[dropcap]సూ[/dropcap]ర్యుడు ప్రకాశవంతంగా వస్తూ ప్రకృతిని మేలు కోల్పోతున్నాడు. సుభద్ర అప్పటికే ఆవుపాలు పిండి ఇంటిలోకి తెచ్చింది. కాఫీలోకి ఆవుపాలు ఇష్టం. దొడ్డిలో పిల్లల కోసం రెండు అవుల్ని పెట్టుకుని పాలు త్రాగడానికి, పూజలకి వాడుతారు.
తెల్లని బుల్లి దూడలు దొడ్డి అంతా చెంగు గెంగున పరుగెడుతూ ఉంటాయి. కాళ్ళకి మువ్వలు మెడలో గంటల బెల్టు పెట్టి అలంకరించారు. నుదుటన గంగ సింధూర నామము పెట్టి అలంకరిస్తారు. అందులో అవు దూడ అలంకరణతో మరింత అందంగా ఉంటుంది.
అపూర్వ ఆ ఇంటి కూతురు కూతురు, రెండవ కూతురు బిడ్డ. తొలి మనుమరాలు. అందుకే ఇంటిల్లిపాది ముద్దు చేస్తారు. పెద్దమ్మ పిన్ని అంతా కూడా ఇష్టపడి ఎంతో గారంగా చూస్తారు.
అపూర్వ అమ్మకి అపూర్వ పుట్టినప్పుడు సుస్తీ చేసింది. అప్పుడు అపూర్వని పెద్ద తల్లికి ఇచ్చి అమ్మను వైద్యానికి పంపారు. అందుకని అపూర్వ పెద్ద తల్లి దగ్గర పెరిగింది. ఆవు పాలు తల్లి పాల వంటివి, మంచి ఆరోగ్యం అని అవును కొత్తది కొన్నారు. అప్పటినుంచి అపూర్వ ఆవు పాలు తాగి పెరిగింది.
తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉండే అపూర్వకి పెంకితనంగా ఉండేది కాదు. పెద్దవాళ్ళు చెప్పినట్లు వినేది. చక్కగా పెద్దల మాటలు వింటూ ఉండేది. మాటలు తక్కువ, వినికిడి ఎక్కువ. ప్రశాంత వదనంతో పెద్ద ముక్కు, వెడల్పు నోరు, దొండ పండు లాంటి పెదిమలతో పిల్ల చూడ ముచ్చటగా ఉంటుంది. ఎవరైనా పలకరించి “రా అమ్మా” అంటే వెళ్ళేది కాదు, ఇంట్లోకి పరుగెత్తి అమ్మమ్మ కొంగులో దూరిపోయేది. “మా మనుమరాలు ఎవరూ రమ్మన్నా రాదు, దానికి సిగ్గు భయం” అని అమ్మమ్మ దగ్గరకు తీసుకుని ఒడిలో కూర్చోబెట్టుకునేది. అపూర్వ పెరుగుదల అంతా ఆమే చూసింది. భువనేశ్వరి అమ్మమ్మ ఒడిలోనే ఎక్కువ సమయం ఉండేది.
బాల్యం నుంచి చంకన పెట్టుకుని పువ్వులు కొయ్యడం పాలు కాచడం వంటి పనులు చేసేది. చిన్న చప్పుడు కూడా లేకుండా లేచినా సరే వెనకాల లేచి వచ్చేసి కూర్చునేది. “ఇప్పటి నుంచి ఎందుకు? పాలు పితికి కాచాక లేపుతాను” కదా అనేది. కానీ అపూర్వ వినేది కాదు.
కొంచెం మాటలు బాగా వచ్చాక అమ్మమ్మ పాడే పద్యాలు విని పడుతున్నట్లు పెదాలు కదిపేది. ఇంకొంచెం ఎదిగాక మాటలు వచ్చి గొంతు కలిపి మాటలు, పాటలు అన్నీ కూడా పలుకుతూ ఉండేది. ఆలా పద్యాలు పాటలు పలికేది. అలా చిన్నతనం నుంచి అన్ని కూడా చక్కగా నేర్చుకున్నది. పిల్లల్ని ఎలా పెంచితే అలా పెరుగుతారు, ఏది నేర్పితే అది నేర్చుకుంటారు. అందుకే లేలేత వయసులో పిల్లలని జాగ్రత్తగా పెంచాలి. మంచి అలవాట్లు చెయ్యాలి.
