ఆచార్యదేవోభవ-44

1
3

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన గురువరేణ్యులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

మహారాజ పోషణలో తెలుగు:

[dropcap]మై[/dropcap]సూరు మహారాజా సాహితీ పోషకులు. మైసూరు మహారాజా శ్రీకృష్ణరాజ వొడియార్ IV హయాంలో మైసూరు విశ్వవిద్యాలం 1916 జూలై 27న ప్రారంభింపబడింది. మహారాజానే తొలి ఛాన్స్‌లర్. తొలి వైస్ ఛాన్స్‌లర్‌గా హెచ్.వి. నంజుండయ్య దిశానిర్దేశం చేశారు. బ్రిటీష్ ప్రభుత్వ పాలనకు బయట భారత దేశంలో కర్నాటకలో వెలసిన తొలి విశ్వవిద్యాలయం. 105 సంవత్సరాల చరిత్ర దానిది.

మైసూరు మహారాజా కళాశాలలో 1909లో కట్టమంచి రామలింగారెడ్డి అధ్యాపకులు. 1912-13 మధ్య ప్రసిద్ధ విమర్శకులు రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ ఆ కళాశాలలో తెలుగు పండితులు. విశేషమేమింటంటే మైసూరు విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏ. లేదు. కన్నడ ఎం.ఏ.లో తెలుగు ఒక పేపరు. పిహెచ్‌డికి తెలుగులో అవకాశం కల్పించారు. తొలి రోజుల్లో డా. కె. సుబ్బారావు ఎందరికీ పర్యవేక్షకులు. 1963లో నండూరి రామకృష్ణమాచార్య తిక్కన భారతంపై పిహెచ్‌డి పొందారు. 1965లో జీరెడ్డి చెన్నారెడ్డి వీరశైవ ప్రభావం గూర్చి సిద్ధాంత వ్యాసం సమర్పించారు. బడాల రామయ్య బసవేశ్వర వచనాలపై పరిశోధన చేశారు.

1973లో తెలుగు-కన్నడ జానపద గేయాలపై ఆర్.వి.ఎస్. సుందరం వ్యావహారిక భాషలో థీసిస్ సమర్పించి పిహెచ్‌డి పొందారు. డా. సి. వి. సుబ్బన్న అష్టావధాన కళ పైన, టి.బి.యం. అయ్యవారు ధూర్జటి రచనల పైన, పి.యస్.గోపాలకృష్ణ తెలుగు – కన్నడ సామెతల మీద పి.హెచ్.డిలు సంపాదించారు.

ప్రస్తుత శాఖాధిపతి:

మైసూరు విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు ఆచార్య యం. రామనాథనాయుడు అధిపతి. అయన జానపద సాహిత్య పరిశోధకుడు. 30 ఏళ్ళ బోధనానుభవం. వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించి 150 దాకా ఎంఫిల్ సిద్ధాంత వ్యాసాలకు పరీక్షాధికారి. వీరి పర్యవేక్షణలో ఏడుగురు పరిశోధకులు ముందుకు నడిచారు. ఉస్మానియా కవుల వేదిక వారి ఉగాది పురస్కారం (2021), దాశరథి పురస్కారం (2020), సాహితీరత్న జాతీయ అవార్డు (2019), బి.యన్. శాస్త్రి సాహితీ అవార్డు లభించాయి. ఆకాశవాణిలో ప్రసారాలు, సదస్సులలో పత్రాలు, పత్రికలలో వ్యాసాలు విరివిగా ప్రకటించారు. రెండేళ్ళు రీజినల్ డైరక్టరుగా, ఆరేళ్ళు డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పాలనా బాధ్యతలు వహించారు.

ఆర్. కె. లక్ష్మణ్, ఆర్.కె. నారాయణ, హెచ్.వై. శారదా ప్రసాద్ ప్రభృతులు ఎందరో ఇక్కడి పూర్వ విద్యార్థులు.

