[dropcap]”దే[/dropcap]వునికి పేర్లేమిటికి ఊర్లేమిటికి?
కులం ఏమిటికి మతం ఏమిటికి?
నేలపైన గీతలు గీసి గీతల లోపల
దేశాలన్ని, దేవులన్ని తయారు చేసి
‘టంకు’ వేసే మనిషి నిన్ని ఏమనాలి
దేవుడంటే… దేవుడే అంతే కదరా… ఇంతే కదరా…” అంటా ఏకనాదము వాయిస్తా వుండాడు నార్ల పల్లన్న.
నేను ఆయప్ప నాదానికి తాళం ఏస్తా తల గుంకాయిస్తా వుండా…
అట్లా తబుడు ఆడికి వచ్చిన మా వూరి గౌని కొడుకు నన్ని చూస్తా “రేయ్! పిల్లగా” అనె.
“అనా… నా”
“ఈడ.. రా… రా”
“చెప్పనా”
“ప్రేమంటే ఏం రా?”
“మీరే చెప్పాలన్న”
“పోని”
“నా”
“నువ్వు ఎవుర్నన్నా ప్రేమిస్తి వేంరా”
“అది… నా”
“చెప్పరా లత్తనా కొడకా (తిట్టు)”
“అది… అది… మీకే తెలియాలన్న”
“అహాహా! దానికేరా నువ్వు అట్లుండేది, నేను ఇంట్లుందేది”
“అనా… నా. నిన్ని ఒగ మాట అడగాలనా?”
“అడగరా”
“దేవుడు వుండాడానా?”
“వుండాడ్రా”
“వుండాడా… అంటే దేవుడు మగోడా? ఆడది కాదానా?”
“ఆ…”
“ఇబుడు చెప్పన ఎవడు లత్త నా కొడుకు” అంట్ని.
నన్ని మింగే మాద్రిగా చూస్తా ఆడనింకా ఎల్లీశా మా గౌని కొడుకు. అదే పొద్దుకి…
“తగులుడిగి పరతత్వ సందానమున యోగా
సాదన సేయవే మనసా…
బ్రహ్మాండమంతయు బయలవు నా మాట
బద్దమని తెలియవే మనసా…!” కైవారం తాతగారి మాట నార్ల పల్లన్న నోట పాటగా వినిపిచ్చె.
నేను ఆ పాటకి పల్లక్కినై పరవశిస్తిని.
***
టంకు = దండోరా