[box type=’note’ fontsize=’16’] సంచిక కాలమిస్ట్, ‘మన రెక్కలు’ రచయిత శ్రీ పురాణం శ్రీనివాస శాస్త్రి గారికి నివాళులు అర్పిస్తూ, వారి చివరి కథని పాఠకులకు అందిస్తోంది సంచిక. [/box]
[dropcap]ఆ[/dropcap] రోజు ఆనందరావుకి వయసు ఊరిమింది. 58 నిండిన అందరి విషయంలోలాగే అతని విషయంలోనూ జరిగింది. అతనికెత్తి మీద రిటైర్మంట్ బరువు మోపడానికి అఫీసు ఏకమైంది. రిలీవ్ ఆర్డర్ ఇచ్చేసారు. దాదాపు పాతికేళ్లయింది ఆ ఆఫీసు కొలువులో చేరి. ఉద్యోగపర్వంలో ఆఖరి ఫైలు వెరిఫై చేసి సంతకం కోసం ఆపీసరుగారి వద్దకు ప్యూను చేత పంపించి కుర్చీలో రికామిగా చేతులు వెనక కలిపి పెట్టుకొని అందు మీద తల ఆనించి ఆవులిస్తూ ఆఫీసంతా కలయ చూశాడు. కుర్చీలు, బల్లలు, బీరువాలు, కంప్యూటర్ సిస్టమ్‌లు, కొన్ని టేబుళ్ల మీద లాప్‌టాపులు అన్నిటినీ ఒక్కక్కటీ గుచ్చి గుచ్చి చూశాడు. అవి మనుషులు కాదు రిటైర్ అవడానికి – ‘నేను సామాను జన్మ ఎత్తినా బాగుండేది’ అనుకున్నాడు. రేపటి నుంచి అవన్నీ ఉంటాయి. తనే ఉండడు ఇక్కడ.. ఉండడు… తన కుర్చీలోకి ఇక ఎవరొస్తారో అని వేదాంతం మార్కు నవ్వుతో మొహం వెలిగించి ఆర్పేశాడు చప్పున,
ఆ రోజు గంట ముందే అందరూ పని ముంగించి ఆనందరావు మీద రిటైర్మెంట్ బరువు మోపడానికి సిద్ధపడ్డారు. ఆఫీసులో ఉద్యోగుల సంఘానికి ఇటీవల వసూళ్లు బాగా పెరిగాయి. ‘ఉద్యోగంలో ఇక్కడ ఎవడూ శాశ్వతం కాడు’ అనుకుని ఓ బ్యాండు మేళం అరేంజి చేసేరు.
‘ఇలా నా కోసం డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నారు వీళ్లు’ అనుకున్నాడు ఆనందరావు. అంతలో యూనియన్ మనుషులు మెడలో దండేసి సభకు పిలుచుకుపోయారు.
