[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి వావిలికొలను రాజ్యలక్ష్మి రచించిన ‘ప్రేమ పరిమళం‘ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]”అ[/dropcap]క్కా!”
“ఏంటిరా దీపూ?”
“అమ్మ నాన్న ఇంకెప్పుడొస్తారు?” బేలగా చూస్తూ విచారంగా అడుగుతున్న తమ్ముడిని అలా చూడగానే ఎందుకనో అనిందిత మనస్సంతా ఒక్కసారిగా డీలా పడిపోయింది.
దీపు దగ్గరిగా వెళ్ళి వాడ్ని బిగ్గరగా వాటేసుకొని “ఏం, దీపూ! ఎందుకలా అడుగుతున్నావ్? అమ్మనాన్నలపై బెంగ పెట్టుకున్నావా? వస్తారు లేరా! ఇంకా రెండు మూడు రోజుల్లో” అంటూ తమ్ముడిని అనునయంగా ఓదార్చింది.
“అమ్మని చూడాలని వుందక్కా!” గద్గదిక స్వరంతో అన్నాడు.
“నాన్న ప్రతిరోజూ రాత్రిపూట మాట్లాడుతూనే వున్నాడు. ఆ టైమ్‌లో నీవేమో బాగా పండుకొని వుంటావు. నిద్ర లేపలేకపోయాను. ఈమారు నీవు పండుకున్నా సరే నాన్న ఫోన్ చేసినప్పుడు నిన్ను తప్పకుండా లేపి అమ్మతో మాట్లాడిస్తినురా. సరేనా?” అంది తమ్ముడికి సర్ది చెప్పుతూ ప్రేమగా తల నిమురుతూ.
“ఓకె.. అక్కా! తినడానికి ఏమైన పెట్టవా? ఆకలవుతుంది.”
“సరే, నీవలా కూర్చో. నేను క్షణంలో నీ కోసం ఉప్మా చేస్తినురా.”
“ఊహు, ఉప్మా నాకొద్దక్కా!”
“ఏం, ఉప్మా ఇష్టం లేదా?”
“వద్దు. ఇంకేమైన పెట్టక్కా!”
“సరే, అమ్మ పోయేప్పుడు చేసినవి కారం అటుకులు వున్నాయి అవి పెట్తాను. సరేనా?” అంటూ అనిందిత వంటింట్లో కెళ్ళీ కబోర్డ్‌లో పై అరలో వున్న స్టీల్ డబ్బా అందుకొని కొన్ని అటుకులు తీసి ఓ ఫ్లేట్‌లో పెట్టి దీపుకిచ్చింది తినమని.
“నేను నాన్నకు కాసేపయ్యాక ఫోన్ చేస్తాను. అప్పుడు నాన్న ఫోనెత్తితే నీకిస్తానురా. అమ్మతో తనవిదీరా మాట్లాడు సరేనా?”
‘సరే’ అన్నట్లుగా బుద్ధిగా తలూగించాడు కారం అటుకులు తింటూ.
ఆ తర్వాత అనిందిత తాను టీ పెట్టుకొని తాగి, తమ్ముడికి పాలలో బూస్ట్ కల్పించింది.
“రాత్రికి మనం వంటేం చేసుకుందామురా దీపూ?” సరదాగా అడిగిందామె.
“ఆలూ బిర్యానీ చేయక్కా! తినక చాలా రోజులైంది” ఉత్సాహంగా అన్నాడు దీపు.
“ఓ.కె. డన్.. రాత్రికి అదే చేస్తాను” అంది నవ్వుతూ అందామె.
అక్కాతమ్ముడిద్దరూ కలిసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లులి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, ఆలుగడ్డలు అన్నీ తరిగి పెట్టుకొగా, గబగబా కుక్కర్లో చేసేసింది.
భోజనం చేయక మునుపే ఓమారు తండ్రి సెల్‌కు ఫోన్ చేసింది. కలువలేదు. సర్పంచ్ లలితాంబకు చేసిందీమారు.
ఆవిడ వెంటనే ఎత్తింది.
“సర్పంచ్ గారూ! మా అమ్మ నాన్న ఎక్కడున్నారు? ఎన్ని సార్లు చేసినా ఫోన్ ఎత్తడం లేదు. మా తమ్ముడు దీపూ మా అమ్మతో మాట్లాడాలని ఒహటే పేచి. నాన్నేమో ఫోన్ ఎత్తడం లేదు.”
