ఉదయ రాగం-8

1
3

[box type=’note’ fontsize=’16’] శ్రీ భీమరాజు వెంకటరమణ వ్రాసిన ‘ఉదయ రాగం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]”చ[/dropcap]దువుకోట్లేదా?”

“తొమ్మిదో క్లాసు. ఇవాళ ఆదివారం శెలవు కదా అందుకని…”

“ఇక్కడ కూర్చో”

సత్యం ఉదయ్ వైపు చూస్తూ ప్రక్కన కూర్చున్నాడు.

“ఆదివారాలు ఇలా ఎవరికేం కావాలో తెచ్చి పెడుతుంటావా?”

“అవును సార్. ఆదివారం ఉదయం, సాయంత్రం జనాలొస్తారు. మీరొక్కరే ఈ టైమ్‌లో వచ్చారు. దాదాపు అందరూ వాళ్ళకు కావలసినవి వాళ్ళు కూడా తెచ్చుకుంటారు. ఎవరో ఒకరు ఏదైనా తెమ్మని అడుగుతుంటారు. ఈ రోజు ఉదయం ఎక్కువ జనం రాలేదు. ఎవరూ ఏమీ  తెమ్మని అడగలేదు. ఇక ఇంటికి వెళదామనుకుంటున్నాను. మిమ్మల్ని దూరం నుంచీ చూసి వచ్చాను”

“తిండానికి అన్నం కాకుండా ఏమైనా దొరుకుతుందా దగ్గర్లో?”

“దొరుకుతై సార్! అదుగో ఆ రెండు గుడిసెల ప్రక్కనుండి కాస్త ముందుకెళితే గంగవ్వ ఇంట్లో జొన్న రొట్టెలు చేస్తుంది. బాగుంటయ్. చాలాసార్లు తెచ్చిచ్చాను”

“బైక్ మీద ఇద్దరం పోయి తెచ్చుకుందామా?”

“మీరెందుకు సార్! రావడం, సముద్రాన్ని చూస్తూ హాయిగా కూర్చోండి. ఇట్లా పోయి అట్లా వచ్చేస్తాను. అప్పుడు మళ్ళీ సముద్రం చూస్తూ రొట్టెలు తినండి, బావుంటుంది. మళ్ళీ మీరు వచ్చేది ఎప్పుడో కదా!”

“నిజమే, నేను ఇప్పటికి సముద్రాన్ని రెండు సార్లే చూశాను”

“అయితే మీరు  ఇక్కడే నీళ్ళలో తిరుగుతూ ఉండండి. నేను తొందరగానే వచ్చేస్తా!”

ఉదయ్ చిన్నగా నవ్వి పర్స్ తీసి “నాలుగు రొట్టెలు ఎంతౌతుంది?” అడిగాడు.

“నలబైరూపాయలు రొట్టెలు, పదిరూపాయలు కర్రీ మొత్తం యాభై ఇవ్వండి చాలు”

పర్సులోంచి వంద రూపాయల నోటు అతనికిచ్చి “చిల్లర కూడా కావాల్లే తీసుకరా” అన్నాడు ఉదయ్

అది తీసుకొని సత్యం చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

ఉదయ్ లేచి నీళ్లలోకి దిగి కాసేపు నిలుచున్నాడు. దగ్గర్లో ఎవరూ లేరు కాస్త దూరంగా చేపలు, వలలు ఎండబెట్టి ఉన్న చోట నలుగురైదుగురు ఉన్నారు.  మోకాళ్ల లోతు వరకూ వెళ్ళి కాసేపు నిలబడ్డాడు. కాసేపు అటు ఇటూ తిరిగాడు.

మరికాసేపటికి సత్యం కవరు చేత్తో పట్టుకొని రావడం కనిపించింది.

వస్తూనే “సార్ ఎలా ఉంది మా సముద్రం?” అడిగాడు.

“బాగుంది. అన్నిటికంటే అలలొచ్చి మన కాళ్ళ క్రింద ఇసుక లాగేసి వెళుతుంటే పడిపోతానేమో అనిపించినా మజాగా ఉంది”

“గట్టిగా నిలబడితే పడిపోము సార్”

“ఏమన్నావ్?”

“అదేసార్! గట్టిగా నిలబడితే పెద్ద అలలొచ్చినా కాళ్ళ క్రింద ఇసుక లాగేసినా పడిపోము”

సత్యం వైపు కాసేపు పరిశీలనగా చూశాడు ఉదయ్.

తన చేతిలోని కవరు అందించాడు సత్యం.

