కలగంటినే చెలీ-18

0
3

[box type=’note’ fontsize=’16’] శ్రీ సన్నిహిత్ వ్రాసిన ‘కలగంటినే చెలీ’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ఊ[/dropcap]ళ్ళో.. రచ్చబండ వైపు నడుస్తున్నారు శంకరం మాష్టారు. అతని మనసంతా బాధ గూడు కట్టుకుని ఉంది. కొడుకు సూర్య ఫోన్‌ చేసి పది రోజులైంది. ఇంతకు ముందు బాగానే ఉండేవాడు. కానీ ఈ మధ్య అసలు తాము బ్రతికున్నామో లేదో కూడా పట్టించుకోవడం లేదు. ఖర్మకాలి తాము ఫోన్‌చేస్తే “బిజీగా ఉన్నాను.. తర్వాత మాట్లాడతాను” అని పెట్టేస్తాడు. ఏంటో అంత బిజీ.. కన్న తల్లిదండ్రులని కూడా పట్టించుకోనంత బిజీ. “నమస్కారం మాష్టారూ.. అబ్బాయి ఎలాగున్నాడు” అడుగుతున్నాడో తెలిసిన ఆసామి.

“బాగానే ఉన్నాడండీ…”

“అలాగా.. ఈ సారి ఫోన్‌ చేస్తే అడిగానని చెప్పండీ” అంటూ వెళ్ళిపోయాడు. చివుక్కుమంది మాష్టారి మనసు. మింగలేక కక్కలేక నిశ్శబ్దంగా నడవసాగాడు.

రచ్చబండ చేరుకున్నాక రోజూ కలిసే మిత్రులు “రండి మాష్టారూ” అంటూ స్వాగతం పలికారు.

అందరినీ ఆప్యాయంగా పలకరించి ఆసీనులయ్యారు.

ప్రెసిడెంట్‌ గారు అడుగుతున్నారు, “ఏంటండీ… ఈ మధ్య మీ అబ్బాయి ఊరి వైపు రావడం లేదు… అసలు ఈ ఊరు గుర్తుందా అయనకి?” అని.

గతుక్కుమంది శంకరానికి. ఇవాల్టికి ఇక అదే టాపిక్‌ నడుస్తుంది.

గొంతు పెగల్చుకుని “అవునండీ.. చాలా బిజీగా ఉన్నాడట.. వీలు చూసుకుని వస్తానన్నాడు” అన్నారు.

పక్కనే ఉన్న మోతుబరి “ఆ… ఈ కాలం కుర్రాళ్ళకి ఊరు ఎందుకు గుర్తుంటుంది…ఒక్కసారి ఊరు దాటితే అంతా మర్చిపోతారు” అన్నాడు. అందరూ పక పకా నవ్వారు.

“ఆ.. ఊరుకోవోయ్‌… ఆళ్ళ పనులు ఆళ్ళకి ఉండవా.. మన లాగ పనికిమాలినోల్లా ఏటి” అన్నాడు ఇంకో పెద్దాయన.

“ఔన్రోయ్.. అదీ నిజమే… మర్సిపోనాను” అన్నాడు ఇంకో సన్నకారు.

శంకరం గారన్నారు “అదేం లేదండీ.. ప్రోజెక్ట్‌ పనులు ఒక కొలిక్కి వచ్చాక వస్తానన్నాడు” అని సర్ది చెప్పారు.

“ఊరుకోండి మేష్టారూ.. మీరెప్పుడూ ఇలాగే కవర్‌ సేత్తారు… మీ వోడు వత్తానన్నా ఆళ్ళావిడ రానివ్వాద్దూ…” అన్నాడో తీర్పరి.

అవమాన భారంగా అనిపించింది శంకరానికి. అదేమీ బయటపడకుండా మౌనంగా ఉండిపోయాడు.

ఆ తర్వాత ఏవేవో గ్రామ రాజకీయాలు మాట్లాడుకున్నారు. భోజనాల వేళయిందని అందరూ అక్కడి నుండి కదిలిపోయారు.

తిన్నగా ఇంటికొచ్చిన శంకరం , భార్య పార్వతిని గట్టిగా కేకేసి పిలిచారు.

“ఏమే… నీ కొడుక్కి మనం బ్రతికున్నామన్న విషయం గుర్తుందా?” కోపంగా అన్నారు.