“మీ నాన్నగారు, దొరస్వామి, మా తమ్ముడు ముగ్గురూ కల్సి ఇందాకనే ఎక్కడికో బయటికెళ్ళారు. ఇదిగో, మీ అమ్మగారు మాత్రం వున్నారు. ఫోన్ యిస్తున్నాను. మాట్లాడమనండి మీ తమ్ముడిని.”
“హమ్మయ్య! ఒరేయ్ దీపూ! నీ అదృష్టం బాగుంది. ఇక మాట్లాడురా అమ్మతో” సంతోషంతో ఫోనిచ్చింది తమ్ముడికి.
దీపు ముఖం ఆనందంతో వెలిగిపోవడం అనిందిత గమనించింది. వాడి తలపై చేయేసి ప్రేమగా నిమురుతూ “నీవు మాట్లాడేది అయ్యాక నాకివ్వు ఫోన్” అంటూ పని చేసుకోసాగింది. ఓ చెవి ఇటు వేసి వాడు తల్లితో ఏమేమి మాట్లాడుతున్నాడో వింటూనే వుంది.
***
“ఒరేయ్, బాబూ! ఇలా రావోయ్!”
“ఏంటన్నా?” కొంచెం బెదురుగా చూస్తూ ముందుకొచ్చాడాబ్బాయ్.
” గ్రామ పంచాయితీ ఆఫీస్‌లో అనిందితా మేడమ్ వచ్చిందేమో చూసిరా!…”
“సరే” అంటూ ఆ అబ్బాయ్ తూనీగలాగా పరిగెత్తాడు.
ఓ ఐదు నిముషాలలో బాణంలా మళ్ళీ దూసుకొచ్చాడా అబ్బాయ్. “రాలేదన్నా!” అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఉప సర్పంచు రాయప్ప ఇంటిముందు అటు ఇటు తిరుగుతూ ఫోన్ చేసి ఎవరితో మాట్లాడుతున్నాడు.
అంతలో తల్లి సత్యవతి ఫోన్ చేసిందనికి.
“ఏంటమ్మా! బాగున్నావా?”
“నేను బాగున్నానురా! నీవెలా వున్నావేమోనని ఫోన్ చేశాను. వేళకు తిండి తింటున్నావా లేదా?”
“ఆ, వండుకొని బాగానే తింటున్నానమ్మా”
“జాగ్రత్త బిడ్డ! బయటి కెళ్ళినప్పుడు ఇంటికి తాళం పెట్టి వెళ్ళు. తలుపులు దగ్గరికేసి వెళ్ళకెక్కడికి. ఎటైనా వెళ్ళితే తాళం పెట్టి వెళ్ళు . ఎందుకంటే కోడల పిల్లకని కొన్న బంగారం ఇంట్లోనే వుంది. అందుకని చెప్తున్నానురా!…”
“సరే, అమ్మా. ఫోన్ పెట్టేయనా? అందురూ బాగేకదా? ఇంకా ఎన్ని రోజులకమ్మా మీరు వచ్చేది?”
“ఇంకా ఓ మూడు రోజులకి వస్తావేమోరా!”
“సరే, నీ ఆరోగ్యం జాగ్రత్త! వుంటానమ్మా” రాయప్ప ఫోన్ పెట్టేశాడు.
ఎదురుగుండా వున్న రోడ్డు పై దృష్టి సారించి చూడసాగాడతను; ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా.
కాసేపటికి అతని నిరీక్షణ ఫలించింది. అల్లంత దూరంలో స్కూటీపై అనిందిత వస్తూ కనిపించింది. ఉప సర్పంచ్‌ను దూరం నుంచే చూసిన ఆమె మెల్లగా బండి స్లో చేసింది.
“మేడమ్! నేను మీ కోసమే ఇందాకటి నుంచీ ఎదురుచూస్తున్నాను.”
“మీ వాలకం చూడగానే గుర్తించిన నేను ఆగాను. ఎందుకోసం?”
“మండలాఫీసు నుంచి ఎమ్.పి.ఓ. గారు కొంతమంది పని వాళ్ళని పంపారు. వాళ్ళు వైకుంఠధామంలో పని చేస్తున్నారు. ఒకరు స్నానాలకి కొళాయిలు బిగిస్తున్నారు. మరొకర గదిలోనికి కరెంట్ సప్లై యిస్తున్నారు. నేనిప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. ఇంకో విషయం ఏమంటే రేపు అగ్రికల్చర్ ఫీల్డాఫీసర్ వస్తానన్నారు. రైతులందర్నీ పిలిపించి సమావేశ సభ నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయమన్నారు. మరి నేను వెళ్ళి రానా మేడమ్! ఆఫీసుకు టైమ్ అవుతుంది.” చేతి వాచీ చూసుకుంటూ అన్నాడు రాయప్ప.
