జ్ఞాపకాల తరంగిణి-18

0
3

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]

[dropcap]చా[/dropcap]లా సంవత్సరాలుగా నాకు హిందూ పత్రిక చదివే అలవాటు. 1971 నుంచీ రీడర్స్ డైజెస్టు చందాదారుణ్ణి. US Consulate ప్రచురించే Span, భారతి, ఇతర సాహిత్య పత్రికలూ క్రమం తప్పకుండా చదివేవాణ్ణి. మా ప్రిన్సిపాల్ కాలేజీ లైబ్రరీని అభివృద్ధి చేయమని పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అన్-ఎయిడెడ్ కళాశాలైనా చాలా పత్రికలు తెప్పించేవాణ్ణి. గూడూరు మునిసిపల్ డాక్టరు సీతారామయ్యగారు మా బంధువు. ఆయన తరచూ మాయింటికి వచ్చేవారు. వారి వద్ద వన్యజంతువులమీద అనేక పుస్తకాలు తెచ్చుకొని చదివాను. మా రెండో అబ్బాయికి తరచూ జ్వరం వచ్చేది. డాక్టర్లు ఏవో మందులు రాసిచ్చేవారు. వారే బాబుకు ప్రైమరీ కాంప్లెక్సు అని తేల్చి నాలుగేళ్లు మందులిచ్చి నయం చేశారు. వైద్యానికి సంబంధించిన ఏ విషయం అడిగినా వారు వివరంగా చెప్పేవారు. 1973లో ఒకరోజు డాక్టర్ గారు మా యింటిముందు కారు ఆపి, ఒక పార్సిల్ పట్టుకుని లోపలికి వచ్చారు! మీకోసం గూడూరు సిరమిక్ ఫ్యాక్టరీలో సెప్టిక్ మరుగుదొడ్లు కట్టుకోను అవసరమైన రెండు సీట్లు కొని తెచ్చాను, వెంటనే పని మొదలుపెట్టమన్నారు. వారి ప్రోత్సాహంతో ఆ పని పూర్తి చేశాను.

సందర్భం కాకపోయినా వారికి మా కుటుంబం మీద ఏర్పడిన అవ్యాజమైన ప్రేమను చెప్పడానికే ఈ సంఘటన పేర్కొనవలసివచ్చింది. మొత్తం మీద తెలుగు అధ్యాపకుణ్ణి అయినా డాక్టర్ గారి దయవల్ల వైద్యం మీద కొంత అవగాహన కలిగింది. ఈ పుస్తక జ్ఞానం, పత్రికా పఠనం నాకు కాలేజీలో అదనపు గుర్తింపునిచ్చాయి. ఒక పర్యాయం పాఠంలో పాముల ప్రస్తావన వచ్చింది. అప్పటికే వైల్డ్ లైఫ్ మీద చాలా పుస్తకాలు చదివాను. నా పిల్లలక్కూడా జంతువులను గురించీ, పక్షులను గురించీ మంచి ఎరుక ఉంది. ఆ జ్ఞానంతో పాఠం చెబుతూ పాముల గురించి కొన్ని నిజాలు చెప్పి, అంధవిశ్వాసాలను ఖండించాను. సైన్స్ విద్యార్థులు ఈ విషయాలను జువాలజి మాస్టారు వద్ద ప్రస్తావించారు. అతను చాలా చులకనగా, హేళనగా నేను చెప్పిన అంశాలను గేలి చేసి క్లాసులో మాట్లాడాడట! పిల్లలు మళ్ళీ క్లాసులో నన్ను ప్రశ్నించారు. నేను చదివిన ప్రామాణిక గ్రంథాలను ఇచ్చి వారి సైన్సు మాస్టరుకు చూపించమన్నాను. అంతటితో ఆ మాస్టరు నిరుత్తరులయ్యారు. అసలు సంగతేమంటే ఆయన ఏడు రోజుల్లో దేవుడు సృష్టంతా ముంగిచారని నమ్మే బాపతు.

కమిటీవారు కాలేజి రెండో సంవత్సరం ఇంటర్, బియస్.సి క్లాసులు ప్రారంభించారు. ఆ రోజుల్లో కడప ప్రాంతం నుండి మా కళాశాలలో చాలామంది విద్యార్థులు చేరేవారు. ఆ ప్రాంతాల్లో తగినన్ని డిగ్రీ కళాశాలలు లేకపోవడం ఒక కారణం కావచ్చు. మేము అడ్మిషన్ల కోసం పడిగాపులు కాయనవసరం లేకపోయింది. పైగా మాది కాంపోజిట్ కాలేజి, అయ్యవార్లు బాగా చెప్తున్నారనే పేరు కూడా మెల్లమెల్లగా ప్రచారమయింది.

