[box type=’note’ fontsize=’16’] శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారికి కనకాభిషేక సన్మానం జరిగిన సందర్భంగా 1948 సంవత్సరంలో ప్రచురించిన జ్ఞాపకసంచికను సేకరించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ పెద్ది సాంబశివరావు. [/box]
తెలుగు కవులలో పేరెన్నిక గన్న తుమ్మల సీతారామమూర్తి గారు గాంధీ కవిగా, దేశభక్తునిగా విశేష ప్రఖ్యాతులు గడించారు. వారికి యువప్రాయంలోనే విశేష కనకాభిషేకము, గజారోహణము 1945లో గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణమున జరిపారు.
ఆ సందర్భముగా 1948 సంవత్సరంలో ఒక జ్ఞాపకసంచికను ప్రచురించారు. అందు 150 మంది, నాటి ప్రముఖ కవులు, రచయితలు తమ సందేశాలను అందించారు.
లక్షకు పైగా పుస్తకాల నిలయం, గుంటూరు, అన్నమయ్య గ్రంథాలయములో మనసు ఫౌండేషన్ వారు అందజేసిన దాదాపు 40 వేల పుస్తకాలు, వాటి పట్టిక ఉన్నది. అందులో ఈ సంచిక లభించింది. దీనిని యూనికోడ్ రూపంలోకి మార్చి తెలుగు వారికి అందిస్తున్నారు పెద్ది సాంబశివరావు. ఇందుకు సహకరించిన తుమ్మల కళాపీఠం, అధ్యక్షులు డా. కొండబోలు బసవపున్నయ్య గారికి, తప్పులు సరిదిద్దిన డా. సూర్యదేవర రవికుమార్ గారికి ధన్యవాదములు తెలుపుకున్నారు.
~
నవోదయము
పలుకు పలుకు పలుకు
మా యాంధ్రవాణి పలుకు
మా తెలుగుతల్లి పలుకు
రాజమహేంద్రపురీ పురందరుడు
రాజరాజ పేరోలగమ్ములో
నాట్యముచేసిననాటి వైభవము
నేటిక హో! యీ చోటగంటినని..పలు.
పేరుగన్న నెల్లూరు పురంబున
మనుమసిద్ధి రాణ్మౌళి కొలువులో
శంఖనాదముల సంరంభములో
ఝంకృతిచేసిన సౌఖ్యమబ్బెనని.పలు.
కనకస్నానము నేటికబ్బెనని.పలు.
కంచుఢక్క భేదించి గడించిన
హరిహరరాయ ధరాధినాయకుని
తళుకుతళ్కుముత్యాలశాలలో
కృష్ణరాయ భూకాంతుని సభలో
అష్టదిగ్గజా లమరినసభలో
ఘల్లు ఘల్లుమని గర్జలు సల్పిన
మంజీరధ్వని మరలవింటినని ..పలు.
రఘునాథుని యాస్థానవీధిలో
రత్నహారములు కాన్కలుగాగొని
భద్రగజముపై వాడవాడలను
పయనము సల్పినఠీవి గంటినని..పలు.
అభినవతిక్కన సన్మానములో
ఆద్యగౌరవము లెల్ల దక్కెనని
తక్కిట తథిగిణ తకథై యంచును
తాండవించి రాణించితి నేడని.పలు.
– శ్రీ కుఱ్ఱా వేంకట సుబ్బారావు
~
తొలిపలుకు
సమాజవికాసము కల్గించు వారిలో కవియొకడు. అంతే కాదు, ప్రముఖుడు కూడ. అతడు ద్రష్ట. అతనిచూపు విశ్వవ్యాపకము.
అతనిసృష్టి సత్యము, శివము, సుందరము. అతడు నిద్రాణమైయున్న జాతిని మేలుకొల్పు వైతాళికుడు. అతని వాణి ప్రజానీకము నున్నతోన్నత శిఖరముల కెక్కించు నిశ్రేణి. అతడు లేని సంఘము నిర్జీవము. అతని నారాధింపని జాతి నిస్తేజము.
