[box type=’note’ fontsize=’16’] కృష్ణా జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా ముక్త్యాల లోని శ్రీ కోటి లింగేశ్వరస్వామి ఆలయం గురించి, శ్రీ ముక్తేశ్వరస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
శ్రీ కోటి లింగేశ్వరస్వామి ఆలయం, ముక్త్యాల
[dropcap]ఆం[/dropcap]ధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట నుంచి 8 కి.మీ.ల దూరంలో ఉత్తర వాహిని అయిన కృష్ణా నదీ తీరంలో 54 ఎకరాల స్ధలంలో వున్నది ఈ ఆలయం. ఈ ఆవరణలోవున్న శ్రీ పంచముఖ అమృత లింగేశ్వరస్వామి వారి దేవాలయము సుమారు 55 అడుగుల ఎత్తయిన ఐదు అంతస్తుల విమాన గోపురంతో, 4 ద్వారములతో, 4 ధ్వజస్తంభములతో అలరారుతోంది. ఏ ద్వారంనుంచయినా స్వామిని దర్శించవచ్చు. శివాలయానికి ముందు మహా మండపం, అందులో రెండు వైపులా శ్రీ కామాక్షి, విజయ గణపతుల దేవాలయాలున్నాయి. ఇంకా కశ్యప మహర్షి రచించిన కాశ్యప శిల్ప శాస్త్ర ప్రమాణముతో 32 శివ గణ పరివారాలయములు, 27 శివలీల మూర్తులు, 27 శక్తి ఆలయములు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు షట్ గణపతులు, షట్ సుబ్రహ్మణ్యులు వగైరా 108 దేవతా మూర్తులకు గుళ్ళు సిధ్ధమవుతున్నాయి. ఇవికాక కోటి శివలింగాలని ప్రతిష్ఠిస్తారు. ఈ పని ఇప్పటికి చాలా మటుకు పూర్తి అయి వుండవచ్చు.
కార్తీక మాసంలో ఒకసారి మేము ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేసి, 108 శివలింగాల దగ్గర దీపారాధన చెయ్యాలనే సంకల్పంతో ఇక్కడ శివలింగాల దగ్గర చేశాము.
ఈ ఆలయ నిర్మాణం కంచికచర్ల వాస్తవ్యులు శ్రీ గద్దె ప్రసాద్, పావని గార్ల శుభ సంకల్పంతో, భద్రాచల వాస్తవ్యులు శ్రీ మందరపు వెకటేశ్వర్లు స్ధపతి ఆధ్వర్యంలో జరుగుతోంది.
శ్రీ ముక్తేశ్వరస్వామి ఆలయం, ముక్త్యాల
ముక్త్యాలలో శ్రీ కోటిలింగశివ క్షేత్రానికి 2 కి.మీ. ల దూరంలో వున్నది అతి పురాతనమైన శ్రీ ముక్తేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయంలో శివలింగం బలి చక్రవర్తిచే ప్రతిష్ఠింపబడ్డది. పక్కన అమ్మవారి గుళ్ళో శ్రీచక్రంకూడా ప్రతిష్టింపబడివుంది. శివ కేశవులకు బేధం లేదన్నట్లు చెన్న కేశవ స్వామి ఆలయం కూడా ఈ ప్రాకారంలోనే వుంది. ఇక్కడ కృష్ణా నది ఉత్తర వాహిని. ఈ క్షేత్రం ఉత్తర కాశీగా పరమ పావన పుణ్య తీర్థంగా ప్రసిధ్ధికెక్కింది. పలు పురాణాలలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావన వున్నది.
ఈ స్వామిని త్రేతాయుగంలో రామ లక్ష్మణులు, ద్వాపర యుగంలో పాండవులు దర్శింటారుట. ఎఱ్ఱన, శ్రీనాధుడు మొదలగు మహాకవులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు వారు రాసిన గ్రంథాలలో వున్నది.
త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి ఇక్కడ ఆశ్రమం ఏర్పాటుచేసుకుని నిత్యం ఉత్తరవాహినిలో స్నానం చేసేవారని మార్కండేయ పురాణంలో వున్నది. నదీ ప్రవాహంలో ఆయనకు జంట నందులు కనిపించేవిట. కృష్ణ ఒడ్డున జంట నందుల విగ్రహాలు వున్నాయి. ఇప్పటికీ నది లోతులో బంగారు శివాలయం వుందని భక్తుల నమ్మకం. ఋష్యశృంగ మహర్షి ఇక్కడికి సమీపంలో వున్న కొండగుహలో తపస్సు చేసేవారుట. అప్పుడు ఆ గుహ నుండి నిరంతరం సామవేదగానం వినిపించేదిట.
గుడి తెరచి వుంచు వేళలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల దాకా తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల దాకా. మీరు వెళ్ళిన సమయంలో గుడి మూసి వుంటే గుడి మొదట్లో వున్న షాపులో అడగండి. పూజారిగారి ఫోను నెంబరు దొరకవచ్చు. ఆయన ఇల్లు సమీపంలోనే.
బల్లకట్టు
సరదా వున్న పట్నవాసులు చూడదగ్గ ఇంకో విశేషం బల్లకట్టు. గుడి దగ్గరనుంచి కొంచెం దూరం వుంటుంది. ఈ బల్లకట్టు మీద మనుషులతోపాటు ఒకేసారి మూడు లారీలను ఎక్కించి అవతలి ఒడ్డుకి చేరుస్తారు.
కావాలంటే మీరు కూడా మీ వాహనంతో సహా ఆ బల్లకట్టుమీద అవతలి ఒడ్డుకెళ్ళచ్చు.