రెండో ఏడాది చేరిన అధ్యాపకుల్లో తెలుగులో మాచవోలు శివరామప్రసాదు మంచి పండితులు, అన్నిటికన్నా నమ్మదగిన మిత్రుడయ్యారు. ఆయన ప్రైవేటుగా తెలుగు ఎం.ఎ. చదివి ఫస్టుక్లాసులో పాసయ్యారు. మా కాలేజీలో చేరకముందు ఎనిమిదేళ్ళు నెల్లూరు సెయింట్ పీటర్సు హైస్కూల్లో చేశారు. అతనితో పనిచేసిన సీనియర్ టీచర్ ఒకరు “పురుషోత్తం నమ్మదగిన వ్యక్తికాదు” అని తనకు జాగ్రత్తలు కూడా చెప్పి పంపాడట! 1973 నుంచి ఈనాటివరకు మా స్నేహాన్ని ఎవరూ చెడగొట్టలేకపోయారు. ఆ యేడే మదనపల్లి ప్రాంతంనుంచి రామమోహనరెడ్డి అనే యువకుడు ఇంగ్లీషు శాఖలో జూనియర్ లెక్చరర్‌గా చేరాడు. తను స్ఫురద్రూపి, పైగా వైదుష్యం ఉన్నవాడు, అయితే ఆవేశపరుడు, పిల్లలను బాగా ప్రేమించేవాడు. మరొక ఇంగ్లీషు అధ్యాపకుడు రాయుడు కూడా బోధనలో పేరు తెచ్చుకొన్నాడు. ఇంగ్లీషు శాఖ అధిపతి నరసింహం తెలుగు ప్రబంధాలలోనుంచి కూడా పద్యాలూ చదివేవాడు. వాళ్ళ తాతగారు దాసు. దళితవాడలో కుటుంబాలకు వైష్ణవ మతవిధులు నిర్వహిచేవారట! అందరం ఉత్సాహం ఉరకలు వేస్తుంటే కాలేజీకి అంకితమయ్యాము.

1974 మొదట్లో కాలేజీలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఇంగ్లీషులో మాతో పాటు చేరిన నరసింహాన్ని డిపార్ట్మెంట్ హెడ్డుగా తొలగించి, మరుసంవత్సరం చేరిన రాయుడుని హెడ్డుగా వేశారు. ఇది కమిటీ కార్యదర్శి పని. హెడ్డుకు ప్రతేక్యమైన హోదా ఏమీ ఉండదు. టైంటేబుల్ తయారుచేసి అధ్యాపకులకు తరగతులను కేటాయించడం, పాఠాలు సక్రమంగా జరుగున్నాయా లేదా అని అప్పుడప్పుడూ డిపార్టుమెంట్ మీటింగ్ పెట్టి చర్చించుకోడం వంటి బాధ్యతలు తప్ప వేరే ఆర్థిక ప్రయోజనాలు లేవు. నేను చేరినరోజునుంచీ తెలుగు హెడ్డును. పాపం! జి.నరసింహం మా అందరికన్నా వయసులో పెద్దవాడు, దళితుడు, అతనికి పిల్లల్లో మంచి పేరు కూడా వుంది. సమస్యను కమిటీ ముందుకు తీసుకొని వెళ్ళాము. కార్యదర్శి కులం పేరుతో, మరోవిధంగా బెదిరించి అధ్యాపకుల్లో బలహీనరావుల్ని తనవైపుకు తిప్పుకున్నాడు. మిగిలినవాళ్ళం నరసింహం సమస్యను అధికారుల ముందుకు తీసుకొని వెళ్ళాము. ఏమీ కాలేదు. ఎం.ఎల్.సి మాణిక్యరావు గారు మాకు సలహాదారు. మొదట ప్రిన్సిపాల్ కమిటీ వైపు ఉన్నారు కానీ తర్వాత మా వైపుకు వచ్చారు. ఆయన జిల్లాకు కొత్తవారు కనుక చెప్పినట్టు వింటారని అనుకొన్నారు కార్యదర్శిగారు. సంజీవిశెట్టి అధ్యక్షులేగాని వారు వృద్ధులు, మిగతా కమిటీ సభ్యులు వ్యాపారస్తులు, వారికి ఏమీపట్టదు. ఈ పరిస్థితుల్లోనే కార్యదర్శి మూడో విద్యా సంవత్సరం మొదట్లోనే ఒక సాయంత్రం చివరి క్లాసు తీసుకొని గృహోన్ముఖులవుతున్న నలుగురు అధ్యాపకులను ఉద్యోగం నుంచి తొలగిచినట్లు ఆర్డరు చేతికి యిచ్చారు. పాపం అందులో ఇద్దరు ఇంగ్లీషు లెక్చరర్లు పదేళ్ల ఎయిడెడ్ సర్వీస్ వదులుకొని వచ్చిచేరినవాళ్లు. ఇక మేము సీనియర్లము రంగంలోకి దిగక తప్పిందికాదు. కాలేజి సమయం అయిపోయాక గుంపుగా సైకిళ్ళు వేసుకొని ప్రతి కమిటి సభ్యల ఇంటికి, డోనార్ల ఇళ్లకు తిరిగి సమస్యను వివరించాము. మాకు “డర్టీ డజన్” అని మాతో చేరకుండా కమిటీ పక్షంలో ఉన్న లెక్చరర్లు పేరుపెట్టారు. నేను స్థానికుణ్ణి. పత్రికల వారంతా తెలుసు. సమస్యకు పరిష్కారం లభించక, హైకోర్టులో కేసువేశాము. కొన్నినెలల తర్వాత సర్వోదయ కాలేజీ సమస్య ఆక్టా ద్వారా ముఖ్యమైన అధికారుల దృష్టికి కూడా వెళ్ళింది. Teacher MLC మాణిక్యరావుగారు మాకు ఎనలేని సహాయం చేశారు. హైయర్ ఎడ్యుకేషన్ శాఖ తీసివేసిన లెక్చరర్లను తిరిగి చేర్చుకోమని ఉత్తరువు పంపినా, కార్యదర్శి గారు ఖాతరు చేయలేదు.