“చెరో రెండు రొట్టెలు తిందాం” అన్నాడు ఉదయ్.

“నాకొద్దు సార్! ఇంట్లో అమ్మ చేసుంటుంది”

“ఫరవాలేదులే, అది రాత్రికి తినొచ్చు, మరి మాట్లాడకుండా అదుగో నా బైకు కవరులో వాటర్ బాటిల్ ఉంటుంది, తీసుకురా”

వాటర్ బాటిల్ తెచ్చి ప్రక్కన కూర్చున్నాడు సత్యం.

“అవును సత్యం! నేను నీకు ఇవి తెచ్చినందుకు ఐదో పదో ఇస్తానేమో, అలా కాకుండా నేనిచ్చిన వంద తీసుకొని అటునుంచి అటే ఇంటికి వెళ్ళిపోతే నీకు వంద రూపాయలు మిగిలేవిగా! అలాంటి ఆలోచన రాలేదా?”

సత్యం కొంచెం సేపు ఆలోచించి “మిమ్మల్ని చూస్తే అబద్ధం చెప్పాలనిపించడం లేదు సార్. మొదట్లో రెండు సార్లు అలాంటి పనులు చేశాను కూడా. ఒకరికేమో రెండువందలు ఖర్చైతే మరో యాభైరూపాయలు ఎక్కువ చెప్పి తీసుకున్నాను. మరొకరికి వాళ్ళడిగినవి తెస్తూ నాకు కావలసినవికూడా ఆ డబ్బులోనే  కొనుక్కొని వెళ్ళాను. కానీ ఇంటికెళ్ళాక  మా అమ్మ బాగా తిట్టింది. మా అయ్యకు చెప్పలేదు. చెప్తే  బాగా కొట్టేవాడు. ఇక బయటకు పంపేవాడు కాదు. నేను చేసిన పనులు దొంగతనంతో సమానమని మా అమ్మ తరువాత నన్ను కూర్చోబెట్టి చాలా సేపు చెప్పి నేను ఒకప్పటి స్టువార్టుపురం దొంగల్లా అయిపోతానేమో అని ఏడ్చింది. ఆరోజు నుండి నేను అలాంటి పనులు చెయ్యట్లేదు సార్”.

సత్యం వైపు మెచ్చుకోలుగా చూస్తూ “నీకు ఆ అవసరం రాదులే! ఎందుకంటే చాలా మంది ధనవంతులకంటే నువ్వు పెద్ద ధనవంతుడివి. నీ ధనం ఇదిగో ఇక్కడుంది” అంటూ సత్యం గుండెమీద చెయ్యి పెట్టి చూపాడు.

ఇద్దరూ తినడం అయిపోయింది.

కాసేపు కూర్చున్నాక “నీతో మాట్లాడుతుంటే బాగుంది సత్యం! ఇక నేను బయలుదేరుతాను. నువ్వు నాతోరా. ఊర్లో డ్రాప్ చేసి వెళతాను”

సత్యం కూడా బైక్ ఎక్కాడు.

అతను చెప్పిన చోట దించి అతని చేతిలో యాభైరూపాయలు పెట్టాడు ఉదయ్.

“ఐదో పదో ఇస్తానని యాభై ఇచ్చారేంటిసార్?”

“చిల్లర ఈసారొచ్చినపుడు తీసుకుంటాలే” అన్నాడు ఉదయ్ అతని తల నిమురుతూ.

“మళ్ళీ ఎప్పుడొచ్చినా, సముద్రం దగ్గర ‘సత్తి ఎక్కడ’ అని అడగండి, ఎవరైనా చెబుతారు, నేను ఇక్కడ బాగా ఫేమస్. ఇంతకీ మీ పేరు తెలుసుకోవచ్చా సార్?” అడిగాడు వినయంగా.

“నా పేరు ఉదయ్! నీ అంత ఫేమస్ కాదనుకో” అంటూ నవ్వి సత్యం భుజం తట్టి బైక్ ముందుకు పోనిచ్చాడు.

ఒంగోలులో తనకు కావలసిన  వస్తువులు కొనుక్కొని చీమకుర్తి వైపు బయలురాడు ఉదయ్.

***

మరుసటి రోజు ఉదయం పదిగంటల ప్రాంతంలో తిరుపతి స్వామి ఉదయ్‌ని మైనింగ్ పర్మిట్లకు సంబంధించిన పనిమీద ఒంగోలు వెళ్ళమన్నాడు. ఉదయ్ మోటర్ బైక్ తీసుకొని వెళుతుండగా విజయవాడ ట్రక్ లోడింగ్ జరుగుతున్నది. ఏమీ పట్టించుకోనట్లు ఉదయ్ వెళ్ళిపోయాడు.

