[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. [/box]
డా॥ చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి
[dropcap]న[/dropcap]మస్తే. నా పేరు డా॥ చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి.
2015లో తెలుగు భాషలో మొదలైన నా సాహితీ ప్రస్థానం నా రచనలు నలభై అయిదింటిని ప్రచురితమవడం చూసింది; వాటిలో ఒక నవల కూడా ఉంది. నేను ఈ మధ్యనే వ్రాయడం మొదలుపెట్టినా, నేను యువ రచయిత్రిని కాను.
సమాజానికి ఉన్నత విలువలుండే సాహిత్యాన్ని అందివ్వడం కోసమే నేను రచనలు చేస్తాను. ఆఖరికి నేను హాస్య కథ వ్రాసినా సరే, దానిలో ఒక విలువ పొంచి ఉంటుంది. నా రచనలలో స్త్రీకి ఉన్నతమైన స్థానం, తనదంటూ ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటాయి. నా కథలు ‘చినుకు’, ‘ఆంధ్ర భూమి’, ‘నవ్య’, ‘స్వాతి’, ‘నెలవంక-నెమలీక’, ‘చైతన్య మానవి’ వంటి అచ్చు పత్రికలలోనూ, ‘మాలిక’, ‘గో తెలుగు డాట్ కాం’. ‘తెలుగు తల్లి కెనడా’, ‘కౌముది’, ‘సహరి’ వంటి వెబ్ పత్రికలలోనూ ప్రచురింప బడ్డాయి.
నాలో వ్రాసే పటిమ ఉందని గుర్తించి ప్రోత్సహించిన స్నేహితులు శ్రీ నిప్పాణి కళ్యాణ్ సాగర్ గారికి, శ్రీ రాజేశ్ యాళ్ల గారికీ ఎప్పుడూ ఋణపడి ఉంటాను. వీరే కాక, నా రెండు నవలలూ ఓపికగా చదివిన శ్రీమతి నండూరి సుందరీ నాగమణి గారు, ‘ఆథర్స్ అండ్ స్టోరీస్’ వాట్సప్ బృంద సభ్యులు నన్ను అభిమానంతో ప్రోత్సహించారు. వారందరికీ నా ధన్యవాదాలు.
నేను మూస రచనలను చేయడానికి ఇష్టపడను. విభిన్న ఇతివృత్తాలు, విభిన్న కోణాల నుండి మానవ ప్రవర్తనని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తాను, అది ఫలితాన్ని ఇచ్చినా, ఇవ్వక పోయినా కూడా! నా పరిచయాన్ని ప్రచురిస్తున్న ‘సంచిక’ వారికి ధన్యవాదాలు.
drcslakc@gmail.com