[dropcap]న[/dropcap]హుషుడు నోవాల నుంచీ
ఎకిలిస్ దాకా
తెలియని పాద ముద్రలతో
సముద్రమెప్పుడూ కాలంలా ప్రాచీనమే
కాదని అల అలకూ నీకొక భాష్యం తోచవచ్చు
సముద్రం నీకొక ఆనంద కెరటం లాగో
ఆకాశ తీరాలకు నిను కలిపే గాజు వంతెన లాగో
నిత్య నూతనంగానో అనిపించవచ్చు
ఒడ్డున నిలబడి
అలలపై మెరిసే ఉదయాస్తమయ సంధ్యలనో, మండుటెండనో
చూస్తున్న నిన్ను
ఉన్నట్టుండి అది తాత్త్వికుడినో కవినో చేయవచ్చు
నాకయితే నన్ను తనముందు నిలుపుకోకుండా కూడా
నా గుండె గుహలో నిండిన దాని ఘోషతోనే
అనేక జన సంద్రాలను చూపగలదీ క్షార జల సంద్రం
గహన దుఃఖాన్ని మోసుకొచ్చి
నీలిరంగు నీటితివాచీలా గుండె ముందట పరుస్తూనే వుంటుంది
తన తడి అంచులదాకా
తరాలనుంచీ విస్తరించిన విషసమూహాల మధ్య
కుతంత్రాల కుట్రల దురాక్రమణల యుద్ధాల యుగాంతాల మధ్య
భూసముద్రపు సొరచేపలమధ్య
అవినీతి తిమింగలాల మధ్య
గుక్కెడు బతుక్కై తపించే
నేనెలాటి అల్ప మత్స్యాన్నో
ప్రతి అలల చప్పుడు మధ్యా
చూపుతూనే వుంటుంది ఈ సముద్రం!