ఆఫీసులో పని అయ్యాక ఉదయ్  చీమకుర్తి ఊరు బయట ఒక టీ స్టాల్ ప్రక్కన బైకు ఆపి అక్కడ కూర్చున్నాడు. ఒక గంట తరువాట విజయవాడకు టైల్స్ లోడ్ తీసుకెళుతున్న లారీ వస్తున్నది.  చిన్నగా దాని వెనుక బయలుదేరి వెళ్ళాడు. ఒంగోలు దాటి కాస్త దూరం పోయి త్రోవగుంట సమీపంలో లారీ ప్రక్కకు ఆగింది. ఉదయ్ కూడా కాస్త దూరంగా ఆగి గమనిస్తున్నాడు. ఒక పావుగంట తరువాత ఒకతను వచ్చి లారీ ఎక్కాడు. డ్రైవర్ దిగి నిలబడ్డాడు. క్లీనర్ సహాయంతో ఆ లారీ ఎక్కిన వ్యక్తి కొన్ని టైల్స్ క్రిందకు దించాడు.

సరిగ్గా అదే సమయానికి ఉదయ్ అక్కడకు చేరుకుని మొత్తం ముగ్గుర్ని టైల్స్‌తో సహా మొబైల్ ఫోన్ తీసుకొని ఫొటోలు తీశాడు.

డ్రైవర్ గతంలో ఫ్యాక్టరీలో టైల్స్ దింపించిన ఉదయ్‌ని గుర్తుపట్టాడు.

“సార్ సార్ నాకేం తెలీదు సార్. మీ రమేష్ చెబుతేనే ఇక్కడ దించుతున్నాను”

“ఎంత కాలం నుంచి ఇలా జరుగుతున్నది?”

“అదేం లేదు సార్! ఇదే మొదటి సారి. మా ఓనరుకి చెప్పకండి సార్, నా ఉద్యోగం పోతుంది. మీ కాళ్ళు మొక్కుతాను”

ఆ మాటలు రికార్డ్ చేశాడు ఉదయ్.

“సార్ ఇప్పుడేం చెయ్యమంటారో చెప్పండి. మళ్ళీ పొరపాటున ఎక్కువ లోడైనాయని చెప్పి వాపసు ఇవ్వమంటారా?”

“అలా చేస్తే పెద్ద గొడవౌతుంది. ఇలా ఎన్ని సార్లు టైల్స్ దింపావో చెప్పు. నీకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తాను”

“దీంతో కలిపి ఆరు సార్లు దించాను సార్. నాకు ట్రిప్పుకు రమేష్ వెయ్యి రూపాయలు ఇస్తాడు. వాచ్‌మన్‍కు కూడా ఎంతో కొంత ఇస్తుంటాడు సార్”

“ఈసారి ఇలా చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతావ్”

“లేదు సార్ ఇంకెప్పుడూ చెయ్యను సార్” అంటూ కాళ్ళు పట్టుకున్నాడు.

బైక్ వెనక్కు తిప్పుకొని వెళ్ళిపోయాడు ఉదయ్.

ఫ్యాక్టరీకి రాగానే తనకోసం ఎదురు చూస్తున్నాడు రమేష్.

“సాయంత్రం మీ ఇంటికొస్తాను, అక్కడ మాట్లాడుకుందాం” అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు ఉదయ్.

ఫ్యాక్టరీలో ఉదయ్ అటూ ఇటూ పనులమీద  తిరుగుతుంటే అతన్నే గమనిస్తున్నాడు రమేష్.

ఆరోజు పనులయ్యేసరికి సాయంత్రం ఏడు గంటలు దాటింది. ఉదయ్ కోసం బయట రమేష్ కాచుకొని ఉన్నాడు.

“మా ఇంటికొస్తానన్నావుగా! బైకెక్కు. నా కూతురు కీర్తి మొదటి పుట్టినరోజు ఇవాళ. ఇప్పుడే తిరుపతి స్వామిగారితో సహా అందరికీ స్వీట్స్ ఇచ్చి నీకోసం ఎదురు చూస్తున్నాను. ఎటూ ఇంటికొస్తున్నావు కదా, అక్కడ మా  ఇంట్లో నీకు విందు భోజనం ఏర్పాటు చెయ్యమని నా భార్యకు  ఫోన్ చేసి చెప్పేశాను”

“చాలా సంతోషం, నా గదికెళ్ళి ఫ్రెష్ అయి ఒక గంటలో వస్తాను. నువ్వెళ్ళు”

రమేష్  వెళ్ళిపోయాడు.