***
ఆనందరావు రిటైర్మెంట్ వల్ల ఒక ఉత్తమ కార్యదక్షుణ్ణి ఆఫీసు కోల్పోతోందనీ, ఈ నష్టం ఆ సంస్థకు తీరనిదనీ, ఆ లోటు పూడ్చలేమనీ సభలో తీర్మానిస్తూ మాట్లాడారు అంతా, వాళ్లలో ఆనందరావు వంటే సుతరామూ పడని సుబ్బారావు; ఎప్పుడూ మెమోలతో సతాయించిన ఆఫీసరూ; కన్ను గీటాడన్న దొంగ ఫిర్యాదుతో ఆర్నెల్లు సస్పండ్ చేయించిన వనజాక్షి కూడ ఉండడం అతనికి ఇబ్బంది అనిపించింది. అయినప్పటికీ వాళ్ల ఉన్యాసాలతో తనకి తాను కొత్తగా తోచాడు కాస్సేపు. వద్దు వద్దంటుంటే ఇంటికి ఆటో ఎక్కించారు తనని. ఒక చేత్తో పూల దండ, మరో చేత్తో హాండ్ బ్యాగూ, క్యాష్ పట్టుకున్న ఆనందరావు – స్వీట్ ప్యాకెట్ ఆఫీసు వాళ్లు, యూనియన్ కలిసి ఇస్తే ఎలా పట్టుకోవాలా అని ఆలోచించాడు. స్వీట్ ప్యాకెట్ ఏదీ రాలేదు కాబట్టి బతికిపోయాడు. రెండు చేతులూ బ్యాలెన్స్ చేసుకుంటూ జాగ్రత్తగా ఆటో ఎక్కాడు. అందరూ హడావిడిగా వీడ్కోలుగా చెయ్యూపుతుండగా ఆటో దూసుకుపోయింది. ఆటో మీటరు కేసి చూస్తూ కంగారుపడ్డాడు ఆనందరావు ఇంటికి ప్రయాణంలో. మీటర్‌లో పైసల లెక్క తిరిగిపోతుంటే పెద్ద దోపిడి కుట్రలో ఇరుక్కుపోయినట్లు ఫీలింగు వచ్చేసింది. ఆ భజంత్రీ మేళం మానేసి ఆటోకి డబ్బులిస్తే బాగుండేది అనుకున్నాడు. మేనేజ్మింట్ ఇచ్చే ఉంటుంది. మధ్యలో యూనియన్ వాళ్లు నొక్కెయ్యకుండా ఉంటారా? యూనియన్ సెక్రటరీకి బ్యాండ్ మేళం ఉండబట్టి అక్కర్లేకున్నా పెట్టారు. అధవా తన మానాన తనని వదిలేసినా బస్సులో ఐదు రూపాయల ఖర్చుకి ఇంట్లో వాలేవాడు. ‘తను అసలే మామూలు మనిషి కాదు – రిటైరైన మనిషి’ అనుకున్నాడు. సెల్ఫ్ పిటీ ఆలోచనలు అటు ఇటూ తిరిగాయ్!
***
‘ఆ రోజు నించీ డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెడుతూ పెన్షన్ చాలవన్న మాట రాకుండా కుటుంబ బండిని లాగించెయ్యాలి’ అనుకుంటూ ఇంట్లోకి అడుగు పెట్టాడు. ‘హియర్ కమ్స్ రిటైర్టు ఆనందరావు’ అని గుమ్మం దగ్గర గట్టిగా అందరికీ వినపడేలా చెప్పి ఎంటరయ్యాడు. అతన్ని ఎవరూ విన్నట్టు లేరు. ఎదురొచ్చిన భార్యకి దండ, బ్యాగు అందించి ‘కాఫీ’ అంటూ కుర్చీలో కూలబడ్డాడు. ‘ఆ బల్ల మీద పెట్టాను తీసుకోండి’ అంది భార్య పార్వతి. ఆమె అలా అనడంలో తన రిటైర్మెండ్ ఎఫెక్ట్ ఏమన్నా ఉందా! అని ఆలోచించాడో నిమిషం. పార్వతి చేతిలో చీపురు కాబట్టి, నిజంగానే చెయ్యి ఊరుకోకే అలా అంది అని సర్ది చెప్పుకొని బల్ల మీదికి వంగి స్వయంగా చేతిలోకి తీసుకున్నాడు కాఫీ కప్పుని.
