[dropcap]అ[/dropcap]మ్మ గర్భం నుండి వచ్చినప్పుడు
నాకు తెలియదు నేను ఎవరో
బారసాల చేసినప్పుడు కూడా
నాకు తెలియదు నేను ఎవరో
అక్షరాభ్యాసం చేసినప్పుడు
నాకు తెలియదు నేను ఎవరో
బడిలో చదివినప్పుడు కూడా
తెలియదు నాకు నేను ఎవరో
ఉన్నత పాఠశాలలో అనుకున్నా
నేను ఒక మంచి బాలుడినని
కళాశాలలో చదివినప్పుడు
అనుకున్నా నేను హీరోనని
డిగ్రీ చేతికొచ్చినప్పుడు తెలిసింది
నేను జీరో అని హీరో కానని
ఉద్యోగం వచ్చినప్పుడు అనుకున్నా
నేను మళ్ళా హీరో అయ్యానని
పెళ్ళి అయ్యాక అనుకున్నా
నేను ఒక భర్తనని భరించేవాడినని
పిల్లలు పుట్టాక అనుకున్నా
నేను తండ్రిని అయ్యానని
వాళ్ళని చదివించినప్పుడు అనుకున్నా
నేను యంత్రంగా మారానని
వాళ్ళకి పెళ్ళి చేసినప్పుడు అనుకున్నా
నేను బాద్యతలు ఉన్నవాడినని
మనుమలు పుట్టాక అనుకున్నా
నేను తాతను అయ్యనని
ముసలితనం వచ్చేసినా తెలియలే
నేను నిజంగా ఎవరినని
ఈ నేను ఎవరు అన్నది
నాకు ఎప్పుడు తెలుస్తుందో….