తరతరాల దాస్యముచే తన సంస్కృతిని గోల్పోయి క్రుంగి కుమిలిన మన సంఘము నేటికి – స్వతంత్రమై పురోగమించుచున్నది. అది ఉత్తమ మార్గములో పయనించి, విశ్వకల్యాణకారి యగునట్లు, తోడ్పడవలసిన బాధ్యత, అధికారము కవులకు హెచ్చుగా కలదు. అట్టి వారిని గుర్తించి, గౌరవించి వారి సందేశమును శిరసావహించి ఓజస్సు, తేజస్సు సమార్జించుకొనుట సంఘమున కవశ్యకర్తవ్యము.
కావున వర్తమానాంధ్ర కవులలో సుప్రసిద్ధులై చిరకాలికమైన సారస్వత సేవచే తెలుగుజాతికి జాగృతి కల్గించుచున్న అభినవ తిక్కన, శ్రీ తుమ్మల సీతారామమూర్తి చౌదరిగారిని సత్కరించుట సముచిత ధర్మమని తలంచితిమి. తెలుగునాడెల్ల మా యుద్యమముపట్ల నాదరాభిమానములు చూపి మాకు జవము, జీవము ప్రసాదించుట – ప్రశంసనీయము.
ఈ సందర్భమున మా విజ్ఞప్తిని పాలించి యీ సంచికకు అమూల్య రచనల నంపి తమ సౌజన్యమును ప్రకటించిన రచయితల కందఱకు మా నమోవాకములు.
వినీతుడు, వెలువోలు సీతారామయ్య, సన్మానసంఘాధ్యక్షులు
~
50 మందితో సన్మాన కమిటీ ఏర్పాటు చేశారు.
150 మంది కవులు, రచయితలు సందేశాలు పంపారు.
ఇతడు దేవరకోట రాజ్యేందిరా మ
నః ప్రియుడు శివరామ భూనాయకుండు
పేర్మిమై జాళువా గండపెండెరంబు
తొడిగి నవతిక్కనకు సొంపు లిడినవాడు
………………………
అధ్యక్షోపన్యాసము
శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారియెడ నాకు గౌరవాభిమానము లెక్కువ. వారియొక్కకృతిని గాంధీగారి యాత్మకథను జదివినప్పుడు నాకుగల్గిన యానందా శ్చర్యములకు మేరలేదు. అప్పుడు వారితో నాకు బరిచయము సున్న. వారిపేరైన విన్నవాడనుగాను. అయిననేమి? ”నిక్కమైన మంచినీలము” చూపుతోడన హృదయము నాకర్షించును. స్వయంప్రకాశమున్నచోట దూతికలేల? ఒకరుచెప్పి చూపవలయునా? ”కనులుండిన గాంతసొగసు కనబడదొక్కో” ఆటవస్తువుల యెడను, వ్యక్తులయెడను మెప్పు స్వయంభవము.
గాంధీగారి యాత్మకథను జదివినవెంటనే శ్రీ చౌదరిగారికి నాయొక్క మహదామోదమును దెలుపుచు లేఖ వ్రాసితిని. వారడిగికాదు. ఒకరి ప్రేరేపణమిద గాదు. అనివార్యమైన స్వేచ్ఛ స్వేచ్ఛమై నాటినుండి నేటివఱకు వారికవిత్వమునెడ నాకు నుండు గౌరవ భావమును, దానినుండి నే బడయు హృదయాహ్లాదమును దినదిన ప్రవర్థ మానములగుచున్నవి. పరిమితి లేదు. అమితత్వ దోషమును లేదు. కొనసాగుచున్నదిగాని కొననంట లేదు.
నిజమైన కవిత్వముయొక్క గుణములలో నిది యొకటి. ఎన్నిమార్లు చదివినను విసుగు పుట్టదు. క్రొత్తక్రొత్త రసములు స్ఫురించును. ఎంతదినిన నాకలి తీరదు. రోయింపు పుట్టదు. ఇంకను దినగోరుదుము.
