చారిత్రక కథా సాహిత్యం – జాతీయ సమైక్యత

0
4

[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకుల కోసం డా. టి. గోపాలకృష్ణారావు రచించిన ‘చారిత్రక కథా సాహిత్యం – జాతీయ సమైకత్య’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము. మూల రచన ‘తెలుగు’ వైజ్ఞానిక త్రైమాసిక పత్రిక జనవరి – మార్చి 2004 సంచికలో ప్రచురితం. [/box]

[dropcap]ఏ[/dropcap] దేశ ప్రజలకైనా జాతీయభావం ఉండడం అత్యావశ్యకం. లేకపోతే బలవంతులైన ఇతర దేశీయుల ఆక్రమణ సందర్భంలో దేశానికి ముప్పు ముంచుకొని వచ్చే సమయంలో లేదా పారతంత్ర్యంలో మగ్గుతున్న క్లిష్టసమయంలో ‘ఎవరికివారే యమునా తీరే’ అన్నట్లు ప్రజలు ఏమీ పట్టించుకోకపోతే దేశ ప్రజల మనుగడ విపత్సముద్రంలో మునిగిపోయే అవకాశం ఉంది. ప్రజలందరూ ఆ సమయంలో జాగ్రదవస్థలో ఉండి, శత్రువులను పారద్రోలగలిగారంటేనే దేశ సమగ్రత, సమైక్యత నిలువగలదు. ప్రజలు సుఖసంతోషాలతో అభివృద్ధిని సాధించగలరు. ఇది ఏ దేశానికైనా వర్తించే లక్షణం. ఇది తిరుగుబాటుచేసి, స్వాతంత్ర్యం సంపాదించుకొన్న ప్రతి దేశానికి వాస్తవమైన అంశం. అప్పుడే జాతి జాగృతమై, తమ్ముతాము రక్ష్మించుకోవడానికి సాధ్యమవుతుంది. ఇది భారతదేశం పట్ల సత్యం. ఈ జాతీయ సమైక్యానికి సాహిత్యం దోహదకారి అయిన అంశం స్తవం గాని వాస్తవం.

కవి సమాజంలోని కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, మేధావి వర్గంలో మొదటి శ్రేణికి చెందినవాడు. నిద్రావస్థలో ఉన్న సమాజాన్ని తట్టిలేపి జాగృతం చేయగల వైతాళికుడు. అందుకే సమాజంలోని మంచి చెడులకు అనుగుణంగా స్పందించి ఉచితరీతిని రచనలు చేసి, తన రచనల ద్వారా ప్రజల్ని, జాతిని మేల్కొల్పుతాడు. పరిస్థితుల ప్రభావం కవిపై ఉంటుంది. కవి తగు ఉచితరీతిని రచన చేస్తాడు. కాబట్టి సామాజిక స్థితి ప్రభావం కవిపైన, కవి రచనల ప్రభావం జాతి మీద పరస్పరం ఉంటుందని మనం గ్రహించవచ్చు. ఇది మామూలుగా కొనసాగే కాలంలో ఉండకపోవచ్చు. విపరీతమూ, విరుద్ధమూ, ఘోరమూ అయిన పరిస్థితులు నెలకొన్నప్పుడు తప్పనిసరిగా జాతి స్పందిస్తుంది. అందులో ప్రప్రథమంగా రచయితలు స్పందించి, తన్నిరోధం కోసం, మంచిని పెంచడం కోసం రచనలు చేస్తారు. సమంగా ఈ లక్షణమే మన భారతదేశం అస్వతంత్రమై పరపీడన భరించలేక స్వాతంత్ర్యం కోసం అర్రులు చాచి, ఆరాటపడిన దినాలలో భారత జాతీయ సమైక్యత కోసం కవి కోకిలలు గళాలు విప్పి పంచమస్వరంలో కవితా గానమాలపించాయి. ఆ కవితలే, ఆ సాహిత్యమే జాతినంతటిని సంఘటితపరచి స్వాతంత్రోద్యమ సమరంలో దూకడానికి చైతన్యాన్ని ఇచ్చాయి. ఉన్ముఖులను చేయడమే గాక ప్రాణ బలిదానానికి సిద్ధపరచాయి. జాతి, మత, వర్గ బేధాలు లేకుండా దేశ ప్రజలందరూ సమైక్యమై జాతీయ సమరంలో చేరి తెల్లదొరల బారి నుంచి తప్పించి, దేశ స్వాతంత్ర్యం కోసం ఒకే తాటిపై నడిచి, స్వాతంత్ర్యం సంపాదించి స్వేచ్ఛావాయువులు పీల్చగలిగారు. మనం స్వతంత్రులమయ్యాం. ఈ సందర్భంలోనే జాతీయ సమైక్యానికి సాహిత్యమెంతగానో దోహదం చేసింది.

“Nationalism is a state or condition of mind characteristic of certain people with a homogeneous culture, living together in close association on a given territory and sharing a belief in a distinctive existence and a common destiny.”

