రెండు ఆకాశాల మధ్య-37

0
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ఏ[/dropcap]డ్చి ఏడ్చి ఏ నడిరాత్రి తర్వాతో మాగన్నుగా నిద్రపట్టింది. కల.. కలలో తను నిద్ర కోసం ప్రయత్నిస్తోంది. అప్పుడే నాన్న బైటినుంచి వచ్చాడు. కాళ్ళూ చేతులు మొహం కడుక్కున్నాక తువ్వాలుతో తుడుచుకుంటూ “షామ్లీ అన్నం తిందా?” అని అడుగుతున్నాడు. “అది తిందా లేదా అని అడుగుతారు తప్ప కొడుకుల గురించి పట్టించుకోరెందుకు” అంది అమ్మ. “మీకెట్లయినా కూతుర్లంటేనే వల్లమాలిన ప్రేమ.. అందునా షామ్లీ అంటే మరింత ప్రేమ” అని కూడా అంది.

నాన్న నవ్వుతున్నాడు. “మగపిల్లలు ఎట్లాగయినా బతుకుతారు. షామ్లీ, షానోదేవి మనకున్న ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళని ఒకయ్య చేతిలో పెట్టి పంపేవరకు అల్లారుముద్దుగా చూసుకోకపోతే ఎలా చెప్పు.. షామ్లీ మనసు ఎంత మెత్తనో నీకూ తెల్సుగా. దానిక్కూడా మనమంటే ఎంత ప్రేమో.. పిచ్చి పిల్ల” అన్నాడు.

నాన్న తన గదిలోకొచ్చి మంచం మీద ఓ పక్కగా కూచున్నాడు. “మొదట బువ్వ తినేసి వెళ్ళి మీ కూతుర్తో ముచ్చట్లాడవచ్చుగా” అంటోంది అమ్మ.

“నా తల్లి నిద్రపోబోతుంటే ఇప్పుడు ముచ్చట్లు పెట్టి దాని నిద్ర పాడుచేస్తాననుకున్నావా ఏంటి? చూశావా నా కూతురు కళ్ళు మూసుకుని పడుకుంటే ఎంతందంగా ఉందో?” అంటూ నాన్న తన ముంగురులు సవరిస్తున్నాడు. తర్వాత మెల్లగా వొంగి నుదిటి మీద ముద్దు పెట్టుకుని..

తన శరీరం మీద ఏదో పాకుతున్నట్టనిపించి చప్పున కళ్ళు తెరిచింది. అస్లంఖాన్.. తన పక్కనే పడుకుని ఏదేదో చేస్తున్నాడు… ఎక్కడెక్కడో చేతులేస్తున్నాడు. తను పెద్దగా అరవబోయింది. నోరు నొక్కేశాడు.

పైన బడ్డాడు.. కొండచిలువ అమాంతం తన మీద పడినట్టు.. నరకం.. తను గిలగిలా తన్నుకుంది. నొప్పితో విలవిల్లాడింది. ఆ దుర్మార్గుడు వదల్లేదు. బలవంతంగా తన కోరిక తీర్చుకుని, లేచి నిలబడి, శవంలా పడి ఉన్న తన శరీరాన్ని కాల్తో పక్కకు నెట్టి లోపలికెళ్ళిపోయాడు.

వీడ్నేనా తను కొన్ని రోజుల క్రితం దయగలవాడనుకుంది? రక్తం తాగే రాక్షసుడు.. వొంటికయ్యే గాయాలకన్నా మనసుకయ్యే గాయాలే ఎక్కువగా బాధిస్తాయని అంత చిన్న వయసులోనే తనకు అర్థమైంది. రాత్రంతా ఏడుస్తూనే ఉంది. తను ఎంత ఏడ్చినా జాలిపడేవాళ్ళు కానీ కన్నీళ్ళు తుడిచేవాళ్ళు కానీ ఎవరూ లేరక్కడ. తను ఒంటరి.. ఎప్పటికీ ఒంటరే.. ఇక ముందు బతుకంతా ఈ నరకంలో, ఈ రాక్షసుడి దుర్మార్గానికి బలౌతూ, ఇలా ఒంటరి బతుకు బతకాల్సిందేనా.. దేవుడా.. నాకెందుకీ శిక్ష.. అనుకుంది.

