[dropcap]గు[/dropcap]మ్మం దగ్గర బైక్ శబ్దం వినబడటంతో, ఉలిక్కిపడి ‘చచ్చింది గొర్రె, గిరి, వాళ్ళావిడతో కలిసి వచ్చేసినట్టున్నాడే’ అనుకున్నాడు మధు మనసులో.
గిరి దంపతులతో కలిసి, తానూ సతీసమేతంగా శేఖర్ పెళ్ళికి వెళ్దాం అనుకున్నాడు మధు. అందుకనే ఈరోజు ఆఫీస్ నుండి గంట ముందే వచ్చేశాడు కూడా. తన భార్య లలితకి కూడా ఆఫీస్ నుండి తొందరగా రమ్మని, పెళ్ళికి వెళ్లాలని చెప్పాడు. కానీ లలిత మాత్రం ఇంకా ఇల్లు చేరలేదు. కానీ ఇంతలోనే గిరి, సతీ సమేతంగా ఇంటికి వచ్చేశాడు. దాంతో ఏం చెప్పాలో తెలియక, కాస్త బలవంతంగా నవ్వేస్తూ, “మా ఆవిడ వచ్చేస్తోంది. దార్లో ఉందట. రాగానే అందరం కలిసి శేఖర్ పెళ్ళికి వెళ్ళిపోదాం హి హి హి” చెప్పాడు మధు ఆ బలవంతపు నవ్వుని అలానే కొనసాగిస్తూ.
తర్వాత కొద్దిసేపటికి లలితకి ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ లిఫ్టు చేయలేదు “ఛ ఛ ఎన్ని సార్లు చెప్పినా నా మాటకి విలువివ్వదు. అప్పటికీ ఆఫీసుకి వెళ్ళే ముందు మూడు నాలుగు సార్లు గుచ్చి గుచ్చి చెప్పాను కూడా. ముచ్చు మొహంది” అని తిట్టుకుని మళ్ళీ “హి హి హి” అని మళ్ళీ ముఖానికి నవ్వు పులుముకుని, ఆ కబురూ, ఈ కబురూ వాళ్ళకి చెప్పి, తర్వాత వాళ్ళకి కొంచెం కాఫీ కలిపి ఇచ్చాడు. అప్పటికే వాళ్ళు వచ్చి గంట దాటిపోవడంతో,
“ఒరేయ్ మధూ, ఇప్పటివరకూ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో అర్థం కాకపోయినా, వదిన వచ్చేవరకూ ఏదోటి మాట్లాడాలని మాట్లాడుతున్నావని అర్ధం చేసుకుని ఓపిక పట్టాం. ఇక చాలురా” కాస్త మంటగా చూశాడు గిరి.
“ఇంకొంచెం సేపు ఉండు, వచ్చేస్తుంది. ఇంతలో టివి పెడతాను” అని వార్తలు పెట్టాడు. కాసేపటికి, ఇక ఉండలేక వాచీ చూసుకుని, “సరేరా మధు” అని లేచాడు గిరి.
“ఏంటి లేచావ్ చానల్ నచ్చలేదా” అంటూ వేరే చానల్ పెట్టాడు మధు.
“కుళ్ళు జోకులు వేయకు. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. మరీ తాళి కట్టేసాక వెళితే బావుండదు. వదిన వచ్చాక ఇద్దరూ కలిసి రండి. మేము అక్కడ నీకోసం వెయిట్ చేస్తాం” అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటికే ఏడున్నర అయిపోయింది. ముహూర్తం ఎనిదింపావుకి. దాంతో ఓ క్షణం ఆలోచిస్తూ, ‘పోనీ నే ఒక్కడినే వెళ్ళి వచ్చేస్తే పోతుందా! అమ్మో, అందరూ భార్యలతో వస్తారు. నేను ఒక్కడినే ఇలా ఏకాకిలా వెళితే బావుండదు. పైగా సతీ సమేతంగా వస్తానని అన్నాను కూడా’ అనుకున్నాడు మనసులో.
ఇంతలో ఇంటికి చేరిన లలిత, స్కూటీ దిగి లోనికి నడిచి వస్తూ “మధూ ఏం చేస్తున్నావ్” అడిగింది మామూలుగా.
“ఏం చేయడమేంటి నీ బొంద. శేఖరం పెళ్ళికి వెళదాం, సరిగ్గా ఆరు గంటలకి కొంప చేరమని, నువ్వు ఆఫీసుకి వెళ్ళేముందు ఒకటికి నాలుగు సార్లు నీ చెవి కొరికి కొరికి మరీ చెప్పానా. అయినా నీలాంటి అగులుబుగులు మనిషిని నేనింతవరకూ చూడలేదు. పాపం మనతో పాటు కలిసి వెళ్దాం అని గిరి దంపతులు ఎంతో ఆశగా మనింటికి వచ్చారు. ఇప్పటిదాకా ఉండి వెళ్లారు. పెళ్ళికి రమ్మని, శేఖరం,వాడికి కాబోయే భార్యతో వచ్చి మరీ శుభలేఖ ఇచ్చి రమ్మన్నాడు. కానీ నువ్ ఇంత ఆలస్యంగా రావడం ఏమన్నా బావుందా చెప్పు” అడిగాడు మధు.