***
భుజం మీద తువ్వాలుతో బాత్‌రూమ్‌కి వెళ్లిన ఆనందరావుని పార్వతి అడ్డేసింది “మీ కప్పుడే ఏం తొందర? అబ్బాయి అర్జంటుగా పని మీద బైటకెళ్ళాల్ట. వీడి స్నానం తర్వాత అమ్మాయి కాలేజికి పోతుంది. ఆ ఇద్దరూ అయ్యాక పిలుస్తాను” అని వెనక్కి వెళ్లమంది. “సరే” అంటూ రెండో బాత్‌రూమ్ ఉన్న గదిలోకి దారి తీశాడు. “అటెక్కడికి. ఆ ట్యాప్ పని చేయటం లేదు” అని గురుతు చేసింది. స్నానపానాదుల దగ్గర ఇక తనది లీస్ట్ ప్రయారిటీ అని అర్థం చేసుకుని, చిన్నబోయిన మొహన్ని గంభీరంగా న్యూస్ పేపర్లో దాచేసుకున్నాడు. బ్రేక్‌ఫాస్ట్‌కి డైనింగ్ టేబుల్ దగ్గర సీన్ ఎలా ఉంటుందో అని శంకించాడు. తను ససేమిరా ఎగబడకూడదు అని చెప్పుకున్నాడు మనసుకి.
పార్వతి పిలుపు వచ్చాకే వెళ్లాళి అని గట్టిగా అనుకొన్నాడు. పేపర్లో ఒక వార్త మీద దృష్టి పడింది. ఆర్థిక పరిస్థితి చక్కబడే దాకా పెన్షన్లు పెరగవు అన్నది తాత్పర్యం. సుప్రీం కోర్టు పెంచాలని చెప్పినా సర్కార్ పెడచెవిన పెడుతోంది. ‘ఏమిటో దిక్కు మాలిన సంత’ అని చీత్కారంగా అనుకొన్నాడు.
***
“రిటైర్మెంట్ గురించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకోయ్. అన్నీ మానేయడమే. వారానికొసారే షేవింగ్. అదీ వద్దనుకుంటే ఇంకా మంచిది. మూడు నెలలకో సారే హెయిర్ కట్. బనీన్లు లోపలి డ్రాయర్లు కట్టుకోడం మానేసి రెండు జతల బట్టలతో కాలక్షేపం చేయడమే. అనవసరపు ప్రయాణాలు, సానుభూతి పలకరింపులు, విషెస్ అన్నీ ఫోన్లోనే. పెళ్లిళ్లకీ, బర్త్ డేలకీ మనం విషెస్ చెప్పకపోతే పిల్చినవాళ్లు ఎవళ్లూ రైలు కింద తలకాయ పెట్టుకోరు, గుర్తుంచుకోరు. ఇంట్లో ఒకే గదిలో అఘోరిస్తే ఫ్యాన్లు, కరెంటు ఖర్చులు కలిసొస్తాయ్” ఇంకా తనలాగే కొత్తగా రిటైర్మెంట్ బరువు ఎత్తుకొన్న మరో కొలీగ్ సీతాపతి ఫోన్‌లో క్లాస్ పీకుతుంటే ఆనందరావుకి బేజారయిపోయింది. ‘అన్నీ మానెయ్యాలా’ అనుకుంటూ చేతిలో సిగరెట్ కేసి దీనంగా చూశాడు.
***
ఆనందరావు పెన్షన్ అకౌంట్ ఉన్న ఎస్.బి.ఐ పాస్ బుక్, డెబిట్ కార్డు అడిగి తీసుకుంది పార్వతి. అవి చేతిలో పడగానే ‘రిటైర్మెంట్ జాగ్రత్తలు’ అంటూ ఓ పది నిముషాలు పాఠం అప్పగించింది. అది కొడుకు ప్రకాశం నూరిపోసిన పాఠం అని తెలుస్తూనే ఉన్నా చప్పుడు చేయకుండా బుద్ధిగా విన్నాడు ఆనందరావు. ఆ పాఠం సారాంశం ఏమిటంటే – అబ్బాయ్ ప్రకాశం ఆరోజే ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగం ఇప్పించిన యూనియన్ పెద్దమనిషి వరసగా ఆరు నెలలు జీతం పట్టుకొని ఏదో కొద్దిగా విదిలిస్తాడు ఇంటికి పట్టుకుపోడానికి. ఆ తర్వాత కూడా ఆఫీసు ఉద్యోగంలో ప్రకాశం సెటిలవడానికి ఇంకో ఏడాది పట్టొచ్చు. కాబట్టి ఇల్లు సాఫీగా సాగాలంటే మొత్తం బాధ్యతలు కొడుక్కి అప్పగించి కృష్ణా రామా అంటూ కాలక్షేపం చేయాలి తప్పదు.