ఆ ఒక్క రోజుతో తన కష్టాలు తీరిపోలేదు. అది ఆరంభం మాత్రమే.. ప్రతి రోజూ అర్ధరాత్రి దాటాక అస్లంఖాన్ వసారాలో పడుకుంటున్న తన దగ్గరకొచ్చి తన శరీరాన్ని చిత్రవధ చేయడం మొదలెట్టాడు. తనకు ఎదురుతిరిగే ఓపిక కూడా ఉండేది కాదు. పారిపోవాలనిపించేది. అలాగని ఎక్కడికని పారిపోతుంది? తనున్నది పాకిస్తాన్ భూభాగంలో అని తెలుసు. తన చుట్టూ ఉన్నది కరడుకట్టిన ముస్లింలే అని తెలుసు.. దానికి తోడు తన కదలికల మీద జహరా గట్టి నిఘా పెట్టి ఉంచేది. చివరికి బహిర్భూమికెళ్ళాలన్నా ఒంటరిగా పంపేది కాదు. తను కూడా తోడొచ్చేది.

కూరగాయలు కొనడానికి జహరా బుర్ఖా వేసుకుని బైటికొచ్చినపుడు కూడా పక్కనే తనను కూడా ఉంచుకునేది. అలా వచ్చినపుడే ఒకసారి ఆ వీధిలో ఉన్న రామమందిరాన్ని చూసింది. లోపలికెళ్ళి దేవుడ్ని మొక్కుకోవాలని ఎన్నిసార్లు అన్పించిందో…

ఓ రోజు దారపు ఉండలు, గుండీలు కొనడానికి అస్లంఖాన్ బజారుకెళ్ళాడు. జహరా తలనొప్పిగా ఉందంటూ పడుకుంది. తను ఆమె తలపడ్తూ కూచుంది. కొద్ది సేపటికి ఆమెకు నిద్రపట్టింది. సన్నటి గురక విన్పిస్తోంది. గుళ్ళోకెళ్ళి తనకిష్టమైన దేవుడ్ని దర్శించుకోడానికి అదే సరైన సమయం అనుకుంది. జహరా లేచేలోపల తిరిగొస్తే చాలనుకుని, తలుపు దగ్గరగా వేసి, వేగంగా నడుచుకుంటూ రామాలయాన్ని చేరుకుంది. జహరా పక్కనున్నప్పుడు తలయెత్తి చూస్తే తిడుందన్న భయంతో ఓరకంట చూసేది. ఇప్పుడు గుడిని కళ్ళారా చూసుకుంటుంటే ఎంతానందమో…

ఎంత ఉత్సాహంగా మెట్లెక్కిందో.. లోపలినుంచి గుడి గంటలు విన్పిస్తున్నాయి. ఆ శబ్దాన్ని వింటూ మైమరిచిపోయిన తనకు వెనకనుంచి జహరా కర్కశ స్వరం విన్పించలేదు. గుడిగంటల శబ్దం ఆగడం ఆలస్యం జహరా గొంతు విన్పించి భయంతో వెనక్కి తిరిగి చూసింది. వెనక లంఖిణిలా నిలబడి ఉంది జహరా. ఆమె కళ్ళు క్రోధంతో ఎర్రటి నిప్పు కణికల్లా ఉన్నాయి.

తను మెల్లగా మెట్లు దిగి తలవొంచుకుని జహరాతో పాటే యింట్లోకి నడిచింది. రోడ్డు పైన నడుస్తున్నంత సేపూ ఏమీ అనని జహరా యింట్లోకి అడుగుపెట్టగానే జుట్టు పట్టుకుని గొడ్డుని బాదినట్టు బాదింది. కింద పడేసి కాళ్ళతో తన్నింది. “మా యింట్లో ఉన్నన్ని రోజులు కాఫిర్ పనులు చేశావా నిలువునా పాతరేస్తాను ఖబర్దార్” అంది.

“రాముడు మా దేవుడు. నేనెందుకు మా దేవుని గుళ్ళోకి వెళ్ళకూడదు?” తన్నులు తింటూనే తను ఎదురు ప్రశ్మించింది.