“సరే, మీరిక నిశ్చింతగా వెళ్ళిరండి. ఇక్కడి విషయాలన్నీ నేను చూసుకుంటాను లెండి” అనిందిత అతనికి నవ్వుతూ అభయమిచ్చి, బండిని వైకుంఠధామం వైపు తిప్పింది. కాస్త దూరం వెళ్ళగానే సెల్ రింగైంది. బండిని ఓ పక్కగా ఆపి సెల్ చేతిలోకీ తీసుకొని నెంబర్ చూసింది. ఎమ్.పి.ఓ. గారిది ఫోన్. ఎత్తి “హల్లో సార్! నమస్కారం!” అంది వినయంగా.
“నమస్కారమమ్మా! ప్రస్తుతం మీరెక్కడున్నారు?”
“ఊళ్ళోనే వున్నాను సార్! వైకుంఠధామంలో పని జరుగుతుందని ఉపసర్పంచ్ గారు చెప్తే చూడడానికని అటే వెళ్ళుతున్నాను.”
“అక్కడి పనులన్నీ వాళ్ళతో ఈరోజు పూర్తిగా కంప్లీట్ చేయించండి. ఇంకో విషయం మీతో చెప్పాలి. ఓ మంచి శుభవార్త!”
“ఏంటి సర్! అంతటి మంచి శుభవార్త మనకు? తొందరగా చెప్పండి మరి”నవ్వుతూ అడిగిందామె.
“మన జిల్లాకి కొత్తగా వచ్చిన కలెక్టర్ ప్రేమ్ సాగర్ గారు ‘పల్లెప్రగతి’ లో భాగంగా ప్రత్యక్షంగా వీక్షించడానికి వస్తున్నారు. ముందుగా మన మండలంలోని మీరు పని చేస్తున్న ఊర్నించే తన పర్యటన మొదలవుతుందని చెప్పారమ్మా!”
“అవునా? నిజంగా నాకు చాలా సంతోషంగా వుంది సార్! ఎప్పుడొస్తారు?”
“ఇంకా డేట్ చెప్పలేదు. కలెక్టర్ గారు చెప్పగానే నేనే మీతో చెప్తాను.. వారొచ్చే వరకూ ఊరు ఊరంతా అద్దంలా మెరిసి పోవాలి.”
“తప్పకుండా సార్! మీరేం వర్రీ అవ్వకండి. నేనున్నానుగా. అన్నీ విషయాల్ని నేను చూసుకుంటాను లెండి. వందశాతం మరుగు దొడ్ల విషయంతో పాటు, యింకా ఎన్నో కార్య క్రమాలలో ముందున్నాం మనం. ఈవారం రోజుల లోపే నా శాయశక్తులా కృషి చేసి చిన్నా చితక పనులేమన్నా వుంటే వాటన్నింటిని సంపూర్ణంగా చేసేస్తాను సార్!”
“సంతోషం అనిందితగారూ!” ఆయన ఫోన్ పెట్టేయగానే ఆమె కూడా సెల్ ఆఫ్ చేసి మళ్ళీ స్కూటీ స్టాట్ చేసింది.
***
ఆ రోజు ఊళ్ళో రైతుల సమావేశం జరుగుతుంది. పంచాయితీ ఆఫీసు ముందున్న విశాలమైన స్థలంలో కర్షకులందరూ నిండుగా కూర్చున్నారు. ఆ సభకు మండలాఫీసునుంచి ముఖ్య అతిథిగా ఎమ్.పి.ఓ. గారు వచ్చారు.
గ్రామ కార్యదర్శి అనిందిత సభకు అధ్యక్షత వహించింది. ఫీల్డాఫీసర్ గారు ఏయే పంటల్ని వేయాలో నాణ్యమైన విత్తనాల సేకరణ, సేంద్రియ ఎరువుల గురించి అన్ని విషయాలూ అందరికీ సంపూర్ణంగా అర్థమయ్యేలా విడమర్చి చెప్తున్నారు.