అపూర్వ తాత సూర్యనారాయణ పేరున్న ఆయుర్వేద వైద్యులు. ఆయన ఆ రోజుల్లో ఉచిత వైద్యం చేసేవాడు. డబ్బు కోసం కాక ప్రజా సేవగా చేసేవారు. ఉన్న వాళ్ళు ఏదో ఒక రూపంలో ముట్టచెప్పేవారు. అది కూడా పుచ్చుకోవడానికి ఇష్టత చూపేవారు కాదు. కానీ పట్టుపట్టి ఏదో ఒక రూపంలో బహుమతిగా ఇచ్చేవారు. కొందరికి పాత బియ్యము, పచ్చళ్ళు కూడా పథ్యానికి పెట్టేవారు. పొరుగూరు వారికి అయితే భోజనం కూడా పెట్టేవారు. అలా ఆయన గొప్ప పేరు పొందారు.
వైద్యుడు అని వచ్చిన వారికి ఆదరణ ఆప్యాయత చూపి మాటలతో భయం పోగొట్టి మందులు తక్కువ వాడి మానసిక ఎదుగుదలకు తోడ్పడుతూ, రోగం నయం చేసేవారు. అంతేకాదు ఊళ్ళోకి కళాకారులు, పండితులు, స్వామీజీలు, తోటి వైద్యులు వచ్చినా అందరినీ ఎంతో బాగా సత్కరించి పంపేవారు. ఒక్కొక్క సారి ఇంట్లోనే వెనుక భాగంలో కుర్చీలు షామియానా వేసి కార్యక్రమాలు చేసేవారు.
అప్పుడు అపూర్వకి బంగారు బొమ్మలా వేషం వేసి ప్రార్థన చెయ్యడం, పుష్ప గుచ్చాలు ఇవ్వడం వంటివి అలవాటు చేసారు. అలా చక్కగా ఎన్నో విషయాలు చిన్నతనం లోనే నేర్చుకున్నది. సూర్యనారాయణ గారు ఇంటికి ఎదురుగా ఒక పాఠశాల ఉండేది. అది కాస్తా బాగా శిథిలమయ్యింది. అందుకని “ఎక్కడైనా కొత్త స్థలం తీసుకుని కొత్త స్కూల్ కట్టించే దాతను చూడండి. లేదంటే స్కూల్ ఎత్తివేస్తారు. మీకు ఉద్యోగాలు వేరే ప్రాంతానికి వెయ్యవచ్చు, లేకపోవచ్చును” అని పంచాయితీ వారు మాస్టార్లతో అన్నారు. అప్పుడు అంతా పంచాయితీ వారి ఆధీనంలో ఉన్నది. ఆలా అనేటప్పటికి మాస్టర్లు చాలా బాధపడ్డారు. అప్పుడు సూర్యనారాయణ గారిని అడిగితే ఆయన దయతో ‘ఇంత మంది జీవితాలకు ఒక ఆధారం చూడాలి’ అన్న సంకల్పంతో కొత్త స్కూల్ కట్టించి ఇచ్చారు.
ఆ స్కూల్ పిల్లల మంచి నీళ్ళు తాగుతారని, ఒక బావి ఉంటే దానికి చుట్టు గోడ కట్టకుండా రెండు చాదలు, నాలుగు గ్లాసుల పెట్టించి ఉంచేవారు. ఆటల సమయంలో పిల్లలు కొందరు అడిగి దొడ్డి లోని ఉసిరి కాయలు, మామిడి కాయలు, నారింజ కాయలు, సీతాఫలం పళ్ళు కొట్టుకుని కోసుకుని పట్టుకెళ్లేవారు. వారిని ఎవరూ అడ్డుకోలేదు, ఇంకా చెప్పాలంటే పాలేరు చేత కోయించి ఇచ్చేవారు.
ఎంతో దాన గుణం దయా గుణం ఉన్నవారాయన. మనుమరాలు అపూర్వ కోసం ఆ స్కూల్ కట్టించారు అంటారు కానీ ఎంతమందికో ఉద్యోగాలు నిలిచాయి. అపూర్వకి అక్షరాభ్యాసం ఎంతో ఘనంగా చేశారు. క్లాస్ మాస్టర్‌కి, హెడ్ మాస్టర్‌కి జావారు పెట్టారు. స్కూల్ అంతా పిల్లలకి మిఠాయి ఉండలు పంచి పెట్టారు. క్లాస్ పిల్లలకి పలక బలపం పంచారు. ఎంతో ఘనంగా ఆ స్కూల్ గురించి మాట్లాడుతూ డీఈఓ గారు సూర్యనారాయణ గారికి సన్మానం చేశారు
అంతర్ పాఠశాలల పోటీలో ఆ స్కూల్ నుంచి పోటీకి పిల్లలను తయారు చేసి పంపమని వారికి డాన్స్ పాటలు నేర్పమని, డాన్స్‍౬లు చేయించమని హెడ్ మాస్టర్ వచ్చి అపూర్వ పెద్దతల్లిని అడిగారు. అపూర్వతో పాటు ఇంకా ఎనమండుగురు పిల్లలకి డాన్సులు దేశ నాయకుల గురించి రాసిన పాట గ్రూప్ డాన్స్ చేయించారు. అపూర్వ చేత ఇంకో ఎమ్మెల్యే గారి అమ్మాయి చేత స్వాగతం గీతం చేయించారు. నండూరి సుబ్బారావు గారి ఎంకి పాట ఇంకో వ్యాపారవేత్త అమ్మాయి చేత చేయించారు. ఆ స్కూల్‌కి ప్రథమ బహుమతి లభించింది. ఎంపి చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు.