పార్వతమ్మకు విషయం అర్థం అయింది. రచ్చబండ దగ్గర ఏదో ఇష్యూ అయిందని, అందుకే కోపంగా ఉన్నారని, తను తగ్గడం బెటర్‌ అని అనుకుంది. నెమ్మదిగా “పోనీలెండి… వాడి పనులు వాడికుంటాయి కదా… పైగా మనం అప్పుడెప్పుడో గొడవపడి వచ్చేసాం… మనం కూడా అర్థం చేసుకోకపోతే ఎలా?” అంది.

“బాగా వెనకేసుకొస్తావు వాడిని.. ముందు ఫోన్‌ చెయ్‌.. నేను మాట్లాడాలి” అన్నారు శంకరం.

సూర్య ఫోన్‌ కలిసాక శంకరం “ఏరా…. నువ్వు మన ఊరొచ్చి ఎన్నేళ్లు అయ్యింది గుర్తుందా? మేం ఎలా ఉన్నామో.. ఏమయిపోతున్నామో నీకు అక్కరలేదా?” అని గట్టిగా అరిచారు.

సీరియస్‌ పనిలో ఉన్న సూర్యకి టక్కున బీపీ రెయిజ్‌ అయ్యింది. అయినా కంట్రోల్‌ చేసుకున్నాడు. “ఇప్పుడేమయింది నాన్నా… నేను రాకపోతే మీకు నష్టమేమైనా ఉందా… ఎందుకంత ఆవేశం?” అన్నాడు.

“మా బాధ నీకు ఆవేశంలా కనబడుతోందా… అంతేరా.. నిన్ను పెంచి పెద్ద చేసాం కదా.. అదే మేం చేసిన తప్పు…” అంటూ ఉండగా పార్వతమ్మ ఫోన్‌ లాక్కుని “… ఒరేయ్‌.. మేము చెప్పేది వినరా.. ఒక్కసారి అందరినీ తీసుకుని ఊరు రారా.. జనాల సూటిపోటి మాటలు భరించలేకపోతున్నాం..” అంది.

“వస్తానమ్మా.. వీలు చిక్కడం లేదు… కుదరక నేనే రావడం లేదు” అన్నాడు సూర్యం.

“అమ్మాయి రాకపోయినా.. నువ్వు పిల్లాడ్ని తీసుకుని రా..” అని ఫోన్‌ పెట్టేసింది పార్వతమ్మ.

బాధగా అనిపించింది సూర్యకి. సీత పట్ల తన తల్లికి ఇంకా కోపం తగ్గలేదని అర్థమైంది. కానీ తనొక్కడే ఊరు వెళ్తే ‘మీ ఆవిడేదిరా’ అని అడిగే ఊళ్ళో వాళ్ళకి ఏం సమాధానం చెబుతాడు. అందుకే వెళ్ళడం లేడు. ‘అయినా తను పెళ్ళి చేసుకోవడమే ఈ మార్పులన్నిటికీ కారణమా? లేక పరిస్థితిని హేండిల్‌ చెయ్యలేని తన అసమర్థతా? ఏమో!! కాలమే తేల్చాలి’ అనుకుని నిట్టూర్చాడు.

***

సుశీల్‌!!

సీత తమ్ముడు. విజయవాడలో ఇంజనీరింగ్‌ చదువుతున్న విద్యార్థి. అనసూయమ్మ గారి గారాల పుత్రుడు. అతన్ని చిన్నప్పటి నుండీ తన చెప్పు చేతల్లో పెంచింది అనసూయమ్మ. మగపిల్లాడు కదా అని నెత్తి మీద పెట్టుకుంది. ఆ గారాబం తోనే వాడు గాడిదలా తయారయ్యాడు. పట్టుబట్టి వెనకనుండి తోస్తే ఇంజనీరింగ్‌ దాకా దేకాడు. భారీగా డొనేషన్‌ తీసుకుని సీటిచ్చిన ఆ కాలేజీ వాళ్ళు కూడా అతన్ని బాగా ముద్దుగా చూసుకుంటారు. పరీక్షల్లో బాగా వ్రాయకపోయినా చూసీ చూడనట్టు వదిలేస్తారు. ఆ రకంగా అతను అదృష్ట జాతకుడు. అయితే అతనో పెద్ద తాత్వికుడు కూడా. ఎవరి గురించీ పట్టించుకోకుండా, కాలేజీ హాస్టల్లో ఉంటూ తనదైన ఆనంద ప్రపంచంలో విహరిస్తూ ఉంటాడు. అవసరానికి మాత్రమే ఆ ప్రపంచంలో నుండి తల బైటికి పెట్టి తల్లి అనసూయమ్మ గారిని సంప్రదిస్తూ ఉంటాడు. అవసరం తీరాక తిరిగి తన షెల్‌లోకి వెళ్ళిపోతాడు. అందుకే అతని ప్రసక్తి ఇప్పటి దాకా రాలేదు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఇంటికొచ్చాడు. అనసూయమ్మ విపరీతంగా సంతోష పడిపోయింది. “సీతా…నీ తమ్ముడొచ్చాడే..” అని కూతురికి ఫోన్‌చేసి చెప్పింది. తమ్ముడి గురించి తెలిసిన సీత నిరాసక్తంగా “ఆహా..అలాగా..సరే”  అని చెప్పి ఫోన్‌ పెట్టేసింది.

