కశ్మీర రాజతరంగిణి-56

5
3

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

అధ వంశక్షయే వృత్తే రాజ్ధః శంకరవర్మణః।
ప్రజాప్రార్థనాయ రాజ్యం సుగంధా విదధే సృయమ్॥
(కల్హణ రాజతరంగిణి, V 243)

[dropcap]సు[/dropcap]గంధాదేవి సంరక్షణలో గోపాలవర్మ రాజ్యాధికారం స్వీకరించాడు. గోపాలవర్మ  చిన్న వయసువాడయినా, చక్కగా పాలించాడు. ఎందరో దుష్టులు అతడి చుట్టు చేరి అతడిని తప్పుదారి పట్టించాలని చూశారు. అధికారం రుచి చూపించి దాని దుర్వినియోగం వైపు అతడి బుద్ధిని మళ్లించాలని ప్రయత్నించారు. కానీ ఎలాంటి దుష్ట ప్రలోభాలకు గోపాలవర్మ లొంగలేదు. కానీ అధికారం వల్ల లభించే వికృతాలకు రాణి సుగంధాదేవి లొంగిపోయింది. భర్త మరణం తరువాత ఆమెలో లైంగిక వికృతులు కలిగాయి. ఆమె మంత్రి ప్రభాకరుడికి లొంగిపోయింది. అతడి వల్ల లభిస్తున్న లైంగిక సౌఖ్య భావనలకు ఆమె దాసోహం అంది. దాంతో మంత్రి అయినా సర్వాధికారాలను ప్రభాకరుడు అనుభవించసాగాడు. అతను ఖజానాను కొల్లగొట్టాడు. షాహి రాజ్యం ఉదభాండపురాన్ని గెలిచి, ఆ రాజ్యంపై రాజుగా లల్లియ కుమారుడు తోరమాణుడిని   నిలిపాడు. ఈ విజయంతో ప్రభాకరుడికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. అతడు గర్వంతో కన్నుమిన్ను  కానకుండా వ్యవహరించాడు. అందరినీ అవమానపరచేవాడు. చులకనగా మాట్లాడేవాడు.

ఇదంతా గమనిస్తున్న గోపాలవర్మ మౌనంగా ఉండలేకపోయాడు. ఖజానాను స్వంత ఆస్తిలా వాడుకుంటున్న ప్రభాకరుడిని నిలదీశాడు. లెక్కలు అడిగాడు. దాంతో ప్రభాకరుడికి గోపాలవర్మ అంటే భయం కలిగింది. అతడి వల్ల ఏ ప్రమాదం ముంచుకుని వస్తుందోనన్న భయంతో రాజుపై మంత్ర ప్రయోగం చేయించాడు. దాని ఫలితంగా గోపాలవర్మ కాలిపోయి మరణించాడు. అలా రెండేళ్ల గోపాలవర్మ పాలన హఠాత్తుగా అంతమయింది.

అతని తరువాత సంకటుడు రాజయ్యాడు. కానీ పది రోజులలోనే అతడు మరణించాడు. దాంతో శంకరవర్మ వంశ పాలన అంతమయింది. కశ్మీరుకు రాజులేని పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ప్రజలంతా రాణి సుంగథదేవిని రాజ్యభారం స్వీకరించమని ప్రార్థించారు. వారి ప్రార్ధనను మన్నించి రాణి సుగంధాదేవి రాజ్య భారం స్వీకరించింది.

ఇదొక అపూర్వమైన ఘట్టం!

భారతదేశ చరిత్ర గురించి, సాంఘిక వ్యవస్థ గురించి పలు రకాల వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. భారతదేశంలో స్త్రీ వంటింటి కుందేలు అని,  ఆమెని ఎదగనీయలేదని, స్వేచ్ఛ లేదని ఇలా పలురకాల వ్యాఖ్యానాలు వినిపిస్తుంటాయి. భారతీయ వ్యవస్థను విమర్శిస్తూ, చీదరించుకుంటూ వ్యాఖ్యానిస్తారు. వారికి చరిత్ర తెలియదు. భారతదేశం గురించి తెలియదు. ప్రపంచంలో ఏ నాగరికతలోనయినా, ఏ దేశ చరిత్రలోనయినా భారతదేశంలో ఉన్నంత మంది రాజ్యం చేసిన మహిళలు లేరు. ముఖ్యంగా, కశ్మీరు చరిత్రలో ఉన్నంత మంది మహిళా అధికారులు లేరు.

