[box type=’note’ fontsize=’16’] తెలుగులో అక్షర దోషాలు, ఇతర తప్పులు లేకుండా ఎలా వ్రాయవచ్చో ఈ శీర్షిక ద్వారా తెలియజేస్తున్నారు శ్రీమతి నండూరి సుందరీ నాగమణి. [/box]
~
ఇంకొన్ని కథనాలు ఉంటాయి. ఇవి సాధారణంగా కథలలో తక్కువ పాత్రలున్నపుడు ముఖ్యంగా త్రికోణ ప్రేమకథలలో వాడేవారు.
ఉదాహరణకు ఈ కథ చదవండి.
గోపి చెప్పిన కథ:
రాధ నా ప్రాణం. కానీ ఈరోజు ఆమెను రవితో చూసినపుడు నాకు మతి పోయింది. ఉదయం లేచి ఎప్పటిలాగానే ఆఫీసుకి వెళ్ళాను. రాధ పసుపుపచ్చని చీర ధరించి వచ్చింది. ఎందుకో నాతో ముభావంగా ఉంది. మా బాసు రవితో చనువుగా ఉంటోంది. అసలు రాధ, నేను ఎలా ఉండే వాళ్ళం? (గతంలోకి వెళతాడు).
రాధ చెప్పిన కథ:
ఈ మధ్య గోపిని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. ప్రేమ ఉన్నచోట నమ్మకమూ ఉండాలి కదా. సాధింపులు ఎక్కువైపోయాయి. పెళ్ళికాక ముందే ఇలా ఉంటే మరి ఆ తరువాత? (ఇలా సాగుతుంది)
రవి చెప్పిన కథ:
గోపి మీద అసూయగా ఉంది. రాధను నా స్వంతం చేసుకోవాలి. ఎలా?
….. ఇలా కొనసాగుతుంది ఈ కథ. అన్ని పాత్రలు స్వగతం లోనే కథను చెబుతూ వెళతాయి.
ఈ మధ్య ఇలాంటి కథనాలు అంతగా రావటం లేదు.
కథనం ఏదైనా, ఏ పురుషలో చెప్పినా విషయం సూటిగా ఉండాలి. ప్రసంగ రీతిలో ఉండకూడదు. అలాగే క్లిష్టమైన సమాసాలు, గ్రాంథిక వాక్యాలు వ్రాయటం వలన చదివేవారికి పఠనం వేగంగా సాగదు. పాఠకుడు చదవకుండానే పేజీలు తిప్పేస్తాడు. కథనమెపుడూ సాధారణ భాషలో సరళంగా, వేగంగా సాగాలి. అప్పుడే పఠితలకు ఉత్సాహంగా ఉంటుంది.
అలాగే పెద్ద పెద్ద బోధనలు, జీవిత సత్యాలు, కొటేషన్లు ఎక్కువగా ఉపయోగించకూడదు. ఎప్పుడైనా అవసరాన్ని బట్టి ఫరవాలేదు కానీ కథలో విషయం కంటే ఇవి ఎక్కువైతే సోదిగా అనిపిస్తుంది.
రకరకాల జెనర్లు వ్రాయవలసి ఉంటుంది. క్రైమ్ కథ వ్రాసినపుడు వర్ణనలు పనికిరావు. కేవలం క్రైమ్ సంఘటన(లు) మాత్రమే కథలో ఉండాలి. అలాగే ప్రేమకథ అయితే ఆ ఇద్దరి ఎమోషన్స్, కొద్దిగా కుటుంబ పరిస్థితులు… ఇంతే! వేరే పాత్రల గురించి, సంఘటనల గురించి సమగ్రంగా అవసరం లేదు. హాస్య కథలో సీరియస్ నెస్ పనికిరాదు. కుటుంబ నేపథ్య కథలలో సునిశితమైన హాస్యం ఉండవచ్చు కానీ మోతాదు మించరాదు. ఈ కిటుకులన్నీ వ్రాస్తూ ఉంటే అనుభవం మీద అలవాటు అవుతాయి.
*