వచ్చిన రోజు స్మార్ట్‌ఫోన్‌లో తల దూర్చి కామ్ గానే ఉన్నాడు సుశీల్‌. తర్వాతి రోజు నుండి నెమ్మదిగా గోకడం మొదలెట్టాడు. “అమ్మా..నాక్కొంచెం డబ్బులు కావాలి” అని.

“ఎంత కావాల్రా..” అంది అనసూయమ్మ

“రెండు లక్షలు”

“అమ్మో అంత డబ్బా.. ఎందుకురా..” ఆశ్చర్యపోయింది

“నా ఫ్రెండ్‌ రాకేష్ కష్టాల్లో ఉన్నాడమ్మా.. వాళ్ళ నాన్న గారికి ఆపరేషన్‌ చెయ్యాలట… ఎక్కడ ట్రై చేసినా దొరకడం లేదట..” పిల్లిలా నెమ్మదిగా అన్నాడు.

అనసూయమ్మ నమ్మడానికి ట్రై చేసింది. కొడుకు మీద ప్రేమ ఆమెను నమ్మేలా చేసింది. “సరే..చూద్దాంలే” అంది. సుశీల్‌ మళ్ళీ స్మార్ట్‌ఫోన్‌లో సంతోషంగా తలదూర్చాడు.

తర్వాతి రోజు పొద్దున్న అనసూయమ్మ సీత దగ్గరకు వెళ్ళింది. అప్పటికే సూర్య ఆఫీసుకి, చింటూ స్కూల్‌కి వెళ్ళిపోయారు.

సావధానంగా కూర్చున్నాక “అమ్మా…చెప్పమ్మా..ఏంటి విషయాలు” అంది సీత.

“తమ్ముడు అర్జెంటుగా డబ్బులు కావాలంటున్నాడమ్మా..” అంది అనసూయమ్మ.

“అలాగా.. ఎంతంట…”

“రెండు లక్షలు… ఎవరో ఫ్రెండ్‌ నాన్న గారికి ఆపరేషన్‌ అంట..”

“సరే నీ దగ్గర ఉంటే ఇవ్వు” అంది సీత.

“నా దగ్గరెక్కడున్నాయమ్మా… మీ నాన్నగారు రిటైర్‌ అయిన తర్వాత పెన్షన్ మీదే కదా బ్రతుకుతున్నాము “

“అయితే ఇవ్వడం మానేయ్‌.. అంత కంగారేముంది “

“అయ్యో అలా అనకమ్మా.. వాడు బాధపడుతున్నాడు..”

“సరే, నన్నేం చెయ్యమంటావమ్మా..” కొంచెం కోపంగా అంది సీత.

“అలా.. కోప్పడకమ్మా.. నువ్వు సూర్యకు తెలీకుండా ప్రతీ నెలా చిట్టీ వేస్తున్నావు కదా.. అది పాడేద్దాం..” అంది అనసూయమ్మ.

“అదేంటమ్మా… అవసరానికి వస్తాయని ఆయనకు తెలీకుండా కడుతున్నాను…నీకు ఇచ్చేస్తే ఎలా?” అసహనంగా అంది.

“చూద్దాం లేమ్మా.. తర్వాత ఎడ్జస్ట్‌ చేస్తాను.. ఇప్పుడైతే ఇవ్వు…” అని బ్రతిమాలింది. చాలా సేపు ఆలోచించింది సీత. తప్పించుకునే పరిస్థితి లేదు కాబట్టి “సరేనమ్మా.. కానీ తొందరలోనే ఇచ్చెయ్యాలి” అని చెప్పింది. “అలాగేనమ్మా… నా తల్లివి కదూ..” అని మురిసిపోయింది అనసూయమ్మ.