రాజతరంగిణి ఆరంభంలోనే శ్రీకష్ణుడు ‘యశోవతి’ని రాణిగా నిలపటం చూశాము. రాజతరంగిణి నిండా రాజులతో సమానంగా, ఒకోసారి రాజుకన్నా ఎక్కువగా రాణులు, ఇతర మహిళలు మందిరాలు నిర్మించటం, విహారాలు కట్టించటం, నగరాలు నిర్మించటం కనిపిస్తుంది. పలు సందర్భాలలో రాజు శివ మందిరమో, విష్ణు మందిరమో నిర్మిస్తే, రాణి విహారాన్ని, చైత్యాలను నిర్మించటం కనిపిస్తుంది. అంటే రాజులతో సంబంధం లేకుండా రాణులు పలు విషయాల్లో స్వతంత్రంగా వ్యవహరించే వారన్నమాట. వారికంటు ప్రత్యేకంగా ధనం ఉండేదన్నమాట. ప్రతి విషయానికీ  రాజుపై ఆధారపడకుండా రాణులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవటం కనిపిస్తుంది. ప్రజలు కూడా ఓ మహిళ ఆధిపత్యం పట్ల కూడా నిరసన కానీ, చులకన అభిప్రాయం కానీ కనబరచినట్టు లేదు. పైగా రాణిని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నట్టు తెలుస్తుంది. రాణి సుగంధాదేవి విషయంలో కూడా ఇది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రజల అభ్యర్ధనను స్వీకరించి ఆమె రాజ్యభారం స్వీకరించింది. ఆమె మహిళ అన్న భావన ఆ కాలంలో ఆమెకు రాజ్యాధికారాన్నివ్వటంలో ప్రజలకు ప్రతిబంధకం కాలేదు.

సుగంధాదేవి భర్తతో సహగమనం చేయలేదు. గోపాలవర్మ రాజుగా నిలబెట్టి అతని పేరు మీద రాజ్యం చేసింది. అంతేకాదు మంత్రి ప్రభాకరుడితో సంబంధం నెరపింది. అతడిని పెత్తనం చెలాయింపనిచ్చింది. కానీ ప్రభాకరుడు దుష్టుడు. ఖజానా నుంచి దోచుకుంటున్నడని తెలిసిన గోపాలవర్మను చంపించాడు. ఆ తరువాత రాజతరంగిణిలో ప్రభాకరుడి ప్రసక్తి రాదు. పరోక్షంగా రాజ్యాధికారం నిర్వహించిన  ప్రభాకరుడి ప్రసక్తి గోపాలవర్మ మరణం తరువాత రాకపోవటం, మరొకరిని గద్దెపై నిలపాలని సుగంధాదేవి ప్రయత్నించటం చూస్తే జరిగింది ఊహించవచ్చు. రాణికి నిజానిజాలు తెలిసి ఉంటాయి. ప్రభాకరుడి నైచ్యం ఆమె ఆమెకు అర్థమయి ఉంటుంది. అతడిని రాజాస్థానం నుంచి వెడలగొట్టడమో, చంపి ఉండడమో జరిగి ఉండవచ్చు. రాజవంశానికి చెందిన వారెవరూ లేకపోయినా రాణి ఏకాంగులు, తంత్రులతో స్నేహం నెరపి తన రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకుంది తప్ప ప్రభాకరుడిని తలవలేదు. అతడి ప్రసక్తి లేకపోవటం కూడా ఇలాగే జరిగి ఉంటుందన్న ఊహకు బలం ఇస్తుంది. తరువాత ఎక్కడా రాణి దారి తప్పినట్టు, లైంగిక వాంఛలకు లొంగి ప్రవర్తించినట్టు రాజతరంగిణిలో లేకపోవటం కూడా ఈ ఆలోచనను బలపరస్తుంది (ఈ ఆలోచన ఆధారంగా కస్తూరి మురళీకృష్ణ కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు సంపుటంలో రాణి సుగంధాదేవిఅన్న కథ రాశారు).

అనేక పుణ్యకార్యాలు చేస్తూ, మందిరాలు నిర్మిస్తూ రాణి సుగంధాదేవి, గోపాలవర్మ భార్య సంతానాన్ని కనటం కోసం ఎదురు చూసింది. గోపాలవర్మ మరణించే నాటికి అతని భార్య గర్భవతి. కానీ   ఆ పుట్టిన శిశువు మరణించటంతో తన అధికారాన్ని సుస్థిరం చేసుకుని రెండేళ్లు రాజ్యం చేసింది సుగంధాదేవి.   రాజ్యభారాన్ని ఎవరికి కట్టపెట్టాలో ఆలోచిస్తూ, తగ్గ వారసుల కోసం వెతుకుతూ ఉంది. చివరికి తన బంధువయిన నిర్జితవర్మకు రాజ్యాన్ని అప్పగించింది.

