డా. పెన్నా శివరామకృష్ణ “హైకూలలో” దృశ్యభావ చిత్రాలు

1
3

[dropcap]జ[/dropcap]పాన్ దేశంలో ఉద్భవించి, పండితపామర జనరంజకమై వివిధ దేశాలకు వ్యాప్తి చెందిన కవితా ప్రక్రియ హైకూ. ‘హై’ అంటే ఆహ్లాదం. ‘కు’ అంటే పద్యం లేదా వాక్యం అని అర్థం. ‘హొక్కు’ అనే పదానికి ‘ఆరంభ కవిత’ అని భావం. మసవొక షికి (1866-1902) అనే కవి “హొక్కు” అనే పదాన్ని “హైకూ”(Haiku) గా మార్చాడంటారు.

పురాతన జపాన్ కవులు హైకూ లక్షణాలు (5-7-5-7-7) తర్వాత కాలంలో త్వరితగతిన మార్పులు చెందాయి. ఇంగ్లీష్ సిలబుల్స్ గానీ, తెలుగు అక్షరాలు గానీ జపాన్ “ఓంజీ”లకు ( జపనీయ ధ్వని సంకేతాలు) సమానం కాదు. కనుక హైకూకి అక్షర నియమాన్ని పూర్తిగా, సరిగ్గా పాటించడం సాధ్యం కాదు. కచ్చితమైన నిర్వచనమూ, నిర్వచనం ప్రకారం రాయడమూ జరగడం లేదు.

భారతీయ కవులకు ఆంగ్లానువాదాలు ద్వారానే హైకూ పరిచయం అయింది అని చెప్పవచ్చు. మూలంలోని జపాన్ భాషలోని హైకూలతో ఎక్కువ పరిచయం లేక వివిధ ఆంగ్లానువాదాలను చదివి ఆకర్షితులై ఉత్సాహంగా రాయటం వల్ల, అనువాదాలలో ఉన్న వైవిధ్యం వల్ల కొంత అపోహలు, వివిధ నిర్వచనాలు నెలకొన్నాయి. మూడు పాదాలలో 1, 3 పాదాలకు కొందరు గజల్ లాగా కాఫియా, రదీఫ్ లను అనుసరించారు. అలా వ్రాస్తూ కొందరైతే “హైకూ గజల్” అని మురిసిపోయారు. భారతదేశంలో హైకూ గురించి మొదట ప్రస్తావించింది సుబ్రహ్మణ్య భారతి, రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పవచ్చు. జవహర్ లాల్ యూనివర్సిటీ, న్యూఢిల్లీలో ప్రొఫెసర్ ఎమిరిటస్‌గా పని చేసిన డా. సత్య భూషణ్ వర్మ జపాన్ యూనివర్సిటీకి విజిటింగ్ ప్రొఫెసర్‌గా, అకడమిక్ అడ్వైజర్‌గా వెళ్లి, “జపనీస్ – హిందీ నిఘంటువు” రూపొందించడమే కాక జపాన్ హైకూలను నేరుగా హిందీలోకి అనువదించారు.

తెలుగులో ఇస్మాయిల్, గోపిరెడ్డి రామకృష్ణ రెడ్డి, గోపరాజు రాధాకృష్ణ వంటివారు హైకూలు విస్తృతంగా రాసారు.

డా. పెన్నా శివరామకృష్ణ గారిని హైకూలోని “దృశ్యభావచిత్రణ” ఆకర్షించింది. వివిధ భాషల్లో వచ్చిన హైకూల ఆంగ్లానువాదాలను అధ్యయనం చేసారు. “దేశదేశాల హైకు” అనే పుస్తకాన్ని రాసారు. 1990లో తన మొదటి సంపుటి వెలువరించారు.

తర్వాత 2001లో ” చినుకుల చిత్రాలు”, 2004 లో “సులోచనాలు” సంపుటాలు వచ్చాయి. హైకూ గురించి వారి మాటల్లో —

“నిత్యజీవితంలో మనకు ఎదురయ్యే, ఉపయోగించుకునే వస్తు సమూహాన్ని, ప్రాకృతమైన అంశాలను నిశితంగా పరిశీలిస్తూ తాదాత్మ్యం చెందటం ద్వారా అవి కలిగించే ఆశ్చర్య పూరితమైన ఆనందానుభవమూ, జ్ఞానబోధ ‘ధ్యానబౌద్ధం’ లోని సారాంశం. ఇలా ప్రకృతిలో తాదాత్మ్యం వల్ల కలిగే జ్ఞానం ఆధారంగా తనను, జీవితాన్ని, ప్రపంచాన్ని అవగాహన చేసుకోవటాన్ని ‘సతోరి’ (ఎన్‌లైటన్‌మెంట్) అంటారు. తాదాత్మ్యస్ధితిలో కవి ఆశ్చర్యాన్నో, ఆనందాన్నో, విషాదాన్నో, సున్నితమైన సంవేదననో కలిగించిన దృశ్యానికి లేదా దృశ్య శకలానికి భౌద్ధికమైన వివేచన లేకుండా యథాతధంగా ఇవ్వబడిన అక్షర రూపమే హైకు. తాదాత్మ్యం మూలంగా ఉక్తివైచిత్రి చేకూరుతుంది. క్లుప్తత, గుప్తతలు సమకూరుతాయి.”