ఈస్టిండియా కంపెనీ భారతదేశంలో నెలకొన్న తరువాత క్రమంగా ఆంగ్ల ప్రభుత్వం ఈ గడ్డపై మెల్లగా కాలూని స్థిరపడింది. భారతీయులలో ఇది కొంత కలవరపాటు కలిగించింది. క్రమంగా సైనికులలో, స్థానికులలో, సంస్థానాధిపతులలో, రాజులలో అసంతృప్తి కలిగింది. తత్ఫలితమే 18వ శతాబ్దంలోనే తలెత్తిన తిరుగుబాట్లు, ముఖ్యంగా 1857లో జరిగిన సిపాయి తిరుగుబాటు వీటిలో మొదటిది. భారత స్వాతంత్రోద్యమానికి పునాది సిపాయి తిరుగుబాటుగా ఆంగ్ల ప్రభుత్వం భావించి, అణచివేసింది. స్వాతంత్ర్య భావ బీజాలు భారత ప్రజల హృదయసీమల్లో ఉద్బుద్దమయ్యాయి. క్రమంగా స్వాతంత్ర్యం కోసం ఉత్తర భారతంలో ఎందరో ఎన్నో విధాలా ప్రయత్నించారు. కొంత ఆలస్యంగానే అయినా దక్షిణ భారతంలోను ప్రజలు స్పందించారు. చైతన్యవంతులై స్వాతంత్ర్య సముపార్జనకు పాటుపడ్డారు. అలాగే ఆంధ్రులు సైతం తమ వంతుగా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. కవులు తామూ ప్రజల్ని సాహిత్యంలో ఉత్తేజపరిచి, ముందుకు నడిపి, స్వాతంత్ర్య సముపార్జనలో కీలకపాత్రను నిర్వహించారు. జాతీయ సమైక్యం కోసం సాహిత్యం దోహదం చేసింది. ఆ సందర్భంలోనే కవితలు, నాటకాలు, నవలలు రచితమై, ప్రజలకు స్వాతంత్ర్య ఆవశ్యకాన్ని, ప్రాధాన్యాన్ని ప్రస్ఫుటం చేసి, ముందంజ వేయడానికి ఉపకరించాయి.

‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసీ’ – అన్న సూక్తి భారతీయుల జాతీయ భావనకు ఆదర్శమైంది. ఇది –

‘గంగేచ యమునే చైవ

గోదావరి సరస్వతి

నర్మదే సింధు కావేరి

జలేస్మిన్ సన్నిధిం కురు’

అన్న నదీనదాల ఏకస్వరూప భావనలో దర్శితమైంది. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక రూపాల్లో, బహుముఖాలుగా ఆయా కవులచేత, ఆయా సందర్భాలలో సాక్షాత్కరించింది, పవిత్రమైందిగా విలసిల్లింది. ఆధునిక యుగంలో ఈ జాతీయస్పూర్తి పునరుజ్జీవనోద్యమంలో వినూత్నంగా సాక్షాత్కరించింది. పృధ్విమాత అయింది. జన్మభూమి బంకించంద్రుని వందేమతరంలో శక్తిరూపంగా, చైతన్య విలసిత మూర్తిగా, అనంతశక్తి రూపంగా దర్శింపబడింది. జాతీయోద్యమకాలంలో భారతీయ సంస్కృతీ రంగాన్ని, సాహిత్యాన్ని ఈ భావన ముందుకు నడిపించింది. మాతృదాస్య విముక్తి లక్ష్యమైంది. పురాణ గాథలు ఆధునిక చైతన్యంలో సాక్షాత్కరించాయి.

దేశం స్వాతంత్ర్యం పొందడంతో మరో కొత్తయుగం ఆరంభమైంది. ప్రజల ఆశలకు, ఆశయాలకు వారి భవిష్యత్తు నిర్మాణానికి అనుగుణంగా సౌభాగ్యవంతమైన దేశాన్ని రూపొందింపచేయడానికి – రాజకీయ సాంఘికమైన అనేక విధానాలతో, మార్గదర్శక సూత్రాలతో భారత రాజ్యాంగం 26 జనవరి 1950లో అమలులోకి వచ్చింది.

‘ఉదార చరితునకు వసుధయే కుటుంబం’ అన్న సూక్తి గుర్తుకు రాకమానదు. మన ప్రాచీయ వాఙ్మయంలో దీనికి సంబంధించిన అనేకాలైన అంశాలు కనిపిస్తాయి. తెలుగులో జాతీయ భావనాకవిత్వం ఎంతో వెలువడింది. ఈ కవిత్వాన్ని విశ్లేషిస్తే-

  1. దేశ భౌగోళిక వర్ణనాత్మకమైంది – పర్వతాలు, పుణ్య నదీనదాలు, చారిత్రక స్థలాలు, పవిత్ర క్షేత్రాలు మొదలైనవాటిని వర్ణించేది.
  2. సంస్కృతీ స్వరూపానికి సంబంధించింది – ఆచార వ్యవహారాలు, తాత్త్విక వేదాంత ధోరణులు, కళాత్మకమైన అంశాలను వెలార్చేది.
  3. చారిత్రకమైన వస్తువుతో జాతిలో చైతన్యాన్ని ఉజ్జ్వలింపచేసేది.
  4. తత్కాలీనమైన రాజకీయావగాహనతో యుద్ధ వాతావరణాన్నో, ఉద్యమాలనో, వర్తమాన పరిస్థితులనో పురస్కరించుకొని వెలువడేది – ఇత్యాదిగా ప్రధాన శాఖలు కనిపిస్తాయి.

భారతదేశ భౌతిక సంపదలోని భాగాలే నదీనదాలు, పర్వతాలు, పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలు, ఇవి జాతికి మహనీయమైనవి, పవిత్రమైనవి. ప్రతి భారతీయుణ్ణి ప్రత్యక్ష సంబంధం చేత జాతీయభావ ప్రేరితుణ్ణి చేసేవి.

‘జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి

జయ జయ జయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి.’

శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి భారతదేశాన్ని మాతృమూర్తిగా స్త్రీ పురుష సమాహితమైన అసంఖ్యాక జనానీకంతో రూపొందిన సంఘటిత శక్తిగా ఐక్యతను భావిస్తూ రాసిన గీతం.

‘ప్రాభాత ప్రాంగణాన మ్రోగేను నగారా

భారతభువి పొందెను ముక్త జీవధారా’

పరిపాలన నుంచి స్వాతంత్ర్యాన్ని పొంది దేశమంతటా స్వేచ్ఛా భావనతో కూడిన చైతన్య శక్తి ప్రవహిస్తున్న తీరు ఇందులో దర్శితమైంది. ఈ జీవధార జాతి మనుగడకు అత్యంత ఆవశ్యకమైంది.