పెన్షన్ డబ్బుపై పెత్తనం కూడా వాడికే దఖలు పరిచేసి, పెన్షన్ అనేది లేదు అనుకుంటే భేషుగ్గా ఉంటుంది. ఏ బాదరబందీలూ లేకపోతే మన పెద్దాళ్లం ఇద్దరి ఆరోగ్యాలకీ ఢోకా ఉండదు. ఆ పాఠం శ్రద్ధగా విన్న తరువాత జేబులో మిగిలిన ఏకైక సిగెరెట్ బయటకి తీసి, నలిపి, కిటికి లోంచి అవతలకి విసిరేశాడు ఆనందరావు. ‘ఇక నీకూ నాకూ రుణం తీరిపోయింది. నీ కోసం ఇంట్లో సజ్జుతో గొడవలు పడలేను’ అని సిగరెట్ షోకిల్లాకి గుడ్ బై కొట్టేసి హఠాత్తుగా సత్తువ ఉడిగినవాడిలా కుర్చీలో కూలబడ్డాడు ఆనందరావు.
***
నెలకో పాలి అయినా బీరు తాగకుండా, రోజుకి ఆర ప్యాకెట్టయినా సిగెరెట్లు ఊదకుండా కేవలం అన్నం తిని త్రేన్చుతూ బతకడమెట్లా బెంగపట్టుకున్న ఆనందరావు ‘అవునూ అసలు ఇలా జిహ్వ లాగేస్తుంటే అణుచుకుంటూ ఇంకా తాను ఎన్నేళ్లు బతకాలి?’ అని కొత్త కంగారుకి లోనయ్యాడు. సందు చివర చిలక జోస్యం వాడిని ఆశ్రయించాడు.
‘అబ్బో ఇంకో 20 ఏళ్లు గ్యారంటీ’ అన్న జోస్యం విని మనసులో ఏడ్చేశాడు. నోరు పీకుతూ ఉంటే ఇంకా అన్నేళ్ళా అని చావు కబురు విన్నట్టు కలత చెందాడు. ‘అన్నిటికీ అన్నమే రామచంద్రా’ అని నిట్టూర్చాడు.
***
నిద్దట్లో మెలకువ వచ్చినపుడు అది పగలో రాత్రో తేడా తెలియటం లేదు ఆనందరావుకి. పగలు కూడా రాత్రిలా ఒళ్లెరక్కుండా పడుకుంటున్నాడు. ఇల్లు నడపడానికి దూరం కావడంతో ఏం చేస్తున్నాడో ఎవరికీ అక్కరలేకపోయింది. అది కలిసొచ్చి మరీ జోగిపోతుంటే పొట్ట పెరిగింది. అతను చేసింది ప్రవేటు ఉద్యోగం. పడకకి మాత్రం రిటైరయ్యాక, ఇప్పుడు తను ప్రభుత్యోద్యోగి, భలే భలే అని తన మీద తాను జోకేసుకొంటే పెద్దగా నవ్వొచ్చింది. ఆపుకోలేకపోయాడు… ‘రికామీ గాణ్ణహో’ అని గట్టిగా అరిచేశాడు టముకేసినట్టు. అహ్హహ్హ… హిహ్హిహ్హే… హుహ్హుహ్హు అంటూ నిద్ర మత్తు చెదిరి పోయోలా టాపు లేచిపోయేలా పగలబడ్డాడు!