“చీకటి పుట్టుపిరికి

వెలుతురొస్తే చాలు

వస్తువుల వెనక దాక్కొంటుంది”

“సాలీడు గొప్ప తత్వవేత్త సున్నాలు చుడుతూ బోధిస్తోంది వేదాంతాన్ని”

“స్టాండు లో బిక్షుకులు

తమ నీడలు పరచుకుని నిద్రిస్తున్నారు”

“వ్యక్తీకరణ పద్ధతి” మాత్రమే హైకూని మిగిలిన కవితా ప్రక్రియ నుండి వేరు చేస్తుంది. ఒక దృశ్యాన్ని చూసినప్పుడు కవికి మెరుపులాంటి భావం, కొన్ని ఆలోచనాత్మక భావనలు కలుగవచ్చు. దానిని అతను ఒక ‘ఉత్ప్రేక్ష’ లాగా పాఠకుని ముందుంచుతాడు. అదే దృశ్య చిత్రణ ఒక్కోసారి పాఠకుడిలో మరొక భావాన్ని స్ఫురింపజేయవచ్చు. ఏదేమైనా క్లుప్తత అన్నదే ప్రధానమైనది అన్నదానికి పై హైకూలు మంచి ఉదాహరణ. ఇంకా —

“పారదర్శకమైన నిర్బంధాలే

అక్వేరియంలో చేపకు

జీవితంలో మనిషికి”

“బల్లి కి చిక్కిన పురుగు

ఓటమి తప్పదని తెలిసినా పోరాటం ఆపలేదు”

“సుడిగాలి –

కొమ్మని ఊపేస్తున్నానని

పిట్ట గర్విస్తోంది”

అద్దాలలో నుండి చేప కనిపిస్తోంది, మనచుట్టూ మనుషులు ‘కనిపిస్తున్నారు’. కానీ స్వేచ్ఛ లేదు. అయితే బంధనాలు విడిపించుకోడానికి చివరి వరకు, ప్రాణం పోయేవరకు పోరాడాలని మరో హైకులో స్పష్టపరుస్తున్నారు. గాలికి ఊగుతున్న కొమ్మ మీద కూర్చొని ఉన్న పిట్ట తానూ ఊగిపోతూ, అసలు తానే కొమ్మను ఊపేస్తున్నానని గర్వపడడం అజ్ఞానం. అది అలా అనుకొంటోందని కవి భావించడమే ఇక్కడ చమత్కారం.

“ప్రమిద వెలిగించాను

చీకటిని చిన్న ముద్దచేసి

పీఠంగా మార్చుకుంది”

కవితాత్మకమైన కవి యొక్క ఈ భావ చిత్రం చూడండి. దీర్ఘమైన సమాసాలు గాని, శబ్దాడంబరత గానీ లేకుండా కేవలం వెలుగుతున్న ప్రమిద, దాని కింద ఏర్పడిన చీకటిని చూసి, ‘చీకటిని పీఠంగా’ ఏర్పర్చుకొని అని చెప్పటం కవితాత్మక భావచిత్రణ.

“నడుమ నడుస్తున్నానని

దూరంగా వెళ్ళి

కలుస్తున్నాయి రైలు పట్టాలు”

“కాళ్ళు లేని వ్యక్తి కూర్చుని

రెండు చేతులతో

దారిని వెనక్కు లాగుతున్నాడు”

ఒక దృశ్యాన్ని కవి చూసినప్పుడు కలిగే ఆలోచన కవితాత్మక రూపంలో వెలువడుతుంది. దానిని అర్థం చేసుకోవటంలో, ఆస్వాదించడంలో చదువరి ఆలోచన, అతని దృక్పథం, జీవితానుభవం కూడా తోడైతేనే దాని అర్థం మరింత అందగిస్తుంది.

ముందుగా కవితా వస్తువును హైకూ కవి నిర్దేశించుకోడు. ఒక దృశ్యం ద్వారా తాను పొందిన ఉద్వేగాన్ని ఆవిష్కరిస్తాడు. హైకూలో చెప్పబడిన దానికంటే ‘చెప్పబడనిదే’ అధికంగా ఉంటుంది. చంద్రున్ని చూపించే వేలు లాంటిది హైకూ. ఆ వెన్నెల్లో తడవటం మాత్రం పాఠకుని మీద ఆధారపడి ఉంటుంది. భావుకుడైన పాఠకుని హృదయంలోనే హైకు పరిపూర్ణత పొందుతుందని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here