1917 ప్రాంతంలో గాంధీజీ భారత స్వాతంత్రోద్యమానికి సారథ్యాన్ని చేపట్టాడు. ఆయన సారథ్యంలో స్వాతంత్ర్య సమరం అంతకు ముందులేని ఏకోన్ముఖతను, నిర్దిష్టమైన ఆదర్శ సిద్ధాంతాలను సంపాదించుకున్నది. 1920 ప్రాంతంలో గాంధీజీ సహాయ నిరాకరణమనే ఆయుధాన్ని స్వాతంత్ర్య పోరాటంలో ప్రయోగించాడు. గాంధీజీ స్వాతంత్రోద్యమాన్ని, హరిజనోద్ధరణను చిత్రిస్తూ ఒక గొప్ప నవల ఈ వికాసయుగం చివర తెలుగులో వచ్చింది. అదే ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’ (1921). మాలపల్లికి పూర్వం జాతీయోద్యమాన్ని చిత్రిస్తూ వేలూరి శివరామశాస్త్రి ‘ఓబయ్య’ (1920) అనే నవలను రాశాడు. ‘ఓబయ్య’లో ఓబయ్య అనే విద్యావంతుడైన యువకుడు జాతీయవాదియై చిన్ననాడే పెండ్లి అయినా బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ గ్రామ నిర్మాణ కార్యక్రమాలను చేస్తుంటాడు. కాని ఓబయ్య చేసిన కార్యక్రమాలెన్నో మూలబడినట్లు చెప్పి రచయిత నిరాశావాదాన్ని సృష్టించాడు. కాని చివరకు గ్రామం అగ్నిజ్వాలలకు గురైనప్పుడు ఓబయ్య శిష్యులు వచ్చి మంటలార్పడం, ఓబయ్య చిన్నవాటి భార్య వైద్య విద్య చదివి ఆ గ్రామానికి వచ్చి సేవ చేయడం ద్వారా రచయిత ఆశాతత్త్వాన్ని పోషించాడు. మాలపల్లిలో గాంధీజీ జాతీయోద్యమం, హరిజనోద్ధరణలు ప్రతిబింబించాయి.

ఉన్నవ గాంధీజీ సిద్ధాంతాలను నమ్మినవాడు. సందర్భానుకూలంగా రచయిత పాత్రల ముఖాన గాంధీజీ సిద్ధాంతాలను ఆదర్శాభిప్రాయాలుగా చెప్పించాడు. గ్రామాల్లో ఉండే వర్ణవ్యత్యాసాలను, కక్షలను, పగలను ఉన్నవ వాస్తవికంగా చిత్రించాడు.

తెలుగు సాహిత్యంలో అసలైన జాతీయభావన, జాతీయ సమ్యైతకు అంకురార్పణ చేసింది ఉన్నవ లక్ష్మీనారాయణ. తెలుగులో జాతీయభావన, జాతీయ సమైక్యత నిజానికి కవిత్వంతో మొదలు కాలేదు. నవలతో మొదలైంది. 1917 అక్టోబరు విప్లవం గురించి తెలుగులో మొదట చెప్పడానికి పూనుకొన్నది పట్టాభి సీతారామయ్య. 1921 ఆంధ్ర పత్రిక ఉగాది సంచికలో ‘సోవియట్టులు’ అని ఆయన రాశారు. ఉన్నవ లక్ష్మీనారాయణ గారు మాలపల్లి నవలలో సోషలిస్టు భావాలను, బోల్షివిక్ విప్లవ భావాలను అనుకూల వైచిత్రిలో ప్రవేశపెట్టారు. కొవ్విడి లింగరాజు గారి ‘అమ్మ’ 1932 ‌‌- 1934లో వచ్చింది.

మాలపల్లి జాతీయోద్యమానికొక నూతన దృక్పథాన్నిచ్చింది. ఒక నూతన పంథాను చూపెట్టింది. ఈ పంథా ఒక దశాబ్దం తరవాత తేజోవంతమై చాలామంది యువకుల్ని ఆకర్షించింది. తెలుగు సాహిత్యంలో మాలపల్లికి గల చారిత్రక ప్రాధాన్యం ఇదేనని కంభంపాటి సత్యనారాయణ ‘అర్ధశతాబ్దకాలంలో ఆంధ్రులపైన అక్టోబరు విప్లవ ప్రభావం’ అనే వ్యాసంలో పేర్కొన్నారు. విశ్వనాథ సంప్రదాయ వివాహ వ్యవస్థను సమర్థిస్తూ ఉన్ముక్త ప్రేమను నిరసిస్తూ ఏకవీర (1925),  చెలియలికట్ట (1935) నవలలను రాశాడు.

చారిత్రక నవలల్లో చిలకమర్తి – హేమలత, అహల్యబాయి శాపం (1923), విష్ణువర్దనుడు (1927), వెంకట పార్వతీశ్వర కవుల – వసుమతీ వసంతం (1913), ప్రమదావనం (1914), ధరణి ప్రెగడ వెంకట శివరావు – కాంచనమాల (1908 శివాజీ చరిత్రను చిత్రించేది), భోగరాజు నారాయణమూర్తి – విమలాదేవి (1910), ఆంధ్ర రాష్ట్రము (1916), అస్తమయము, ధరణికోట (1917), వేలాల సుబ్బారావు – రాణి సంయుక్త (1908), శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి – ఆంగ్లరాజ్య స్థాపన(1917), వంగూరు సుబ్బారావు – ప్రభాతం (1915), కేతవరపు వేంకటశాస్త్రి – రాయచూరు యుద్ధం (1913), ఆనందాబాయి, దుగ్గిరాల రాఘవచంద్రయ్య చౌదరి – విజయనగర సామ్రాజ్యము (1913), చిలుకూరి వీరభద్రరావు – కర్ణ సామ్రాజ్యము (1916), నాయకురాలి దర్పము (1916), ఏ.వి నరసింహం – విజ్జలదేవి (1915) చెప్పుకోదగినవి.

ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించిన ఇతివృత్తాన్ని తీసుకొని చారిత్రక నవలలను రాసిన వారిలో కేతవరపు మొట్టమొదటి వాడనాలి. ఆంధ్రదేశ చరిత్రలోని ఘట్టాలను వర్ణిస్తూ ఆయన ‘రాయచూరు యుద్ధం’ (1914). ‘బొబ్బిలి ముట్టడి’ అనే చారిత్రక నవలలను రాశారు. ఈ రెండింటిలో రాయచూరు యుద్ధము రచన 1913లో జరిగినా 1914లో ముద్రితమైంది. ఈ కాలంలోనే సరిగ్గా దుగ్గిరాల రాఘవచంద్రయ్య చౌదరి ‘విజయనగర సామ్రాజ్యము’ (రచన 1913 ప్రచురణ 1914) నవల ఆంధ్రదేశ చరిత్రను చిత్రించేది వెలువడింది. దీన్ని విజ్ఞాన చంద్రికా గ్రంథమాల ప్రచురించింది. ఇదే పద్ధతిలో ఆంధ్రదేశ చరిత్ర ఘట్టాలను చిత్రిస్తూ భోగరాజు ‘ఆంధ్రరాష్ట్రము’ (1916) రాశారు.

20వ శతాబ్దరంభంలో వచ్చిన సాంస్కృతిక పునరుజ్జీవనం, తత్ఫలితంగా రేకెత్తిన జాత్యభిమానం, స్వాతంత్రేచ్ఛలు ఈ చారిత్రక నవలల్లో ప్రతిబింబించాయి. 1857లో విదేశీపాలనకు వ్యతిరేకంగా ప్రథమ స్వాతంత్ర్య సమరం జరిగింది. 1855 విశ్వవిద్యాలయాల స్థాపనతో పాశ్చాత్య విద్యా విధానం భారత దేశంలో ప్రవేశించింది. పాశ్చత్య నాగరికతా ప్రభావాన్ని, క్రైస్తవమత వ్యాప్తిని, పాశ్చత్య విద్యాబోధనను ఎదిరిస్తూ కొందరు మేధావులు తిరుగుబాటు ఉద్యమాలు లేవదీశారు. అంతేగాక భారతీయుల్లో ఉన్న అజ్ఞానం, మూఢ విశ్వాసాలు, సాంఘిక దురాచారాలు నశిస్తే గాని ఏదీ సాధించలేమని గ్రహించిన మహామహులు సంఘ సంస్కరణోద్యమాలను నడిపారు.

సాంస్కృతిక పునరుజ్జీవనంతో పాటు జాతీయాభిమానం, దేశభక్తి కూడా భారతీయుల్లో పెంపొందసాగాయి. లార్డ్ కర్జన్ చేసిన బెంగాల్ విభజనతో బెంగాల్‍లో స్వరాజ్య వాంఛ, జాతీయాభిమానాలు ప్రబలాయి. బెంగాల్‍లో నాయకుడు బిపిన్ చంద్రపాల్, ముట్నూరి కృష్ణారావు ఆహ్వానం మీద మచిలీపట్నం వచ్చి ఉపన్యసించాడు. అదే ఆంధ్రదేశంలో జాతీయోద్యమానికి నాంది పలికింది. జాతీయోద్యమం పెల్లుబికి ప్రజల్లో జాతి ప్రాచీన వైభవం మీద అభిమానగర్వాలు ప్రబలాయి. తత్ఫలితంగా రచయితలు ప్రాచీన చరిత్రలోని ఘట్టాలను తీసుకొని నవలలను రాశారు. ప్రాచీన చరిత్రలోని యథార్థ సంఘటనలను, యథార్థమైన ఒక రాజు కాలాన్ని తీసుకుని కల్పిన పాత్రలతో ప్రబోధించే చారిత్రక నవలలు కూడా రాయబడ్డాయి. పాఠకులు వీటిని చదివి ఉత్తేజితులయ్యారు. భారత జాతీయోద్యమంతో పాటు ఆంధ్రోద్యమం 1913 నాటి నుంచే ఆరంభమైంది.

చిలకమర్తి – శాపము (1923), విష్ణువర్దనుడు (1927) వంటి ఆంధ్రులకు సంబంధించిన ఇతివృత్తాలను తీసుకున్నా ఇవి పూర్తిగా కల్పితమైనవి, చరిత్రాధారాలు లేనివి. వీటికి పూర్వమే 1914లో రాయచూరు యుద్దం, విజయనగర సామ్రాజ్యం, బొబ్బిలి ముట్టడి, 1916లో ఆంధ్రరాష్ట్రం వంటి చారిత్రకేతివృత్తం గల చక్కటి నవలలు వచ్చాయి. తరవాత కాల్పనికోద్యమ యుగంలో బాపిరాజు, నోరి నరసింహశాస్త్రి ఆంధ్రుల చరిత్రకు సంబంధించిన ఇతివృత్తాలతో గొప్ప చారిత్రక నవలలను రాశారు. ఈ విధంగా వికాస యుగంలో చారిత్రక నవలలు జాతి పునరుజ్జీవనం, జాతీయోద్యమం ప్రభావంతో తెలుగులో ముమ్మరంగా రాయబడ్డాయి.

అడవి బాపిరాజు చారిత్రక నవలలు తెలుగు నవలా సాహిత్యానికి అలంకారాలు. ఆయన ఆంధ్ర దేశాన్ని పాలించిన రాజవంశాలనొక్కొక్కదాన్ని తీసుకొని ఆ కాలంనాటి చారిత్రక వైభవమంతా ప్రతిబింబించేటట్లుగా నవలలను రాశారు. చాళుక్య యుగాన్ని చిత్రిస్తూ ‘అంశుమతి’, శాతవాహనుల యుగాన్ని చిత్రిస్తూ ‘హిమబిందు’, ఇక్ష్వాకుల యుగాన్నిచిత్రిస్తూ ‘అడవిశాంతి శ్రీ’, కాకతీయుల యుగాన్ని చిత్రిస్తూ ‘గోన గన్నారెడ్డి’ నవలలను బాపిరాజు రాశారు. చారిత్రక సత్యాలను తీసుకొని ఆయా యుగాల సాంఘిక ధార్మిక రాజకీయ పరిస్థితులను కన్నులకు కట్టేటట్లుగా చిత్రించిన చారిత్రక నవలాకారుల్లో బాపిరాజు మొదటివారు. ఆంధ్రజాతి సాంస్కృతిక వైభవాన్ని బాపిరాజు చిత్రించినంతగ మరెవ్వరూ చిత్రించలేదు. బాపిరాజుకు గత సంస్కృతీ వైభవాల మీద మక్కువ ఎక్కువ. సున్నితమైన భావాలను మధురమైన వర్ణనా శైలిలో విషయాన్ని చెప్తాడు. ఎంత సుదీర్ఘంగా చెప్పినా విసుగు పుట్టదు. బాపిరాజు గత చరిత్రలోని సంస్కృతీ వైభవాన్ని ప్రేమ సౌందర్యాన్ని దర్శిస్తే, చలం సంప్రదాయం మీద పెద్ద తిరుగుబాటు చేసిన నవలాకారుడు.