అపూర్వ పెద్దతల్లికి డాన్స్ కొంచెం వచ్చు. అమె బుర్రకథ కూడా స్కూల్‌లో చదివేటప్పుడు నేర్చుకున్నది. సంగీతం సాహిత్యంలో కూడా బాగా ప్రవేశం ఉన్నది. కనుక అపూర్వకి అన్ని ఇంటిలోనే నేర్పేవారు. ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో విద్య బాగుండేది. ధనవంతులు సహితము పిల్లలను చేరిపించి చదివించేవారు. అలా అపూర్వ అతి గారాబంగా పెరిగింది.
మేడ ఎదురుగా స్కూల్. ఆ ప్రాంతంలో తాత గారిది ఒకటే మేడ ఉండేది. మేడ వారి మనుమరాలు అని పిలిచేవారు. ఎదురు స్కూలే అయినా సరే, పాలేరు దగ్గర ఉండి అపూర్వని తీసుకెళ్లేవాడు. మళ్లీ స్కూల్‍లో భోజనం సమయానికి వెళ్లి తీసుకు వచ్చేవాడు. అమ్మమ్మ అమ్మ కలిపి కంచం పెట్టి గోరు ముద్దలు తినిపించేవారు. ఎంతో ప్రేమ అభిమానం. అయింటి పెద్ద మనుమరాలు కూడా. ఇంటికి ఎవరూ వచ్చినా పరిచయం చేసి దీవించమనే వారు. కొన్నిసార్లు ఇంటికే మాస్టర్లు వచ్చి పాఠాలు నేర్పేవారు. బాల్యం అంతా ప్రాథమిక పాఠశాలలో మహారాణిలా గడిచింది.
***
అపూర్వ జీవితం హైస్కూల్ స్థాయిలో కూడా గొప్పగా సాగింది. సంగీతం పోటీల్లో మంచి పేరు వచ్చి బెస్ట్ సింగర్‍గా సెవెంత్ క్లాస్‌లో అవార్డులు పుచుకున్నది. భువన విజయం నాటకంలో రాజనర్తకీమణుల వేషం వేసిన పిల్లలకి నృత్యం నేర్పి పాట పాడి కార్యక్రమం చేయించింది.
అపూర్వను హైస్కూల్ చేర్పించడానికి తాతగారు ఆ స్కూలుకి వెడితే అక్కడ హెడ్ మాస్టర్ “మీ మనుమరాలి కోసం స్కూల్ కట్టించారు. మాకు ఒక షెడ్ వేయించి ఇవ్వండి, సైకిళ్ళు పెట్టుకోవడానికి” అని అడిగారు. “అప్పుడు ఆ టీచర్ల ఉద్యోగాలు పోతాయని స్కూల్ కట్టించాను, ఇప్పుడు షెడ్ కదా” అని చిరునవ్వు నవ్వారు తాతగారు.
ఎలాగైతేనేమి ఇంటికి దగ్గరలో హైస్కూల్ అయినా రిక్షాలో పంపేవారు. ఒక్కోసారి వెళ్లి దిగబెట్టి బజారు పని చూసుకుని వచ్చేవారు. హై స్కూల్‌లో డాన్స్ చెయ్యడానికి ఇంట్లో ఒప్పుకోలేదు, అందుకని పాట పాడి బహుమతులు తెచ్చుకున్నది.
ఇంటర్ స్థాయికి వచ్చింది. ఇంటికి కొంచెం దూరం లోనే కాలేజి. అక్కడ కూడా ఇదే సమస్య వచ్చింది. కొత్త కాలేజి. సూర్యనారాయణ గారి మనుమరాలు చేరడానికి అప్లికేషన్ పెట్టింది. సైన్స్ చదివితే డిసిప్లిన్ వస్తుందని అపూర్వ నమ్మకము, అలాగే జాయిన్ అయింది. ఇంటర్వ్యులో ప్రిన్స్‌పాల్ మార్కులు చూసి బహుమతుల సర్టిఫికెట్‌లు చూసి మురిసిపోయారు. కాలేజి కొత్తగా వచ్చింది, రూమ్స్ అంత బాగుండేవి కాదు. అందుకని “పేరెంట్స్ నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నాము, తాతగారికి చెప్పి నువ్వు కూడా డొనేషన్ కట్టు” అని చెప్పారు. అపూర్వ ఎంత తెలివైనదైనా ఈ సమస్య వస్తోంది.