***
ఆనందరావు నవ్వుకి భార్య పార్వతి కొడుకు ప్రకాశం, కూతురు అలివేణి ఉలిక్కిపడి భుజాలు తడుముకున్నారు.
***
అతి చురుగ్గా, అత్యంత బిగ్గరగా, వేళాకోళం వెక్కిరింతగా ఆనందరావు నవ్వడం పార్వతి అంతకు ముందు ఎప్పుడూ వినలేదు. అందుకే గతుక్కుమంది. ఆ మనిషిచ్చే జీతంతో రెండేళ్ల నించి, ఆ ఖర్చూ ఈ ఖర్చూ చెప్పి కొంత డబ్బు వెనకేసింది తను. భర్తకి రెండేళ్లలో రాబోయే రిటైర్మెంట్‌తో చేతిలో చిల్లికాణి లేని దాన్లా మిగలకుండా ఉండాలని ఆ జాగ్రత్త. ఇప్పుడు భర్తగారి నవ్వుతో అపరాధ భావన తోసుకొచ్చి విసవిసా దేవుడి మందిరం దగ్గరకెళ్లి ఆ కిందనించి డబ్బు సంచీ ఇవతలకి తీసి భర్త గదిలోకి నడిచింది.
“అబ్బాయి పెన్షన్ డబ్బు తీసుకొన్నా మనకేం భయం లేదు. ఇదిగో నే దాచిన డబ్బు. ఉట్టికట్టుకుని ఊరేగండి” అని ఆ డబ్బు సంచీ ఆనందరావు ఒళ్లోకి విసిరింది. “అలా నవ్వకండి. విన్లేకపోతున్నాం” అని ఓ ఈసడింపు విసరి వెళ్లిపోయింది పార్వతి.
***
కొడుకు ప్రకాశం పిల్లిలా వచ్చి చటుక్కున వంగి తండ్రి కాళ్లకి దణ్ణం పెట్టి కళ్లకు అద్దుకున్నాడు. ఆ పని చేస్తూ మనసులో లెంపకాయల స్తోత్రం చదువుకున్నాడు.
‘అంతా ఉత్తిదే. నాకు ఉద్యోగం రాలేదు. మీ పెన్షన్ డబ్బు మీద కన్నేసాను. క్షమించండి’ అని గబగబా పాఠం వప్పగించి బైటికి నడిచాడు.
***
అలివేణి పెళ్లయిన పక్కింటి సుబ్రావ్‌తో చెక్కేసే ప్లాన్ గురించి గిల్టీగా ఫీలయింది. తండ్రి నవ్వు ఆమెలోని ఆడతనపు బిడియాన్ని బైటికి లాగింది, చటుక్కున తండ్రి గదిలోకి వెళ్లి “అట్లేం కాదు… నాతోని కాదది” అని గబగబా చెప్పేసి, టేబుల్ మీద కాఫీ కప్పు చేతిలోకి తీసుకొని టేబుల్ మీద తడి మరకలు తుడిచి ‘హాయ్’ అని తండ్రికి టాటా చెప్పి వెళ్లిపోయింది.
***
పార్వతి దాపుడు డబ్బు అంటూ ఓ చిన్న డబ్బుల సంచి చేతిలో పెట్టడం ఏమిటో, కాళ్లకి కొడుకు మొక్కడం ఏమిటో, కూతురు కాఫీ కప్పు తీసు శుభ్రం చేస్తూ హాయ్ చెప్పడం ఏమిటో – ఏమీ అర్ధం కాలేదు ఆనందరావుకి. అంతా వింతగా తోచింది. విషయం పట్టుబడక మళ్లీ నవ్వు అందుకున్నాడు మెట్లు మెట్లుగా, స్వరం పెంచుతూ, కుదిస్తూ… రికామిగా… “అహ్హాహ్హా… హిహ్హీహ్హీ… హుహ్హూహ్హూ!” అంటూ.