నెల్లూరు జిల్లా కలెక్టరు అర్జునరావు గారు, మా ఇంగ్లీష్ హెడ్ జి.నరసింహం ఇండోరులో ఒకే బేచ్లో యం.ఎ. కలిసి చదివారు. కొంచం పరిచయం వుంది. వారిని కలిసి పరిస్థితి వివరించాము. జస్పాల్ సింగ్ అనే ఐ.పి.ఎస్ యువ అధికారి, పోలీసు సూపర్నెంట్ వారు కరెస్పాండెంట్-సెక్రటరీగారిగారికి జ్ఙానోదయం కలిగించారు. మా వాళ్ళందరూ తిరిగి ఉద్యోగాల్లో చేరారు. ఈ అనుభవంతో కమిటీకి తత్వబోధయింది . మా జి.నరసింహంగారికి తిరిగి ఇంగ్లీష్ హెడ్ పదవి కూడా దక్కింది. మాకు తెలీకుండానే అందరం ఉద్యమకారులం అయ్యాము. మా ఇంగ్లీషు లెక్చరర్ రామ్మోహన్ యాక్టాలో క్రియాశీల సభ్యడయినారు. దాదాపు పదేళ్లు అధ్యాపక వృత్తిలో ఉంటూ మేము ఉద్యమకారులంగా నిర్విరామంగా తిరిగాము.

కాలేజీ ప్రారంభం అయిన కొద్దిరోజులకే మరుపూరు కోదండరామారెడ్డి గారు సింహపురి అనే చిన్న స్థానిక వారపత్రికలో సర్వోదయ కళాశాలలో ఒక్క తెలుగు శాఖలో తప్ప అన్ని శాఖలకు సమర్థులైన అధ్యాపకులు ఎంపిక అయ్యారని రాశారు. ఆ పత్రిక సంపాదకులు ఆకుల సుబ్రహ్మణ్యం గారు మా కార్యదర్శికి దగ్గరివారు. కోదండరామరెడ్డి గారి అబ్బాయి తరుణేందు, నేను ప్రాణమిత్రులం. ఆయన బహుశా ఎవరి ప్రోత్సాహంతోనో అలా రాసి ఉంటారు. ఇప్పుడు నవ్వొస్తుందిగాని అప్పడు చాలా బాధ పడ్డాను.