మైసూరు కళాశాల ఘన చరిత్ర గలది. అక్కడి అధ్యాపకులైన కట్టమంచి రామలింగారెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్‌లు ఇద్దరూ ఆంధ్ర విశ్వవిద్యాలయం పెట్టిన తొలినాళ్ళలో ఉపకులపతులుగా దిశానిర్దేశం చేశారు. తెలుగు, సంస్కృత భాషలలో విద్వాంసులైన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య కీర్తనల పరిష్కారంలో ప్రధాన పాత్ర వహించారు. వీరి కుమారులు జయంత శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఆంగ్లాచార్యులు. తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి చేతుల మీదుగా స్వామి వారి బహుమానాన్ని స్వీకరించి అనంతకృష్ణ శర్మ కన్నుమూశారు.

మైసూరు సుందరుడు:

పెన్‌సిల్వేనియా విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొపెసర్‍గా వెళ్ళివస్తున్న ఆర్.వి.యస్. సుందరం నెల్లూరులో పుట్టి పెరిగారు. నవల, కథానిక, కవిత్వం, విమర్శ, అనువాదం అనే ప్రక్రియల్లో తలస్పర్శిగా అవలోకనం చేసిన వ్యక్తి. విద్యార్థి దశలోనే సుందరం ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందారు. 20 ఏళ్ళ వయస్సుకే మదరాసు విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. తెలుగు పూర్తి చేశారు.

ఉద్యోగ జీవితం కర్నాటక లోని కోలారులో ప్రారంభమైంది. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో మెళకువలు నేర్చుకున్నారు. మైసూరు విశ్వవిద్యాలయంలో 36 సంవత్సరాల బోధనానుభవం వీరిది. తెలుగు విశ్వవిద్యాలయం వారి రాజమండ్రి విజ్ఞానపీఠంలో జానపద విజ్ఞానాచార్యులుగా పీఠాధిపతి అయ్యారు. 46 ఏళ్ళుగా విదేశాలలో పాఠాలు బోధిస్తున్న ప్రత్యేకత వీరిది. శతాధిక గ్రంథకర్త.

15వ ఏట ప్రారంభమయిన రచనా వ్యాసంగం స్వర్ణోత్సవం జరుపుకుంది.

రచనా సుందరుడు:

1.జానపద సాహిత్య స్వరూపం 2. ఆంధ్రుల జానపద విజ్ఞానం 3. కన్నడ సాహిత్య చరిత్ర 4. నన్నయ్య భారతం 5. రచనాస్వాదనం 6. పోతన భాగవత కన్నడానువాదం 7. గ్రంథ పరిష్కరణ శాస్త్రం

నవలలు – కథలు: సంస్కారం, ఆకాశగంగ, భావన, విద్యార్థి, చిదంబర రహస్యం, బిరుగాళి

పరిశోధనా గ్రంథాలు -తెలుగు సాహిత్యంలో దేశీ కవిత, పరిశోధనా పద్ధతులు

జీవిత చరిత్రలు – పుట్టప్ప కథ, పట్టాభి సీతారామయ్య, డా. సి.ఆర్. రెడ్డి, రచనాస్వాదనం వగైరా

సుందర జానపదం – వీరి పరిశోధనా స్రవంతికి గంగాఝరి.

ఆంధ్రుల జానపద విజ్ఞానం అనే గ్రంథానికి మైసూరు విశ్వవిద్యాలయ డి.లిట్ (1987) వీరి కిరీటంలో కలికితురాయి. తెలుగు కన్నడ జానపద గేయాలు – సిద్ధాంత గ్రంథానికి 1973లో మైసూరు విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి పొందారు. జానపద సాహిత్య సంబంధ గ్రంథాలు ఎనిమిది తెలుగు, కన్నడ ఆంగ్ల భాషలలో రచించిన ధీచరితుడు సుందరం.

అచ్చివచ్చిన తెలుగువారి బోణీ:

వివిధ విశ్వవిద్యాలయాలకు నాంది పలికిన వ్యక్తులు తెలుగు సాహితీవేత్తలు కావడం యాదృచ్ఛికం కాదు, భగవత్ సంకల్పం. మదరాసు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు రఘుపతి వెంకటరత్నం నాయుడు (1925). ఆయన విద్యావేత్త. ఆంధ్ర విశ్వకళా పరిషత్ బిల్లును మదరాసు శాసన సభలో ఆమోదింపజేసిన ఘనులు. ఆయన శ్వేతాంబర ఋషి. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించేవారు. మదరాసు విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రవేశపెట్టించిన ప్రముఖులు.

ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపక ఉపాధ్యక్షులు సర్ కట్టమంచి రామలింగారెడ్డి బహుభాషావేత్త. రెండు దఫాలు ఆయన ఆ పదవి నధిష్ఠించారు. 1926-31, 1936-49. అంటే 18 ఏళ్ళు సంవత్సరాలు దిశానిర్దేశం చేసి తెలుగు శాఖను పటిష్ఠం చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ సంస్థ ఉపాధ్యక్షులు (1931-36).

అడుగుజాడలు తీర్చిదిద్దిన ఆచార్యులు:

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా గుంటూరులో పి.జి.సెంటర్ 1967లో స్థాపించినప్పుడు తెలుగు శాఖలో ఆచార్యులు తూమాటి దొణప్పను ప్రత్యేకాధికారిగా నియమించారు. ‘గురజాడ అడుగు జాడ’ అనే నానుడి వలె దొణప్ప అడుగు జాడలో నాగార్జున విశ్వవిద్యాలయం ఏర్పడింది (1976). దొణప్ప ఆధ్వర్యంలో తెలుగు విశ్వవిద్యాలయం 1986లో తొలి అడుగులు వేసింది.

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ పి.జి.సెంటర్ 1967లో అనంతపురంలో స్థాపించినప్పుడు యాదృచ్ఛికంగా తెలుగు శాఖ ఆచార్యులు కోరాడ మహాదేవశాస్త్రి పునాదులు వేసి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి బాటలు వేశారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయ అనుబంధంగా వరంగల్‍లో పి.జి.సెంటర్ నెలకొల్పినపుడు తెలుగు శాఖ ఆచార్యులు బిరుదురాజు రామరాజు 1968లో దిశానిర్దేశం చేశారు. ఈ విధంగా పలు నూతన విశ్వవిద్యాలయాలకు తెలుగు ఆచార్యులే మార్గదర్శనం చేయడం గర్వకారణం.

తెలుగదేలయన్న?:

మైసూరు కళాశాలలో ప్రారంభ దినాలలో 1948లో కె. సుబ్బరామప్ప మైసూర్ మహారాజా కళాశాలలో తెలుగు శాఖలో చేరారు. మైసూరు విశ్వవిద్యాలయంలో 1973లో రీడర్‍గా చేరి తర్వాత రిటైరయ్యారు. యు.జి.సి. ప్రొఫెసర్. తెలుగు-కన్నడ ఏకలిపి కోసం విశేష కృషి చేశారు. వీరి పర్యవేక్షణలో జీరెడ్ది చెన్నారెడ్డి, నండూరి రామకృష్ణమాచార్యులు, ఆర్.వి.యస్. సుందరం, టి.బి.యం. అయ్యవారు, సి.వి. సుబ్బన్న, బి. భావనారాయణ, లలితా పీటర్స్, పిహెచ్‌డిలు పొందగలిగారు. ఆంధ్ర దేశంలో అవకాశం లేనప్పుడు మైసూరు ఆదుకొంది వీరిని.

ముఖ్యమంత్రికి అధ్యాపకుడు వీరభద్రయ్య:

హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 1986-2004 మధ్య తెలుగు శాఖ ఆచార్యులుగా బోధించిన ముదిగొండ వీరభద్రయ్య సాహితీవేత్త. సిద్ధిపేటలో ఉపాధ్యాయుడిగా వున్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పాఠాలు బోధించారు. 1942లో గజ్వేల్, అముదీపురంలో జన్మించారు. ఉస్మానియా నుండి ఎం.ఏ (1963), కాకతీయ నుండి పిహెచ్‌డి పొందారు. ‘సామాజిక సాంస్కృతిక దృక్పథం – శ్రీశ్రీ’ అనేది సిద్ధాంత వ్యాసం (1982). కె. రామకోటి శాస్త్రి పర్యవేక్షకులు. వీరి గ్రంథం ‘తెలుగు కవిత – సాంఘిక సిద్ధాంతాలు’ – రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.