ఉదయ్ తయారయ్యి బజారుకెళ్ళి పాపకు ఒక గౌను కొన్ని పండ్లు తీసుకొని రమేష్ ఇంటికి చేరుకున్నాడు.

ఎదురొచ్చి చేతులు కలిపి లోపలికి తీసుకెళ్ళాడు రమేష్.

“నా భార్య సుధారాణి, ఇదిగో మా పాప కీర్తి”

“పాప చాలా ముద్దుగా ఉంది, మా అక్క స్పందన కూడా అచ్చం నీలాగుంటుంది” అంటూ పండ్లు, గౌను సుధారాణికి అందించాడు.

వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది.

భోజనాలకి కూర్చున్నారు. ఎన్నెన్నో కబుర్లు, సినిమాలు, రాజకీయాలు, జోకులు రకరకాల విషయాలు చోటు చేసుకున్నాయి. మధ్యమధ్యలో ఉదయ్ కుటుంబ విషయాలు గురించి అడుగుతున్నాడు రమేష్. వాటిని ఎంతో కొంతే చెబుతూ దాటేశాడు ఉదయ్.

భోజనాలు అయ్యాక “ఎలాగుంది అన్నయ్యా నా వంట? ఈయన ఐదింటికి చెప్పాడు. నాకు సమయం సరిపోలేదు. హడావిడిగా  చేశాను”

“లేదమ్మా! చాలా బాగుంది. రమేష్ ఎందుకు కాస్త  బొద్దుగా ఉన్నాడో నాకిప్పుడు అర్థమయ్యింది”

ముగ్గురూ నవ్వుకున్నారు.

“ఉదయ్! నువ్వు ఇంత మంచివాడివి, కలుపుగోలు మనిషివి అని నేననుకోలేదు” అన్నాడు రమేష్.

“నువ్వు నన్ను మంచివాడివి  అని అంటున్నావు. ఆమె నన్ను అన్నయ్యా అని ఇందాకనే పిలిచేసింది. ఈ మంచి తరుణంలో మీ పాప పుట్టినరోజు సంధర్భంగా నీకొక మాట చెప్పాలనుకుంటున్నాను”

“చెప్పు ఉదయ్! నువ్వు నాకంటే ఎక్కువ చదువుకున్నావు. పైగా నువ్వంటే ఏమిటో మాకు అర్థమైంది. మనం మంచి స్నేహితులమయ్యాం. నువ్వు ఏది చెప్పినా బాగుంటుంది”

ఉదయ్ అతని వైపు ప్రశాంతంగా చూస్తూ “ఉదయం టైల్స్ లోడు వెనుక నేను వెళ్ళి జరిగింది చూశానని నీకు అప్పటికప్పుడే ఫోన్ వచ్చేసి ఉంటుంది.

నేను ఈ విషయాన్ని గొడవగా మార్చి నీకు ఇబ్బంది కలిగించ దల్చుకోలేదు. పరిస్థితులను బట్టి ఇలాంటి బలహీనతలు ఏర్పడతాయి. కానీ నీకు అలా కాదు. మంచి వ్యక్తి దగ్గర పనిచేస్తున్నావు. ఆయన కూడా నువ్వు నమ్మకంగా పనిచేస్తున్నావని నమ్మారు. ఇక్కడే నువ్వు బాగా ఎదిగే అవకాశం ఉంది. నలుగురు కలిసి తప్పుడు పనులు చేస్తున్నప్పుడు ఎప్పటికైనా ఎక్కడో తప్పకుండా తేడా వచ్చి మొత్తం బయట పడుతుంది. అప్పుడు ఈ  గ్రానైట్ ఫీల్డ్‌లో నీకొక మచ్చ ఏర్పడుతుంది. నిన్ను ఎవరూ నమ్మరు. నీకివన్నీ తెలియనివి కావు. నీది బలహీనత కాదు దురాశ. దాని కారణంగా బుద్ధి తప్పుదోవ పడుతున్నది.

ఇక్కడ నువ్వు పనిలో చేరి సంవత్సరమే అయిందని తెలిసింది. ఇలాంటి చేతివాటం పనులు తరువాత మెల్లిగా మొదలుపెట్టి ఉంటావు. ఎక్కువ కాలం కాలేదు కాబట్టి అది పూర్తి స్థాయి వ్యసనంగా మారి ఉండదు. బుద్ధి మార్చుకునే అవకాశం ఉంది. ప్రయత్నిస్తే అసాధ్యం కాదు.