సరే ఏదో కొంత డబ్బు డొనేషన్ ఇచ్చారు. ఒకసారి అవసరానికి స్కూల్ కట్టించడం వల్ల అంతా అపూర్వ తాతగారిని ఏదో ఒకటి సహాయం అడుగుతూనే ఉండేవారు. ఆయన అసలే దానకర్ణుడు, ఆవిడ అన్నపూర్ణ. ఇంటికి వెళ్ళిన వారిని భోజనం చేస్తే కానీ వెళ్ళ నిచ్చేది కాదు. ఆ ఇంట్లో ఎందరో కళాకారులు, పండితులు, స్వామీజీలు, మాతాజీలు, సాహితీవేత్తలు ఆ ఇంట అడుగు పెట్టి అతిథ్యం పొంది సన్మానం పొంది దీవించి వెళ్ళేవారు. ఎవరూ వచ్చినా అపూర్వను పిలిచి పరిచయం చేసి దీవించమనడం అలవాటుగా మారింది.
డిగ్రీలో కూడా బెస్ట్ పెయింటర్, బెస్ట్ సింగర్ అవార్డ్ పొందింది. అలా అపూర్వ అపురూపంగా అన్ని కళలు సొంతం చేసుకుని ఎన్నో బహుమతులు అవార్డులు పొందింది. అయితే ఆడపిల్ల ఉద్యోగం చేస్తాను అంటే “వద్దు నిన్ను ఒక్కర్తిని వేరే చోటికి పంపము” అన్నారు. “పోనీ అమ్మా నాన్న కూడా ఉంటే సరీ” అంది. “వద్దు అమ్మా, మీ అమ్మకి ఓపిక లేదు. మీ నాన్న పట్నం జీవితం ఒప్పుకోడు” అన్నారు.
***
అపూర్వ తల్లి గురించి చెప్పాలి.
అపూర్వ తల్లి తండ్రులు పిల్లలను ఎంతో గారంగా పెంచారు, అంతే కాదు అల్లుళ్ళు అంతా దగ్గిర వాళ్ళే. పిల్లని ఎప్పుడు చూడాలని ఉంటే అప్పుడు పంపెయ్యలి. ఆ విధంగా మాట్లాడుకుని వేలు విడిచిన బావమరిదికి చేశారు.
అతను ఆయుర్వేదం డాక్టర్. అల్లుడు కూడా చేతికి అంది వస్తాడని ఆశ.
అంతా కావలసిన వారే, దగ్గిర వాళ్ళు. అందరికీ ఘనంగా సత్కారం ఐదు రోజుల పెళ్లి. హంస కారులో ఊరేగింపు. వండిన వంటకం వండకుండా పెసరట్టు ఉప్మా, మిఠాయి, ఇడ్లీ, వడ, సాంబారు, మైసూర్ పాక్, దోసె, రవ్వ దోసె, పుణుకులు, కాజపురి కూర, గులాబ్ జామున్లు, చపాతీ కూర, జాంగ్రీ, ఒక స్వీట్ తప్పనిసరి… ఇలా అల్పాహారం ఉండేది. ఇంకా భోజనల్లో ఎన్నో రకాలు వడ్డించారు. పెళ్ళి ఘనంగా చేశారు, పదేళ్ల పాటు మళ్లీ ఎవరూ అలా చెయ్యలేదు.
పిన్ని వరసే ఆడపడుచులు. అంతా అక్క బావ అంటూ కావలసినవి అడిగి మరీ పట్టుకెళ్లేవారు. ఎంత దగ్గరి వాడైన అల్లుడు అంటే గడ్డి పరక కూడా లేచి ఎగురుతుంది సామెత ప్రకారం. పెళ్లి అయ్యాక గొడవలు పెట్టాలనే మనస్తత్వం ఉన్న బంధువులు అంతా ఒకటి అయ్యి అలక పాన్పు అంటూ గొడవ పెట్టారు. అది అయ్యాక అప్పగింతల దగ్గర ఒక గొడవ. ‘చీరలు నచ్చలేదు వేరేవి తెప్పించండి’ అంటూ. కొట్టు నుంచి బట్టలు తెప్పించారు నచ్చినవి ఏరుకోమన్నారు. అలా పెళ్లిలో ఎన్నో అక్కరలేని గొడవలు పెట్టి, తిన్నవారు కూడా అల్లరి చేసి వెళ్లారు.