వీరి గ్రంథములయందెల్ల నాత్మకథ యగ్రగణ్యము. తక్కినయవి సామాన్యములు కావు. కాని వానియందలి విషయములు గాంధీగారి జీవితముతో దులదూగ జాలినంత గొప్పవికావని నాయభిప్రాయము. శైలికి దగినట్లు విషయముండవలయును. లేనిచో నది పదాడంబర ప్రకటనమగును. విషయమునకు దగినట్లు శైలి యుండవలయును. లేనిచో జీవముండినను నాకృతి సౌందర్యముండదు. రసవంతము కానేరదు. ఆకర్షింపదు. ఆత్మకథయందు రచన మనోహరము. గాథ లోకోత్తరము. ఇంత ప్రశస్తముగ రెండును దక్కిన గ్రంథములలో నలపడెనో లేదో నేను దృఢముగ జెప్పజాలను. దేశభక్తి, యాంధ్రాభ్యుదయ రక్తి, పితృపూజ యివన్నియు మన జీవితమున నఖండములైన జ్యోతులు! వాని వెలుగుచే మనల నావరించియుండు తమము కొంతకు గొంత విరియును. అయినను వీనికిని మించిన యితివృత్తములు లేకపోలేదు. యావన్మానవుల యాత్మలను బరవశములజేసి హృదయము నగలించి మనసులకు నిశ్చైతన్య మొసంగెడు కావ్యములు, భారత రామాయణముల వంటివి పుట్టవా యికముందు? హైందవ భావనాశక్తి యడుగంటి యింకి పోలేదు. దేశమునకు స్వతంత్ర పరిపాలనాభాగ్యము సంభవించినది. ఈ గొప్పకథకు దగినట్టి వీరకావ్యములను వ్రాయజాలిన వారలలో సీతారామమూర్తి యున్నాడా? లేడా? ఉన్నాడని నా నమ్మిక. నా నమ్మిక వమ్ముచేయడనియు నా విశ్వాసము. సీతారామా! విశ్వాస ఘాతుకుడవు కాకుము.
మన చౌదరి యతిప్రాసములకై భంగపాటుచెంది తలగోకికొనుచు బలాత్కార పదప్రయోగములు చేసి, యర్థము ననుసరించి పదములువాడక, పదములబట్టి యర్థమును వంపులుపెట్టి వంగజేయు నీరసుడుగాడు. భావ మనర్గళముగ బ్రవహించు చందాన వ్రాయు మహనీయుడు. యతి పదాదియందేకాక మధ్యమునను గొననువ్రాలును. ప్రాసమునకు, యతికినై పద్యము యొక్క నడక నిలిచి దాటవలసిన యిబ్బందిలేదు. అర్థమును బట్టి పదములు, పదములలో లీనమైనరీతిని యతిప్రాసములు ననాయాసముగ, నప్రయత్నముగ, స్వచ్ఛందముగ వచ్చి చేరుచుండును. ఈ సిద్ధియందు బ్రసిద్ధుడు తిక్కన. ఈ వర్గమున దిక్కన్నతో సజాతీయుడైనవాడు మన చౌదరి. అనగా సరిసమానుడని యతిశయోక్తి బలికి యపాయము దేను. ఆ వర్గమున నగ్రాసనత్త్వము లేకున్నను నాసనత్వముకలవాడని నా మనవి.
నన్నయ సాంస్కృతిక దీర్ఘసమాసముల వెదచల్లినాఁడు భారతములో, కాని యవి యన్వయ సౌకర్యమున నర్థ సౌలభ్యమున సాధారణమైన పదములకంటె నేమాత్రము కఠినములు కావు. మఱి యవన్నియు శ్రావ్యములు, సరళములు పామరులకు సయితము సులభ వేద్యములు కాగలవి. మన చౌదరియు నిట్టిసమాసముల రచించుటయందును నిజముగ భారతీయుఁడ ! నన్నయయందు బోలె, బేరునకు మాత్రము సాంస్కృతికములు: నిజమున కాంధ్రములు. కవితాకళలో నద్భుతానందముల సమకూర్చు నంశములలో నిదియొకటి. ఎఱ్ఱనయుఁ, దిక్కనయు నన్నయ్యకు నీడుజోడులే. యీ మహత్తరశక్తిని. వారు వ్రాసిన దందరకు నర్థమగుటకొరకు. అందఱి మనసులు కరఁగుటకునై. ఆ సంప్రదాయము నుద్దరించిన యాధునికుడు సీతారామమూర్తి.