కాలేజీ అయిపోగానే జమీన్ రైతు పత్రిక ఆఫీసుకు వెళ్లి కాసేపు కూర్చొని నా మిత్రులు గోపాలకృష్ణ గారితో మాట్లాడి ఇంటికివెళ్లడం అలవాటు. సంపాదకులు నెల్లూరు శ్రీరామమూర్తి గారు కూడా ఎదురు రూంలో కూర్చొని ఉండేవారు. వారు కోరితే పుస్తక సమీక్షలు చేసేవాణ్ణి, వ్యాసాలు రాసేవాణ్ణి. అందువల్ల నాకేదో ఆ పత్రికలో చాలా పలుకుబడి ఉందని అందరూ, ప్రత్యేకంగా మా కార్యదర్శిగారి అపోహ. ఉద్యోగంలో చేరినరోజే కాలేజీ విషయాలు అక్కడ చెప్పకూడదు అని నిర్ణయం తీసుకున్నా.

మా కమిటీలో జె.శంకరరావు అనే డాక్టరుగారు కూడా సభ్యులు. వారు మా మామగారి కుటుంబ వైద్యులు కూడా. వారి తండ్రి డాక్టర్ ప్రకాశరావు గారు గొప్ప వైద్యులుగా ప్రసిద్ధులు. శంకరరావు గారి అన్నయ్య డాక్టర్ భక్తవత్సలం మద్రాసులో వైద్యవృత్తిలోను, సోదరి విశాఖలోను డాక్టర్లుగా పేరు తెచ్చుకున్నారు. కాలేజీ పెట్టిన మరుసటి సంవత్సరం స్టాఫ్ రూంను పరదాతో రెండుగా విభజించి ఒకభాగంలో పిల్లల వైద్యపరీక్షకు తాత్కాలిక ఏర్పాటుచేశారు. డాక్టరు శంకరరావు గారు అక్కడ ఉన్నపుడు మా అధ్యాపకులు పెద్దగా నవ్వుకుంటూ మాట్లాడుతూంటే డాక్టరు గారు నిశ్శబ్దంగా ఉండమని చెప్పి పంపించారు. అధ్యాపకులు పట్టించుకోకుండా గాసిప్ సాగిస్తూ ఉంటే డాక్టర్ గారు వచ్చి పెద్దగా చీవాట్లు పెట్టి వెళ్లారట. నేను అప్పడు క్లాసులో ఉన్నాను గనక జరిగింది తెలియదు. రెండు రోజుల తర్వాత జమీన్ రైతు పత్రికలో “సర్వోదయలో గర్వోదయం” శీర్షికతో విద్యావంతులైన అధ్యాపకులను కమిటీ సభ్యలు దూషించినట్లు వార్త వేశారు. మరుసటిరోజు మా ప్రిన్సిపాల్ గారు, కార్యదర్శి గారు అధ్యాపకులను సమావేశపరచి చాలా తీవ్రంగా బెదిరించారు. సహజంగానే ముల్లు నావైపే చూపుతుంది. నిజంగా నాకు జరిగింది తెలియదు, డాక్టర్ గారు మా మామగారి కుటుంబ వైద్యులు కూడా. వినయంగా “నేను చెప్పలేదండీ! ఎవరు చెప్పినా పొరబాటే! పెద్దమనసు చేసుకొని మా అధ్యాపకులను క్షమించండి” అని అన్నాను. ఆ రోజునుంచీ నాతొ అధ్యాపకులు ఎవరూ మాట్లాడేవారు కాదు. అందరికీ నాతో మాట్లాడితే ఉద్యోగం తీసేస్తారనే భయం. చేయని తప్పుకు శిక్షింపబడ్డానని క్షోభతో నాలో నేను కుమిలిపోయాను. ఆవేశంగా జమీన్ రైతు ఆఫీసుకు వెళ్లి నా మిత్రుడితో తగాదాపడ్డాను. “మీ కాలేజీ మీద వార్త రాయవద్దని చెప్పడానికి నీకేం హక్కుంది? మా ఉద్యోగం మేము చేయొద్దా?” అని గోపాలకృష్ణ అన్నారు. తను చాలా సౌమ్యులు, మితభాషి. నేనే ఆవేశపరుణ్ణి. ఇద్దరిమధ్య స్నేహం కొనసాగింది. జమీన్ రైతుకు వార్త ఎట్లా చేరిందనేది నాకు పదేళ్ళ తర్వాత తెలిసింది. జమీన్ రైతు పత్రిక వారికి పరిచయమున్న ఒకరు, మా సహ అధ్యాపకుడు ఉప్పందించాడు. నాకు యెంత ప్రాణమిత్రులైనా గోపాలకృష్ణ అతనిపేరు బైట పెట్టలేదు. వృత్తిధర్మం వేరు, స్నేహాలువేరు అని నిరూపణ అయింది.

