మంత్రం మహిమ

0
3

[dropcap]సే[/dropcap]తుపతికి ఏ పని చేసినా కలసి రావడం లేదు. ఏ చిన్న వ్యాపారం ప్రారంభించినా కలసి రావడం లేదు! ఎవరితో మాట్లాడుతున్నా తనకు తెలియకుండానే తన మాటలు వక్రీకరించి ఎదుటివాడు అపార్థం చేసుకుంటున్నాడు.

ఎందుకు తన బతుకు ఇలా అయిపోయిందని రోజూ బాధపడేవాడు సేతుపతి. ఇలా ఉండగా ఆ ఊరికి చంద్రశేఖర సరస్వతి అనే మహా తపస్వి వచ్చి రామాలయంలో ఉపనిషత్తులు, పురాణాలు వివరించి వాటిలోని సూక్ష్మాలు వివరించేవాడు. ఉపన్యాసం అయిపోయాక బతుకుని ఏ విధంగా సుఖమయం చేసుకోవాలో, సమస్యల నుండి ఏవిధంగా బయటపడాలో కూడా వివరించేవాడు.

సమస్యలు ఉన్న కొందరు ఆయనను కలసి తమ సమస్యలు వివరించి ఆయన ఇచ్చిన సూచనలతో, ఇచ్చిన మంత్ర పఠనంతో పరిష్కారాలు పొందేవారు. కర్ణాకర్ణిగా చంద్రశేఖర సరస్వతిని గురించి సేతుపతికి తెలిసింది.

ఒకరోజు పొద్దున్నే స్నానాదులు ముగించుకుని సేతుపతి చంద్రశేఖర స్వామి వద్దకు వెళ్ళి తన సమస్యలు విన్నవించుకున్నాడు. ఆయన ఆ సమస్యలన్నీ నిశితంగా విని, కొంచెంసేపు కళ్ళు మూసుకుని ఆలోచించి ఒక కాగితం మీద మంత్రం వ్రాసి దానిని సేతుపతికి ఇచ్చి, “నీవు వ్యాపారం చేయాలనుకుంటున్నావు కాబట్టి పొద్దున్నే ఈ మంత్రం పూర్తి నమ్మకంతో చదివి నేను వ్యాపారం చేయగలను అనుకుని వ్యాపారం ప్రారంభించు, తోటి వర్తకుల సలహాలు కూడా తీసుకో, అసలు వ్యాపారంలో బాగా పైకి వచ్చిన వారు ఏవిధంగా వ్యాపారం చేస్తున్నారో గమనించు, దేనికైనా పరిశీలన అవసరం” అని చెప్పి పంపాడు.

సేతుపతి చంద్రశేఖరసరస్వతి చెప్పినట్టు మంత్రం పఠించి వ్యాపారం ప్రారంభించాడు. దాని మీదే పూర్తి దృష్టి పెట్టాడు. కొద్ది రోజులలోనే వ్యాపారం అభివృద్ధి చెందుతున్నట్లు తెలుసుకున్నాడు.

ఒకరోజు సేతుపతి ఉంటున్న వీధిలోని శివరాముడనేవాడు సేతుపతి దగ్గరకు వచ్చి తనూ వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నట్లు, తగిన సూచనలు ఇవ్వమని అడిగాడు.

సేతుపతి తన మామూలు ధోరణిలో, “ఎప్పుడంటే అప్పుడు నీకు చెప్పలేను, కాస్త తీరిక చేసుకుని రేపు కలువు. అదీ గాక నీకు వ్యాపారంలో మెళకువలు చెప్పాలంటే నా సమయం కొంత వెచ్చించాలి, తెలుసుకో” అని కర్కశంగా చెప్పాడు.

సేతుపతి మాటలు విని శివరాముడు సలహా అడిగినందుకు బాధపడుతూ వెళ్ళిపోయాడు.

కొద్ది సేపట్లో సేతుపతి తన మాటల్లోని కర్కశత్వం గురించి ఆలోచించాడు. ఎంత ప్రయత్నించినా తాను ఇతరులతో సౌమ్యంగా మాట్లాడలేక పోతున్నాడు.

ఈ సమస్యకు కూడా పరిష్కారం చంద్రశేఖర సరస్వతినే అడగాలని నిర్ణయించుకుని మరలా పొద్దున్నే ఆయన దగ్గరకు వెళ్ళి తన వాక్శుద్ధిని గురించి వివరించాడు.

చంద్రశేఖర సరస్వతి సేతుపతి మాటలు చిరునవ్వుతో విని మరలా మరొక మంత్రం వ్రాసి ఇచ్చి ఈ విధంగా చెప్పాడు.

“మనం సౌమ్యంగా మాట్లాడాలి. సాధ్యమైనంత వరకు మన మాటల్లో ఎదుటివారికి ఇబ్బంది కలిగించే పదాలు మనం వాడకూడదు. మాట్లాడేటప్పుడు చిరునవ్వుతో మాట్లాడాలి. అప్పుడే ఎదుటివాడికి మనమీద మన మాట మీద నమ్మకం, మంచి అభిప్రాయం కలుగుతుంది. ఇది వ్యాపారస్తులకు మరీ ముఖ్యం. రోజూ ఈమంత్రం వ్యాపారానికి పోయే ముందు చదువు. దీనిని బాగా వ్రాసి నీ అంగడిలో ఒకచోట అతికించు. ఖంటతా పట్టు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, ఈ మంత్రాన్ని మనసులో పఠించి, వచ్చిన వారితో సౌమ్యంగా మాట్లాడు. నీకు అంతా సవ్యంగా జరుగుతుంది” చెప్పాడు చంద్ర శేఖర సరస్వతి.

సేతుపతి అప్పటినుండి అందరితో చక్కగా మాట్లాడసాగాడు. అనుకున్న పనులు నెరవేరసాగాయి.

అసలు విషయం ఏమిటంటే చంద్రశేఖర సరస్వతి మంత్రం పేరుతో సేతుపతికి ఒక విధమైన ఆత్మస్థైర్యం కలిగించాడు. ఆ మంత్రాలు సేతుపతిలో తన మీద తనకు పూర్తి నమ్మకం కలిగించాయి.

కొద్ది రోజుల తరువాత, చంద్రశేఖర సరస్వతిని సేతుపతి కలసి,”మహానుభావా దేనిలోనైనా విజయం సాధించాలంటే, పరిశీలన, పరిశోధన, వాక్శుద్ధి ఉండాలని తెలుసుకున్నాను. ఎప్పటికీ మీ సలహాలు పాటిస్తూ నా జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకుంటాను” అని నమస్కృతులతో చెప్పి పూలు ,పండ్లు ఆయన ముందర పెట్టి ఆనందంగా ఇంటికి వెళ్ళాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here