పాపకు కీర్తి అని పేరు పెట్టుకున్నావు. నీకు ఎటువంటి కీర్తి కావాలి? ఉన్నతంగానా? నీచంగానా? నువ్వే ఆలోచించుకో.

నువ్వు ఇక్కడి వాడివి. నేను ఎక్కడినుంచో వచ్చాను. ఎప్పుడు వెళ్ళిపోతానో తెలీదు.

ఫ్యాక్టరీలో చాలా అవకతవకలు, వాటి ద్వారా తిరుపతి స్వామి గారికి చాలా  నష్టం జరుగుతున్నదని నాకు అర్థమౌతున్నది. ఆ నష్టం ఆపగలిగితే మనలాంటివాళ్ళు మరో నలుగురికి ఇక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి. వాళ్ళూ నీలాగే సుఖంగా ఉంటారు.

నిజానికి నాకు ఇక్కడి ఈ పరిస్థితుల మధ్య పనిచేయడం నచ్చడం లేదు. వెతుక్కుంటూ వచ్చి  ఇక్కడ చేరినందుకు, తిరుపతి స్వామిగారు నన్ను సొంత మనిషిలా చూసుకుంటున్నందుకు, వీలైనంత వరకూ అవకతవకలు సరిచేద్దామని, అలా చెయ్యలేకపోతే వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను.

ఇప్పుడు నీ సమాధానాన్ని బట్టి నాకు ఒక అవగాహన వస్తుంది. బయట పంచలో కూర్చుని ఉంటాను. మీ ఆవిడతో కూడా మాట్లాడు. నువ్వు మారి నా ప్రయత్నానికి మద్దతుని నాకు ఉత్సాహాన్ని ఇవ్వాలనిపిస్తే వచ్చి నన్ను నీ బైకు మీద నా గది  దగ్గర  డ్రాప్  చెయ్యి. లేకుంటే తలుపులు వేసేసుకో. ఒక అరగంట సమయం సరిపోతుందనుకుంటాను”  అని చెప్పి బయటకు వెళ్ళి తన సెల్ఫోన్‌లో పాటలు వింటూ కూర్చున్నాడు ఉదయ్.

లోపల కాసేపు మాటలు ఏమీ లేవు. ఆ తరువాత గొణుగుతున్నట్లుగా ఏవో మాటలు మధ్య మధ్యలో కొద్దిపాటి ఏడుపుతో కూడిన ఆమె అస్పష్టమైన స్వరం. ఆ తరువాత నిశ్శబ్దం…

చెప్పిన అరగంట సమయం దాటిపోయింది. ఉదయ్ అటుగా చూశాడు. తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. చిన్నగా నిట్టూరుస్తూ మరో నిముషం కూర్చున్నాడు. ఏ అలికిడీ లేదు. పెదవి విరిచాడు. ఒక్కసారిగా లేచి వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళి గేటు తీశాడు.

“ఆగు ఉదయ్” అనే మాటలతో వెనుదిరిగి చూశాడు.

“పద నిన్ను రూము దగ్గర డ్రాప్ చేస్తా!” అంటూ దగ్గరకు వచ్చాడు రమేష్.

ఉదయ్ సంతోషంగా అతని భజం తట్టాడు. గడప దగ్గర నమస్కారం పెడుతూ నిలబడి ఉంది సుధారాణి.

సమయం తొమ్మిదైంది.

“ముందు ఫ్యాక్టరీకి పోనివ్వు, నేను లోపలికెళ్ళి వెంటనే వస్తాను. అప్పుడు నా గది దగ్గర వదిలేసి వెళ్ళు” అంటూ బైక్ ఎక్కాడు ఉదయ్.

ముందు ఫ్యాక్టరీకి వెళ్ళారు. ఉదయ్ లోపలకెళ్ళి కాసేపాగి వచ్చాక అతన్ని తన గది దగ్గర దింపాడు రమేష్.

వెళ్ళబోతూ “ఉదయ్! ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పుడు పనులు చేస్తుంటే ఎప్పుడూ మనసు అలజడిగా ఉంటుంది. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఫ్యాక్టరీకి కలిగించిన నష్టాన్ని నేనే ఎలాగో పూడుస్తాను”

“నువ్వు మారుతావని నమ్మానుగానీ మరీ ఇంతగా అని ఊహించలేదు. నిన్న సత్యం, ఇవాళ నువ్వు. దేశంలో నిజాయితీ నీరుగారిపోతున్నదని నిరుత్సాహం కలుగుతున్నా నిలదొక్కుకోగలదని కూడా నమ్మకం  కలుగుతోంది”

“సత్యమా, అతనెవరు?”

