చేష్టలు

3
3

[dropcap]క[/dropcap]త్తాళి మాను బుడాన్ని నరికి బొబ్బడి వలచి లోపల వుండే కుడాన్ని (గుజ్జును) కసకస కోసి గుడువులా యేసి పొయ్యి అంటిచ్చేకి సురువు చేసే శంకరన్న.

నేను గుడవనిండా నీళ్ళు పోసి పొయ్యిపైన పెడితిని.

అగ్గి మంటేస్తా అన్న దాంట్లో పిడికెడు బెల్లం యేసె. రవంతసేపు ఉడికినంకా ఒక్క ముక్కని తీసుకొని నక్కినాకి చూసి “ఆ… ఉడికిందిరా” అంటా గుడువని పక్కకి దింపి నీళ్ళు వడగట్టి ఆరనిచ్చే.

ఆమీద ఇద్రు ఆ కత్తాళి కుడుమును కడుపు నిండా తింటిమి.

ఇట్లా తబుడు నాలా ఒగ చిన్న మాట పుట్టే అట్లే ఆ మాటని అన్న మిందేస్తిని.

అంటే “అనా…నా.. నిన్ని ఒగ మాట అడగాలనా” అని.

“అడగరా”

“నేను ఎవుర్నినా?”

“నువ్వా?”

“ఊనా”

“నువ్వు నువ్వేరా”

“నేను నేనే అని నాకు తెలుసునా”

“ఇంగేమి”

“అదే నేను ఎవురని?”

“తూ… నా కొడకా”

“నేను నీ కొడుకునా?”

“అయోగ్య నాయాలా”

“అట్లనా”

“అట్ల కాదురా కుక్క నాయాలా”

“నేను కుక్కనా”

“చెప్పేది వినరా కోతులకు పుట్టినోడా”

“నేను కోతులకి పుడితినా… అహా తిట్టు కూడా భాషే కదా. తిట్టు కూడా బతుకే కదా. నా ఉనికి నా మూల సిద్ధాంతం ఓ తిట్టులో దాగుందా? అయితే నేను నేనే అయినా నాలో వుండే నేను అనేది ‘కోతి’ సరేనా, పోతానా”

“పాడైపో”

“పోతా కానీ ఈ కోతి ఎవురునా?”

“దాన్నే అడుగుపోరా”

“అది మాట్లాడెల్దె”

“మచ్చిక చేస్కో… మాట్లాడకున్నా దాని చేష్టల ద్వారా అదెవురని నీకి తెలుస్తుంది.”

“సరేనా”

అన్న చెప్పినట్లే నేను పోయి కోతులను మచ్చిక చేసుకొంట్ని. వాటి చేష్టలు చూసి నగినగి పెడితిని.

అదే పొద్దుకుని ‘ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో…’ దాశరథి గారి మాట నా మనసులా తట్టే.

“నువ్వు మా కోతుల జాతుల బిడ్డవప్పా” మానుపైనింకా ఒగ గండ్రకోతి అనె.

“ఇంగా చెప్పాలంటే పాలిచ్చే జంతు జాతుల సొత్తువి” బండపైనింకా  ఓ నరవానరం అనె.

నా గురించి నాకు చెప్పిన నా పెద్దలకు, పూర్వీకులకు దండాలు చెప్పి ఆడనింకా వస్తిని.

***

చేష్టలు = బుద్ధులు/పనులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here