వీరి రచనలు – విమర్శ మౌలిక లక్షణాలు, అనువర్తిత విమర్శ, సాంఘిక విమర్శ, బయోగ్రఫికల్ విమర్శ, నవల కథానికా విమర్శ, చారిత్రక విమర్శ, సంప్రదాయ విమర్శ- అనే విభాగాలు చేయవచ్చు. 16 పైగా ప్రామాణిక గ్రంథాలు వెలువరించారు. సత్యసాయి బాబా భక్తులుగా ‘శ్రీ సత్యసాయి అవతార తత్త్వం లక్ష్యం’, ‘భగవాన్ శ్రీ సత్యసాయి దివ్యలీలా మకరందం’ వంటి గ్రంథాలు వెలువరించారు. విశ్రాంత వానప్రస్థ జీవితం ప్రశాంతినిలయం, పుట్టపర్తిలో గడుపుతున్నారు. అధిరోహణం, మహామౌనం వీరి ఖండకావ్యాలు. కవిత్వకళాతత్వం మరో గ్రంథం.

ఉద్యోగ జీవితం:

కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చేరకముందు ఆంధ్ర ప్రదేశ్ డిగ్రీ కళాశాలల్లో 1975-86 మధ్య తెలుగు శాఖాధ్యక్షులు. 1986లో కేంద్రీయ విశ్వవిద్యాలయం రీడరు. 1988 నుంచి ఆచార్యులు. 2007 నుంచి సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలలో గౌరవ ఆచార్యులు. 60 దాకా గ్రంథాలు వెలయించారు. గొప్ప వైణికులుగా ప్రదర్శనలిచ్చారు. జాతి విపంచీగానం – అనే జాతీయ కావ్యంలో భారతీయ సంస్కృతిని ఆవిష్కరించారు.

అ’పరిమి’త పాండితీ ప్రకర్ష:

పరిమి రామనరసింహం అమరావతిలో జన్మించిన (1946 జనవరి 23) అసాధారణ ప్రజ్ఞాశాలి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులుగా రిటైరయి హైదరాబాదులో స్థిరపడ్డారు. 37 సంవత్సరాల బోధన, పరిశోధనానుభవం. మైసూరులోని భారతీయ భాషా సంస్థలో 18 ఏళ్ళ అనుభవం. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 1985-2011 మధ్య వివిధ హోదాలలో 26 సంవత్సరాలలో సగభాగం ప్రొఫెసరు. అమెరికాలోని విస్కాన్సిన్, చికాగో యూనివర్శిటీలలో రెండేళ్ళు విజిటింగ్ ప్రొఫెసర్ అనుభవం ఉంది. నూజివీడు లోని రాజీవ్‌గాంధీ యూనివర్శిటీలో 2012-16 మధ్య వివిధ హోదాలలో పర్యవేక్షించారు.

విజయ విలాస శైలీ పరిశీలన వీరి సిద్ధాంత వ్యాసం. భాషా బోధనా సామాగ్రి, నిర్మాణం, శైలీ శాస్త్రం, నిఘంటు నిర్మాణం, ప్రాచీన సాహిత్యం వీరి విశేషకృషికి నిదర్శనాలు. విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖలో తొలిసారిగా కంప్యూటర్ ల్యాబ్ ఏర్పర్చి యంత్రానువాదం, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ వంటి కోర్సులు పెట్టించారు. నరసింహం గారు అన్నామలై విశ్వవిద్యాలయ లింగ్విస్టిక్స్ ఎం.ఏ.లో బంగారు పతక గ్రహీత. 30 గ్రంథాలు పరిశోధనాత్మకంగా ప్రచురించారు. 70కి పైగా సదస్సులలో పత్రాలు సమర్పించారు. అమెరికా, మారిషస్, జపాన్, సింగపూర్ విస్తృతంగా పర్యటించారు. పూర్వం 60 అష్టావధాన ప్రదర్శనలిచ్చారు. విశ్రాంత జీవనంలో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ పుష్కరకాలంగా గడుపుతున్న అపరిమిత సాహితీ వరివస్య వీరిది.

ఈ విశ్వవిద్యాలయ ఆచార్యులు యన్. యస్. రాజు గొప్ప పరిశోధకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here