“మన రాష్ట్రంలో రకరకాల వైవిధ్యంతో కూడిన వివిధ రకాలైన పరిస్థితులు, ఏడాది పొడుగునా సమశీతోష్ణ వాతావరణం, రకరకాల పంటలను సాగు చేసేందుకు దోహదపడే వివిధ రకాల నేలలతో పాటూ… మనకు వుండే పంటపొలాలకు కావల్సిన నీటి వనరులు, సహజ సిద్ధమైన అనుకూల వాతావరణం ఆ విధాత మనకిచ్చిన గొప్ప వరం. అనాది కాలం నుంచీ మన దేశంలో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. భారత దేశము యొక్క వ్యవసాయరంగంలో ఫలసాయం ఇచ్చే మొక్కలు మరియు పాడి పశువుల ఉత్పత్తులతో తయారు చేసిన ఎరువులను… అనేక క్రిమికీటకాదులకు ఉపయోగించే పిచికారీ చేసే పురుగు మందులన్నీ సేంద్రీయ పద్ధతులతో ఉపయోగించాలి. మన దేశము యొక్క ఆర్థిక రంగానికి అసేంద్రియ పద్ధతులతోనే చేసే వ్యవసాయం విచక్షణా రహితంగా ఉపయోగించడం వలన ఈనాడు అతితీవ్రమైన దుష్పరిణామాలకు దారి తీసి, మనుష్యులకు అనేకనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, వాతావరణ కాలుష్యం కలిగిస్తాయి. కాబట్టి తత్ఫలితంగా ఇప్పటికే మన రాష్ట్రంలోని కొంతమంది కర్షకులు రసాయన రహితమైన సాగు చేసే పద్ధతులవైపు మరలుతున్నారు. పూర్తి స్ధాయిలో సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చక్కని సలహాలు సంప్రదింపులు.. సరైన సమయంలో వ్యవసాయ అధికారులతో చర్చలు సమావేశాలు జరుపుతూ ముందడుగు వేస్తుంది. ప్రతి ఏడాది సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం చేసేందుకు రైతులు కూడా ఇష్టంగా ముందుకొస్తున్నారు. ఈ విధంగా మన రాష్ట్రంలో సేంద్రీయ పద్ధతులతో వ్యవసాయం చేసే భూమి విస్తీర్ణం… ఆ పంటల ఉత్పత్తులు పెరగడంతో పాటు దేశంలో ఇంకొన్ని రాష్ట్రాలలో అభివృద్ధిలో ముందడుగులో వుండ్డం మంచి శుభ పరిణామం …”
“సేంద్రియా ఎరువులేసి పంటలు పండిస్తే మాకెంటీ లాభం? అధిక ఫలసాయం రాదు కదా సారూ?” అంటూ ఓ రైతు ప్రశ్నించాడు.
“మీరు వేసింది మంచి ప్రశ్నేకాని, అలా ఎవరన్నారు మీతో? అది వాస్తవం కాదు. రసాయానిక పద్ధతులతో పండించే వాటికన్నా ఎక్కువే నాణ్యమైన ఫలసాయం పొందవచ్చు. సేంద్రియ ఎరువులలో వ్యవసాయ పర్యావరణ రహిత ప్రత్యామ్నాయ పద్ధతిలో సాగు చేసే విధానం అత్యంత ఉత్తమం. చాలా ఖరీదైన రసాయనిక ఎరువులు… పురుగు మందులు వాడకుండా సాగు చేసే పద్ధతులను మార్చుకుంటే రైతులు ఎన్నో ఖర్చులను అన్ని విధాలా తగ్గించుకోవచ్చు. భూమిలో సేంద్రియ పదార్ధం పెరగడం వలన, భూసారశక్తి పెరగడం వలన పర్యావరణం పరిరక్షించబడుతుంది. పండే పంటల్లో… ఆహారాల్లో రసాయనిక ఎరువుల అవశేషాలుండవు. మనుష్యుల యొక్క ఆరోగ్యం కాపాడబడుతుంది. పంట భూములలో పంటల వైవిధ్యం పెరుగుతుంది. ప్రజలకు పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన తిండి గింజలు, కాయకూరలు, ఆకుకూరలు, ఫలాలు మున్నగు ఆహార పదార్ధాలు లభిస్తాయి. వ్యవసాయ ఉత్పత్తులను అధిక స్ధాయిలో ఉత్పత్తి చేయడం వలన వ్యవసాయాన్ని సుస్ధిర పర్చడానికి ఉపయోగపడుతుంది. మన రాష్ట్ర పభుత్వం ఈ పద్ధతికి అనుగుణంగా సేంద్రియ ధృవీకరణ అధారిటీని కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి, సుస్ధిరమైన వ్యవసాయ పద్ధతుల ద్వారా సమతుల్యంగా ప్రకృతి వనరులను వినియోగించుకోవాలని సహజ సిద్ధమైన ఉత్తమ పంటలు పండించడానికీ పంటల సాగులో సంపూర్ణంగా సమగ్ర సేంద్రియ విధానమే పాటించాలి..” అంటూ వ్యవసాయ శాఖాధికారి చాలా సేపు రైతులను ఉద్దేశించి వ్యవసాయానికీ సంబంధించిన ఎన్నెన్నో విషయాలను గురించి అనర్ఘళంగా మాట్లాడినాడు. ఆ తర్వాత ఎమ్.పి.ఓ. గారు, అనిందిత కూడా మాట్లాడి ముగించారు.