కశ్మీరు చరిత్రలో సుగంధాదేవిది అధ్బుతమైన వ్యక్తిత్వం. ఆరంభంలో దారి తప్పినా  తన తప్పు గుర్తించి, సరైన దారికి వచ్చి ప్రజలకు సక్రమమైన పాలనను అందించింది. అధికారం చేపట్టింది కానీ అధికారం వల్ల వచ్చే ప్రలోభాలకు లొంగలేదు. రాజ్యాధికారం అర్హుడని భావించిన వాడికి అప్పచెప్పి వెళ్లిపోవాలని ప్రయత్నించింది. కానీ అతడు స్త్రీలోలుడు, తాగుబోతు కావటంలో తంత్రయోధులు అతడి అధికారాన్ని అంగీకరించక, అతడి సంతానం అయిన పదేళ్ల పార్థుడిని గద్దెపై కూర్చుండ బెట్టారు. దుర్భాషలాడుతూ సుగంధాదేవిని రాజ్యం వెడలనడిపారు. వారు ఆడిన దుర్భాషాలన్నీ ప్రభాకరుడు ఆమె గురించి అన్న మాటలే. గతంలో ఆమె చేసిన దుశ్చర్యల పాపాలకు తాము పరిహారం చేస్తున్నట్టు తంత్రయోధులు భావించుకున్నారు. ఈ రకంగా   రాణి రాజ్యం వదలి వెళ్లింది. అయితే ఆమె మళ్లీ సైన్యం తీసుకుని యుద్ధానికి వస్తున్నదని భావించిన వారు ఆమెను నిష్టాలవిహారంలో బంధించారు. ఆమె ఆ విహారంలోనే మరణించింది. ఇదీ అద్భుతమైన రాణి సుగంధాదేవి జీవితం. నైతిక విలువలు వదలి,  దిగజారి, ఆ పాతాళం నుంచి పైకెదిగి నిస్వార్ధంగా రాజ్యం చేసి వ్యక్తుల స్వార్థానికి బలయిన రాణి సుగంధాదేవి  స్త్రీ ఆత్మశక్తికి చక్కటి నిదర్శనం. అప్పటి భారతీయ వ్యవస్థ ఇప్పుడు మేధావులు చిత్రిస్తున్న రూపంలో లేదన్న విషయం స్పష్టం చేస్తుంది రాణి సుగంధాదేవి గాథ.

ఇక్కడ కశ్మీరు పరిస్థితిని కల్హణుడు చక్కగా వివరిస్తాడు. ఈ వివరణ చదువుతుంటే సమకాలీన రాజకీయ పరిస్థితులు గుర్తుకు వస్తాయి.

భూభుజో గ్రామకాయస్థా ఇవాన్యోన్య విపాటవమ్।
దత్తాధికాధికోత్కోచా విధుదుస్తంత్రి సేవయా॥

యద్రాజైః కన్యాకుబ్జాధ్యా విలబ్ధాస్తత్ర మండలే।
తంత్రగామ హుండికా దానార్భూభుజాం జీవితా భవత్॥
(కల్హణ రాజతరంగిణి, V 265, 266)

రాజు పదేళ్ల బాలుడు కావటంతో అతడి తండ్రి సంరక్షుడిగా రాజ్యం చేసేవాడు. అతడు లంచాలు తీసుకునేవాడు. డబ్బు ఇచ్చిన వాడు చెప్పినది చేసేవాడు. అయితే అసలు అధికారం తంత్రయోధులది కావటంతో వారిని సంతృప్తిపరచే రీతిలో ఎవరు ధనం ఇస్తే వారికే అన్నీ దక్కేవి. దాంతో కన్యాకుబ్జాన్ని సైతం జయించిన కశ్మీర రాజుల కాలంపోయి అధికారం కోసం తంత్రయోధులకు ధనం అర్పించే రాజుల కాలం వచ్చింది అని వ్యాఖ్యానిస్తాడు కల్హణుడు. అప్పుడే కాదు ఇప్పటి రాజకీయాల్లోనూ అధికారం సాధించటంలో ‘ధనం’ ప్రధాన ప్రాతపోషించటం చూస్తే మారేది ‘కాలం’ తప్ప ‘సమాజం’ కాదనిపిస్తుంది.