పెళ్లి కొడుకు అతని తల్లి ఉన్నారు, ఒక ఆడపడుచూ ఉన్నది. అప్పటికి నాలుగేళ్లుగా ఈ సంబంధం నలుగుతోంది.
“నేను పిల్లని అత్తింటికి పంపను, మీ కొడుకు వచ్చి నా దగ్గరే ఉండాలి. ఆయుర్వేదం చదువు ఉన్నదని ఆశ” అన్నాడు.
దానికి వాళ్ళ అన్నదమ్ములు, తల్లి, అక్క చెల్లెళ్ళు అంతా ఒప్పుకున్నారు. నలుగురు అన్నలు, ముగ్గురు అక్కలు అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. పిల్లలు కూడా ఉన్నారు. ఆఖరి వాడు సూర్య కిరణ్.
అల్లుడు తల్లికి చాలా ఇష్టం. ఆఖరి కోడలు మనవరాలు అయితే తనకి నచ్చినట్లు వండి పెట్టి, చూసుకోమని అడగవచ్చు అని ఆశ. కోడలు కాక పోయినా, కోడలు తల్లి తనకి వరుసకి కూతురు కనుక పట్టు పట్టి ఈ పెళ్లి చేసింది.
అయితే ఇక్కడ ఒక తిరకాసు ఉన్నది. పెద్ద అల్లుడు తన కూతుర్ని చెయ్యాలని పట్టుపట్టాడు. కానీ ఆ పిల్ల వయసులో పదేళ్లు చిన్నది. అందుకు సూర్య కిరణ్, తల్లి కూడా ఒప్పుకోలేదు.
కారణం అల్లుడు తన కూతుర్ని బాధలు పెట్టేవాడు. ఐదు ఎకరాలు పొలం, వంద కాసులు బంగారం పెట్టి పెళ్లి చేసింది. అయితే అతనికి అప్పట్లో యాబై ఏకరాలు ఉన్నాయి. ఊరు ప్రెసిడెంట్ చేసేవాడు. అందుకని అపూర్వ బామ్మ అపూర్వ తల్లిని ఏరీ కోరి చేసుకున్నది, కానీ పెళ్లి కాగానే అల్లుడు రక రకాల కోరికలు కోరుతూ అల్లరి పెట్టాడు. దానితో సూర్యనారాయణ గారు “పిల్లని ఇప్పుడిప్పుడే పంపాను. అల్లుడు తల్లి ఇక్కడే ఉండండి” అని చెప్పారు. అపూర్వ బామ్మ వప్పుకుంది.
కానీ బావగారు మాత్రం “అక్కడ వ్యవసాయం ఎవరూ చూస్తారు? కేవలం అయుర్వేదం కుదరదు” అంటూ గొడవ చేశాడు. ఇంకా చేసేది ఏముంది? అత్తగారు కొన్నాళ్ళు ఉండి కొడుకుకి సర్ధి చెప్పి పెద్ద కొడుకు దగ్గరికి వెళ్లి పోయింది. కిరణ్ కొన్నాళ్ళు మామగారు దగ్గర కొంత వైద్యం నేర్చుకుని తన అన్నకి వంట్లో బాగా లేదని వెళ్లే అక్కడే ఉండిపోయాడు. అప్పటికే అపూర్వ కడుపున పడింది.
బెంగ అనారోగ్యం రెండు కలిసి ఆపూర్వ పుట్టేటప్పటికి మరీ నిరాశ నిస్పృహలతో ప్రసవం కష్టమయ్యింది. అందుకే అపూర్వ తాత గారి దగ్గర అమ్మమ్మ దగ్గర పెరిగింది.
పెద్ద తల్లి, పిన తల్లి ఎంతో గారం చేసేవారు. అపూర్వ తల్లి మాత్రం నిర్లిప్తంగా ఉండేది. తండ్రి వస్తూ వెడుతూ ఉండేవాడు. నాలుగు రోజులు ఉండేటప్పటికి అన్నగారు మనిషి చేత కబురు పంపేవాడు.
ఏది ఏమైనా అపూర్వ జీవితం ఎంతో గొప్పగా జరిగింది. తండ్రి ప్రేమ అంతగా లేదు కానీ తాత ఇంట్లో మహారాణిలా పెరిగింది. అటువంటి పిల్ల చేత ఉద్యోగం ఎందుకు చేయిస్తారు? పి.జి. కూడా ప్రైవేట్‌గా చదివింది కళల్లో ప్రావీణ్యత సాధించింది. ఆడపిల్ల అనగానే డిగ్రీ కాగానే పెళ్లివారు ఎంతో మంది బంధువుల్లో మా అబ్బాయికి చేసుకుంటాము, మా అబ్బాయికి చేసుకుంటాము అన్నారు. కానీ వాళ్ళల్లో విదేశీ సంభందాలు ఎక్కువ ఉన్నాయి. ఎంత దగ్గరి వారైన బంధువులైనా, “మేము విదేశాలకి పంపము. మాకు ఒక్క మనుమరాలు, దానిని తల్లిని చూసేవారు కావాలి” అని చెప్పి పంపేవారు.
