[dropcap]బు[/dropcap]డి బుడి అడుగులు వేస్తూ
బుజ్జి బుజ్జాయి అమ్మనడిగింది
అమ్మా.. నాన్నేడి అని అమాయకంగా
అమ్మ మోములో కమ్ముకున్న
చిమ్మ చీకటిలాంటి చింత
ఆ చిన్నారికేం తెలుసు పాపం
నాన్న నిన్నటి జ్ఞాపకంగానే
మిగిలిపోతాడని మరి రాడని
అమ్మ గుండెలో జ్వాల మండుతున్నా
తనను గుండెకు హత్తుకున్నప్పుడు
చల్లని వెన్నెల వలె ఉందని కాబోలు
ఆ చిట్టి తల్లికి తెలియదు నాన్న లేడని
అమ్మ కంటి నుండి కన్నీరు కారినా
అది తనపై పన్నీరు వలె పడిందని
ఆ చిట్టి చిన్నారి మురిసిపోయింది
ఆటలతో అన్నీ మరచిపోయింది
నాన్న లేకుండా ఇక ఇలా గడపాలని
అమ్మే అమ్మా నాన్న ఇక నుండి అని
ఆ పసి వయసు లో తెలిసేదెలా
నాన్న మరి లేడు రాడని ఆ తల్లి చెప్పేదెలా