ఎంతోమంది రైతులు సేంద్రియ పద్ధతులతో పంటలు పండించడానికి ముందుకొచ్చినారు.
ఏయే పంటల్నీ ఏ నేలల్లో వేయాలో, ఎలాంటి నాణ్యమైన విత్తనాల్ని వాడాలో అన్ని విషయాలనీ అందరికీ సంపూర్ణంగా అర్థమయ్యేలా విడమర్చి చెప్పినందుకు అనిందిత ఆయన్ని ప్రశంసాపూర్వకంగా అభినందించింది.
ఆ తర్వాత కొంతమంది రైతులు వెంట వాళ్ళు పంట పొలాల్లో తిరుగుతూ వారికి తగిన సలహాలు, సూచనలు ఇస్తూ చాలాసేపు గడిపారు వాళ్ళు. అప్పటికే సాయంత్రం అయింది. మళ్ళీ పంచాయితీ ఆఫీసు దగ్గరికి చేరుకున్నారంతాను.
“మేడమ్! ఈ ఊరు ఊరంతా ఎంతో పరిశుభ్రంగా పచ్చటి చెట్లతో ఫలపుష్పాదుల తోటలతో ప్రకృతి సౌందర్యంతో చూడముచ్చటగా వుంది. దానికి తోడు అందరికీ అర్థమయ్యేలా వాటర్ ట్యాంక్ మీదో చిత్రం, స్కూల్ బిల్డింగ్ గోడల మీద, ఈ పంచాయితీ ఆఫీస్ గోడల మీద మీరు వేయించిన హరిత హారాన్ని వ్యక్తం చేసే విధంగా నీటిని వృథా చేయకుండా వుండేలా.. ఊర్ని శుభ్రంగా వుంచేలా ఎన్నెన్నో అంశాల్ని ఈ చిత్రాలల్లో ప్రతిబింబించేలా పొందు పర్చి ఊళ్ళోకి వచ్చిన ప్రతి ఒక్కర్ని ఆకొట్టుకునేలా వున్నాయి. ముఖ్యంగా ఊళ్ళోని జనాలకి అనునిత్యం వీటిని చూస్తుంటే వాళ్ళు చేయాల్సిన కర్తవ్యమేమిటో వారికి వెంటనే స్ఫురించేలా వున్నాయి దృశ్య చీత్రీకరణ. ఈ బెస్ట్ ఐడియా ఎవరిది సార్?” అంటూ ఎమ్.పి.ఓ. సార్‌ని అడిగాడతను.
“ఇందులో ప్రతి అంశం అనిందిత మేడమ్‌దే. ఆమె కృషితోనే ఈ ఊరింత అభివృద్ధిలో ప్రయనిస్తుంది. త్వరలో ఇక్కడికి మన జిల్లా కొత్త కలెక్టర్ గారు కూడా త్వరలో రాబోతున్నారండీ”
“అవునా!? చాలా సంతోషం కంగ్రాట్స్ మేడమ్!”
“నో, నో సార్! అలా అంటారుగాని ఇదంతా నా కృషియే అంటే నేనొప్పుకోను. ఈ ఊరు ప్రజలు ఐక్యతతో చేసిన శ్రమదానం, వారందరి సమిష్టి కృషి వలనే మేము సాధించగలిగాము. చుట్టు పక్కల గ్రామాలకి మా ఊరు ఆదర్శవంతంగా నిలువగలుగుతుందీనాడు” అని నవ్వుతూ పంచాయితీ ఆఫీస్‌లో వాళ్ళకి టీ, బిస్కెట్స్‌తో ఆతిథ్య మిచ్చింది అనిందిత.
(ఇంకా ఉంది)