“పిల్ల భవిష్యత్తు చూడాలి కానీ, తల్లిని తండ్రినీ చూసే అల్లుడు దొరకడు” అని అంతా నిర్ధారించారు.
అన్నదమ్ములు లేరు. ఒక్క పిల్ల, తల్లిని చూడవద్దా ఇది ప్రశ్న.
అపూర్వ అందచందాలు, ఆస్తి చూసి కొందరు ఈర్ష్య కూడా పడ్డారు. మళ్లీ తండ్రిని రంగంలోకి దింపారు. “నా కొడుక్కి చేస్తే నిన్ను చూస్తాము, నీ పెళ్లాన్ని చూస్తాము. పిల్లని ఒప్పించి పెళ్లి చెయ్యి. కన్యాదాతగా నీకు మేము గౌరవం ఇస్తాము” అన్నారు.
ఇంకేముంది? కిరణ్ కూతురిని ఒప్పించడానికి తల్లి తాత మీద ఎన్నో కథలు అల్లి పిల్లని పెళ్లికి ఒప్పించాలని చూసాడు. కానీ అపూర్వకి చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ తెలియదు, తాత మాత్రమే తనని చూసాడు అని విజ్ఞతతో ఆలోచించింది. అటు జన్మ నిచ్చిన తండ్రి అయినా ఏనాడు బాధ్యత తీసుకోలేదు, అంతా తాత, పెద తల్లి చూశారు. ఎన్ని చూసి, ఎంత కష్టపడితే ఒక ఆడపిల్ల ఈ సమాజంలో పెద్దదిగా పెరుగుతున్నది ఆలోచించాలి.
ఎవరైతే నిన్ను నిన్నుగా చూసి ఆత్మీయత అభిమానం పంచి అర్థం చేసుకుని ఆదరిస్తారో వాళ్ళని జన్మలో వదులు కోకూడదు. ఈ విశాల ప్రపంచంలో అతి కొద్ది మంది మాత్రం మనస్ఫూర్తిగా అభిమానించి సహకరిస్తారు. మనతో మాట్లాడే మాటలు కేవలం మాటలుగా తీసి పారెయ్యకూడదు. దానివల్ల మనుష్యుల మధ్య దూరాన్ని దగ్గర చేస్తాయి. ఆ మాటలు వల్లే మనిషిలో ఆత్మీయత పెరుగుతున్నది. అదే అమృతాన్ని నింపుతుంది.
అయితే మధ్యవర్తులు లేని పోని మాటలు పుట్టించి వైరం తేగలరు. అందుకే మాటలు ఎంతో పదిలంగా ఉండాలి. మనం జీవితంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మ కూడదు అని తెలుసుకోవడం చాలా కష్టం. ప్రతి మనిషి అవకాశాన్ని బట్టి మారుతూ ఉంటారు. వాళ్ళ అవసరం కొద్ది కబుర్లు చెపుతారు. అందులో నిజమెంత అబద్దమెంత తెలుసుకునే లోగా జీవితం చేజారిపోతుంది.
“జీవితంలో మనం ఎవరిని కలవాలి, ఎవరితో జీవించాలి అన్నది కాలం నిర్ణయిస్తుంది. మనం ఎంత మంచిగా ఉన్న అవతలి వారు అర్థం చేసుకోరు. అదే విధి వ్రాత. మనకెవరు కావాలేనేది మన హృదయం నిర్ణయిస్తుంది, కానీ మన మనసులో ప్రేమ మాటలతో చెప్పినా కొందర్ని నమ్మలేరు. కారణం జీవితంలో ఎదుర్కొన్న ఎదురు దెబ్బలు వల్ల ఎవర్ని నమ్మలేరు. మన మాటలు ప్రవర్తన అంతా ఎంత బాగున్నా వంకలు పెడతారు” అని అపూర్వ తల్లి తన అనుభవాన్ని కూతురికి చెప్పింది.
దాంతో అపూర్వను బంధువులు ఎవరూ చేసుకుంటానన్న తల్లిని చూడాలి తండ్రిని చూడాలి అన్న నేపథ్యంలో అపూర్వ పెళ్లి విషయంలో ఆలోచనలో పడ్డారు.