కాల్పనిక యుగంలో ఇంకా కొన్ని చారిత్రక నవలలు రాయబడ్డాయి. పిలకా గణపతిశాస్త్రి ‘మీనాంబిక’ నాయకరాజుల కాలం నాటి చారిత్రక నవల. ఆయన ‘కాశ్మీర పట్టమహిషి’, ‘విశాల నేత్రాలు’ కూడా శృంగార వీర రసభరితమైన చారిత్రక నవలలు.

అడవి బాపిరాజు మాదిరిగానే ఆంధ్రుల చరిత్రలోని వివిధ రాజవంశాల కాలంనాటి ఇతివృత్తాన్ని తీసుకొని చారిత్రక నవలలు రాసిన వారు నోరి నరసింహశాస్త్రి. చరిత్రక యథార్ధతలతో ఇతివృత్తాన్ని నిర్మించి ప్రాచీన చరిత్ర, వైభవాలను నోరి తన నవలల్లో చిత్రించారు. చాళుక్యుల నాటి చరిత్ర రాజకీయాలను చిత్రిస్తూ నోరి ‘నారియణ భట్టు’ నవలను రాశారు. ‘రుద్రమదేవి’ (1951) రెడ్డి రాజుల కాలాన్ని చిత్రిస్తూ ‘మల్లారెడ్డి’ (1958), ‘కవి సార్వభూముడు’ విజయనగర కాలాన్ని చిత్రిస్తూ ‘ధూర్జటి’ నవలలను రాశారు.

1952లో వచ్చిన నవల జి.వి కృష్ణారావు ‘కీలుబొమ్మలు’ నవల భారత స్వాతంత్యానంతరం గ్రామాల్లో వచ్చిన సాంఘిక ఆర్థిక పరిణామాలను చిత్రిస్తున్నది.

ఈ కాలంలో తెలుగువాళ్లు గర్వించదగిన చారిత్రక నవల ‘చెంఘీజ్ ఖాన్’ (1956), ఈ నవలను తెన్నేటి సూరి రాశారు. మంగోలియన్ నియంత చెంఘీజ్‍ఖాన్ జీవితాన్ని ఈ నవల చిత్రిస్తున్నది. ఇది స్వతంత్రమైన నవల. మధ్య ఏషియాలో విజృంభించిన క్రూరుడు, వీరుడు అయిన చెంఘీజ్ దురంతాలను దీనిలో రచయిత చాలా నేర్పుతో చిత్రించారు.

అడవి బాపిరాజు హిమబిందు నవలలో ఆంధ్ర శాతవాహన రాజు ఉజ్జయినీ పాటలీపుత్ర నగరాలను జయించి గంగాతీరం వరకు ఉత్తర భారతాన్ని శాతవాహన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడని చారిత్రక కథనం రాశారు. శాతవాహనుల కాలంనాటి వైదిక బౌద్ధమతాల సమన్వయాన్ని, వాణిజ్య వైభవాన్ని, సంస్కృతీ ఔన్నత్యాన్ని పాఠకుల కనులముందు నిలిచేటట్లుగా బాపిరాజు వర్ణించారు. ఆయన చెప్పినవన్నీ చారిత్రక సత్యాలు కాకపోయినా ఒక చారిత్రకయుగాన్ని ప్రతిబింబింపచేస్తూ నవల నడుస్తుంది. ఇక్ష్వాకురాజుల పాలనావైభవాన్ని, ధార్మిక దృష్టిని, సంస్కృతి వైభవాన్ని చాలా యథార్థంగా చిత్రించాడు. బాపిరాజు కేవలం రచయితే కాదు భావుకుడు. దివ్యదృష్టి కలవాడు. ఆయన రాసిన అన్ని చారిత్రక నవలలు ఆంధ్రుల చరిత్ర పుస్తకాలను చదవకుండానే ఆంధ్ర దేశాన్నేలిన రాజుల చరిత్రలు, ప్రజాజీవనం, కళాసంస్కృతుల వైభవం, రాజకీయ పాలన, యుద్ధాలు అన్నీ కరతలామలకం చేస్తూ ఉన్నాయి. భవ్యంగా, దివ్యంగా చారిత్రక నవలలను తెలుగులో రాసినవాడు అడవి బాపిరాజు. రచనా శిల్పం, సరళమైన ఊహాలోకాల్లోకి తీసుకుపోగలిగిన భాషాభావాలు, ఆయా యుగాలకు సరిపడే పాత్రల సన్నివేశ వాతావరణ కల్పన బాపిరాజు చారిత్రక నవలల్లో మాత్రమే కనిపించే విశేషత.

వికాసయుగంలోనే విజ్ఞాన చంద్రికా మండలి ప్రచురించిన ‘విజయనగర సామ్రాజ్యము, రాణీ సంయుక్త, ఆంధ్రరాష్ట్రం’ వంటి కొన్ని చారిత్రక నేపథ్యాలు ఎక్కువగా ఉన్న నవలలు వచ్చాయి.

1980 దశకంలో పత్రికల్లో ముదిగొండ శివప్రసాద్, లల్లాదేవీలు రాసిన చారిత్రక నవలలు ధారావాహికంగా ప్రచురింపబడి పాఠకులను ఆకర్షించాయి. రచనా శిల్పం మౌలికతలు లేని చారిత్రక నవలలే ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి.