“మరెప్పుడైనా చెబుతాలే” అంటూ గదివైపు నడిచాదు ఉదయ్.

రమేష్ బైక్ నిదానంగా కనుమరుగయ్యింది.

***

రెండు నెలల పాటు భార్యతో అమెరికా టూరు వేసుకున్న తిరుపతిస్వామి ఫ్యాక్టరీ వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోమని ఎవరికి తగ్గట్లు వాళ్లకు చెప్పి, అన్ని విషయాలు గమనిస్తూ తనకు ఎప్పటికప్పుడు ఫోన్‌లో తెలియజేస్తూ ఉండమని ఉదయ్‌కి చెప్పి వెళ్ళాడు.

ఉదయ్ మైనింగ్ వ్యవహారాలు, ఫ్యాక్టరీలో ప్రొడక్షన్, సేల్స్, స్టాక్స్, క్రిష్ణపట్నం, చెన్నైల నుండి జరిగే ఎక్స్‌పోర్ట్‌కు సంబంధించిన వివరాలు, ముఖ్యమైన డీలర్లు, కొందర్ని నేరుగా కలిసి, కొందరి వివరాలు ఆఫీస్ రికార్డ్స్ ద్వారా తెలుసుకున్నాడు.

అన్ని విషయాలూ ఎప్పటికప్పుడు తిరుపతిస్వామికి తెలియజేస్తున్నాడు. తన ఆలోచన ప్రకారం కొన్ని పనులు చెయ్యటానికి తిరుపతిస్వామి అనుమతి తీసుకుంటున్నాడు.

ఆఫీసుకి కాస్త దగ్గర్లోనే ఉన్న ఒక స్టోర్ రూమ్ ఉంది. అందులో కొద్దిగా మాత్రమే సామాను ఉంది. దాన్ని ఫ్యాక్టరీ షెడ్ లోనే ఒక మూల గది ఏర్పాటు చేసి అందులో పెట్టించాడు. ఖాళీ చేసిన గదిని గెస్ట్ రూముగా మార్చేసి ప్రస్తుతానికి తను అప్పుడప్పుడు రాత్రిళ్ళు వచ్చి కొంత సమయం ఉండేట్లు ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యమైన స్థలాల్లో సి.సి. కెమేరాలు పెట్టించాడు. స్టాక్ రికార్డింగ్, నైట్ డ్యూటీ చేసే వాళ్ళ మస్టర్లు, పని సమయాలు నమోదు చేసే విషయంలో ఖచ్చితమైన విధానాలు ప్రవేశపెట్టాడు. అవినీతికి, దొంగతనాలకు అడ్డుకట్ట వేస్తూ మరికొన్ని మార్పులు చేశాడు.

తిరుపతి స్వామి అనే వ్యక్తి యొక్క సొంత వ్యాపారంలా ఉన్న ఆ ఫ్యాక్టరీని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపనీని తలపించేలా కట్టుదిట్టం చేశాడు.

మధ్య మధ్యలో అమ్మానాన్నలకు, అక్క స్పందనకు, శ్రీరాంకు, అరుణ, రవళి, మనోజ్ లతో ఫోన్లు, మెసేజ్‌లు చేస్తూ ఎవరికి తగ్గట్లు వారితో తన విషయాలు పంచుకుంటున్నాడు.

అనుకున్న సమయాని కంటే మరో నెల ఆలస్యంగా వచ్చిన తిరుపతి స్వామి ఉదయ్ చొరవ, చేపట్టిన కొన్ని మార్పులకు సంతోషించాడు. పని పట్ల అతని శ్రద్ధకి ఆశ్చర్యపడ్డాడు.

దొంగతనాలు, దొంగ మస్టర్లు, స్టాకు బుక్స్‌లో అవకతవకలు, కొన్ని అనవసర ఖర్చులు, ఖర్చు కాకుండానే పుస్తకాల్లో కనపడే పద్దులు కట్టడి అయ్యేసరికి తరువాత నెలలోనే అభివృద్ధి కనిపించింది.

“దీన్నిబట్టి చూస్తే నాకొక విషయం అర్థమైంది ఉదయ్! నీ పైన ఏ రకమైన ఒత్తిడి లేకుండా నిన్ను స్వేచ్ఛగా వదిలేస్తే నువ్వు బాగా రాణిస్తావు” అంటూ భుజం తట్టాడు తిరుపతి స్వామి.