అపూర్వ పెళ్లి చెయ్యడం మహా కష్టమయ్యింది. విద్యలో సరస్వతి, డబ్బులో పర్వాలేదు. ఒక రూపాయి ఉంటే ఆ రూపాయ కూడా అపూర్వదే అనే ఉద్దేశంతో అపూర్వ తండ్రిని పట్టుకుని చాలా మంది బంధువులు ఎంతో ఆదరణ చూపేవారు. “వాడికేమి డబ్బున్న పెళ్ళాం. బంగారు బొమ్మ లాంటి పిల్ల” అనేవారు. “ఎవరితో పెళ్లి చేస్తావో కానీ నిన్ను చూసే ఇంట పెళ్లి చెయ్యి” అనేవారు.
అపూర్వ పెళ్లికి బంధువులలో చాలా మంది ఒకరికి తెలియకుండా ఇంకొకళ్ళు పిల్లని పెళ్ళి చెయ్యమని కబుర్లు మధ్యవర్తుల ద్వారా సందేశాలు పంపుతూ ఉండేవారు.
అయితే సూర్యనారాయణ గారు పిల్ల విషయంలో చేసిన తప్పు మనుమరాలు విషయంలో చెయ్యకూడదని బంధువుల మాటలు ఎంత తియ్యగా ఉన్నా పెళ్లి విషయంలో ఆలోచనలో పడ్డారు.
పిల్లని ఉద్యోగంలో పెడితే ఈ బంధువులు అక్కడ చేరి దాన్ని పీడిస్తారు అని భావించి పిల్లను ఉద్యోగంలో పెట్టడానికి ఇష్టపడలేదు.
ఇలాంటి ఆలోచనలతో పెళ్లి ఎవరికి చెయ్యాలి అనే మీమాంస వచ్చింది. జాతకాలు గ్రహాలు అన్ని కూడా చూపించారు. ‘మంచివాడే వస్తాడు’ అని చెప్పేవారు. బంధువులయితే, “ఈ పిల్లని ఎవరికి చేస్తారు? విదేశాలు పంపరు” అంటూ నోళ్ళు తెరుచుకుని ఉన్నారు. కొందరయితే “పిల్లను చేసుకుంటాం కానీ తల్లిని తండ్రిని ఎవరు చూస్తారు?” అన్నారు.
ఇది నేటి సమాజంలో ఒక్క పిల్ల ఉన్న తల్లి తండ్రులు పడుతున్న వ్యథ. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ సమస్య ఇలాగే ఉన్నది.
అయితే అపూర్వ కళల గురించి తెలుసుకున్న ఒక సంస్థ యజమాని తన కొడుక్కి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు.
మధ్యవర్తి ద్వారా కబురు పంపారు. అయితే మాటలు వేరు చేతలు వేరు. “పెళ్లి తరువాత తల్లిని తండ్రిని చూడాలి ఇందుకు సమ్మతమేనా?” అని కబురు పంపారు.
“కిరణ్‌కి ఒక్క కూతురు. కొడుకులు లేరు కనుక, ఆస్తి కొంత నా కొడుక్కి ఇవ్వాలి. వాడి మంచి చెడులు మేము చూస్తాము. ఆడపిల్ల వల్ల కాదు, అల్లుడు వల్ల కాదు. అల్లుడు ఎందుకు చూస్తాడు” అంటూ కిరణ్ అస్తి అన్నగారు కొడుకు పేర కొంత రాయించాడు.
ఈ రోజుల్లో మనుష్యులు వచ్చి అవకాశం ఇచ్చినా నమ్మడానికి లేదు. మాటలు చేతలకి వచ్చేటప్పటికి మారుతున్నాయి. ఈ విషయం ఎవ్వరూ చెప్పలేరు! విధి నిర్ణయం ఎలా ఉంటే అలా అని సర్ది చెప్పుకోవాలి అనుకున్నారు.
కొందరు జీవితాల్లో తల్లి తండ్రి సమస్యగా మిగులుతారు. పిల్ల కావాలి, పిల్ల ఆస్తి కావాలి కానీ పుట్టింటి బాధ్యత కూడదు. అప్పగింతల నాడే అన్ని మరచి అత్తింట బాధ్యతలు అందిపుచ్చుకోవాలి. పుట్టింటి వారికి కప్పు కాఫీ కూడా ఇవ్వకూడదు. ఇలాంటి పరిస్థితి ఎందరో ఆడపిల్లలు ఎదుర్కుంటున్నారు. అలసి అడిగి అడిగి అతుక్కునీ ఉండి పోతున్నారు. అక్కడే కదా జీవితము. ఇది ఆడపిల్ల పరిస్థితి. ఎందరికో ఇది అనుభవము.