కందుకూరి లింగరాజు గారు ‘మాక్జిమ్ గోర్కీ’ నవలను ‘అమ్మ’ పేరుతో అనువాదం చేసి 1934లో ప్రచురించినప్పటి నుంచి అది తెలుగు సాహిత్య కళాకారులను చాలామందిని ఆకర్షించింది. సామాన్య మానవులు, వాళ్ళ వాస్తవిక జీవితాల్లో కష్టనష్టాలు – తమ కష్టనష్టాల నుంచి బయటపడడానికి తామే నడుం బిగించవలసిన అవసరం, వాళ్ళ ప్రేమానురాగాలు, వాళ్ళలోని మానవతా లక్షణ వైశిష్ట్యం మొదలైనవన్నీ వస్తువులుగా వర్గీకరించబడ్డాయి.

1908లో ధరణి ప్రగ్గడ వెంకట శివరావు రచించిన కాంచనమాల, వెంకట పార్వతీశ్వరులు రచించిన వసుమతీ వసంతం (1911), ఎ.పి నరశింహులు రచించిన వసంతసేవ (1912), వేలూరి శివరామశాస్త్రి రచించిన అహోబలీయం (1920) ప్రముఖమైన చారిత్రక నవలలు.

విశ్వనాథ సత్యనారాయణ రచించిన చారిత్రక నవలల్లో విశిష్టమైనది బద్దన్న సేనాని. కారణం ఈ నవలలో కథానాయకుడు పంచమ కులస్ధుడైన బద్దన్న. తెలుగుదేశంలో కులవ్యవస్థ 12వ శతాబ్ది ప్రథమ భాగంలో ఎలా ఉండేదో బద్దన్న సేనాని నవల ద్వారా మనకు అవగతమవుతుంది. కథానాయకుడైన బద్దన్నకు ప్రతి నాయకుడు సంబయ్య, సంబయ్య రాజవంశీకుడు, గొంకరాజుకు సర్వ సేనాధిపతి. బద్దన్నకు సంబయ్య అవరోధంగా నిలుస్తాడు. సంబయ్య వ్యక్తిత్వం ఎలాంటిదో ఈనాటికి అధికారుల్లో, రాజకీయ నాయకుల్లో మనకు కనిపించే వ్యక్తిత్వమే తప్ప వేరు కాదు. సంబయ్య కల్పించిన అవరోధాన్ని రాజకీయ చతురతతో అధిగమించి దేశాన్ని పశ్చిమ చాళుక్యుల ఆధీనం నుంచి విముక్తం చేసే లక్ష్యాన్ని బద్దన్న సాధిస్తాడు. బద్దన్న సంస్కారం ఈ సమాధానం చెప్పుతోంది.

“భయం కాదు స్వామి ఈ దేశం వైరాగ్యం గల దేశం నా కులము వైరాగ్యం

కల కులము. యుద్ధము వచ్చినచో మేము సేన. లేనిచో పాలేరులము”

చిలకమర్తి లక్ష్మీనరసింహారావు గారి రాజస్థాని కథావళి యువకుల్లో దేశభక్తిని ఆ కాలంలో పురికొల్పింది. చిలకమర్తి వారి హేమలత (20వ ప్రకరణం – 154పుట) లో అల్లా ఉద్దీన్, బీమ్‍సింగ్, నారాయణ సింగ్ పాత్రల ప్రస్తావనలో జాతీయ సమైక్యతా భావం స్పష్టంగా కనిపిస్తుంది. “వేకువజామున రాజపుత్ర మహమ్మదీయ లొండొరులు సెలవు గైకొని పోవుచున్నప్పుడు మధన సింగ్ నాజర్ జంగ్‍ను రహస్య స్థలమునకు గొనిపోయి గాడాలింగనమొనర్చి, మిత్రుడా! మనమిరువురము అన్నదమ్ములవలె ఉంటిమి. మనము అన్య జాతులవారమైననూ మనకు భేదము లేదు. ఇక ముందు ఉండదు. మౌలాలియు, నారాయణ సింగ్ మిత్రులై తమ తమ మముల గురించి వాదముల సలుపుచూ సుఖముగా కాలము బుచ్చు చుండిరి.” ఇదే విధంగా చిలకమర్తివారి సువర్ణగుప్తుడు జాతీయ సమైక్యతకు ప్రతీక.

భానుమూర్తి గారి ప్రదర్శనము, భారత ధర్మ దర్శనము, దుగ్గిరాల రామమూర్తి స్వాతంత్ర్య ప్రదర్శనము, కొండపర్తి వీర భద్రాచార్యుల భారత దర్పణము, ప్రత్తిగొడుపు రాఘవరాజు, బాపూజీ, బోసుబాబు (కథ)లలో జాతీయ సమైక్యత, జాతీయతా భావన విస్తృతంగా కనిపిస్తున్నాయని కురుగంటి సీతారామాచార్యులు, పిల్లల మర్రి వెంకట హనుమంతరావు గారు (1949) ప్రచురించిన నవ్యాంధ్ర సాహిత్య వీధులు – ప్రథమ భాగంలో పేర్కొనబడింది.

శ్రీ పాదవారి భావాలు : జాతి – స్త్రీలు

‘కొత్తచూపు’ కథలో రెండు విషయాలున్నాయి. ఒకటి వరకట్నం పనికిరాదనడం, రెండు జాతిని రక్షించుకోగల శక్తిని సంపాదించుకోవాలనడం.