తర్వాత ఆ చిట్టీ పాడి రెండు లక్షలకు కొంచెం తక్కువ ఎమౌంట్‌ తీసుకుని సుశీల్‌ చేతిలో పెట్టింది అనసూయమ్మ. “చాలా థేంక్స్‌ అమ్మా..” అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు సుశీల్‌.

ఆ రాత్రికే బయలుదేరి విజయవాడ వెళ్ళిపోయాడు. విజయవాడలో దిగగానే ఒక బైక్‌షో రూంకి వెళ్ళి అప్పటికే ఆర్డర్‌ ఇచ్చిన బైక్‌కి పేమెంట్‌ చేసి, ఆ హై ఎండ్‌ బైక్‌ని డెలివరీ తీసుకున్నాడు. కనక దురమ్మ వారి సన్నిధిలో పూజ చేయించాడు. ఆ రాత్రి తన ఫ్రెండ్స్‌ అందరికీ బ్రహ్మాండమైన మందు పార్టీ ఇచ్చాడు…. పేరులో తప్ప ఎక్కడా ‘శీలం’ లేని సుశీల్‌!!!

***

ఆఫీసులో సీరియస్‌గా పని చేస్కుంటున్నాడు సూర్య. త్వరలో ఒక బాంబ్‌ పేలబోతోందని తెలిస్తే అంత ప్రశాంతంగా ఉండేవాడు కాదు.

ప్యూన్‌ వచ్చి ఒక లెటర్‌ ఇచ్చాడు. ఆశ్చర్యపోతూ దాన్ని ఓపెన్‌ చేసాడు.

అది చిట్‌ఫండ్‌ కంపెనీ పంపిన లెటర్‌. ఆ కంపెనీ తరపున వాళ్ళ లాయర్‌ వ్రాసినది. రవి అనే వ్యక్తి డబ్బులు కట్టనందున అతనికి గ్యారంటీ ఇచ్చిన ముగ్గురు ఎంప్లాయీస్‌ దగ్గర నుండి రికవరీకి సంబంధించిన కోర్ట్‌ ఆర్డర్‌ అది! హతాశుడయ్యాడు సూర్య. మంచికి వెళ్తే చెడు జరగడం అంటే ఇదే అనుకుని బాధపడ్డాడు. వెంటనే రవి కోసం అతని సీట్‌కి వెళ్ళాడు. కానీ వాడు లేడు. బాస్‌ రాజీవ్‌ దగ్గరికి వెళ్ళాడు.

“రా సూర్యా.. రా..” అన్నాడు రాజీవ్‌.

“బాస్‌.. చూసారా ఇది.. మన రవికి నేను గ్యారంటీ ఇచ్చాను. ఇప్పుడు వాడు ఆ డబ్బులు కట్టలేదట. నాకు సేలరీ రికవరీ వచ్చింది” అన్నాడు ఎక్సైటింగ్‌గా..

“అవునా.. అందుకేనా ఆ రవి గాడు ఆఫీసుకు రావడం లేదు” అని బ్లాంక్‌ ఫేస్‌ పెట్టాడు.

“వాడు మీకు టచ్‌లోకి వస్తే నేను మీకు ఇన్ఫార్మ్ చేసానని చెప్పండి” అని వచ్చేసాడు. రవి సెల్‌కి కాల్‌ చేస్తే స్విచాఫ్‌ వస్తోంది.

సూర్య వెళ్ళగానే రాజీవ్‌, రవి ఆల్టర్నేట్‌ నెంబర్‌కి ఫోన్‌ చేసాడు.

రవి “ఆ చెప్పన్నా..” అన్నాడు.

“ఇప్పుడే వచ్చాడు… అనుకున్నట్టే అయింది. సేలరీ కటింగ్‌ వచ్చింది. మన ఫైనాన్స్ గ్రూప్‌వాళ్ళు ఆ పని చూసుకుంటారు లే” అన్నాడు. “.. మన విషయం మాత్రం బైటికి రాకూడదు”.

“అలాగే అన్నా..” అని చెప్పి పెట్టేసాడు రవి. రాజీవ్‌ క్రూరంగా నవ్వుకున్నాడు. చిట్టీ పాడిన సొమ్ముని ఇద్దరూ సమానంగా పంచుకున్న విషయం సూర్యకు తెలిసే అవకాశం ఎప్పటికీ లేదు.

సీట్‌కి వచ్చి అలాగే కూలబడిపోయాడు సూర్య. తన ఒక్కడి జీతం మీదే కుటుంబం నడుస్తోంది. ఏదో కొంచెం సేవింగ్స్‌ తప్ప పెద్దగా దాచుకున్నది లేదు. ఇప్పుడు సేలరీ చేతికి రాకపోతే బ్రతుకు బండిని నడిపేదెలా?