పెద్ద వాళ్ళు “తల్లి తండ్రిని పక్కన పెట్టు, పిల్ల పెళ్లి సంగతి చూడు” అని కొందరు సలహా కూడా ఇచ్చారు.
అపూర్వ పరిస్థితులు ఆలోచించి తన కళలను గుర్తించి చూసుకుంటామన్న సంబంధం కనుక తనకి ఎటువంటి సమస్య ఉండదు. ‘తండ్రిని అన్నదమ్ములు చూస్తారు, తల్లి మాత్రమే బాధ్యత’ అని చెప్పింది.
ఆ ప్రకారం “కొడుకు ఎంబీఏ చదువు చదివి తండ్రితో పాటు బిజినెస్స్ చూస్తున్నాడు; మాకు మీ అమ్మాయిని చేసుకోవం ఇష్టమే. మా అక్క అనుకుని వాళ్ళ అమ్మని కూడా మేమే చూస్తాము” అని నచ్చ చెప్పి పెళ్లి చేశారు.
బంధువులు పెళ్లికి వచ్చి వంకలు పెట్టారు. ఆ పిల్లాడు తరుపు వారికి గొడవలు పెట్టాలని చూశారు, కానీ విజ్ఞత కల మగపెళ్ళి వారు బయటి వాళ్ళు చెప్పిన మాటలు పక్కన పెట్టి పెళ్లి చేసుకుని పిల్లతో పాటు తల్లినీ కూడా తీసుకెళ్లారు. అది వాళ్ళ సంస్కారము. “తెల్లవారితే ఎంతో మంది మా ఇంట్లో భోజనం చేస్తారు, అలాంటిది మా కొడుక్కి పిల్లనిచ్చిన తల్లికి పట్టెడు మెతుకులు పెట్టలేమా?” అని అడిగారు. కూతురితో పాటు సారె మాదిరి తల్లిని తీసుకెళ్లడం చూసి కొందరు ఈర్ష్య పడ్డారు.
విధి గొప్పది. ఎందరు ఎన్ని అడ్డంకులు పెట్టినా అపూర్వ పెళ్లి జరిగింది. దీనికి బంధువులు చాలా అక్కసు వెళ్ళగక్కారు. ఆస్తితో పిల్ల ఇంకా ఆస్తి ఉన్న ఇంటికి చేరింది.
కన్న తండ్రికి జ్ఞానోదయం అయింది. చిన్న పిల్లవాడు అయినా అల్లుడు విజ్ఞతగా మామగారిని కూడా తెచ్చుకుని తమ దగ్గరే పెట్టుకున్నాడు.
ఎన్నో తరాల అంతరాలు సంప్రదాయాలు మనుషుల మనస్సులో పాతుకు పోయాయి. బావమరిది లేని సంబంధం, ఒక్క కూతురు అయితే మాత్రం తల్లి తండ్రి బాధ్యత ఎవరూ చూస్తారు అని బంధువులు అన్న మాటలు విని చాలాకాలం విసిగి పోయిన సమయంలో పన్నీటి జల్లులు కురిసినట్లు ఈ సంబంధం కుదిరి పెళ్లి అయింది.
‘పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు’ అన్న శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన సన్నాయి మేళం వారు వాయిస్తున్న సమయంలో – ఆనందంగా తలంబ్రాలు పోసుకున్నారు. అసలే అందాల అపరంజి బొమ్మ అపూర్వ ముత్యాల పూల మెరిసే పూల తలంబ్రాలు బియ్యం తలంబ్రాలు కలిసి ఎంతో అందంగా పోసుకున్నారు.
సాత్విక్ పేరుకి తగ్గటే సాత్వికంగా ఉంటాడు.
ఏమి? రక్త బంధం లేకపోయినా ఆత్మీయ బంధంతో మనుష్యులు దగ్గర అవుతారు. పెళ్లి అత్యంత ఘనంగా మగ పెళ్లి వారే అన్ని చూసుకున్నారు. నేటి తరంలో యువత తల్లి తండ్రి మాదిరే అత్తమామలను చూడటానికి ముందుకు రావడం అభినందనీయము. ఈ తరంలో ఎంతో మంది యువకులు కొడుకుల మాదిరి అత్తమామలని చూస్తున్నారు. కోడళ్ళు కూడా కూతురు మాదిరి ఇంటి బాధ్యతలు అత్త అని కాకుండా తల్లిలా చూస్తున్నారు.
ఆధునిక యుగంలో యువతలో ఈ మార్పు కూడా చాలా మందిలో కలిసి వస్తోంది. పెద్దల్ని గౌరవించడం నేర్చుకున్న యువత జీవితంలో ఎప్పుడూ ఉన్నత శిఖరాలు నధిరోహిస్తారు.
శాంతి శుభమ్