అప్పుడు అధికారం కోసం తంత్రయోధులకు హుండీలు సమర్పిస్తే, ఇప్పుడు అధికారం కోసం పార్టీ ఫండులు, హైకమాండ్ డిమాండులు తీరుస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ ‘పేరు’లో తప్ప ‘పని’లో మార్పు రాలేదనిపిస్తుంది. తంత్రయోధులకు ధనం సమర్పించేందుకు రాజ్యాధికారంపై ఆశ ఉన్న వారందరూ ప్రజలను పీడించసాగారు. ఆశ ఉన్నవారు జట్లుగా ఏర్పడి ప్రజలను దోస్తూ ధనం సమర్పించుకోసాగారు. ప్రజల జీవితం దుర్భరమైపోయింది. ప్రజలను పీడించటంలో అధికారులతో ప్రకృతి కూడా పోటీ పడింది. వరదలు వచ్చి పంటలను ముంచెత్తాయి. దాంతో తినటానికి తిండి లేక ప్రజలు మలమల మాడిపోయారు. వితస్త   ఉబ్బిపోయిన మానవశవాలతో నిండిపోయింది. శవాలతో నది నుండి నీరు కనిపించేది కాదు. జంతువులు పీక్కుతినగా మిగిలిన ఎముకలతో కశ్మీరు మొత్తం శ్మశానంలా కనిపించేది. ఈ సమయంలో అధికారులు, తంత్రయోధులు తమ వద్ద ఉన్న ఆహారాన్ని రెట్టింపు ధరలకు అమ్మి ధనవంతులయ్యారు.

ఈ సమయంలో అవకాశమున్న ప్రతి ఒక్కరు ధన సంపాదన, అధికార సాధనల వెంటపడ్డారు. వయసు రాగానే పార్థుడు తండ్రిని పక్కకు తప్పించి అధికారం చేపట్టాడు. తంత్రయోధులకు ధనం కట్టబెట్టి పార్థుడిని తొలగించి అతడి తండ్రి రాజ్యాధికారం సాధించాడు. ఇద్దరు రాణులు మృణావతి, బప్పటదేవిలు వీరుడయిన సుగంధాదిత్యుడికి లైంగిక సౌఖ్యానిస్తూ, ధనాన్నివ్వటం ద్వారా తమ తమ సంతానానికి రాజ్యం దక్కేట్టు చూడాలని తపన పడ్డారు.

ఓ వైపు రాణుల కుట్రలు, ఇలా సాగుతూండగా మరో వైపు రాజు బాలుడయిన చక్రవర్మకు రాజ్యం కట్టబెట్టి మరణించాడు. వెంటనే పార్థుడి అనుయాయులు అతడికి రాజ్యం అందివ్వాలని దాడులు చేశారు. తంత్రయోధులు చక్రవర్మను తొలగించి శూరవర్మను సింహసనంపై కూర్చోబెట్టారు. సంవత్సరం తరువాత పార్థుడు అధికంగా ధనం ఇవ్వటంతో వారు పార్థుడిని సింహాసనంపై కూర్చోబెట్టారు. అయితే ఇంకొన్నాళ్లకు చక్రవర్మ అధికంగా ధనం ఇవ్వటంతో పార్థుడిని తొలగించి చక్రవర్మకు రాజ్యాధికారం ఇచ్చారు. అయితే కొన్ని నెలల తరువాత తంత్రయోధులకు డబ్బు చెల్లించలేక చక్రవర్మ భయంతో రాజ్యం వదలి పారిపోయాడు.

చక్రవర్మ రాజ్యం వదలి పారిపోవటంతో శంకరవర్ధనుడు ధనంతో శంభువర్ధనుడిని తంత్రయోధుల దగ్గరకు పంపాడు. ఆ ధనం ఉపయోగించి, తన సోదరుడిని మోసం చేసి తానే రాజయ్యాడు శంభువర్ధనుడు. ఈలోగా దామరుల సహాయంతో చక్రవర్మ కశ్మీరంపై దాడి చేశాడు. వీరోచితంగా పోరాడి తంత్రయోధులను ఓడించాడు. అతడు రాజధానిలో అడుగుపెట్టేలోగా శంభువర్ధనుడు, పారిపోతున్న తంత్రయోధులను కూడగట్టుకుని చక్రవర్మపై దాడి చేశాడు. ఓడిపోయాడు. నిండు సభలో ఓ భటుడు శంభువర్ధనుడి తల నరికివేశాడు.