కొద్ది రోజుల తర్వాత గోపాలకృష్ణ ఒక వార్త తెలియజేశారు. ఆ రోజుల్లో ధనెంకుల నరసింహం గారు నెల్లూరులో జయభేరి పేరుతో వారపత్రిక నడిపేవారు. అందులో పోస్టల్ డిపార్టుమెట్లో సార్టింగ్ శాఖలో గుమాస్తాగా చేసే సుబ్రహ్మణ్యం పగలు పత్రికలో పార్టుటైంగా పనిచేసేవాడు. ఆతను ఫోన్ చేసాడు మా మిత్రుడు గోపాలకృష్ణకు. తనమీద, నా మీద మా కళాశాల కార్యదర్శిగారే పత్రిక ఆఫీసులో కూర్చొని దూషణలతో కూడిన వ్యాసం రాసి ఇచ్చారని, పత్రికాధిపతి దాన్ని ప్రచురించమన్నాడని.

ఆతను అన్నట్లే తెల్లవారి పత్రికలో వ్యాసం వచ్చింది. మా మిత్రుణ్ణి ఖర్వాటుడని, మరేదో పేర్లతో దూషణలు, నన్ను గురించి రాస్తూ, తాటాకుల పండితుడని, అదనీ ఇదనీ నా పేరెత్తకుండానే దూషణలు. రెండురోజుల తర్వాత మా కాలేజీ కార్యదర్శి రోడ్లో కనిపిస్తే వారి చెయ్యిపట్టుకొని ఆపి, “సార్, మీరు చెప్పండి, ఉద్యోగం మానేసి వెళ్లిపోతా” నని ఆవేశంగా అన్నా. ఆయన “డాక్టర్, డాక్టర్” అని సంబోధిస్తూ “అదేం లే”దని చెప్పి గబగబా తప్పించుకొని కారెక్కి వెళ్లిపోయారు. నాకు కళ్ళల్లో నీళ్లు స్రవిస్తూన్నాయి. వివశుణ్ణయిపోయాను. ఉద్యోగధర్మంలో ఇటువంటి దొంగ దెబ్బలు చాలా తిన్నాను.

ప్రిన్సిపాల్ గారు కూడా తరచూ మెతగ్గా ఉండేవాళ్ళను ఏడిపించేవారు. మాకు మేనేజరుగా రాఘవులని ఒక వైశ్య- మధ్య వయసు వ్యక్తిని నియమించారు. ఆతను ప్రిన్సిపాల్ గారు ఎన్ని తిట్టినా పడుండేవాడే కానీ ఎదురుచెప్పడు. ఒకసారి ప్రిన్సిపాల్ అదుపుతప్పిన ఆగ్రహంలో “రాఘవులూ, మన భార్య శరీర భాగాలు మనకు తెలియవా?” అనే అర్థం వచ్చేట్లు ఏదో అన్నారు. ఆతను ఏమీ మాట్లాడలేదుకానీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నేను ప్రిన్సిపాల్ గారికి ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్నా. నాక్కూడా వళ్ళు మండిపోయింది. “సర్, ఈ మాటలు నన్నని ఉంటే మిమ్మల్ని కత్తితో పొడిచి వెళ్లిపోయేవాణ్ణి” అన్నాను. ఆయనకు తామన్నమాట యెంత తప్పో తెలిసింది. మేనేజర్ రాఘవులు రూంలోంచి వెళ్ళిపోయాడు. పాపం! నోరులేని మనిషి. నాలుగేళ్ల తర్వాత పెప్టిక్ అల్సర్ బరస్టయింది. హాస్పిటల్లో చేర్పించాము. ఆపరేషన్ అయింది. రాత్రి ఏడుగంటలపుడు అందరం గుంపుగా హాస్పిటలు ముందు నిలబడి ఉన్నాము. డాక్టర్ గారు నన్ను పిలిపించారు. వారి వద్దకు వెళితే “పురుషోత్తం సేవ్ చేయలేకపోయాము” అన్నారు. వెలుపలికివచ్చి అందరం ఒక్కపెట్టున ఏడ్చాము. రాఘవులు కొడుకు మా విద్యార్థే. బీకామ్ పాసై ఉన్నాడు. అతన్ని కమిటీ ఉద్యోగంలో పెట్టుకొన్నది.