నానా గొంతెమ్మ కోర్కెలను కోరిన వరుణ్ణి ఈ కథానాయిక అన్నపూర్ణ అడిగిన ప్రశ్న ‘నాకు జవాబు చెప్పండి. ఉత్తర భారతభూముల్లో భారతీయ స్త్రీలెందరో మానభంగాలకు పాల్పడ్డారు. ఉత్తరాంధ్ర భూముల్లో మనవాళ్లకెందరికో అలాంటిది తటస్థపడుతోంది. తెనుగు స్త్రీలకిది చావుబతుకుల సమస్య. మేమిది చూసీ చూడకుండా విడిచి పెట్టడానికి వల్లకాదు. మరి, మీ కళ్ళ ఎదుట మీ ఆత్మీయులకున్నూ అలాంటిది తటస్థపడితే తరవాతి మాట ఏమయినా, ముందు కళ్ళుమూసుకుని మీరు శత్రువుల మీద పడగలరా?’ (కొత్తచూపు, నవంబరు 1948).

వరుడికి ఉండాల్సిన లక్షణం కూడా చెప్పింది. ‘శౌర్యం బలపరాక్రమాలు, తెగబడి యుద్ధం చేసే ధైర్యం, వీలు తప్పితే పెళ్ళికూతుర్ని రాక్షస వివాహం పద్ధతిగా సంపాదించుకోవాలన్న చూపు, అందుకు తగ్గ సత్తా’.

ఉత్తరదేశంలో దేశ విభజన, ఆంధ్రదేశంలో రజకార్ ఉద్యమమూ శ్రీపాద వారిని ఈ విధంగా రాయడానికి కారణం. అందువల్ల వేద విద్యలకు ఆలవాలమైన అగ్రహారంలో, కళా నిపుణులు, వైద్యులు కూడా పంక్తి బాహ్యులైన అగ్రహారంలో ఆడా మగా తేడా లేకుండా సాము గరిడీలు నేర్చుకొనేట్లు ప్రోత్సహించారు.

శ్రీపాదవారు కొన్ని చరిత్ర విషయక వాఖ్యానాలు కూడా చేయించారు పాత్రల చేత. ఈ కథలో “మనకున్నది వర్ణ వ్యవస్థ కాని జాతీయత కాదు, ఆదికాలంలో మనదేశం విజాతీయుల పాలబడడానికి కారణం అదీ. ఈ వర్ణవ్యవస్థకి తోడు అప్పటి మన వాళ్లకి ‘నారాజు’ అనే భావమూ, ఇటు ‘నా విష్ణుః పృథివీ పతిః’ అన్న నమ్మకమూ ముదిరిన కాలంలో ఊరూరా రాజులు వెలిశారు. దీంతో మనం విభేదమే కాని ఐక్యం అన్నమాట మరచిపోయాం. అది పోయి ‘నాదేశం’ అన్నభావం కొత్తగా అనుభూతమై ఎడమొగం పెడమొగంగా ఉన్నవాళ్లనందరినీ ఒకతాటి మీదికి తెచ్చింది. యుగయుగాలుగా బానిసత్వంలో మగ్గిపోతూ వెలుగు మొగం ఎరక్కుండా ఉండిన అస్పృశ్యుడూ, భుజమూ భుజమూ రాసుకుంటూ స్వాతంత్ర్య సమరం సాగించడానికీ కొత్తభావమే కారణం. నా దేశం అనుకోగల వాళ్లకి వర్ణవ్యవస్థ నచ్చదు. వాళ్ళకి నచ్చేదీ, నిజంగా కావలసిందీ జాతీయత. ఈ భావమే మనకి నూతన జవసత్వాలు కలిగించింది. ఇది నేర్చుకోవడం వల్లనే మనం తరతమ భేదాలెరుగని విదేశీయులను ఎదిరించగలిగాం. మనకిప్పుడు చేజిక్కి ఉన్న స్వాతంత్ర్యం నిలవాలన్నా నిలిచి జగజ్జేగీయమానం కావాలన్నా ఇక మనం కొత్త ధర్మం నిర్ణయించుకోవాలి. కొత్తరక్తం పెట్టించుకోవాలి. కొత్త జాతిగా స్ఫుటంగా రూపుదిద్దుకోవాలి.”

ఛత్రపతి శివాజికి ఆధాత్మిక గురువైన సమర్థ రామరాసు జీవితం కూడా చిలకమర్తిని ఎంతగానో ఆకర్షించింది. ఆయనంటారు – “మనం భద్రాచల రామదాసునెరుగుదుము. కాని, ఈ దేశాన్ని ఆధ్యాత్మిక పతనం నుంచి ఉద్ధరించిన ఉపదేశాలు శివాజీ వంటి మహరాష్ట్ర వీరునకు అందించిన మహాత్ముడు సమర్థ రామదాసును ఎరుగం. ఆ ఆధ్యాత్మిక శక్తియే నన్ను ఆ మహాత్ముని జీవిత కథ రాయటానికి ప్రేరేపించింది. ప్రజలు దీన్ని మరింత బాగా అర్థం చేసుకుంటారు.”

“అదే విధంగా గురునానక్ బోధలు కూడా ప్రజలందరికీ అందాలి.”

ఈ విధమైన అంతరంగ ప్రబోధంతోనే చిలకమర్తి ఎందరో మహాత్ముల జీవిత కథలు రాసి తెలుగు వచన సాహిత్యాన్ని శాశ్వతంగా సుసంపన్నం చేశారు.

1946లో చిలకమర్తి స్వీయ చరిత్ర రచన ముగిస్తూ కొన్ని పుటలు (623‌-47) సింహావలోకానికి వినియోగించాడు. అందులో 5వ అంశం అనేకత్వంలో ఏకత్వమనే సిద్దాంతం. ఈ అంశం చిలకమర్తి అర్ధ శతాబ్ది కిందట ఉద్ఘాటించినవే అయినా అవి ఈనాటికీ అన్వయించేవిగా ఉన్నాయి. నిజానికి అవి నాటి కంటే నేటికే మరింత ఎక్కువగా సమన్వయించేవిగా కనిపిస్తున్నాయి. కారణం – పరిస్థితులు నాటి కంటే నేడు మరింత దిగజారి ఉండడమే.

మన ప్రజల జీవితంలో రాజకీయాల్లాగే మతం కూడా ప్రధాన పాత్ర వహిస్తుందనిపిస్తుంది. నిజానికి రాజకీయమనేది ఒక శాస్త్రం. ఇప్పుడది ఆ అర్థంలోకాక కీచులాటలకు, అత్మోత్కర్షకు పర్యాయపదంగా మారింది.

