[dropcap]క[/dropcap]ల్తీ కసాయిలారా!
మనుషుల్ని బతకనీయండిరా!
మీ చేతులు పడిపోనూ
మీ ధన సంపాదనా యావ జిమ్మడిపోనూ —
ఏది కొని తిందామన్నా భయం పట్టుకుందిరా!
అనుమానం పట్టి పీడిస్తోందిరా!
ప్రకృతి ప్రసాదించిన పళ్ళనైనా
పసందుగా తిననీయండిరా!
అందమైన ప్యాకింగ్‌లు చేసి
అందరి కళ్ళు కప్పేద్దామనుకుంటున్నారా?
మీ కళ్ళల్లో కారం కొడదామంటే
అదీ కల్తీదే కదరా!
మీ అక్రమ వ్యాపార దందా తలచుకుంటే
కడుపు మండి పోతుందిరా!
మరీ ఇంత బరితెగించారేమిటిరా!
మానవత్వం మాటే మరిచారేమిటిరా!
ప్రాణం ఎంత చులకన అయిపోయిందిరా మీకు
మీరు చచ్చేంత వరకు మీ కల్తీ సరుకును
మీచేతే తినిపించే శిక్ష వేయాలిరా మీకు!
ఆరోగ్యంతో ఆటలాడుతారా?
అశుద్ధం తిని బతకండిరా!
ధూపం, దీపం కూడా కల్తీ అయితే
భక్తులే స్వర్గానికి చేరాలిరా?
దమ్ముంటే మీరు కరెంటును కల్తీ చేయండిరా!
ఒరేయ్ అవినీతి అనకొండలారా —
అడ్డదారులు తొక్కేవారు పెట్టే
గడ్డి తిని బతుకు తున్నారేమిటిరా?
మీ బొజ్జలు పెంచి, లజ్జను వదిలేశారేమిటిరా?
మీ కడుపులు కుళ్ళిపోనూ
మీ కాళ్ళు పడిపోనూ
ఇప్పటికైనా —
కళ్ళు తెరవండిరా!
కుళ్ళు కడగండిరా !!
(ఇందులో కడుపు మంట తప్ప కవిత్వం వెదకకండి)