపై పుస్తకాలను రచించి ప్రచురించారు. తన ఆదర్శాలకు జీవితాంతం కట్టుబడి ఉన్నారు.
భారతీయ కుల వ్యవస్థ దుష్పరిణామాలను తీవ్రంగా వ్యతిరేకించారు. నీచమైన సినిమా వృత్తిలో ఉన్నందుకు అగ్రకులాల వాళ్ళంతా ఆమెను బహిష్కరించారు. దాంతో వారి పట్ల కాస్తో కూస్తో ఉన్న గౌరవం కూడా పోయిందామెకు. ఆమె కులాంతర వివాహాలను ప్రోత్సహించారు, తమిళ హేతువాద ఉద్యమ నేత, తొలి నాటి ఫెమినిస్ట్ అయిన ఇ.వి.ఆర్. పెరియార్ అభిమానాన్ని చూరగొన్నారు.
‘Indhiya Thaai’ (మదర్ ఇండియా అని అర్థం, 1957 నాటి హిందీ సినిమా మదర్ ఇండియా కాదు) బ్రిటీషు వారికి వ్యతిరేకంగా తీసిన చిత్రం. భారత జాతీయ కాంగ్రెస్, మహాత్మాగాంధీ ఆలోచనల ప్రభావం వల్ల రాజలక్ష్మి హృదయంలో రేగిన భావనల ప్రతిరూపం ఆ చిత్రం. ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించగలిగే ఆమె 28 ఏళ్ళ వయసులో, వృద్ధురాలి పాత్ర పోషించారు. ఈ సినిమా కథాంశం పట్ల సంతోషంగా లేని బ్రిటీషు అధికారులు దాన్ని బాగా కత్తిరించారు. ఆమె అనుమతి లేకుండా, సినిమాకి ‘Tamil Thaai’ కొత్త పేరు పెట్టారు. దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందనుకుంటే – ముక్కలు చెక్కలైన ఆ చిత్రం ఎటువంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది.
సామ్రాజ్యవాద ప్రభుత్వపు వ్యతిరేకతే కాకుండా, రాజలక్షి భౌతిక రూపం ఆమె కెరీర్‍ని నిస్సహాయ స్థితిలో పడవేసింది. ఆమె కూతురు కమల తర్వాత ఎప్పుడో చెప్పారు – ఆమె పోషించిన పెద్ద వయసు పాత్రని నిజమనుకున్న వారు, ఆమె అసలు వయసును గుర్తించలేదనీ, దాంతో అవకాశాలు సన్నగిల్లాయని. ఆ నటి నిజంగానే వృద్ధురాలయిందనీ, నటించే ఓపిక ఉండదని భావించారట. కథానాయిక అంటే ఎప్పటికీ యవ్వనంలోనే ఉండాలనే పితృస్వామ్య భావజాలంలోని బయటకు రాలేనివారు – ఎంతో దృఢమైన రాజలక్ష్మికి సైతం విలన్లుగా మారారు. క్రమంగా ఆమెకు అవకాశాలు క్షీణించాయి. ‘Tamil Thaai’ విడుదల తర్వాత ఆమె కేవలం నాలుగే సినిమాల్లో నటించారు. పైగా అవి కూడా గుర్తుంచుకోదగ్గ పాత్రలు కావు. తొలుత ఆమె ధనవంతురాలి జీవితం గడిపేవారు. అవకాశాలు క్షీణించి ఆదాయం రాక ఆర్థిక పరిస్థితి తలక్రిందులయింది. త్వరలోనే ఆస్తులన్నీ అమ్ముకుని, చిత్రరంగం నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. 1964లో 53 ఏళ్ళ వయసులో ఆమె మద్రాసులో అద్దె ఇంట్లో మరణించారు.
వారసత్వం:
సామ్రాజ్యవాద కాలపు నాటి దేశపు వారసత్వం లానే, టి.పి. రాజలక్ష్మి సినిమాలన్నింటీ ఇప్పుడు కోల్పోయాము. ఆమె తీసిన మైలురాళ్ళ వంటి సినిమాలు – మిస్ కమల, మదురై వీరన్, Indhiya Thaai తో – సహా వేటివీ ప్రింట్స్ ఇప్పుడు దొరకడం లేదు. అలాగే తొలి దక్షిణాది టాకీ సినిమా ‘కాళిదాస్’ జాడలు కూడా లేవు (అలం ఆరా కూడా ఇలాగే అలభ్యం). ఆమె తొలి సినిమా మూకీ చిత్రం ‘కోవలన్’ కూడా ఇప్పుడు దొరకడం లేదు. ఇప్పుడు మనకు వారసత్వంగా దొరికేవల్లా ఆమె గానాన్ని రికార్డు చేసిన కొన్ని గ్రామఫోన్ రికార్డులే!
దేశంలో సినిమా అభివృద్దికి దోహదం చేసిన ఎందరో తొలినాటి దర్శకనిర్మాతలలో ఆమె ఒకరు. రంగస్థలానికి, సాహిత్యానికి, సంఘ సంస్కరణలకి, స్వాతంత్ర్యోద్యమానికి ఆమె చేసిన సేవలను – “ఆమె తొలి తమిళ తెలుగు నటి” అనీ లేదా “ఆమె దేశంలో రెండవ దర్శకురాలు” అని ఒక్క వాక్యానికి పరిమితం చేయడం తగదు.
ఈ ఏడాది ఆమె 110 జయంతి జరుపుకుంటున్న సందర్భంగా, తెర మీద, తెర వెనుక ఆమె సాధించిన ఘన విజయాలను మననం చేసుకోవాలి, గౌరవించుకోవాలి. ఇందులో మనం నిజాయితీగా వ్యవహరిస్తే, ఆమె సినిమా రంగానికే కాకుండా, పలు విభిన్న రంగాలలో సేవలందించారని అంగీకరించవలసి వస్తుంది.
ఎంతైనా ఆమె ‘సినిమా రాణి’ మాత్రమే కాదు, కదా!