చిలకమర్తి ఈ ధోరణికి చాలా విచారపడ్డాడు.

చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించిన రాజస్థాన కథావళి (1906‌-07) లెఫ్టెనెంట్ కల్నల్ జేమ్సుటాడ్ ఇంగ్లీషులో రాసిన ఒక సుప్రసిద్ధ గ్రంథానికి అనువాదం. గ్రంథంలో రాజస్థానంలోని రాజవంశాలకు చెందిన 24 కథలు ఉన్నాయి. అన్ని కథలూ ఒక నీతిని, సందేశాన్ని ఇస్తూ యువలోకాన్ని సన్మార్గంలో పెట్టేవిగా ఉంటాయి. ఆ కథలు ఎప్పుడు అచ్చయి విడుదలవుతాయో అని యువ పాఠకులు ఎదురు చూస్తూండేవారు.

అటు తరువాత గుర్తుంచుకోదగిన ‘భారత కథా మంజరి’ (1911) ఉంది. నీతిని ఉపదేశించే ఆదర్శప్రాయమైన కథలు ఇందులో 19 ఉన్నాయి.

‘చమత్కార మంజరి’లో 48 కథలున్నాయి. అద్భుతమైన జీవిత కథల సంపుటి ఇది. ప్రారంభం నుంచి చివరిదాకా చదువరి ఆసక్తిని సడలనీయని గొప్ప కథన కౌశలం ఇందులో గోచరిస్తుంది.

‘నంద చరిత్ర’లో పతిత జాతుల దైన్య స్థితిని – హరిజనుల దైన్య స్థితిని చిలకమర్తి విపులంగా వర్ణించారు. దక్షిణభారతదేశంలో ఈ అస్పృశ్యులు అగ్రవర్ణాలుండే వీధుల్లో పనిచెయ్యరాదనే నిషేధం కూడా ఉండేది.

సర్వమతాల సిద్ధాంతాలు సహజంగా ఉదాత్తంగాను ఉన్నతంగాను ఉంటాయి. విభేదాలకు కారణం ఆ మతాలను అనుసరించేవారే. హిందువులు, ముస్లిమ్‍లు, క్రైస్తవులు, బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణులు, బ్రాహ్మణులు, నిమ్నజాతులు, తదితరులు – వీరందరిలో విభేదాలకు దారి తీసిన పుణ్యం మతానుయాయులదే. వేల సంవత్సరాలుగా వీరంతా ఇక్కడ పుట్టి పెరుగుతున్నారు. ఈ నింగి కింద, ఈ నేల మీద ఈ గాలి పీల్చి, ఈ నీరు తాగి, ఈ భరతమాత స్తన్యం గ్రోలి ఇక్కడే వర్ధిల్లారు. ఇటువంటి వీరిలో పరస్పర ద్వేష భావం పవిత్రమైన మాతృభూమికే వినాశకరం.

రాముడెవరు? విశ్వమిత్రుడెవరు? పవిత్ర గాయత్రీ మంత్ర ద్రష్ట ఆయన కాదా? వేదవ్యాసులెవరు? పాండవులెవరు? పన్నిద్దరు అళ్వారులు ఎవరు? వీరందరూ బ్రాహ్మణులేనా? కారు! వీరిలో చాలామంది అబ్రాహ్మణులే. వేదవ్యాసుని తల్లి పల్లెపడతి కాదా? వ్యాస మహర్షి వింగడించిన వేదాలను మనం గౌరవించటం లేదా? వ్యాసవిరచితాలే అయిన బ్రహ్మసూత్రాలను, పురాణాలను, మహాభారత భాగవత హరివంశాలను మనం శిరసావహించటం లేదా?

అదే విధంగా, ఇతర మతాలకు, ఇతర జాతులకు సంబంధించి మహాత్ములు రచించిన పవిత్ర గ్రంథాలను సమదృష్టితో గౌరవించాలి.

ప్రస్తుతం అత్యావశ్యకమైంది సర్వమానవ సౌభ్రాత్ర దృష్టి. ప్రపంచమంతా ఏక కుటుంబమని మనమంతా ఆ కుటుంబ సభ్యులమని – విశాలమైన భావం వృద్ధిచెందాలి. ఇది ఎంత తొందరగా వృద్ధి పొందితే అంత మంచిది. కుటుంబంలోని ప్రతి సభ్యుడు తన విధిని తాను నిర్వహిస్తుంటే నిస్సంశయంగా యావత్కుటుంబం వృద్ధి పొందుతుంది. దేశమూ, జాతీ వృద్ధి పొందుతాయి. మనలో ఆసూయా ద్వేషాల నుంచి ఈ పవిత్ర మాతృభూమిని రక్షించవలసిన బాధ్యత మనది కాదా? భగవంతుడు మానవజాతికి ప్రసాదించిన విజ్ఞానవివేకాలతో ప్రవర్తించవద్దా? క్రూర జంతువుల్లాగా, వీధి కుక్కల్లాగ అరచి, కరచి, పోట్లాడి, కొట్లాడుకుంటుంటే వాటికీ మనకూ తేడా ఏముంటుంది? వీటికి పరిష్కారం లేదా?… ఉంది. అదే ‘అనేకాత్వంలో ఏకత్వం’. ఈ సూత్రమొక్కటే ఈ సమస్యకు పరిష్కారం.

కాబట్టి మనందరం ఏకమై, సుఖశాంతి మయమైన విశాల విశ్వ వికాసపు నీడన మానవుల లాగా జీవిద్దాం.

సర్వజీవకోటి శ్రేయస్సు కోసం పై పవిత్రభావాలతో – చిలకమర్తివారు తమ స్వీయ చరిత్ర రచనను ముగించారు.

అమూల్యమైన ఈ భావాలు సార్వకాలిక ప్రయోజనాలను సాధించేవిగా లేవా?

డా. టి. గోపాలకృష్ణారావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here