కశ్మీర రాజును సంహరించిన శ్రీకృష్ణుడు కశ్మీరును పార్వతితో పోలుస్తూ రాజును శివాంశజుడని, అతడిని గౌరవించాలని అన్నాడు. అనాటి నుండి రాజు ఎలాంటివాడయినా గౌరవం పొందుతూ వచ్చాడు. కానీ రాజులను లెక్కచేయకుండా, గౌరవమన్నది లేకుండా, సేవకులు సైతం రాజుల తలలు నరికే పద్ధతికి ఇదే ఆరంభం అంటూ వాపోతాడు కల్హణుడు. ధర్మ మర్యాదను వదలి తండ్రి వంటి రాజును ద్రోహబుద్ధితో సేవకులు వధించటం శంభువర్ధనుడితో ఆరంభం. కొందరు విశ్లేషకులు ఇలా ఓడినవాడి తల నరకేయటానికి ప్రేరణ మ్లేచ్ఛుల నుంచి లభించిందని అంటారు.

అప్పటికే భారతదేశంలో పలు ప్రాంతాలు మ్లేచ్ఛులమయం అయ్యాయి. భారతీయ రాజులు ఓడిన వారిని సైతం గౌరవించి ప్రాణభిక్ష పెట్టేవారు. అలా పలుమార్లు ప్రాణభిక్ష పొందిన వారు ఒక్కసారి గెలవగానే, అంత వరకూ తమను గౌరవించి వదిలిన రాజు తలను నరికి తమ గొప్పతనం చాటుకునేవారు. ఈ పద్ధతి కశ్మీరుకు చేరిందని నిరూపిస్తూందీ సంఘటన. ఇదీ కల్హణుడి బాధ. తనకు పరిచయం ఉన్న ప్రపంచం సంపూర్ణంగా రూపాంతరం చెందుతోందని గ్రహించాడు. కాబట్టి, రాజతరంగిణి ద్వారా ఒక గొప్ప సంసృతి, సంప్రదాయం ఉన్నతమైన చరిత్రకు, ఉత్తమ వ్యక్తిత్వానికి వారసులం మనం అని భావితరాలకు జ్ఞప్తికి తేవటం కోసమే కల్హణుడు రాజతరంగిణి రచించాడు.

శత్రువులందరి అడ్డు తొలగించుకున్న తరువాత చక్రవర్మకు తన శక్తిపై అపారవిశ్వాసం కలిగింది.   చుట్టు వందిమాగధులు చేరి రాత్రింబవళ్లు తనని పొగడుతుంటే తనకి ఎదురులేదనుకున్నాడు. ఇంతలో అతనిలోని వ్యభిచార ప్రకృతిని చుట్టు చేరిన వారు రెచ్చగొట్టారు. ఆ సమయంలో విదేశం నుంచి ఒక డొంబు గాత్ర విద్వాంసుడు హాంసి, నాగలత అన్న ఇద్దరు కూతుళ్లతో రాజదర్బారులో తమ కళా ప్రదర్శనిచ్చాడు. వాళ్ళిద్దరూ రాజుకు నచ్చారు. వాళ్ల పొందు కోసం తపించాడు. వారిలో హంసికి పట్టమహిషి గౌరవం ఇవ్వటమే కాదు ఆమె ఎంగిలి ఆరగించిన వారే తన ఆస్థానంలో ఉండాలని ఆజ్ఞాపించాడు. హంసి , ఆమె బంధువులు ఎంత చెప్తే అంత రాజుకు! ఫలితంగా దొంగలు మంత్రులయ్యారు. రాజతరంగిణిలో కల్హణుడు ఆ కాలంలో దిగజారిన కశ్మీరాన్ని విపులంగా వర్ణించాడు. ఎంతో ఆవేదనతో వర్ణించాడు. ఆ సమయంలో కశ్మీరంలో దేవతలన్న వారెవరూ లేరని అందరూ కశ్మీరాన్ని వదలి పోయినట్టున్నారని అంటాడు కల్హణుడు.

ఇంతలో ఎవరో రాజులో పాపభీతిని ప్రవేశపెట్టారు. రాజు ఇతర దేశాలకి చెందిన మ్లేచ్ఛ మహిళతో సంపర్కం పెట్టుకున్నాడు. అది పాపం అని రాజును  నమ్మించారు. పాపానికి ప్రాయశ్చిత్తం పాపమే అని రాజుకు బోధించారు. మ్లేచ్ఛ స్త్రీతో జరిగిన అశుద్ధ సంపర్కం వల్ల కలిగిన పాపానికి నిష్కృతి పవిత్రురాలు,  పునీతురాలయిన స్త్రీతో సంగమం అని చెప్తారు. రాజు మూర్ఖుడయితే అతని చుట్టు మరింత మూర్ఖులు చేరతారంటారు. కశ్మీరు పరిస్థితి అలాంటిదయింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here