జై ఆంధ్ర ఉద్యమకాలంలో నేను, నా మిత్రుడు, ఉపాధ్యాయ ఉద్యమ సారథి సింగరాజు రామకృష్ణయ్య గారి కుమారుడు ప్రసాదు విరామ సమయాల్లో ఫొటొగ్రఫీ మీద దృష్టి పెట్టాము. ఆ రోజుల్లో హరనాథ్ స్టూడియో అధిపతి నరసింహాచార్యులు మమ్మల్ని దగ్గరతీసి ఫోటోగ్రఫీ నేర్పించారు. వారివంటి ఉత్తములు అరుదుగా ఉంటారు. అప్పటికే స్టూడియో పేరు తగ్గిపోయింది. 16 సంవత్సరాల కుమారుణ్ణి తరిఫీదు చేస్తున్నారు. వారివద్ద లైకా ఎఫ్ 2 ఎస్ ఎల్ ఆర్ కెమెరా, లైకా couple రేంజ్ ఎఫ్ 2 కెమెరా, exposure మీటర్లు, ఇంకా చాల ఫోటోగ్రఫీ సామాన్లు, సాహిత్యం వారివద్ద ఉండేది. విరామకాలంలో వారి శుశ్రూషచేసి కాస్త విద్యను సంపాదించాము. 1972కు నెల్లూరులో కలర్ ఫోటోగ్రఫీ రాలేదు. వారు బొంబాయి నుంచి ఫిల్ము తెప్పించి, మాకు కెమెరా ఇచ్చి కలర్ ఫోటోగ్రఫీ చెయ్యమన్నారు. అయితే ఒక షరతు విధించారు. ముందుగా మిత్రులు, పరిచయస్థులను కలుసుకొని వారి బిడ్డల ఫోటోలు, దంపతుల ఫోటోలు తీయమని చెప్పారు. పోస్టుకార్డు సైజు కాపీకి 15రూపాయలు తీసుకోమన్నారు. ఫిలిం బొంబాయికి పంపి కాపీలు తెప్పించేవారు. లైటింగ్ నిక్కచ్చిగా తెల్సుకొని exposure నిర్ణయించుకోడానికి మీటర్ కూడా ఇచ్చారు. అటువంటి మీటర్లు ఆ రోజుల్లో సినిమావారివద్ద మాత్రమే ఉండేవి. ఇద్దరం ఒక ఉద్యమకారులం లాగా కలర్ ఫోటోలు తీశాము. మొదట్లో మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా, ఫోటోలు చూసుకొని చాలా సంతోషపడేవాళ్లు. అప్పటివరకు మా ఇద్దరివద్ద coupe range కెమెరాలు మాత్రమే ఉన్నాయి. నాకు మా బంధువు నేపాల్‌లో పనిచేస్తూ కెమెరా తెచ్చిచ్చారు. ఇద్దరం ఎన్నెన్నో ప్రయోగాలు చేసాము. వెన్నెల్లో 40నిమిషాల exposure తో ఫోటోలు తీసాము. గ్రహణాల ఫోటోలు తీసాము. 1974లో మా మిత్రులు గోపాలకృష్ణ డాక్టర్ తమ్ముడు, చెల్లెలు వివాహాలు ఒకే వేదికమీద ఒకేరోజు జరిగాయి. రెండు పెళ్లిళ్ళకు ఫోటోగ్రాఫర్ లేకుండా నేనే తీశాను. అమెరికాలో చాటంత సైజు (12x 10) ప్రింట్లు వేయించి పంపించారు. ఆమెట్యూర్ దశను దాటి ప్రొఫెషనల్ దశకు చేరానేమో!