సాయంత్రం దాకా ఏదోలా పనిచేసి ఇంటి ముఖం పట్టాడు. అన్యమస్కంగా డ్రైవ్‌ చేసుకుని ఇంటికి చేరుకున్నాడు. అలసటగా సోఫాలో వాలిపోయాడు.

సీత వచ్చి “ఏమండీ నిన్న మా తమ్ముడు వచ్చాడు..” అని ఏదో చెప్పబోతోంది.

చిర్రెత్తుకొచ్చింది సూర్యకు. “వాడొస్తే ఏం చెయ్యమంటావు.. ప్లీజ్‌ లీవ్‌ మి ఎలోన్‌..” అని విసుక్కున్నాడు. దెబ్బతిన్న పక్షిలా విలవిల్లాడిపోయింది సీత. కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. తమాయించుకుంది. నిశ్శబ్దంగా టీ ఇచ్చి వెళ్ళిపోయింది. చింటూకి హోం వర్క్‌ చేయించసాగింది.

చాలా సేపటి తర్వాత సూర్య నార్మల్‌ అయ్యాడు. సీతను విసుక్కున్నందుకు కించిత్‌ బాధ పడ్డాడు. సీత దగ్గరకు వెళ్ళి “సీతా.. కొంచెం నా మనసు బాలేదు.. అందుకే..” అని చెప్పబోయాడు.

సీత ఏమీ మాట్లాడలేదు. ‘అదే… సర్దుకుంటుందిలే’ అనుకుని దూరంగా వెళ్ళిపోయాడు.

ఆ రాత్రి… సీతకు జరిగిన విషయం చెప్పాడు. తాను ఒక చిట్టీకి గ్యారంటీ ఇచ్చానని… వాడు కట్టకుండా ఎగ్గొట్టాడని… సేలరీ కటింగ్‌ వచ్చిందని, వీలైనంత వరకు ఆ డబ్బులు కొలీగ్‌ రవితో కట్టిస్తానని చెప్పాడు. సీత మౌనంగా ఇవన్నీ వినసాగింది. ఏమీ స్పందించలేదు. ఆ రాత్రి నిర్జీవంగా గడిచిపోయింది. పొద్దున్న లేచాక యథావిధిగా కార్యక్రమాలన్నీ కానిచ్చి… చింటూని స్కూల్‌లో దింపి ఆఫీసుకి వెళ్ళిపోయాడు సూర్య.

సీత తల్లికి ఫోన్‌ చేసింది “అమ్మా… నువ్వొకసారి రా… నీతో మాట్లాడాలి” అని.

“అలాగే వస్తానమ్మా..” అంది అనసూయమ్మ.

సీత టిఫిన్‌ చేసి టీవీ చూస్తుండగా వచ్చింది అనసూయమ్మ.

కూర్చుంటూ “చెప్పమ్మా.. ఏమయింది” అంది.

సీత మొత్తం జరిగింది చెప్పింది. అగ్గి మీద గుగ్గిలం అయింది అనసూయమ్మ. “అదేంటమ్మా.. నీకు చెప్పకుండా అసలు సంతకం ఎలా పెట్టాడు?” అని ఆశ్చర్యపోయింది, తను నిన్ననే సూర్యకు చెప్పకుండా చిట్టీ పాడిన విషయం కన్వీనియంట్ గా మర్చిపోతూ.

“అదేనమ్మా.. నేను కూడా షాక్‌ అయ్యాను” అంది సీత. “..అయినా ఇతనితో ఇక నేను వేగలేకపోతున్నానమ్మా…” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది. చాలా బాధపడింది అనసూయమ్మ.

“ఎందుకమ్మా ఈ బాధలన్నీ.. కొన్ని రోజులు నువ్వు చింటూని తీసుకుని మన ఇంటికి వచ్చెయ్‌.. అప్పుడు సరి అవుతాడు” అని చెప్పింది. ఈ ఆలోచన చాలా కరెక్ట్‌గా అనిపించింది సీతకు. తను కూడా అతని బాధ్యతారహిత ప్రవర్తనతో విసిగిపోయింది. కొన్ని రోజులు దూరంగా ఉంటే మంచిదే అనుకుని తల్లి దగ్గరకు వెళిపోదాం అని నిర్ణయించుకుంది. స్కూల్‌ టైము అవగానే చింటూని పికప్ చేసుకుని ఇంటికి వచ్చి ఒక బేగ్‌లో అన్నీ సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here