“ఎదురు ప్రశ్నిస్తావా? ఎంత పొగరే నీకు? ఐతే వెళ్ళి ఆ గుళ్లోనే ఉండు. మా యింట్లోంచి ఈ క్షణమే వెళ్ళిపో” అంటూ తనను బైటికి గెంటి, తలుపేసుకుంది.

అస్లంఖాన్ బజారునుంచి తిరిగొచ్చేవరకు తను తలుపు బైటనే ఏడుస్తూ కూచుంది. తనకీ యిల్లు తప్ప గతి లేదు. బైటికెళ్తే ఈ మాత్రం తిండి కూడా దొరకదేమోనన్న భయం.. ఇక్కడ అస్లంఖాన్ ఒక్కడే రాత్రుళ్ళు తన రక్తాన్ని పీలుస్తున్నాడు. అదే తను వీధిలో ఒంటరిగా దొరికితే మగవాళ్ళు వూర్కుంటారా? తోడేళ్ళలా వెంటబడి తన శరీరాన్ని పీక్కుని తింటారన్న భయం.. ఆ రోజు అస్లంఖాన్ జహరాకి ఏదో సర్దిచెప్పి తనను లోపలికి రానిచ్చాడు. యింకెప్పుడూ హిందూ దేవుళ్ళ పేరు కూడా ఎత్తకూడదని హెచ్చరిక కూడా జారీ చేశాడు.

ఆ యింటికొచ్చినప్పటినుంచి నుదుట బొట్టు పెట్టుకోడానికి వీల్లేకుండా పోయింది. తనకు బొట్టు పెట్టుకోవడమంటే ఎంతిష్టమో.. ఎర్రటి తిలకం.. రెండు కనుబొమల మధ్య వెలిగే ఎర్రటి సూరీడులా.. ఒక రోజు కళ్ళకు పెట్టుకునే కాటుకనే బొట్టుగా పెట్టుకుంటుంటే జహరా చూసి వీపు చిట్లిపోయేలా కొట్టింది. “నీకు బొట్టేగా కావాలి. ఎర్రగా కాల్చిన కడ్డీతో నుదుట శాశ్వతమైన బొట్టు పెట్టనా?” అంటూ ఓ ఇనుప చువ్వను పొయ్యిలో పెట్టి కాలుస్తుంటే నిజంగా అలా చేస్తుందేమోనని తను ఎంతగా బెదిరిపోయిందో. “ఇంకెప్పుడూ బొట్టు పెట్టుకోను. ముఝె మాఫ్ కరో” అంటూ కాళావేళ్ళా పడితే కనికరించి “మా యింట్లో మరో సారి ఇలాంటి కాఫిర్ పనులు చేసినట్టు తెల్సిందో కాళ్ళూ చేతులు కట్టేసి తిండీ నీళ్ళు లేకుండా వారం రోజులు మాడుస్తాను.. జాగ్రత్త” అంటూ హూంకరించింది.

దేశం ఇండియా, పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర దేశాలుగా విభజించబడిన ఆగష్ట్ పధ్నాలుగు అర్ధరాత్రి తర్వాత లాహోర్‌లో మరింత హింసాకాండ చెలరేగింది. హిందూ దేవాలయాల్ని నేల మట్టం చేశారు. హిందువుల వ్యాపారసంస్థల్ని అగ్నికి ఆహుతి చేశారు. తమ వీధిలో ఉన్న రామాలయాన్ని కూడా పడగొట్టి అక్కడ మసీదు కట్టారు. లోపలికెళ్ళి తమ దేవుడ్ని మొక్కుకోవాలన్న తన కోరిక తీరకుండానే రాముని గుడి అదృశ్యమైపోయింది.

రెండేళ్ళు భారంగా గడిచాయి. ఓ రోజు తనకు కడుపులో తిప్పి వాంతికయింది. అన్నం సయించడం లేదు. వికారం.. వొళ్ళంతా సుస్తీ చేసినట్టు .. ఓ రోజు రాత్రి “దీనికి కడుపొచ్చింది. ఏం చేద్దామనుకుంటున్నారు?” అని జహరా అస్లంఖాన్‌ని అడుగుతుంటే తనకర్థమైంది తనకేమయిందో.. అప్పుడు తన వయసు పదిహేనేళ్ళు..