తన కెమెరాతో రచయిత

హరనాథ్ స్టూడియో ఆచార్యులవారి సహకారంతో second hand Asahi Pentax (F 2) సింగిల్ లెన్స్ రిఫ్లెక్ కెమెరా కొన్నాను. తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో కెమెరా అమ్మవలసివచ్చింది. మళ్ళీ ఎన్నోఏళ్ళ తర్వాత నా రెండవ కుమారుడు సింగపూర్లో ఉద్యోగం చేస్తూ Pentax Camera, teli, videangle లెన్స్‌లు తెచ్చాడు. విషాదం ఏమంటే నాలుగేళ్లకే ఆ కెమెరాలు పాతబడి ఎలెక్ట్రానిక్ కెమెరాలు, ఫిలిం లేనివి వాడుకలోకి వచ్చాయి. నావద్ద కెమెరా ఉన్నా లేకపోయినా ఏ టూరుకు వెళ్తున్నా, ఎప్పడు అవసరమైనా మిత్రులు కెమెరా ఇచ్చేవాళ్ళు. 1970-90 నడుమ ఎన్నో పెళ్ళిళ్ళకు ఫోటోలు తీశాను. మా తోడల్లుడి కుమార్తె పెళ్లి ఎదురుకోల రోజు మగపెళ్ళివాళ్ళు “అబ్బాయి ఇట్లారా ఇక్కడ కొన్ని ఫోటోలు తీయాలి” అన్నారు. వినయంగా నేను పెళ్లికుమార్తె బాబాయినని చెప్పవలసివచ్చింది.

మా సర్వోదయ కళాశాలకు క్రీడామైదానం, తరగతి గదులు, లైబ్రరీలకు సంజీవిశెట్టి గారిచ్ఛిన అర ఎకరం స్థలం, ప్రశాంతి నిలయం భవనం సరిపోదు. విశ్వవిద్యాలయం వారు మరుసటి సంవత్సరానికల్లా తగిన స్థలం సమకూర్చుకునే ఒప్పుదలమీదే మా కళాశాల ప్రారంభించడానికి అనుమతి మంజూరు చేశారు. కళాశాల యాజమాన్యం ఎక్కువ శ్రమ లేకుండానే, సి.ఏ.యం హైస్కూలుకు అనుబంధంగా, నెల్లూరు జిల్లా న్యాయస్థానం, జిల్లా జైలు వెనకపక్క ఉన్న వ్యవసాయ యోగ్యమైన పంటపొలాన్ని ఇళ్ళస్థలాలకింద అమ్ముతూంటే ఖరీదు చేసింది. నెల్లూరులో 1904లో సి.ఏ.యం హైస్కూలు నెలకొల్పబడింది. స్కూలుకు అనుబంధంగా పెద్ద వ్యవసాయక్షేత్రం నిర్వహించబడేది. ఫ్రీచర్చి మిషన్ వారు 1840లలో స్కూలు ప్రారంభించి, ఈ దేశం నుంచి వెళ్ళిపోతూ స్కూలును బాప్టిస్టు మిషనరీల చేతుల్లో పెట్టివెళ్ళారు. ఆ స్కూలే సి.ఏ.ఏం హైస్కూలుగా చాలా కాలం ఉత్తమ ప్రమాణాలతో నెల్లూరుకు గర్వకారణంగా నిర్వహించబడింది. 1947 తర్వాత పాఠశాల నిర్వహణ దేశీయ క్రైస్తవుల పరమైంది. 1972/73లో స్కూలు మేనేజ్‌మెంటు సుమారు 8 యకరాల పొలాన్ని, ఇప్పుడు ఆర్.టి.సి బస్ డిపో ఎదురుగా ఉన్న స్థలాన్ని మా సర్వోదయ కళాశాలకు అమ్మారు. మా సెక్రెటరి/కరస్పాండెంట్ కృషివల్ల ఆ స్ధలంలో మా న్యూ కేంపస్, తరగతిగదులు, గ్రంథాలయం, క్రీడా మైదానం అన్నిటికి ఏర్పాట్లు జరిగాయి.