రోజులు హుషారుగా దొర్లిపోతున్నాయి.

ఆ ఆదివారం తిరుపతి స్వామి గ్రానైట్స్ కంపెనీ పెట్టి పదిహేనేళ్ళైన సందర్భంగా ఒక పార్టీ జరిగింది. దానికి తిరుపతి స్వామి కుటుంబ సభ్యులు కూడా హాజరైనారు. కొందరు పనివాళ్లకు కొన్ని ప్రోత్సాహకాలు అందజేశారు. మిగిలిన వాళ్ళను కూడా నిరుత్సాహపరచకుండా ఏదో విధంగా సంతోష పరిచారు.

తిరుపతి స్వామి అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ “ఐదేళ్ళకొకసారి మనం ఇలా ఫంక్షన్ జరుపుకుంటున్నాం. పోయినసారికంటే ఈసారి చాలా ఉత్సాహంగా జరిగింది. దీనికంతా రూపకల్పన చేసింది మన ఉదయ్. ఇప్పటిదాకా నేను మేనేజరుగా, యజమానిగా ద్విపాత్రాభినయం చేస్తూ మీకు విసుగు  పుట్టించి ఉంటాను. ఇకపై ఈ ఫ్యాక్టరీకి మేనేజర్‌గా ఉదయ్ వ్యవహరిస్తాడు. అతను ఏది చెప్పినా అది నేను చెప్పినట్లే భావించి పనులు చెయ్యండి. సంస్థ అభివృద్ధి చెందితే అందరూ ఇంకా  లాభపడతారు” అని చెప్పి ముగించాడు.

విందు ఏర్పాటు చేశారు. ఉదయ్ ప్రక్కన స్వాతి వచ్చి కూర్చుని ఎన్నో కబుర్లు చెప్పింది. వాళ్ళిద్దర్నీ చూస్తూ తిరుపతి స్వామి దంపతులు సంతోషపడ్డారు.

గెస్ట్ రూమ్‌నే ఉదయ్ ఆఫీసు గదిగా మార్చి తగిన  ఏర్పాట్లు చేశారు. అతని జీతం నలభై వేలుగా నిర్ణయింపబడింది. చీమకుర్తిలోనే అతని గదినుండి కాస్త పెద్ద ఇంటికి ఉదయ్ మకాం మార్చబడింది. ఒక జీపు ఆఫీసు, మైన్స్ పనులకు, అవసరమైతే వ్యక్తిగత పనులకు కూడా వాడుకునే విధంగా ఏర్పాటు చేయబడింది. అక్కడ ఫ్యాక్టరీలో ఇప్పుడు స్వామిగారు పేరుకు బదులు ఉదయ్ సార్ అనే పేరు ఎక్కవ వినపడుతున్నది.

***

ఆరోజు హైద్రాబాద్ నగరం మేఘావృతమై అక్కడక్కడా గర్జనలు వినపడుతున్నాయి. ఆ ఇంట్లో కూడా అదే వాతావరణం చోటు చేసుకుంది.

“లేదు బావా! నాకు మాట తప్పే ఉద్దేశం లేనేలేదు. ఉదయ్ ఒంగోలు వెళ్ళినప్పటి నుండి రెండు మూడు సార్లే హడావిడిగా వచ్చి వెళ్ళాడు. అందులో నేనొకసారి ఊర్లో లేనప్పుడు వచ్చి వెళ్ళాడు. అప్పుడప్పుడూ వాళ్లమ్మతో వీడియో కాల్ మాట్లాడుతుంటాడు.” అన్నాడు వినయంగా శంభుప్రసాద్.

“ఇదంతా నాకెందుకు చెబుతున్నావు? ఇక పిల్లల పెళ్ళి ఆలస్యం చెయ్యటానికి వీల్లేదు. త్వరగా ఉదయ్‌ని రప్పించు” నాగరాజు ముఖం కాస్త ఎరుపెక్కింది.