“నేను బ్యూటీ పార్లర్‌కి వెళ్ళాను. దాంతో కొంచెం ఆలస్యమైంది. అంతే, నో వర్రీస్, నువ్వే వెళ్ళి రా” చెప్పిందామె తేలిగ్గా.
మధుకి కోపం కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లా వచ్చింది. కానీ తన ఫేవరెట్ హీరోయిన్ తమన్నాని తలుచుకుని తమాయించుకుని తప్పక ఒక్కడే వెళ్లివచ్చాడు
తర్వాతోసారి, లలిత ఆఫీస్ కి వెళుతూ, “మధూ నిన్న చెబుదాం అనుకుంటూనే మర్చిపోయా. ఈరోజు నా చిన్ననాటి స్నేహితురాలు, వాళ్ళాయనతో కలిసి బెంగళూరు నుండి నన్ను కలవడానికి ప్రత్యేకంగా వస్తోంది. నేనే వాళ్ళని ఎయిర్‌పోర్టుకి వెళ్ళి రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకువస్తాను. నువ్ ఎలాగో ముందుగా ఆఫీస్ నుండి వచ్చేస్తావ్ కనుక, కొంచెం ఆ చంచం స్వీట్లు ఓ అరకేజీ పట్టుకురా. అలాగే కొంచెం హార్లిక్స్ పెట్టి ఫ్లాస్క్‌లో పోసి ఉంచవూ ప్లీజ్” అడిగిందామె
“సరే నువ్ ఇంత ముద్దుగా చెబితే కాదంటానా” అన్నాడు మధు.
సాయత్రం ఆమె తన స్నేహితురాలినీ, ఆమె పతినీ తీసుకుని ఉత్సాహంగా తన ఇంటికి వచ్చింది. కానీ ఇల్లు లాక్ వేసి ఉండటం చూసి గతుక్కుమంది. ఏం చేయాలో తెలీలేదు. మధుకి ఫోన్ చేస్తే లిస్ట్ చేయలేదు. లలితకి ఓ క్షణం బుర్ర గిర్రున తిరిగినంత పనైంది. కొంచెం సేపు ఆలోచించి, ‘మొన్న జరిగిన దానికి ఇది ప్రతీకారవా! వామ్మో’ అని మనసులో అనుకుని, ఏదో ఒకలా అదీ ఇదీ అని ఏదో మాట్లాడింది.. అప్పటికే పది నిమిషాలు అయిపోయింది. వాళ్ళు లగేజీతో పాటు బయట అలా నించుండిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి అని చేతులు పిసుక్కుంటుండగానే మధు వచ్చేశాడు. ఇంటి లాక్ తెరిచి వారిని చక్కగా లోనికి ఆహ్వానించాడు. తరువాత వారిని చక్కగా పలకరించాడు. అప్పటికే తను తెచ్చి ఇంట్లో ఉంచిన స్వీట్స్, కూల్ డ్రింక్స్ సర్వ్ చేశాడు. లలిత పెద్ద భారం దిగినట్టు హమ్మయ అని ఊపిరి పీల్చుకుంది.
మరుసటి రోజు వాళ్ళు వెళ్లిపోయాక, “అయామ్ సారీ మధూ, పోయిన నెల నీ ఫ్రెండ్ శేఖర్ మేరేజ్‍కి వెళ్లడానికి గాను గిరి దంపతులు మనింటికి వచ్చారు. కానీ అపుడు నేను ఇంటికి త్వరగా రాలేదు. అప్పుడు ఆ రోజు నువ్వు ఎంత ఇబ్బంది పడుంటావో నిన్న నాకు ఆ పది నిమిషాల్లో తెలిసి వచ్చింది. ఆ రోజు నేను అలా చేసినందుకు, నువ్ నిన్న ప్రతీకారం తీర్చుకోవచ్చు. కానీ అలా చేయలేదు. ఆ సంధర్బం ఎంత ఇబ్బంది పెడుతుందో నాకు ప్రాక్టికల్‌గా చెప్పాలనే నువ్వు నిన్న లాక్ చేసి ఓ పది నిమిషాలు ఆలస్యంగా వచ్చావని అర్ధమైంది. ఇంకెప్పుడూ అలా అగులుబుగులు మనిషిలా ప్రవర్తించను. అయామ్ సారీ” చెప్పిందామె.
మధు చిన్న చిరునవ్వు నవ్వాడు విజయ గర్వంతో.