కొత్త క్యాంపస్ ప్రారంభం

రెండో యేడే ఈ క్యాంపసులో నాలుగు గదులు నిర్మించారు. అప్పుడు వి.సి.గా ఉన్న డాక్టర్ జగన్నాథరెడ్డి గారు డిసెంబర్ శలవుల తర్వాత, నెలరోజుల లోపలే కాలేజి ఇన్స్పెక్షన్‌కు వచ్చారు (Five Men Commission). కొత్త క్యాంపసులో గదుల నిర్మాణం వారంరోజుల క్రితమే పూర్తయింది. కాని మేనేజ్‌మెంట్ నెలరోజుల క్రితమే గదులు సిద్ధంచేసి వాటిలో తరగతులు జరుపుతున్నట్లు యూనివర్సిటీ వారికి లిఖితపూర్వకంగా తెలిపారు కాబోలు. ఎవరో గిట్టనివారు గదుల నిర్మాణం పూర్తికాలేదని విశ్వవిద్యాలయానికి ఉత్తరం రాశారేమో తెలియదు కాని, వి.సి.గారు, కొందరు సభ్యులు స్వయంగా పరిశీలించేందుకు సాయంత్రం ఆరుగంటలవేళ ఇన్సెక్షన్‌‍కు వచ్చారు. వారిలో సిండికేట్ సభ్యులు బలరామిరెడ్డి గారు, ప్రొఫెసర్ విశ్వనాథం గారున్నారు. ముందుగానే మా అధ్యాపకులనందరిని సమావేశపరచమని చెప్పారు. అందరం సాయంత్రం నుండి వారిరాక కోసం వేచివున్నాము. వారు నేరుగా న్యూ కాంపస్‌కే వచ్చారు. మా కాలేజి కమిటీ స్వాగత సత్కారాలను అంగీకరించకుండా నేరుగా ప్రిన్సిపాల్ గదిలో సమావేశమయ్యారు.

మా కమిటి పెద్దలు నిర్మాణం ఎప్పుడు పూర్తయిందని వి.సి. గారడిగితే నెలరోజుల క్రిందటే పూర్తయినట్లు చెప్పమని స్ట్రిక్టుగా మాకందరికీ ఆర్డరు వేశారు. కొందరు ఆ యేడే ఎంఏ పూర్తయి ఉద్యోగంలో చేరిన కుర్రాళ్ళు. నలుగురైదుగురు మాత్రమే కాస్త సీనియర్లము. వి.సిగారు ఎవరినీ మాట్లాడనివ్వలేదు. శీతల పానీయాలు కూడా నిరాకరించి, మా లెక్చరర్‌ల వైపు చూచి ఇక్కడ స్టూడెంట్స్ ఎందుకున్నారని అడిగారు. వాళ్ళు అధ్యాపకులేనని ప్రిన్సిపాల్ గారన్నారు. ఒక కామర్స్ అధ్యాపకుణ్ణి సూటిగా “ఎన్నిరోజుల క్రితం ఈ గదులు పూర్తయ్యాయి? ఇక్కడ ఎప్పటినుంచి తరగతులు జరుపుతున్నారు?” అని ప్రశ్నించారు. ఆ కుర్ర అధ్యాపకుడు బెదిరిపోయాడు. “నాలుగు రోజులుగా, చిఛీ, కాదు నెలరోజులుగా” అని తడబాటు, తత్తరపాటుతో సమాధానం చెప్పాడు. మేమందరం ఏం కొంపమునుగుతుందో అని భయపడిపోయాము. వి.సి.గారు కోపంగా” నువ్వు చీఛీనా, నేను చీఛీనా” అని అన్నారు. మా అందరి గొంతుల్లో పచ్చి వెలక్కాయ తిన్న చందంగా మాట పెగల్లేదు. వారు ప్రిన్స్‌పాల్ గారినిగాని, కమిటీ సభ్యులనుగాని ఒక్క మాటకూడా మాట్లాడనివ్వలేదు. అదే ప్రశ్న నన్ను కూడా అడిగారు. “ఏమోసార్! సుమారు ఇరవై రోజులనుంచీ ఇక్కడ క్లాసులు జరుగతున్నాయి” అని కట్టె విరక్కుండా, పాము చావకుండా సాక్ష్యం చెప్పాను. వారికి తెలుసు నాలుగు రోజులనుంచే ఇక్కడ తరగతులు నిర్వహిస్తున్నారని. విచారణ అంతా అరగంటలో ముగిసింది. క్లాసులు ప్రారంభించడం ఆలస్యమైంది కాని, కేంపస్‌కి సుమారు ఎనిమిది ఎకరాల స్థలం ఉండనేవుంది. వారు మా పొరపాటును క్షమిస్తారని అనుకున్నాము.

తర్వాత నాలుగు రోజులకు మా కళాశాలకు గుర్తింపు రద్దు చేసినట్లు విసిగారు వుత్తరువులు పంపారు. వారంరోజుల లోపలే మా కమిటీవాళ్ళు నేదురుమల్లి జనార్దనరెడ్డి గారి మాట సహాయంవల్ల విశ్వవిద్యాలయం ఆర్డరు ఉపసంహరించుకొనేట్లు చేయడంలో కృతకృత్యులయ్యారు!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here