అస్లంఖాన్ తోడేలు నవ్వినట్టు నవ్వి “చేసేదేముంది? నెలలు నిండాక బిడ్డని కంటుంది. కననీ.. నీకేమిటి నొప్పి?” అన్నాడు.

యింట్లో అస్లంఖాన్ ఎంత చండశాసనుడో తనకు తెలుసు. అతని ఇష్టానికి వ్యతిరేకంగా జహరా నోరెత్తడానికి లేదు. కొద్దిగా చూపులో తేడా కన్పించినా జుట్టు పట్టుకుని కిందపడేసి కాళ్ళతో ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు. తన దగ్గర దాష్టీకం ప్రదర్శించే జహరా అతన్ని చూస్తేనే వణికిపోయేది.

“మీ ఇష్టం. కానీ మీరు నమాజీ అయిఉండి పక్కా ముసల్మాన్ అయిఉండి, ఓ కాఫిర్ కడుపున బిడ్డను కంటారా? ఆలోచించండి” అందామె.

మరునాడు తన పేరు గోరీబీగా మార్చబడింది. అస్లంఖాన్ ఖాజీని యింటికి పిలిచి, తనని నిఖా చేసుకున్నాడు. తను అస్లంఖాన్‌కి ఉంపుడుగత్తెగా కాక రెండో భార్యగా మారాక యింట్లో కొన్ని కష్టాలు తప్పాయి. జహరా ఒకప్పటిలా తనను కొట్టడం మానేసింది. తిట్లు మాత్రం తప్పలేదు. వసారాలో పడుకోడానికి ఓ జంపఖానా, కప్పుకోడానికి ఓ దుప్పటి లభించాయి. వొంటి పైన చినిగిపోయిన బట్టలకు బదులు రెండు జతల కొత్త బట్టలు వచ్చి చేరాయి. వాటితోపాటు నల్లటి బురఖా కూడా. అంతే తేడా.. మిగతా నరకాలు మాత్రం యథావిధిగా కొనసాగాయి.

జహరాతో కలిసి బైటికెళ్ళిన ప్రతిసారి బురఖా తొడుక్కోవాల్సి వచ్చేది. తమ వూళ్లో స్వేచ్ఛగా సీతాకోకచిలుకలా తిరిగిన తనకు బురఖా వేసుకున్నప్పుడల్లా తను మళ్ళా ప్యూపాలోకి జారిపోయినట్టు అన్పించేది.

పేరు మార్చిన కొత్తలో తనను గోరీబీ అని పిలిచినపుడల్లా అది తన పేరు కాదనుకుని పలక్కుండా గమ్ము నుండిపోయేది. ఆ మొగుడూ పెళ్ళాల మీద గొంతు దాకా కోపం వచ్చేది. తన పేరు షామ్లీ కదా. తనకు చాలా ఇష్టమైన పేరు. షామ్లీ అంటే కృష్ణుని వొంటి రంగులో ఉన్నదని అర్థమట. కృష్ణుడి మీద ప్రేమ కలది అని కూడా అర్థమని నాన్న తన చిన్నప్పుడు చెప్పాడు. తనకు అంత మంచిపేరు పెట్టినందుకు ఎంత సంతోషంగా ఉండేదో. ఈ గోరీబీ ఏంటి? తను హిందువు. తన దేవుళ్ళు వేరు.. తన పూజా విధానం వేరు…

తన పేరు మార్చే అధికారం వీళ్ళకెవరిచ్చారు? అది అమ్మానాన్న తనకు పెట్టిన పేరు. ఒకవేళ పేరు మార్చాలన్నా వాళ్ళకు తప్ప పరాయివాళ్ళకు అధికారం లేదు. తన దేవుళ్ళని కాకుండా వాళ్ళ దేవుణ్ణి పూజించమని బలవంతం చేసినపుడల్లా ఎంత బాధేసేదో..