స్వయముగ నీ యుత్సవ సభలకువచ్చి కన్నారఁ జూచి చేతులారఁ జేయుభాగ్యము విధికృతంబుచే నాకు లభించినది కాదు. కారణములు తెలుపలేను. ప్రకృతము నాది శోకపూరితమైన బతుకు. శాంతి లేదు. సౌఖ్యమంతకు మున్నె లేదు. “తన చేసినదానం బడకపోవ శివునకు వశమే?” అనుభవింపకతప్పదు. నే రానందున సీతారామమూర్తికి గలుగు సేగి, లోటు లెవ్వియు లేవు. ఆ నష్టములు నావి. మనఃకష్టములును.
శ్రీ సీతారామమూర్తి యొక్క గొప్పతనమును గ్రహించి యుక్తరీతి నీ యుత్సవములచే గౌరవించిన యాంధ్రులు తమకర్తవ్యమును నెఱవేర్చిన ధన్యులు. వారికిని నా యభినందనములు.
విధేయుడు, కట్టమంచి రామలింగారెడ్డి
25-12-48
మదరాసు
~
ఆశీస్సు
సీతారామయచౌదరి
ఖ్యాతి గణించెన్ గవిత్వ కల్పనయందున్
నూతన తిక్కన యన్నా
రీతని సమకాలికులు కవీశ్వరు లెలమిన్
విద్యయున్న లేదు వినయంబు, వినయమ్ము
కలదయేని విద్యగలుగు టరిది
ఇతని పట్ల నుభయ మెసకమ్మెసంగె ది
క్కన్న బలెనె కీర్తిగాంచుగాక
కలవాడీతడు శిరమున
గలవాని ధరించు వేల్పుకరుణన్ శ్రీయున్
గలయున్ జిరాయువున్ వ
ర్థిల వర్తిలుగాక సుకవిధీరులు మెచ్చన్
దోసతోట బోలు తోకమ్ముతో సిరి
తో యశమ్ముతో నితోధికమగు
గరిమతోడ మెచ్చు గాంచుత గవులెల్ల
దనదు విభవమున కెద న్నుతింప
వచ్చునట్టి వయసు వార్థకమ్ముగదా! ని
రామయతయ దాని కమరవలయు
గాన సభ్యులేక కంఠులై యీయన
కర్థి గోరుడెపు డనామయంబు
–శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, శతావధాని
~
కృతీ!
నారీతిం గవనంబు చెప్పగల యంతస్సారముం గల్గు వీ
డౌరా వీనికి బోలు గౌరవము నీయాంధ్రప్రజల్ చేయుచు
న్నా రంచుం గని తిక్కయజ్వ కవితానాథుండు దీవించెడుం
దారామండలమందు నుండి యిదె సీతారామమూర్తీ! నినున్
ఏనా డక్షయమౌ కటాక్షముల నిన్వీక్షించెనో వాణి నీ
వానాడే మరి యేను గెక్కితివి విద్యాకేతు హస్తుండవై
యానాడే కనకాభిషిక్తుడవు నీ వైనాడ వీ రెండు న
ద్దానన్ నేడు విడంబనమ్ము చుమి సీతారామమూర్తీ! కృతీ!
తపనీయేష్టకలన్ భవజ్జనకు డే ధర్మంబు ముం దంతికో
లపతుల్యంబుగ దూచి యిచ్చె నవలీలం జూచి యీధర్మమే
యిపు డీ నీ కనకభాభిషేకమున కెంతే బీజ మీ నీ కవి
త్వపు భాండారము తచ్ఛరీర మగు సీతారామ కవ్యగ్రణీ!
ఏనుం గెక్కుట రాజలక్షణ మహో హేమాభిషేకోత్సవో
త్సానందం బది సార్వభౌములకు దా నంకంబు నీ రెంటి సం
ధానం బుండుట ‘బూర్జువా’ కవియె సీతారామకవ్య గ్రియుం
డౌనం చాడెడువా రుపాయనము చేయన్ లగ్గు ‘నోబెల్’ వలెన్
కమ్మ కవిత్వము చెప్పెడి
కమ్మ కవీశ్వరుని చేత గర్మకులంబౌ
కమ్మ కులమ్మిప్పుడుగా
కమ్మ కులంబాయె వాణికమ్మలు తొలుకన్
– వేలూరి శివరామశాస్త్రి
(సశేషం)