“ఆ గ్రానైట్ కంపెనీలో మా వాడు ఇమడలేడని అనుకున్నాను. నెల తిరక్కుండా వచ్చేస్తాడనుకున్నాను. కానీ వాడు అక్కడ మంచి పేరు తెచ్చుకొని ఉద్యోగంలో నిలబడ్డాడు. ఆ కంపెనీకి మేనేజర్ కూడా అయ్యాడట”

“అయితే మరీ మంచిదే. మనమే ఎక్కడ కావాలంటే అక్కడ ఒక గ్రానైట్ కంపెనీ పెట్టేద్దాం. ఆ అనుభవం పనికొస్తుంది. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఆ ఫీల్డ్‌లో ఉన్నారు. కావలసిన సహకారం అందిస్తారు”

“అది కాదు బావా! వాడికి పెళ్ళి విషయంలో కొంత సమయం ఇచ్చాను. త్వరలో అది అయిపోతుంది. అప్పుడు ఇక్కడకు రప్పించి మాట్లాడుతాను. అవసరమైతే నిన్ను కూడా పిలుస్తాను”

“ఏమో బావా! మీవాడు మనం అనుకున్నట్లు చెప్పింది చేస్తూపోయే మెతక మనిషి కాదేమో అనిపిస్తున్నది. నువ్వు ఎలా చెబుతావో ఏమి చెబుతావో నాకు తెలీదు. సంధ్య అతని మీద బాగా ఆశలు పెంచుకున్నది. మీ భార్యా భర్తలిద్దరూ ఉదయ్‌ని ఒప్పించి తీరాలి. లేకుంటే మన రెండు కుటుంబాలకు చెడుతుంది” నాగరాజు కంఠ ధ్వని కాస్త కరుకుగా ఉంది.

“అలాగే బావా! నువ్వేమీ అనుమాన పడకు. మాకు మటుకు నీతో వియ్యమొందాలని లేదా?” అంటూ నాగరాజు చేతులు పట్టుకున్నాడు శంభుప్రసాద్.

వాతావరణం చల్లబడింది. వానైతే కురవలేదు. ఇద్దరి భార్యల కళ్ళూ పొడిగానే ఉన్నాయి. కరచాలనాలు కాఠిన్య వాతావరణాన్ని కరిగించాయి. ఇప్పుడు బయట కాస్త చినుకులు మొదలైయ్యాయి.

వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. వీళ్ళు సోఫాలో కూలబడ్డారు.

“అయినా వీడిలో ఇంతటి దక్షత ఉన్నదని తెలిస్తే మన వ్యాపారమే అప్పజెప్పేవాణ్ణిగా?” భార్యవైపు కాకుండా మరోవైపు చూస్తూ అన్నాడు శంభుప్రసాద్.

“వాడికి మీరు ఎప్పుడైనా ఒక గట్టి పని సొంతంగా చెయ్యమని చెబుతేనేగా తెలిసేది?” శకుంతల మాత్రం అతని కళ్ళలోకి సూటిగా చూస్తూనే చెప్పింది.

“సంధ్యతో పెళ్ళికి ఒప్పుకుంటాడంటావా?”

“ఇప్పుడు వాడు మీకు మగాడిలా కనపడుతున్నాడులా ఉంది”

“వాణ్ణి కష్టపెట్టడం నాకిష్టం లేదు”

“మరైతే ఇష్టం లేని పెళ్ళి చేసుకోమనడం కష్టపెట్టడం కాదా?”

“నీలో కూడా చాలా టాలెంట్లు దాగి ఉన్నాయి”

“వాడు చెప్పిన మాటలు చెప్పానంతే. ఇక్కడ టాలెంట్ అవసరం లేదు”

“మీ అన్నయ్యకిచ్చిన మాట?”

“వాడూ మనల్ని ఎదిరించడం ఇష్టం లేక ప్రస్తుతానికి పెళ్ళి విషయం దాట వేస్తున్నాడు. మరి వాడి మనసులో మాట మనకి పట్టదా?”

“నీకు సంధ్యతో ఉదయ్ పెళ్ళి ఇష్టం లేదా?”

“ఏదీ చెప్పలేని పరిస్థితి నాది. అయినా నా ప్రయత్నం నేను చేశాను. వాడు మాత్రం ఈ పెళ్ళికి సుముఖంగా లేడని నా ఉద్దేశ్యం. ఒత్తిడి చేస్తే ఏం జరుగుతుందో నాకు తెలియదు”

“ప్రస్తుతం రియలెస్టేట్ పరిస్థితి బాగలేదు. ఈ సమయంలో మీ అన్నతో విరోధం చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది”

“వాడు పెట్టిన గడువుకు కాస్త సమయం ఉందిగా! ఆ ఏడుకొండలవాడు ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుందనుకుంటాను” అంటూ లేచింది. అలవాటు ప్రకారం ఆమె కాళ్ళు వంట గదివైపుకు మళ్ళాయి.

శంభుప్రసాద్ చాలా కాలం తరువాత తీరిగ్గా సీలింగ్ ఫ్యానుపైపు చూస్తూ కూర్చున్నాడు.

***

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here