జహరా తనకు ఉర్దూ, అరబ్బీ నేర్పసాగింది. ఆ భాష నేర్చుకోవడం మాత్రం ఇబ్బందిగా అన్పించేది కాదు. తన చదువు ఆగిపోయింది కాబట్టి ఇక్కడెలాగూ మళ్ళా స్కూల్ కెళ్ళి చదువుకోవడం కుదర్దు కాబట్టి ఆమె ఉర్దూ, అరబ్బీ అక్షరాలు నేర్పి వాక్యాలు చదివిస్తుంటే సంతోషంగానే ఉండేది. బాగా చదవడం వచ్చాక ఆ భాషల్లో దొరికే పుస్తకాలు చదవొచ్చని ఆశ పడింది. కానీ తనకు ఆ రెండు భాషలూ నేర్పడంలో ఆమె ఆంతర్యం తన చేత మత గ్రంథాలు చదివించడానికే అని అర్థమై వేదనకు లోనయింది.

నమాజ్ చేయమని బలవంతపెట్టడం మొదలయ్యింది. “నువ్విప్పుడు హిందువ్వి కాదు ముస్లింవి. నమాజ్ చేయడం మన విధుల్లో చాలా ముఖ్యమైంది” అంటూ వజూ ఎలా చేయాలో నమాజ్ ఎలా చేయాలో నేర్పింది. మొదట్లో తను నమాజ్ చదువుతున్నట్టు నటిస్తూ మనసులో మాత్రం తన దేవుళ్ళనే తల్చుకునేది. తన దేవుళ్ళనే ప్రార్థించేది. ఎన్నో యేళ్ళుగా ఆచరిస్తూ ఉండటం వల్ల బలపడిన నమ్మకాల్ని వదులుకోడానికి మనసు ఒప్పుకునేది కాదు. పైకి నమాజ్ చేస్తున్నట్టు నటించడానికి కూడా చాలా హింస పడాల్సి వచ్చేది.

తనకు ప్రసవం అయింది. మగబిడ్డ.. అప్పుడు తన వయసు పదహారు.. వాడి తర్వాత రెండేళ్ళకే అబ్బాయి, మరో మూడేళ్ళకు అమ్మాయి.. అంటే ఇరవై ఒక్క యేళ్ళ వయసులోనే ముగ్గురు బిడ్డలకు తల్లయ్యింది. ముగ్గురికీ ముస్లిం పేర్లు పెడ్తున్నప్పుడు కూడా తన మనసు ఎంతగా క్షోభించిందో.. పెద్దవాడికి ఏడేళ్ళ వయసప్పుడు మగపిల్లలిద్దరికీ సున్తీ చేయించాడు అస్లంఖాన్. అతన్నెప్పుడూ తను భర్తగా గౌరవించలేదు. తనను తన తల్లిదండ్రుల్నుంచి, దేశం నుంచి, మతం నుంచి, చివరికి తన దేవుళ్ళనుంచి కూడా వేరు చేసిన దుర్మార్గుడిగానే తన కళ్ళకు అతను కన్పించేవాడు.

పెద్దవాడు డిగ్రీ పాసయి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. రెండోవాడు డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అమ్మాయికి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. పిల్లల చదువుల విషయంలో తప్ప యింట్లో మిగతా విషయాలన్నీ తన ప్రమేయం లేకుండా, తనను సంప్రదించకుండా జరిగిపోయినవే. యింట్లో అస్లం మాటకు ఎదురుచెప్పడానికి అవకాశం లేదు. ప్రతిదీ అతని నిర్ణయాల ప్రకారమే జరుగుతుంది. తను కేవలం ఓ గాజు బొమ్మ. జహరాకు అరవై యేళ్ళు దాటడంతో రాత్రుళ్ళు సంసారం చేయడానికి పనికొచ్చే ఆట బొమ్మ తను.. అంతే.

ఇండియా వెళ్ళాలని తనకు ఎన్నిసార్లు అన్పించిందో.. ఇప్పటికీ అన్పిస్తూనే ఉంటుంది. జోరాఫాం కెళ్ళి తన పుట్టింటిని చూసుకోవాలనీ, అమ్మా నాన్నను చూసుకోవాలనీ.. తమ్ముడు దర్శన్‌లాల్, చెల్లెలు షానోదేవి.. వాళ్ళ పక్కన కూచుని తమ చిన్నప్పటి కబుర్లు చెప్పుకోవాలనీ..

పెద్దవాడికి పదేళ్ళ వయసున్నప్పుడు అస్లంఖాన్‌ని అడిగింది ఇండియా పంపించమని. పుట్టింట్లో ఓ వారం ఉండొస్తానని వేడుకుంది. “ఇండియా అంటే మనింటి పక్కనే ఉందనుకుంటున్నావా వెళ్ళిరావడానికి? ఎన్ని డబ్బులు ఖర్చవుతాయో తెలుసా? నా దగ్గర డబ్బుల మూటలేమీ లేవు. ఐనా పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకు రావడానికి వీల్లేదని అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించిందట. ఒకవేళ అవసరమైనంత డబ్బు కూడ బెట్టుకున్నా, మనల్ని ఆ దేశానికి రానివ్వరు” అని చెప్పాడు.

అతను చెప్పింది నిజమో కాదో తెలియకున్నా ఆ మాటల్ని నమ్మడం తప్ప తనకు మరో గత్యంతరం లేని పరిస్థితి..

నెల క్రితం కలలో అమ్మా నాన్న కన్పించి, ఏడుస్తూ లేచి కూచుంది. ఆ రోజు కూడా అడిగింది. “ఇండియా వెళ్ళి అమ్మానాన్నను కల్సుకుని వస్తాను” అని.

“మన దేశానికీ హిందూస్తాన్‌కి మధ్య యుద్ధం ముగిసి కొన్ని నెలలు కూడా కాలేదు. తూర్పు పాకిస్తాన్‌ని పోగొట్టుకున్న బాధ మన హుకూమత్ గుండెల్లో యింకా పచ్చిగా సలుపుతూనే ఉంటుంది. ఈ సమయంలో నువ్వు వెళ్తానన్నా వీసా మంజూరు చేస్తారనుకుంటున్నావా? చేయరు. మీ వతన్‌కి వెళ్ళి మీ అమ్మా నాన్నను చూడాలన్న కోరికను మర్చిపో. ఇదే నీ వతన్” అన్నాడు అస్లంఖాన్.

ఈ రోజు బట్టలు కొనడానికి బజారుకెళ్ళినపుడు క్రిష్ణ మందిర్, వాల్మీకి మందిర్ చూశాక, అక్కడ జరుగుతున్న దీపావళి వేడుకల్ని చూశాక మరోసారి ఇండియాకెళ్ళాలన్న కోరిక పురివిప్పింది. అసలు తను ఎప్పటికైనా ఇండియా వెళ్ళగలుగుతుందా? ఎప్పటికైనా తన అమ్మా నాన్నల్ని చూడగలుగుతుందా? తనకిప్పుడు మిగిలున్న కోరిక అదొక్కటే. అమ్మానాన్నల్ని ఒక్కసారైనా కల్సుకుని రావాలన్న కోరిక. అది ఎప్పటికై నా తీరుతుందా? అప్పటికి అమ్మా నాన్న బతికుంటారా? షామ్లీకి ఏడుపు వెల్లువలా పొంగుకొచ్చింది. రాత్రంతా తన అమ్మా నాన్నల్ని తల్చుకుని ఏడుస్తూనే ఉంది.

***

షరీఫ్ రాసిన ఉత్తరం హుందర్మో గ్రామానికి మూడు నెలల తర్వాత చేరింది. అప్పటివరకూ దుఃఖ సముద్రంలో ఈదులాడుతున్న హసీనా తనను ఒడ్డుకి చేర్చడానికి మరపడవ దొరికినంతగా సంతోషపడింది. తన భర్తకు తనన్నా పిల్లలన్నా ఎంత ప్రేమో తనకు తెలుసు. ఎక్కువ రోజులు తమని చూడకుండా ఉండలేడు. భూమ్యాకాశాలు ఏకం చేసైనా సరే అతను హుందర్మో గ్రామానికి చేరుకుంటాడన్న నమ్మకం ఆమెది.

“కొన్నిరోజులు ఓపిక పట్టు. మీ నాన్న తిరిగొస్తాడు. నీ నిఖా హనీఫ్ మియాతో జరిపిస్తాడు” అంటూ ఆస్‌మాకి ధైర్యం నూరిపోసింది.

“నిఖా గురించి నేనేమీ ఆలోచించడం లేదమ్మా. నిఖా జరక్కున్నా పర్లేదు. అబ్బాజాన్ తిరిగొస్తే చాలు” అంటూ ఆస్‌మా కన్నీళ్ళు పెట్టుకుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here